
దాచుకో నీపాదాలకు – దగ నే జేసినపూజ లివి
పూచి నీకీరీతిరూప – పుష్పము లివి యయ్యా ||
వొక్కసంకీర్తనే చాలు – వొద్దికైమమ్ము రక్షించగ
తక్కినవి భాండారాన – దాచి వుండనీ
వెక్కసమగునీ నామము – వెలసులభము ఫల మధికము
దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా ||
నానాలికపైనుండి – నానాసంకీర్తనలు
పూని నాచే నిన్ను -బొగడించితివి
వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా ||
యీమాట గర్వము గాదు – నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము – చెప్పినవాడగాను
నేమాన బాడేవాడను – నేరము లెంచకుమీ
శ్రీమధవ నే నీదాసుడ – శ్రీవేంకటేశుడవయ్యా ||దాచు||
అని సవినయంగా కోరుతూ, హరి అవతారమైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలతో ఆ వేంకటేశ్వరుని అర్చించి ఆ వేంకటాచల వైభవాన్ని, మహాత్మ్యాన్ని సాక్షాత్కరింప చేశాడు. తరచి చూస్తే, ఆయన ఆధ్యాత్మ, శృంగార కీర్తనలలో ఏడుకొండలవాని తత్త్వము, తిరుమల వైశిష్ట్యం, వేంకటాచల వాసుని శోభ మనకు అవగతమవుతాయి.
వేదములే శిలలై వెలసిన దీ కొండ
యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ
అంటూ, అన్నమయ్య ఆ శేషాద్రి యొక్క ప్రశస్తిని స్వామివారికి జరిగే సేవలు, అర్చనలు, ఉత్సవాలు, తిరుమల వైభవాన్ని తన సంకీర్తనలలో కీర్తించాడు. ఎన్నెన్నో ఉద్యానవనాలతో, పుణ్య తీర్థాలతో, మణిమయ గోపురాలతో, వెలుగొందే ఆనందనిలయం శోభ వర్ణనాతీతం.
సీ. ఘన గోపురములు, ప్రాకార మంటపములు,
తేరులు, సత్పుణ్య తీర్ధములును,
కమలాప్త కిరణ సంకలితంబులై ప్రకా
శించుచుండెడి హేమ శిఖరములును,
పావన పరివార దేవతాలయములు,
మహిమ నొప్పు విరక్తమఠవరములు,
రంగ దుత్తుంగ మాతంగ తురంగముల్,
కొమ్మరొప్పు బహుసాధు గోగణములు,
తే. ముద్దుగా బల్కు శుకపికములును, నీల
కంఠములును, మరాళసంఘములు మఱియు
ఫల చయుంలు, తులసికాదళ, సుమములు
క్రిక్కిఱిసియుండు వేంకటగిరి పురమున (శ్రీ వేంకటాచల మహాత్మ్యములో తరిగొండ వేంగమాంబ)
ఉగ్రవరాహ రూపం దాల్చి ఇలచేరిన విష్ణువు ఇక్కడే నివాసమేర్పర్చుకోవాలని సంకల్పిస్తే, తానిచటికి రాకుండిన, నేచటికినైనను వచ్చి, మహాత్ముని వక్షమున వసముండెదనని, పతిని చేరిన శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో నిలుపుకొని స్వయంభువుగా, ‘అరుదైన శంఖచక్రాదులతో, సరిలేని అభయ హస్తంతో’, శతకోటి సూర్యతేజములతో, అనుపమ మణిమయమగు కిరీటముతో వెలసిన శ్రీపతిని కన్నులారా దర్శించి, అతిశయంబైన ఆ శేషాద్రిని అన్నమయ్య నోరారా కీర్తించాడు.
ప|| అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము
లందు వెలుగొందీ ప్రభ మీరంగాను
తగ నూటయివువైయెయిమిది తిరుపతుల గల
స్థానికులును చక్రవర్తి పీఠకములును
అగణితంబైన దేశాంత్రుల మఠంబులును
నధికమై చెలువొందగాను
మిగులనున్నతములగు మేగలును మాడుగులు
మితిలేనిది దివ్యతపసులున్న గృహములును
వొగి నొంగుబెరుమాళవునికి పట్టయి వెలయు
దిగువతిరుపతి గడవగాను ||అదె||
పొదలి యరయోజనముపొదవునను బొలుపొంది
పదినొండు యోజనంబులపరపునను బరగి
చెదర కేవంకచూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సువరులు కిన్నరులు కింపురుషులును
గరుడగంధర్వ యక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంత దేశముల
వేడుకలు దైవారంగాను ||అదె||
యెక్కువలకెక్కువై యెసగి వెలసిన పెద్ద
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద
అక్కజంబైన పల్లవరాయమనిమటము
చక్కనేగుచు నవ్వచరి గడచి హరిదలచి
మ్రొక్కుచును మోకాళ్లముడుగు గడచినమీద
నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
అంతంతగానరాగాను ||అదె||
బుగులుకొనపరిమళంబులపూవుదోటలును
పొందై ననానావిధంబుల వనంబులును
నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల
నీడలను నిలిచి నిలిచి
గగనంబు దాకి శృంగారరసభూరితమై
కనకమయమైనగోపురములను జెలువొంది
జగతీధరునిదివ్యసంపదలు గలనగరు
సరుగనను గానరాగాను ||అదె||
ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగుదురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోకిన భవము
లంతంత వీడి పారంగను
యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశుడా దరిని
యేప్రొద్దు విహరించగాను ||అదె||
ఈ బ్రహ్మాండంలోనే సాటిలేని, మేటైన దివ్య క్షేత్రం శ్రీనివాసుడుండేటి తిరుమలకొండ. శేషాద్రి, క్రీడాద్రి, వేంకటగిరి అని ప్రసిద్ధి చెందిన ఈ శిఖరానికి చింతామణి, జ్ఞానాద్రి, తీర్ధాచలము, పుష్కరశైలము, వృషభాద్రి, కనకాచలము, నారాయణాద్రి, శ్రీవైకుంఠాద్రి, నరసింహ గిరీంద్రము, అంజనాద్రి, వరహాద్రి, నీలగిరీంద్రము, శ్రీనివాస పర్వతము, ఆనందాచలము, శ్రీసద్గిరి, క్రీడాచలము, గరుడాద్రి, శేషాచలము, వృషాద్రి, మరియు వేంకటాద్రి అని కూడా పేర్లు కలవు. శ్రీమన్నారయణుడున్న ఈ పర్వత మహాత్మ్యాన్ని వర్ణించటం మానవమాత్రులకు సాధ్యంకాదు. మనోనేత్రంతో దర్శించి కళ్లముందు సాక్షాత్కరింపచేయటం అన్నమయ్య వంటి వాగ్గేయకారులకి మాత్రమే సాధ్యం.
‘‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన,
వేంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి’’
సౌమ్యశ్రీ రాళ్లభండి