రాగ గీతిక 2 మాయామాళవగౌళ రాగం (15వ మేళకర్త)

మాయామాళవగౌళ రాగం 3వ అగ్నిచక్రంలో 3వ రాగం. ఫూర్వం దీనిని మాళవగౌళ రాగం అని పిలిచేవారు. కటపయాది సంఖ్య విధానానికి అనువయించడం కోసం ఈ రాగానికి మాయా అనే పదాన్ని చేర్చారు. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం (స,రి,గ.మ,ప,ద,ని,స / S R1 G3 M1 P D1 N3 S). ఇది నిర్ధుష్ట రూపం కలిగిన సంపూర్ణ రాగం. అచల స్వరములు, కంపిత స్వరములు కల్గిన రాగం. శాంతి, భక్తి, కరుణ రసాలను పలికించడానికి ఈ రాగం ఉపయుక్తం. అన్నివేళలా పాడుకోవడానికి అనువైనది. ఈ రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమానమైన రాగం భైరవ్.

ఈ రాగంలో స్వరములు వరస క్రమంలో అనగా సరి, గమ, పద, నిస, కలిగి పూర్వాంగ, ఉత్తరాంగములకు సరియైనసంపూర్ణమైన జవాబు (symmetry) గలదు. అందువల్ల ఈ రాగంలో పాడడం సులభంగా ఉంటుంది. కర్ణాటక పితామహుడు పురుందరదాసు ఈ రాగంలో సరళీవరుసలు, జంట వరుసలు, అలంకారాలను రచించటంతోపాటు, ఈ రాగం జన్య రాగమైన మలహరిలో పిళ్ళారి గీతాలను రచించి తమ శిష్యులకు శిక్షణనిచ్చి బహుళ ప్రచారం చేశారు.

ఈ రాగానికి సంవాదాలు, జన్యరాగాలు ఎక్కువ. ఇది మూర్ఛన కారక మేళం. అందవల్ల గ్రహ భేదానికి అనువైనది. మాయామాళవగౌళ రాగంలో రిషభాన్ని గ్రహంచేస్తే 72వ మేళకర్త రసికప్రియ, మధ్యమం గ్రహంచేస్తే 57వ మేళకర్త సింహేంద్రమధ్యమం వస్తాయి. ఈ రాగం నుంచి వెలువడ్డ జన్యరాగాలు అనేకం. అందులో ప్రసిద్ధి చెందింది సావేరి.

ఇతర జన్య రాగాలు: రాగ ప్రవాహం దాదాపు 223 జన్య రాగాలు మాయామాళవగౌళ రాగానికి ఉన్నట్టు తెలుపుతోంది. అయితే వీటిలో కేవలం 41 మాత్రమే పూర్తి రాగాలుగా అభివృద్ధి చెంది ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు, గౌళ, భౌళి, మలహరి, సారంగనాట, నాదనామక్రియ, మేచభౌళి, గుమ్మకాంభోజి, లలిత పంచమం, మారువ, శుద్ధ క్రియ, మేఘరంజి, పాడి, గౌళిపంతు, ఘనసింధు, మూర్జరి, గుండక్రియ, సౌరాష్ట్రము, కమలామనోహరి, జగన్మోహిని, రేగుప్తి, మంగళకైశిక, సాళంగనాట, పూర్ణపంచమం, సురసింధు, దేశ్యగౌళ, సింధురామక్రియ, ఆర్ధ్రదేశిక, ఫరజు మరియు గౌరి.

ఈ రాగమందు పేరెన్నికగన్న రచనలు:

1. మాయాతీత స్వరూపిణీ –– తంజావూరు పొన్నయ్య

2. మేరు సమాన ధీర, విదులకు మ్రొక్కెద, తులసీ దళములచే, ముదమున శంకరకృత –– త్యాగరాజు

3. శ్రీనాథ గురుగుహోజయతి –– ముత్తుస్వామి దీక్షితార్ (ఇది ముత్తుస్వామి మొదటి కృతి)

4. నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి –– శ్యామశాస్త్రి

5. లక్షణగీతం, రవికోటితేజ –– వెంకటమఖి

6. సరసిజనాభా మురారే (వర్ణం), దేవ దేవ కళాయామి –– స్వాతి తిరునాళ్

7. దేవాదిదేవ నను –– మైసూర్ సదాశివం

సినిమా సంగీతంలో కూడా ఈ రాగంలో అనేక ప్రయోగాలు, పాటలున్నాయి. ఉదాహరణకు రుద్రవీణ సినిమాలో కెవి మహదేవన్ ఏసుదాసు చేత త్యాగరాజు రచన తులసీ దళములచే సంతోషముగా పూజింతు పాడించారు. ఇక కీలుగుర్రంలో ఎవరు చేసిన కర్మవారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా, లవకుశలో ఏనిమిషానికి ఏమిజరుగునో, బాలరాజులో గూటిలో చిలకేదిరా, ఓరన్న గూడు చినబోయెరా, సిరిసిరిమువ్వలో ఎవరికెవరు ఈ లోకంలో, చంటి సినిమాలో పావురానికి పంజరానికి పెళ్ళిచేసేలోకం, లైలా మజ్నులో రావో, ననుమరిచితివో, ఆలాపనలో కలిసే ప్రతి, చెట్టు కింద ప్లీడర్ లో జిగి, జిగి, జగదేకవీరుడు అతిలోక సుందరిలో యమహా నీ యమ ఇలా అనేక పాటలను సంగీత దర్శకులు స్వరపరిచారు.

హిందీ సినిమాల్లో కూడా ఈ రాగం సమానమైన భైరవ్ రాగాన్ని విరివిగా ఉపయోగించారు. రంగీలాలోని హైరామా యే క్యా హువా, జాగతే రహోలో జాగో మోహన్ ప్యారే జాగో, ఏక్ దూజే కేలియేలో సోలా బర్సకీ బాలీ ఉమర్ కో సలాం, రాం తేరీ గంగా మైలీ లో టైటిల్ పాట రాం తేరీ గంగా మైలీ హోగయీ, హమ్ దిల్ దేచుకే సనం లో అల్ బేలా సాజన్ ఆయోరే, బిజు బావరాలో మెహే భూల్ గయే సావరియా మరియు ఆష్కీలో అబ్ తేరే బినా జీ లేంగే హమ్ ఇలా అనేకం.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp