దీక్షితార్ వారి కృతుల విశేషాలు 1

తెలుగు సాహిత్యమందు విశేష ప్రజ్ఞగల ముత్తుస్వామి దీక్షితార్ తెలుగు కావ్యశిల్పాననుసరించి కృతులను రచించినట్టుగా మనకు గోచరిస్తుంది. అనగా విభక్తిపరంగా కృతులను రచించుట. ముత్తుస్వామి దీక్షితులు శైవ, వైష్ణవ, దేవీ, సుబ్రహ్మణ్య, గణపతి ఇలా అందరి ఆలయాలను దర్శించి వారిపై కృతులను రచించారు. ఆయన కృతులలో కాశీదేవతలైన విశ్వేశ్వర, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, గంగాది మూర్తుల ప్రస్తుతేకాక నేపాలులోని పశుపతినాధుని ప్రస్తుతి, బదరీలోని నారాయణుని ప్రస్తుతి మనకు కన్పిస్తుంది. ఆయన విష్ణ్వీశభేద మెరుగని అద్వైత, స్వార్త మతస్ధుడు. శ్రీశంకరభగవత్పాదమతావలంబి, ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలలో భక్తి, జ్ఞాన, వైరాగ్య భావముల సమ్మేళనము సుందరముగా సమ్మిళితమై ఉంది.

రామాష్టపది అనే సంగీతరూపకాన్ని రచించిన ఉపనిషద్బ్రహ్మేంద్ర సరస్వతిల వారి వద్ద వేదాంతగ్రంథ అధ్యయనము చేయటం వల్ల ముత్తుస్వామివారిపై రామభక్తి ప్రభావం ప్రస్ఫుటం. మాంజిరాగంలోని ‘రామచంద్రేన సంరక్షితోహం’ అనే కీర్తనలో ఆయన శ్రీరాముడు త్రిమూర్తుల సమిష్టిరూపమని (రమా భారతి గౌరీరమణ స్వరూపేణ రామచంద్రేణ సంరక్షితోహం) వర్ణించారు. అలాగే శ్రీరాముని పరబ్రహ్మతత్త్వాన్ని మాహురి రాగంలో ‘మామవ రఘువీరా’ అనే కృతిలో తెలిపారు. ఈ కృతిలో శ్రీరాముని పామరపండిత పావనకర నామధేయుడని, గురుగుహనుతుడని ముత్తుస్వామి స్తుతించారు.

క్షేత్రదేవతా కీర్తనలు: ముత్తుస్వామి తన జీతకాలమంతా క్షేత్రాటన చేస్తూ తత్తద్దేవతా సంకీర్తనలు చేస్తూ కాలం గడిపారు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రానికున్న విశిష్టత ఆయన చేసిన ప్రతీ కృతీలో ఇనుమడించింది. దీక్షితారు వారు ఆయా క్షేత్ర దేవతలపై చేసిన కీర్తనలలో కొన్ని మచ్చుతునకలు. తిరుపతి వేంకటేశ్వరునిపై వరాళి రాగంలో ‘శేషాచల నాయకం భజామి’ అనే కీర్తన, కంచి కామాక్షిపై చేసిన అనేక కీర్తనలో కమలా మనోహరి రాగంలో ‘కంజదళాయతాక్షి’, హిందోళ రాగంలో ‘నీరజాక్షి కామాక్షి’, శుద్ధసావేరి రాగంలో ‘ఏకామ్రేశనాయకీ’ ప్రసిద్ధాలు. కాంచీపురంలోని కైలాసనాథునిపై కూడా దీక్షితార్ పెక్కు కృతులు రచించారు. వీటిలో వేగవాహిని రాగంలోని ‘కైలాసనాథం’, కాంభోజి రాగంలో ‘కైలాసనాథేన’ ప్రసిద్ధమైనవి. చిదంబర సమీపంలోని గోవిందరాస్వామిపై ఆయన చేసిన కృతులకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా మేచబౌళి రాగంలో రచించిన ‘గోవింద రాజేన’ అనే కృతి కర్ణాటక సంగీత సముద్రంలో ఈ రాగంలో రాసిన ఏకైక కృతని సంగీతజ్ఞలు అభిప్రాయం. అయతే, ఈ రాగంలో వేంకటముఖి రచించిన కొన్ని గీతాలు మాత్రం లేకపోలేదు.

అలాగే చిదంబరం సమీపంలోని వైదీశ్వరన్ దేవాలయ దేవతలపై చేసిన పెక్కు కృతులలో బాలాంబికాదేవిపై రాసిన ‘భజరేరే చిత్త బాలాంబికాం’ అనే కల్యాణరాగ కృతి, వైద్యనాథస్వామిపై కూర్చిన అఠాణ రాగంలోని ‘శ్రీ వైథ్యనాథం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.

పంచలింగ స్థల కీర్తనలు: ఆకాశాది పంచభూతముల ప్రత్యేకాంశలతో పంచలింగ క్షేత్రములు దక్షిణభారతంలో ప్రసిద్ధిగాంచాయి. వీటిలో శ్రీకాళహస్తిలోని లింగం స్వాయంభువు, వాయులింగము. ఇక కాంచీపురంలోని ఏకామ్రనాథుడు పృథ్వీలింగము, శ్రీరంగ సమీపంలోని జంబుకేశ్వరుడు ఆపోలింగం, తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు తేజోలింగం, చివరగా చిదంబరంలోని శివలింగం ఆకాశలింగమని ప్రసిద్ధి. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని స్తుతిస్తూ, ‘శ్రీ కాళహస్తీశ’ అని, కాంచీపురంలోని ఏకామ్రనాధుని ప్రస్తుతిస్తూ, అనేక కీర్తనలు రచించినా భైరవి రాగంలోని ‘చింతయ మాకంద’ అనే కృతి పంచలింగకృతులలో ఒకటి. ‘అరుణాచలనాథం స్మరామ్మనిశ’, ‘జంబూపతే మాంపాహి’, ‘ఆనందనటన ప్రకాశం చిత్సభేశం’ మిగిలిన మూడు పంచలింగ కృతులు.

చిదంబర నటరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కేదార రాగంలో ‘ఆనందనటన ప్రకాశం’ కృతి నటరాజు ఆనందనృత్యానికి సంబంధించినదై ఎంతో రమణీయంగా నాట్యమునకు పనికివచ్చునట్టు సొల్లుకట్లు ఈ కృతికి అనుబంధంగా ఉండటం ఈ కృతి విశిష్టత.

అభయాంబ కృతులు: వైదీశ్వరన్ దేవాలయ అధిష్టాన దేవన అభయాంబపై రాగప్రస్తార సౌలభ్యమునందేకాక, తాంత్రిక విషయస్ఫురణమునందు కూడా గణ్యమైనవి. ‘అంబికాయాః అభయంబికాయాః’ అనే కేదార రాగ కృతియందు కుండలినీశక్తి నిగూఢమై ఉన్నది. అభయాంబపై దీక్షితార్ అన్ని విభక్తులందు కృతులు రచించారు.

1. అభయంబ జగదాంబ – కల్యాణి రాగం – ప్రథమా విభక్తి

2. ఆర్యామభయాంబాం – భైరవి రాగం – ద్వితీయా విభక్తి

3. గిరిజయా అపజయ – శంకరాభరణ రాగం – తృతీయా విభక్తి

4. అభయాంబికాయై – యదుకుల కాంభోజి రాగం – చతుర్థీ విభక్తి

5. అభయాంబికాయాః – కేదారగౌళ రాగం – పంచమీ విభక్తి

6. అంబికాయాః అభయంబికాయాః – కేదార రాగం – షష్ఠీ విభక్తి

7. అభయాంబికాయాం – శహనా రాగం – సప్తమీ విభక్తి

8. దాక్షాయణి – తోడి రాగం – సంబోధన ప్రథమా విభక్తి

ఈ కృతులకు చివరగా మంగళహారతిగా పాడే ముగింపు కృతి ‘శ్రీ అభయాంబ నిన్ను’ అనునది తెలుగు పల్లవితో శ్రీరాగంలో రచించారు. అయితే తర్వాత కాలంలో సంస్కృత, తమిళ భాషలలో ఈ మంగళహారతి ప్రాముఖ్యం పొందింది.

ఈ కృతి ముత్తుస్వామివారు రచించిన మణిప్రవాళ శైలిలో రచించిన అనేకానేక కృతులలో ఒకటి. మణిప్రవాళ శైలి కృతులలో బహుళప్రాచుర్యం పొందిన కృతి కాఫీరాగంలోని ‘శ్రీ వేంకటాచలపతే నిన్ను నమ్మితి’. ఈ మణిప్రవాళి శైలి కృతులలో ఆంధ్ర, తమిళ, సంస్కృత భాషలను ముత్తుస్వామి దీక్షితార్ వారు విశిష్టంగా వినియోగించినప్పటికీ, పల్లవికి మాత్రం తెలుగు భాషనే ఉపయోగించటం విశేషం. రాగప్రస్తారమునకు, పల్లవికున్న ప్రాముఖ్యాన్ని బట్టి సహజ సంగీత మాధుర్యయుక్త ప్రవాహమునకు తెలుగుభాషే అధికయోగ్యత కలదని పండితులు స్పష్టీకరించారు.

(తదుపరి భాగంలో తిరువారూరు క్షేత్రంపై, త్యాగరాజస్వామివారిపై ముత్తుస్వామి వారు చేసిన కీర్తనలను గురించి తెలుసుకుందాం.)

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *