వాగ్గేయకారులు 1 - జయదేవుడు

సంగీతం పాడటమే ఒక కళ అంటే, పాటలను రాసి వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయలగలిగే వారే సంగీతకారులుగా ప్రసిద్ధి కెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి ఆశువుగా గానం చేసే కళాకారులని వాగ్గేయకారులు అంటారు. జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తివంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అలాంటి మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకుందాం.

జయదేవుడు

జయదేవుడు క్రీ.శ. 1098లో రమాదేవి, భోజదేవుల దంపతులకు జన్మించాడు. ఒరిస్సాలోని పూరీకి దగ్గరలోని ‘కిందుబిల్వం’ ఈయన స్వగ్రామం. జయదేవుడు గోవర్ధనాచార్యుల వద్ద శిష్యరికం చేసి సంస్కృతం, సంగీతం అభ్యసించాడు. జయదేవుడు క్రీ.శ. 1116లో బెంగాల్ లో నవద్వీపం రాజు లక్ష్మణసేనుడి ఆస్థానంలో ఆస్ధానకవిగా ఉండేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు.

జయదేవుడు కృష్ణ భక్తుడు. భార్య పద్మావతి నృత్యం, కృష్ణభక్తి ప్రేరణలతో జయదేవుడు రాధా, కృష్ణుల ప్రణయగాథను, భక్తితత్వ్తాన్ని సంస్కృతంలో అష్టపదుల రూపంలో రచించాడు. సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది. ఎనిమిది చరణాలు గల పాటలు, శ్లోకాలు రచించటం వల్ల వీటికి అష్టపదులు అని పేరు. ఈ అష్టపదుల సంకలనమే ‘శ్రీ గీతగోవిందం’. జయదేవుడు రాధాకృత, గోపికా కృత, గీత గోవిందం అని అర్ధం వచ్చేవిధంగా, శ్రీ గీతగోవిందం అని పేరుపట్టాడు. కానీ కాల క్రమేణా ఇది గీతగోవిందంగా ప్రసిద్ధి కెక్కింది. శ్రీ గీతగోవిందం గీతగోవిందంగా మారినట్టే శ్రీ జయదేవ నామం కూడా జయదేవగా రూపాంతరం చెందినట్టు విమర్శకులు భావిస్తున్నారు. జయదేవుడు తన పేరునే ముద్రగా అష్టపదులలో పొందుపర్చాడు. అనేక అష్టపదులలో చివరి చరణంలో శ్రీ జయదేవ శబ్దమే ప్రయోగితమవడమే ఇందుకు తర్కాణం.

సరళమైన పదాలతో, పాటలతో రాసిన గీతగోవిందం భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానమని చెప్పవచ్చు. శృంగార వర్ణనలతో కూడిన శ్రీ గీతగోవిందంలో మొత్తం 12 సర్గాలు, 95 వివిధ వృత్త రచనలు, 78 శ్లోకాలు, 24 పాటలున్నాయి. గీత గోవిందంలోని 12 సర్గాలు భాగవతోంని 12 స్కంధాలకు మారురూపమని ఒక నమ్మకం. సకల వేదసారం గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలలో నిక్షిప్తమయినట్టు, గీత గోవిందలో కూడా 24 ప్రంబంధాలుండటం కాకతాళీయం కాదని గీతగోవిందం భాగవత స్వరూపమని మరో నమ్మిక. అందుకు తగినట్టుగానే అష్టపదులలో మొదటిది దశావతార అష్టపది కావటం విశేషం. 11 చరణాలు గల ఈ అష్టపదిలో జయదేవుడు విష్ణుమూర్తి దశావతారాలను వర్ణించాడు.

జయదేవుని గీతగోవిందం గురించిన ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు జయదేవుడు 19వ అష్టపది రాస్తుండగా ఒక పంక్తి సరిగ్గా కుదరక రాసినదానిని కొట్టివేసి, స్నానానికి వెళ్లాడట. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అదే పంక్తి తిరిగి రాసి ఉన్నదట. ఆశ్చర్యంతో భార్య పద్మావతిని పిలిచి ప్రశ్నించగా మీరే వచ్చి రాశారని ఆమె బదులిచ్చిందట. సాక్షాత్తు కృష్ణభగవానుడే వచ్చి పంక్తిని పూర్తిచేశాడని జయదేవుడు గ్రహించాడు. పద్మావతికి కృష్ణదర్శనం లభించినందున ఈ అష్టపదిని దర్శన అష్టపది అని అంటారు. అంతేకాకా పద్మావతికి లభించిన భాగ్యానికి గుర్తింపు అన్నట్టు జయదేవుడు ఈ అష్టపది చివరి పంక్తిని ‘జయతు పద్మావతీ రమణ జయదేవకవి’ అని పూర్తిచేశాడు.

జయదేవుని అష్టపదులలో బహుళ ప్రాచుర్యం పొందినవి … ‘హరిరిహముగ్ధవధూనికరే’, ‘చందన చర్చిత నీల కళేబర’ మరియు ‘సావిరహేతవదీనా రాధా’ మొదలగునవి. జయదేవునికి ముందు రాగ, తాళాలతో పాటలు పాడినవారుకానీ, పాటలు రచించినవారుకానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. కావున జయదేవుడే మొదటి వాగ్గేయకారుడని చరిత్రకారులు అభిప్రాయం.

జయదేవుని గీతగోవిందం సంగీతరత్నాకరం రాయటానికి దాదాపు రెండు, మూడు శతాబ్దాల ముందు పుట్టింది. గీతగోవిందాన్ని ఏఏ రాగాలలో పాడాలి అన్న మార్గదర్శకత్వం లేనందున సంగీతకారులు తమకు తోచిన రాగ, తాళాలలో అష్టపదులను ఆలపించారు, ఆలపిస్తున్నారు. సంగీతజ్ఙులు శ్రీ మంచాల జగన్నాథరావుగారు జయదేవుని అష్టపదులకు రాగతాళస్వరకల్పన చేస్తూ, తాళములకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. సాహిత్యము నందలి పదపొందిక గమనించినచో వాని ఛందస్సు స్పష్టంగా తెలుసుకోవచ్చని, దాని ఆధారంగా తాళములు కట్టవచ్చని వివరించారు. ఉదాహరణకు ఆరు మాత్రలు గల ’శ్రితకమలా కుచమండల’ అనే అష్టపదిని రూపక తాళంలోనూ, ‘రదసి యది కించిదపి’ అనే అష్టపదిని ఐదు మాత్రలు గల జంపెతాళంలోనూ, ‘మామియంచలితా విలోక్యా వృతం’అనే అష్టపదిని యేడు మాత్రలు గల త్రిపుట లేదా సాకు తాళంలోనూ, ‘లలిత లవంగ లతాపరిశీలన’ అనే అష్టపదిని ఆది తాళంలోనూ పాడుకోవలెనని తెలిపారు. ఖశ్చితంగా ఈఈ రాగాలలో పాడాలన్న నిబంధన లేకపోయినా, జయదేవుడు మంగళ గుర్జరి, బారడి, దేశీ బారడి, గుజ్జరి, భారబి, వసంత, రామఖేరి, గుండఖేరి, దేశాఖ్య వంటి రాగాలలో గీతగోవిందాని గానం చేశాడని అంటారు.

ఎప్పుడో 12వ శతాబ్ధ కాలంలో పుట్టిన అష్టపదులు నేటికి ప్రచారంలో ఉన్నాయి. భజనల్లో, నాట్య ప్రదర్శనల్లో మనకు ఈ అష్టపదులు విన్పిస్తుంటియి. ఒడిస్సి, భరతనాట్యం, మణిపూరి, కూచిపూడి, కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో అష్టపదులను ప్రదర్శింస్తుంటారు. నేటికి పూరిలో జగన్నాథస్వామికి పూజలు నిర్వహించేటప్పుడు, తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు పాడినట్టు, జయదేవుని అష్టపదులు ఆలపిస్తుంటారు. పూరీ జగన్నాథ రథోత్సవ సందర్భంలో 19వ అష్టపదిని ఆలపిస్తారు. కేవలం పూరీలోనే కాకా కేరళలోని గురువాయూరు దేవాలయంలో కూడా అష్టపదులను సోపాన పద్దతిలో గానంచేస్తారు.

జయదేవుడు గీతగోవిందమేకాక, యీసత్కవిచంద్రాలోకం, రతిమంజరి, కారకవాదం, తత్త్వచింతామణి అనే గ్రంధాలను విరచించాడు. కృష్ణ భక్తితత్త్వాన్ని కళ్లకు కట్టినట్టుగా విరచించిన జయదేవుడు క్రీ.శ. 1153లో పరమపదించాడు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *