సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం 5వ బాణ చక్రంలో 5వ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు. కటపయాది సంఖ్యానియమంలో ఇమడ్చడానికి ఈ రాగం ముందు ‘ధీర’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ఈ రాగం ‘ధీర శంకరాభరణం’గా ప్రసిద్ధి కెక్కింది. ఇది సంపూర్ణ, సర్వస్వరగమక వరిక రాగము. ఈ రాగ స్వర స్థానములు షడ్జమము, చతుశృతి రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశృతి దైవతము, కాకలి నిషాదము (సరిగమపదనిస / SR2G3M1PD2N3S). ఇందు అన్ని స్వరములు రాగచ్ఛయా స్వరములు. షడ్జము గ్రహ స్వరము. స,గలు న్యాస స్వరములు. ని,గ,మ,పలు జీవ స్వరములు. అన్నివేళలా పాడుకోగల రక్తి రాగము. శ్లోకములు, పద్యములు పాడటంతోపాటు రాగాలాపనకు కూడా చాలా అనువైన రాగం. స,ప,మలతో ఈ రాగంలో రచనలు ప్రారంభమవుతాయి.
ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ప్రతి రెండో స్వరము ఇందు కంపిత స్వరము. అలాగే మధ్యమము ఇందు కొన్నిసార్లు అర్ధ కంపితం. జంట స్వర, దాటు స్వర ప్రయోగాలు ఈ రాగానికి అందాన్ని చేకూరస్తాయి. హిందుస్థానీ యందు దీని సరిసమానమైన రాగం ‘బిలావల్’. దీనినే పూర్వం వేళావళి అని కూడా అనేవారు. సిక్కుల పవిత్ర గ్రంధం ‘గురు గంథ్ర సాహెబ్’లో కూడా ఈ రాగం ప్రస్తావన ఉంది. గురునానక్, గురు తేజ్ బహదుర్, గురు అర్జున్లు ఈ రాగంలో రచనలు చేశారు. పాశ్చాత్య సంగీతంలో సి-మేజర్ స్కేల్ దీనికి సమానము.
ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన నరసయ్యను చెప్పుకోవచ్చు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైంది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట.
చాలా జన్యరాగ సంతతిగల ఈ జనకరాగంలోని ప్రసిద్ధ జన్యరాగాలు: ఆరభి, బిలహరి, హంసధ్వని, శుద్ధ సావేరి, కదనకుతూహలం, దేవగాంధారి, కానడ, కురుంజి, అఠాణా, కేదారం, బేగడ, పూర్ణచంద్రిక, జనరంజని, దర్బార్, బేహాగ్, వసంత, పూర్వగౌళ, నారాయణి, నీలాంబరి, నారాయణ దేశాక్షి, కోలాహలము, శుద్ధవసంతం మరియు సహన మొదలగునవి.
|
|
|
|
|
|
|
|
|
|
ఈ రాగంలో ప్రసిద్ధికెక్కిన రచనలు: త్యాగయ్య ఈ రాగమందు దాదాపు 20 కృతులను రచించారు. ముత్తయ్య దీక్షితార్ శంకరాభరణంలో రచించిన నవావర్ణ కృతి, పాశ్చాత్య ప్రక్రియలో రచించిన చింతాయ ఆంజనేయం, గురుగుహ సరసిజ, పాహి దుర్గే, రామ జనార్ధన, పార్వతీపతే, సామగానప్రియ, వందే మీనాక్షి, సకలసుర వినుత మొదలగు 40 నొట్టు స్వర రచనలు ఈ రాగానికి ప్రసిద్ధిని చేకూర్చాయి.
సినీ సంగీతం: పాశ్చాత్యలు ఈ రాగాన్ని ఎంతగానో అభిమానించారు. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రంలో జూలియా అండ్రూస్ పాడిన ఈ రాగానికి చెందిన ‘డో ఎ డియర్, ఫీమ్యేల్ డియర్’ పాట బహుళ ప్రాచుర్యాన్ని పొందింది.
ఇక తెలుగులో శంకరాభరణం రాగము కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమా తెలియనివారుండరు. ఆ సినిమాలోని ‘ఓంకార నాదానుసంధానమౌ గానమే’ అన్న పాట ఈ రాగంలోనిదే. అలాగే రోజా సినిమాలోని ‘చిన్ని, చిన్ని ఆశ’ పాట. భార్యాభర్తలలోని ‘జోరుగా, హుషారుగా షికారుపోదమా’, సితారలోని ‘వెన్నెల్లో గోదారి అందం’, బొంబాయిలోని ‘ఉరికే చిలకా, వేచి ఉన్నాను కడవరకు’, ఆరాధనలో ‘నా హృదయంలో నిదురించే చెలి’, విప్రనారాయణలో ‘బుద్ధేనాంజలి నమామి’ చెప్పుకోదగ్గవి.
ఇక భారతీయుల జాతీయగీతం ‘జనగణమణ’ బిలావల్ లోనే రూపకల్పన చేసుకుంది. హిందీ సినిమా పరిచయ్ లోని ‘సారె కె సారే గామాకొలేకేర్ గాతే చలే’, బావర్చీలోని ‘భోర్ ఆయి, గయా అంధియారా’ మొదలగు పాటలున్నాయి.
సౌమ్యశ్రీ రాళ్లభండి