నాలుగైదు సంవత్సరాల క్రితం అన్నమయ్య సంకీర్తనార్చన అని ఒక కార్యక్రమం చేసి, ఆ వాగ్గేయకారుని కీర్తనలు ఆలపించాం. అప్పుడు ఆరేళ్ల మా అమ్మాయి కూడా నాలుగైదు కీర్తనలు పాడి మా బంధువర్గానికి ముఖ్యంగా మా అత్తమామాలకి కొంచెం ఆశ్చర్యం, కొంచెం సంతోషం, కూసింత గర్వ కల్గించింది. ఆ కార్యక్రమం వీడియో మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా, వద్దననీయకుండా మా మామ గారు సుత్తివీరభద్రరావు మాదిరి వీడియో అరిగిపోయేదాకా తాము చూసి, ఇతరులకి చూపి ఆనందపడిపోయారు. అక్కడితో ఆగితే ఏమో, ఆ ఊపులో ఇక తాళ్లపాకవారి పలుకులన్ని మా ఇంటనే అంటే మా అమ్మాయి నోటనే పలకాలన్న తాపత్రయంతో బజారులో ఉన్న అన్నమయ్య కీర్తనల క్యాసెట్లన్ని విరివిగా కొని ఆస్ట్రేలియాలో ఉన్న మాకు పంపారు. నేను కూడా శాయశక్తులా మా అమ్మాయి లేచినప్పటినుంచి నిదురపోయేదాక కీర్తనలు విన్పించి, విన్పించి పైసా వసూలు చేసాను.
ఇంతలో మా మామగారు తిరుపతి వెళ్లటం తటస్థించింది. అక్కడ దేవస్థానం వారి పుస్తకాల షాపులో అన్నమయ్య కీర్తనల పుస్తకం దొరికింది. షరామామూలే! అది మా ఇంటికి వచ్చి చేరింది. కోతికి కొబ్బరికాయ దొరికనట్టు, నేనైనా నోరుమూసుకోవచ్చా, లేదు. తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య కీర్తనలన్నింటిని సుమారు 40 పుస్తకాల్లో ప్రచురించారని నోరుజారాను. అంతే ఉత్తర క్షణం మా మామగారు తిరుపతికి డిడి పంపి ఆ పుస్తకాలన్ని ఆర్డరిచ్చారు. ఏమాట కా మాటే చెప్పుకోవాలి, దేవస్థానం వారు కూడా ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఆ పుస్తకాలన్నింటిని రెండు గోనె సంచీలకెత్తించి (ఇది హాస్యానికి అంటున్నమాటలు కాదండి! వాస్తవం) హైద్రాబాదులో మా మామగారికి పంపారు. అవి తపాల సర్వీసువారి ఆధ్వర్యంలో ఎండకి ఎండి, వానకు తడిసి, ముద్దై, నీరై, కొన్ని పుస్తకాలకు అట్టలు ఊడి, కొన్నింటి పేజీ చిరిగి, మరికొన్నింటి పేజీలు అతుకుల తడకై, బురుద మరకలతో, ముట్టుకుంటే ఊడిపోయేటట్టు తాళ్లపాకవారి కవిత వైభవాన్ని మోసుకుంటూ హైద్రాబాద్ చేరుకున్నాయి.
బస్తాల్లో ఎవరు ఏ బాంబు పంపారో అని బెంబేలుపడి, అయినా ధైర్యం తెచ్చుకొని మూటవిప్పి, తమ ఇంటికి నడచి వచ్చిన అన్నమయ్యవారి కవితలను చూసి, ఆ భగవంతుడే, ఆ తిరుమలవాసుడే తమ ఇంటికి నడచి వచ్చాడని సంబరపడి, మళ్లీ ఆ బస్తాని యథాతధంగా మూటగట్టి, నాకో మెయిల్ పెట్టారు. అమ్మాయి, ఇక అన్నమయ్యవారు నీ సొత్తు ఎప్పుడు తీసుకువెడతావు అని. ఆ బస్తా చూసిన మా ఆడపడుచు వదిన పుస్తకాలు తీసుకు వెళ్లదేమో ఎందుకైనా మంచిది వీలునామాలో కూడా రాయి నాన్నా, అవి నా సొత్తని గట్టిగా చెప్పింది. మా అత్తగారు కూడా నాకు ఫోన్ చేసి, ఎలుకలు కొరికి, చెదలు పట్టిన పుస్తకాలు ఇంకా చెడిపోక ముందే సంరక్షించుకో అని హెచ్చరించారు. అది విని మా వారు కారాలు, మిరియాలు మిక్సీ అవసరం లేకుండానే మెత్తగా నూరారు.
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం! నోరుజారిన పాపానికి మావారని బ్రతిమాలి, బామాలి, కాళ్ల,వేళ్లపడి ఆ పుస్తకాల బస్తాలను హనుమంతుడు సంజీవినీ పర్వతాన్ని మోసుకొచ్చినట్టు భద్రంగా, భక్తితో ఆస్ట్రేలియాకు చేర్చాం. బస్తాలు విప్పి ఆ పుస్తకాలు చూస్తుంటే, చెప్పొద్దు, ఎన్నో గంటలు పురిటినొప్పులు అనుభవించి, ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటే ఒక తల్లికి ఎంత ఆనందం కల్గుతుందో అంత ఆనందం కల్గింది. ఓర్పుగా ఒక్కొక్క పుస్తకం ఎండలో వేసి బాగా ఎండాయన్న నిర్ధారణకి వచ్చాక, చక్కగా పుస్తకాల బీరువాలో వాటిని అలంకరించి మురిసిపోయాను. ఇంతవరకు బాగానే ఉంది, తెలుగు చదవడం, రాయడం కూడా రాని మా అమ్మాయి అన్ని పుస్తకాలు చూసి మూర్చిల్లి, ఇక రేపటి నుంచి నన్ను తెలుగులో ముంచి, కీర్తనల్లో తేల్చి ఆరేస్తారేమోనని బెంబేలు పడితే దాన్ని ఊరుకోపెట్టి, అధైర్యపడద్దని ధైర్యం చెప్పి, ఏమి చేతురా లింగా అని పాడుకోవడం నా వంతైంది.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ఏం సాధించారో నాకైతే తెలియదు గాని, పుస్తకాలని, వాటిలో విలువ కట్టలేని కవితా వైభవాన్ని కనీసం గుర్తించలేని వారు, గౌరవించలేని వారు అక్కడ పనిచేస్తున్నారని మాత్రం తెలుస్తోంది. పుస్తకాలు కొని మీరేం సాధించారని అడుగుతారేమో, అక్కడకే వస్తున్నా. అక్షర, లక్షలు చేసే ఆ పుస్తకాలు నాలుగేళ్లుగా మా బీరువాల్లో మగ్గుతుంటే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం కల్గింది. మనకి తెలియని ఆ వేంకటేశ్వరుని వైభవం, తిరుమల ప్రాశస్త్యం అనేక అన్నమయ్య కీర్తలల్లో అడుగడునా మనకి గోచరిస్తాయి. అలాంటి కీర్తనలని వెదికి, తిరుమలరాయునికి అన్వయించి పాఠకులకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కల్గింది. కొన్ని వేల కీర్తనల్లోంచి ఏ కొన్నింటిని ఎంపిక చేయాలి. చాలా పెద్ద ప్రయత్నమే. అలాగైనా అన్నమయ్య కీర్తనలను కనీసం ఒక్కసారైనా చదవచ్చన్న ఉద్దేశంతో ఈ పంచవర్ష పథకానికి పూనుకున్నాను. ఒక్కరోజులో ఈ ప్రాజెక్టు పూర్తికాదు. తెలుసు. ఎప్పటికైతే అప్పటికే! రామకోటి ఒక జీవిత కాలంలో పూర్తిచేయగలమా? ఏమో భగవదానుగ్రహం, ఎన్ని కీర్తనలు పాఠకులకి పరిచయం చేయగలిగితే అన్నే!
సౌమ్యశ్రీ రాళ్లభండి