రాగ గీతిక - 1

రాగ స్వరశ్చ, తాళశ్చ త్రిభిస్సంగీత ముచ్చతే …. రాగం, తాళం, స్వరం కలిస్తే సంగీతమవుతుంది. వీటిలో ప్రతీ దానికి ఒక విశిష్టత ఉంది. అలాగే ప్రతీదీ మరో దానిపై ఆధారపడి ఉంటాయి. మనకు గల షోడశ స్వరస్థానాల సమ్మేళనమే రాగం. కొన్ని పాటలు వినగానే ఎక్కడో విన్నట్టుగా ఉందని అన్పిస్తుంది. అందుకు కారణం ఆయా పాటలన్నీ ఒకే రాగంలో ఉండటం కావచ్చు. ఏ భాషలో నైనా సరే మనం ఇట్టే ఆ పాటని గుర్తుపట్టేస్తాం. కొన్ని గీతాల వల్ల కొన్ని రాగాలకు విశిష్టత చేకూరుతుంది. కొందరు వాగ్గేయకారుల రచనలు రాగాలకు పేరు తెచ్చి పట్టాయి. ఇలా ప్రజారంజకం పొందిన పాటలను, రాగాలను వాటి లక్షణాలను మా ఈ ‘రాగగీతిక’ శీర్షకలో పాఠకులకు అందిస్తున్నాం. కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలను వాటికి సమాంతరమైన హిందుస్తానీ రాగాలను వాటిలో వాగ్గేయకారులు చేసిన అద్భుత రచనలతో పాటు, బహుళ ప్రాచుర్యం పొందిన చలనచిత్రాల గీతాలను కూడా పొందుపర్చటానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో మా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే సహృదయంతో అర్ధంచేసుకొని క్షమించగలరని ఆశిస్తున్నాం. ముందుగా రాగం అంటే ఏమిటి? వాటి లక్షణాలు, రాగ వర్గీకరణ మొదలైన అంశాలను పరిశీలిద్దాం.

రాగం అంటే ఏమిటి?

శ్లో: యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః |
రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః||

రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని. రాగము మన భారతీయ సంగీతంలో తప్ప మరే సంగీతంలోనూ లేదు. పాశ్చ్యాత సంగీతకారులకు రాగము అను పేరు తెలియదు. రాగము స్థాయి, ఆరోహి, అవరోహి, సంచారి అని నాలుగు విధాలు. ఒక్కోక్క స్వరాన్ని నిలిపి ఉంచడాన్ని స్థాయని, స్వరాలు హెచ్చు క్రమాన్ని ఆరోహణ, అలాగే తగ్గుక్రమాన్ని అవరోహణ అంటారు. ఇక ఈ మూడింటి కలయికే సంచారి.

రాగములు ముఖ్యంగా మూడు రకాలు. షాడవము, ఔడవము, సంపూర్ణము. అందు ఔడవము ఐదు స్వరములను, షాడవము ఆరు స్వరములను, సంపూర్ణము సప్త స్వరములను కలిగి ఉంటాయి. ప్రతీ పాటకీ స్వరమున్నట్టే, స్వరస్థానాలను బట్టి రాగాలుంటాయి. కనీసం ఐదు స్వరాలైనా లేకపోతే అది రాగం కాదని ప్రాచీన సంగీతకారుల అభిప్రాయం. ఈ స్వరాల ఆరోహణ, అవరోహణల నుబట్టి రాగాలను రెండు రకాలుగా విభజించారు. జనక రాగాలు, జన్య రాగాలు.

మేళకర్త రాగాలు: జనక రాగాలనే ‘మేళకర్త ‘రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక (parental), ఆధార (fundamental), మూల (root), ప్రాతిపదిక (primary) రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణరాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట.

అలాంటి మేళకర్తరాగాలు 72 ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాల్లో, ఆరేసి రాగాలను కలిపి ‘చక్రం’ అంటారు. అలా ఒక్కొక్కదానిలో ఆరేసి రాగాల చోప్పున మొత్తం 12 చక్రాలు ఏర్పడ్డాయి. ఈ 12 చక్రాల పట్టిక:

చక్రం మేళకర్త రాగాల సంఖ్య
ఇందు 1వ మేళకర్త నుంచి 6వ మేళకర్త వరకు
నేత్ర 7వ మేళకర్త నుంచి 12వ మేళకర్త వరకు
అగ్ని 13వ మేళకర్త నుంచి 18వ మేళకర్త వరకు
వేద 19వ మేళకర్త నుంచి 24వ మేళకర్త వరకు
బాణ 25వ మేళకర్త నుంచి 30వ మేళకర్త వరకు
ఋతు 31వ మేళకర్త నుంచి 36వ మేళకర్త వరకు
ఋషి 37వ మేళకర్త నుంచి 42వ మేళకర్త వరకు
వసు 43వ మేళకర్త నుంచి 48వ మేళకర్త వరకు
బ్రహ్మ 49వ మేళకర్త నుంచి 54వ మేళకర్త వరకు
దిశి 55వ మేళకర్త నుంచి 60వ మేళకర్త వరకు
రుద్ర 61వ మేళకర్త నుంచి 66వ మేళకర్త వరకు
ఆదిత్య 67వ మేళకర్త నుంచి 72వ మేళకర్త వరకు

 

1 నుంచి 36 వరకు వచ్చే అన్ని మేళకర్త రాగాలలోనూ శుద్ధమధ్యమం ఉంటుంది. అదే 37 నుంచి 72 వరకు గల రాగాలలో ప్రతి మధ్యమం ఉంటుంది. ఈ లక్షణ ఆధారంగా జనక రాగాలను శుద్ధమధ్యమ రాగాలు లేక పూర్వమేళములు, ఉత్తర మేళములు లేక ప్రతి మధ్యమ రాగాలని రెండు రకాలుగా విభజించారు.

జన్యరాగాలు: ఇక ఈ మేళకర్త రాగాల్లోని స్వరాలలో మార్పులు చేయగా అనేక రాగాలు పుట్టకొచ్చాయి. వీటిని జన్యరాగాలంటారు. ఉదాహరణకు ‘మాయామాళవగౌళ రాగం ‘15వ మేళకర్త రాగం. ఈ రాగంలోని ఆరోహణలో గాంధారాన్ని (గస్వరాన్ని), నిషాదాన్ని (ని స్వరాన్ని), అవరోహణలో నిషాదాన్ని వదిలేస్తే, ఒక కొత్త రాగం పుడుతుంది. అదే ‘మలహరి రాగం’. ఈ విధంగా మేళకర్త రాగాల్లోన్ని కొన్ని రాగాలను వదిలివేయడాన్ని వర్జించడమని అంటారు. ఇలా స్వరాలను వర్జించడం వల్ల పుట్టిన జన్యరాగాలను వర్జ్య రాగాలని అంటారు. ఈ వర్జరాగాల్లో ఉన్న స్వరాల సంఖ్యని బట్టి షాడవ సంపూర్ణరాగం, సంపూర్ణ షాడవ రాగం, ఔడవ సంపూర్ణరాగం, సంపూర్ణ ఔడవ రాగం, షాడవ షాడవ, షాడవ ఔడవ లేక ఔడవ షాడవ ఇలా అనేక రకాలు వర్జ్యరాగాల్లో ఉన్నాయి.

అలాగే మేళకర్తరాగంలోని స్వరాలను వక్రగతి పట్టిస్తే, అంటే స్వర క్రమాలన్ని మారిస్తే కూడా కొత్త రాగాలు పుడతాయి. అలా పుట్టిన రాగాలను వక్ర రాగాలంటారు. ఉదాహభరణకు 28వ మేళకర్త రాగం హరికాంభోజి. ఇందులో ఆరోహణ: సరిచగఅంమశుపదచనికైనిస, అవరోహణ: సనీదపమగరిస. ఈ రాగాలను ఆరో: సరిగమపమదానిస, అవ: సనీదపమగమరీగరి అని వక్రం చేయగా పుట్టిన రాగాన్ని‘శహన ‘ అంటారు. వర్జ్య రాగాల్లో ఉన్నట్టే, వక్రరాగాల్లో కూడా స్వరాల వక్రగతిని బట్టి అంటే ఆరోహణలో స్వరాలు వక్రగతిలో ఉన్నాయా లేక అవరోహణలోనా అన్నదాని బట్టి అనేక రాగాలున్నాయి. ఆరోహణ, అవరోహణలో స్వరాలు వక్రగతిలో ఉంటే వాటిని ఉభయ వక్రరాగాలంటారు.

ఉపాంగ రాగాలు, భాషాంగ రాగాలు: సాధారణంగా మేళకర్త రాగ స్వరస్థానాలే, జన్యరాగంలో కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రాగ లక్షణానికి విరుద్ధంగా రాగాలుంటాయి. ఉదాహరణకు బిలహరి రాగం ధీరశంకరాభరణమనే మేళకర్త రాగం నుంచి పుట్టుంది. అయితే మేళకర్త రాగ స్వరాలకు విరుద్ధంగా అన్యస్వరమైన కైశికి నిషాదం వస్తుంది. ఇలా అన్య స్వరరాగాలు కనుక జన్యరాగంలో వస్తే ఆ రాగాలను భాషాంగ రాగాలంటారు. కాంభోజి, ఖమాస్, భైరవి, ముఖారి, ఆనందభైరవి మొదలైన రాగాలన్ని భాషాంగరాగాలే.

అన్యస్వరం రాకుండా, కేవలం జన్యరాగ స్వరస్థానాలే వస్తే అలాంటి రాగాలను ఉపాంగరాగాలంటారు. ఇలాంటి రాగాలే ఎక్కువ. ఉదాహరణకు మోహన, హిందోళ, హంసధ్వని, శుద్ధ సావేరి, ఆరభి, దర్పారు మొదలైనవి ఉపాంగరాగాలు.

నిషాదాంత్య, దైవతాంత్య , పంచమాత్య రాగాలు: కర్ణాటక సంగీతంలో కొన్ని రాగాలు నిషాదముతో ముగుస్తాయి. అంటే ఈ రాగాల యొక్క సంచారము కేవలం మంద్రస్థాయి నిషాదము నుండి మధ్యస్థాయి నిషాదము వరకే. నిషాదముతో అంతమవునుగనుక వీటినకి “నిషాదాంత్యములని” పేరు. ఉదాహరణ నాదనామక్రియ. అదే విధంగా దైవతముతో అంతమయ్యే రాగాలను “దైవతాంత్యము”లంటారు. ఉదాహరణ కురంజి. ఇక రాగములు మధ్యస్థాయి పంచమముతో అంత్యమయిన వాటిని “పంచమాంత్య” రాగాలంటారు. ఉదాహరణ నవరోజు.

 

ఎన్ని రాగాలున్నాయి?

ఒక జనకరాగం నుంచి పైన చెప్పిన లక్షణాలను పాటిస్తూ దాదాపుగా 483 జన్య రాగాలు పుట్టవచ్చు. ఇలా 72 మేళకర్తల నుంచి 34, 847 వర్జ్యరాగాలు పుట్టే అవకాశం ఉంది. ఇక వక్రరాగాలు, భాషాంగరాగాలు లెక్కించుకుంటూ పోతే వాటికి అంతే ఉండదేమో! అందుకే రాగాలు అనంతాలంటారు.

రాగం అంటే కేవలం ఆరోహణ, అవరోహణలు కాదు. అవి కేవలం ఆధారం మాత్రమే. రాగంలో ఉపయోగించవల్సిన గమకాలు, ఒక రాగంలో తరచూ ఉపయోగించవల్సిన స్వరాలు ఇలా వివిధ లక్షణాలను రాగాలకు ఆపాదించినప్పుడే రాగానికి ఒక స్వరూపం ఏర్పడి అది ప్రజాదరణ పొందుతుంది. ఇది క్లుప్తంగా రాగం గురించిన విషయాలు. ఇక మీదట ఒక్కొక్క రాగాన్ని తీసుకుని దాని లక్షణాలు వాటిలో ప్రముఖ వాగ్గేయకారులు స్వరపర్చిన కీర్తనలు, ప్రజాదరణ పొందిన సినీ గీతాలను విశ్లేషిద్దాం. రాగ గీతిక రెండవ భాగంలో ఆది రాగమైన మాయామాళవగౌళ రాగం గురించి తెలుసుకుందాం.

సౌమ్యశ్రీ రాళ్లభండి

 

One thought on “రాగ గీతిక – 1”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp