
అంతారామమయం ఈ జగమంతా రామమయం అంటూ అవతారమూర్తులైన సీతారాములపై ఆత్మీయ భావాన్ని తెలుగువారికి కలిగించటంలో రామదాసు కీర్తనలు, ఆయన రచించిన దాశరథీ శతకంతోపాటు ఉన్నత పాత్ర వహించాయి అనడంలో సందేహంలేదు. చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి, శ్రీ రాముని విమల రూప సుధా రసమును రామదాసుతోపాటు తెలుగు పలక నేర్చిన, విన నేర్చిన భక్తులందరు ఆస్వాదించి తరించారు.
‘గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్చతే’. సంగీతమంటే గీత, వాద్య, నృత్యాల మేటి సమ్మేళనమని సంగీత రత్నాకరమందు చెప్పబడింది. అయితే కాలక్రమేణా గీత, వాద్యముల కలయిక సంగీతంగా రూపాంతరం చెందిది. నేడు కేవలం గానమే సంగీతమని వ్యవహారిస్తున్నారు. అయితే శృతి, లయ, స్వరములతో కూడిన సంగీతము రెండు విధాలు ఒకటి గాత్ర గానము రెండు వాద్యగానము.
ప్రాచీన సంగీత సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా గాత్ర, వాద్య గానాలను పెర్త్ మహానగరంలోని తెలుగువారికి అందించాలని మా ‘తేటగీతి’ సంకల్పించింది. ఆ సంకల్పనకు రూపకల్పనే ‘భక్తరామదాసు వాగామృతవర్షిణి’. రామదాసు కృతులలోని నవరత్న కీర్తనలకు దీటైన దాశరథీ శతకంలోని పద్యాలను ఎన్నుకొని, సమన్వయించి కీర్తనలతోపాటు శతక సౌరభాన్ని మార్చి 1, 2014న తేటగీతి తెలుగు సంగీతాభిమానులకు అందించింది
ఈ కార్యక్రమానికి పెర్త్ లో దౌత్యకార్యాలయానికి కాన్సుల్ జనరల్ గా వ్యవహరిస్తున్న శ్రీ సుబ్బారాయుడుగారు ముఖ్యఅతిధిగా విచ్చేస్తారు. వారి సతీమణి శ్రీమతి హేమగారు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారాయుడుగారు మాట్లాడుతూ, ‘తాను ఎన్నో దేశాల సందర్శించినప్పట్టికీ, పెర్త్ లో తెలుగువారు భాషపట్ల చూపుతున్న అభిమానం, జరుపుతున్న కార్యక్రమాలు మరెక్కడా చూడలేదన్నారు.’ ప్రత్యేకంగా తేటగీతి ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, ఇటువంటి సంగీత కార్యక్రమాలు భావితరాలవారికి మన భాష పట్ల, సాహతీ, సంస్కృతుల పట్ల అవగాహన కల్పిస్తాయన్నారు
సంగీతాభిమానలను రజింపచేసిన ఈ కార్యక్రమం తేటగీతి వెబ్ సైట్ పాఠకులకు కూడా శ్రవణానందం కల్గిస్తుందని ఆశిస్తూ, పూర్తి కార్యక్రమం ఆడియో మీకోసం..
తేటగీతి, మార్చి 13, 2014