అన్నమయ్య కీర్తనల్లో బాలకృష్ణునిలీలలు

శ్రీ కృష్ణలీలలు బ్రహ్మ, విష్ణు, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, కూర్మ, పద్మ, మార్కండేయ పురాణాలలో శ్రీగర్గ, శ్రీదేవీ భాగవతాల్లో, భారత, హరివంశాల్లో వర్ణించపడింది. సమ్మోహనాత్మకమైన కృష్ణ స్వరూపం పండితులను, పామరులను ఒకే విధంగా అలరించింది. లీలాశుకుడు, నారాయణతీర్ధులు, పురందర మరియు అన్నమయ్య వంటి వాగ్గేయకారులెందరో బాలకృష్ణుని లీలా విశేషాలను అభివర్ణించి తరించారు. ‘‘భక్తవత్సలు డౌటపరమ సంప్రీతి పరమ పదంచిచ్చు బాలకృష్ణుడు’’అంటూ ఫలశ్రుతి చేసింది తన ‘శ్రీకృష్ణమంజరి’లో తరిగొండ వేంగమాంబ. వేదాలలో ప్రాచీనమైన ఋగ్వేదంలో కూడా కృష్ణ శబ్ధం పలుచోట్ల విన్పిస్తుంది. శ్రీ భాష్యం అప్పలాచార్యులుగారు ‘‘తిరుప్పావు’’ అనే గ్రంధంలో ‘కృష్ణ’ శబ్ధానికి ఈ విధంగా నిర్వచనం చెప్పారు – కృష్ – అపరిమితము, ణ – ఆనందము, కృష్ణ – అపరిచ్ఛిన్న ఆనందము. అదియే బ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణతత్త్వాన్ని, లీలా వైభవాన్ని అన్నమయ్య తన కీర్తనల్లో సాక్షాత్కరింప చేశాడు.

అన్నమయ్య తీర్ధయాత్రల సందర్భంలో దర్శించిన ఉద్దగిరి, మాడుపూరు, విజయనగరం వంటి కృష్ణ క్షేత్రాలపై సంకీర్తనలు పాడాడు. అవేకాక పర్వ సంకీర్తనలు, బాలకృష్ణుని లీలావైభవ సంకీర్తనలు కూడా ఆయన కీర్తనల్లో ప్రముఖంగా కన్పిస్తాయి. ‘ఓయమ్మ చూడగదరె వుద్దగిరి కృష్ణుడు’, ‘చేరి యందల మోతతో చెన్నకేశవా, యీరీతి మాడుపూరిలో నిట్లాడేవా’, ‘వేడుకకాదు గదమ్మ విజయనగరములోన, వేడెవెట్టి సతులను వెన్నముద్ద కృష్ణుడు’ వంటివి క్షేత్ర సంకీర్తనల్లో కొన్ని ఉదాహరణలు. ఇక అన్నమయ్య కృష్ణ పర్వ సంకీర్తనలను, జయంతి సంకీర్తనలు, కృష్ణాష్టమి సంకీర్తనలు, తిధి జయంతులను గూడ సూచించే సంకీర్తనలు, చివరగా ఉట్ల పండుగ సంకీర్తనలు అను నాలుగు విధాలుగా విభజించవచ్చు.

‘జోజోయని మీరు జోలపాడరో, సాజపు జయంతి నేడే సఫల మిందరికి’, ‘హరి కర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో’ అంటూ, శ్రావణ, భాద్రపద మాసాల్లో అష్టమితో కలిసి వచ్చే రోహిణి నాడు కృష్ణజయంతిగా సూచిస్తూ అన్నమయ్య సంకీర్తనలు చేశాడు. ‘సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమినాడు’ అంటూ, ఎంతో విశిష్టమైన శ్రావణ బహుళాష్టమి ప్రాముఖ్యాన్ని, తత్ ప్రాశస్త్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో భావబంధురంగా అభివర్ణించి ఆలపించాడు. ఇందు కొన్ని మచ్చుతునకలు —

‘కొడుకై జన్మించినాడు కూరిమి శ్రీ కృష్ణుడు, నడురేయి నిదే శ్రావణ బహుళాష్టమినాడు’

‘శ్రావణ బహుళాష్టమి చంద్రోదయము రోహిణి కావింప జన్మదినమిదివో శ్రీ వేంకటపతికి’

‘గోవిందుడు జనించె గోకులాష్టమిదే నేడు’

‘అందమై మధురలోన నదివో కృష్ణావతరామందెను శ్రావణ బహుళాష్టమి నేడు’

‘దేవకి కొడుకుగన్న దినమిది శ్రీజయంతి, వసుదేవుడెత్తెను శ్రావణ బహుళాష్టమిని‘,

‘పురాణ పురుషుడు భువి నవతరించె, సిరుల జయంతి నేడు సేయరో పండగలూ, శ్రావణ బహుళాష్టమిఁ జందురు డుదయించెను’ అంటూ శ్రీకృష్ణజన్మాష్టమి తిధి, నక్షత్రాలను మేళవించి కూడా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాడు.

‘పలువురు వుట్లపండుగను, చిలుకు చిడుక్కొని చిందగను’ అంటూ జన్మాష్టమినాడు భారతదేశ యావత్తు ఎంతో ఉత్సాహంగా, వినోదాన్ని పంచుకునే ఉట్లపండగకు అన్నమయ్య తన సంకీర్తనల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు.

‘బాలులతో వీధులలో బారాడువాడు, కోలలెత్తుక వుట్లు కొట్టిఁజుండీ’

‘అక్కలాల చూడు డందరును, నిక్కి నారవట్టి నేడు కృష్ణుడు’

‘పైకొని చూడరో వుట్లపండుగ నేడు, అకడ గొల్లెతలకు నానందము నేడు’

ఇలా సంకీర్తనల్లో ఉట్లపండగను ఉల్లేఖించడమేకాక, ఎన్ని రకాల ఉట్లు కట్టబడేవో, కొట్టబడేవో కూడా అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలియ చెప్పాడు. వక్కల, సెనగల, పప్పుల, తేనెల, చెక్కరల, నేతుల, బియ్యాల, చక్కిలాల, అటుకుల, చెఱకుల, నువ్వుల, బెల్లాల, చిమ్మిలాల, ఆనవాల, అడుకుల, పానకాల, పెరుగు, వెన్నఉట్లను బలరామకృష్ణులు కొట్టారని అన్నమయ్య సంకీర్తనల్లో తెలుస్తుంది.

ఇక భాగవత దశమస్కంధంలో ఊటంకించిన శ్రీ కృష్ణుని దివ్యలీలలే అన్నమయ్య లీలావైభవ సంకీర్తనలకు ఆధారము. అన్నమయ్య తన సంకీర్తనల్లో పూతన, శకటాసుర, తృణావర్త, కంసాదుల సంహారం, ఉలూఖల బంధనం, కాళీయ మర్ధనం, గోవర్ధనోద్ధరణ మొదలైన ఘట్టాలను కూర్చి ఎంతో రసవత్తరంగా ఆలపించాడు.

‘ఎక్కడి కంసుడు యికనెక్కడి భూభారము, చిక్కువాప జనియించె శ్రీ కృష్ణుడు’

‘కావిరి విరెసె కంసుడిగినిసె, వావిరి పువ్వుల వానలు కురిసె’

‘చన్నుదాగి పూతనను సగ్గుడుగా చప్పరించె’

‘పిసికిపూతకి చన్ను బిగియించి పట్టిన, యిసుమంతలు చేతులివియపో’

‘చిమ్మెడి విషములు చేసిన రొమ్ములు, కొమ్మని యిచ్చిన గుడిచేని
బొమ్మర పోవడు పూతకి బొరిగొని, అమ్మరో గయ్యాళి శిశువు’

‘కాళింగు దొక్కితివట కటకట వుద్దండాలు, వోలిజేయ దొరకొంటివొ’

‘బాలునీ కోపమిది సరిలేని మద్దలివి, రోలనే యిట్లను విరుగద్రోయుడు’

‘కరికరించగ రోలగట్టితే నప్పుడు మా, హరిగాడుగదా ఆడనున్న బిడ్డడు’

‘కినిసి గోవర్ధనగిరి వెల్లగించిన, యినుమువంటి చేతులివియపో’

‘గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు’

‘తొల్లె గోవర్ధనమెత్తి దొరతనాలెల్లాజేసి, అల్లవాడె నిలుచున్నాడాతుడీతడా’

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంకీర్తనల్లో శ్రీ కృష్ణలీలలు మనకు దర్శనమిస్తాయి.

బాలకృష్ణుని భక్తితత్వం: కేవలం కృష్ణలీలలను కీర్తనలుగా ఆలపించడమేకాక, తన సంకీర్తనల్లో భక్తి తత్వాన్ని ఇనుమడింపచేశాడు అన్నమయ్య. ‘నానాభక్తులివి నరుల మార్గములు’ అంటూ భక్తిలో అనేక విబేధాలను తెలిపాడు. ఉన్మాదభక్తి, పతివ్రతాభక్తి, విజ్ఞానభక్తి, ఆనందభక్తి, రాక్షసభక్తి, తురీయభక్తి, తామసభక్తి, వైరాగ్యభక్తి, రాజసభక్తి, నిర్మలభక్తి మరియు నిజభక్తి, ఇలా అనేకానేక భక్తితత్వాలను అన్నమయ్య తన సంకీర్తనలలో పొందుపర్చాడు.

‘ఇట్టి ముద్దులాడి బాలుడేడి వాడువాని, బట్టితెచ్చి పొట్టనిండ బాలుపోయరె’

అంటూ యశోద బాలకృష్ణునిపై కురిపించే వాత్సల్యం, ‘మొత్తకురె యమ్మలాల ముద్దులాడు వీడె, ముత్తెము వలె నున్నాడు ముద్దలాడు’

అని గోపికలు చిన్నారి కృష్ణుని యశోద శిక్షిస్తే నిలువలేక కురిపించే వాత్సల్యం,

‘తోయపుం గురులతోడ దూగేటి శిరసు, చింత
కాయలవంటి జగడములతోడ
మ్రెయుచున్న కనకంపు మువ్వల పాదాలతోడ
పాయక యశోదవెంట బాఱాడు శిశువు
చిన్ని శిశువు, చిన్నిశిశువు
ఎన్నడు జూడమమ్మా యిటువంటి శిశువు’

అంటూ బాలకృష్ణుని సౌందర్య దర్శనంతో ఆ దేవదేవునిపై పెంచుకునే వాత్సల్యం భక్తితత్వానికి పరాకాష్ఠ.

నవవిధ భక్తిమార్గాల్లో కీర్తనమొకటి. అన్నమయ్య గుణసంకీర్తనం మనకు ప్రధానం కన్పిస్తుంది.

‘కొండగొడుగుగబట్టి గోకులమునెల్లగాచి
మెండుగు గొల్లెతలతో మేలమాడి
అండనె నోరుదెరచి యశోదకు లోకములు
దండిగాజూపె నితడెదంట యైనబాలుడు’

అని చెప్పడంలో గోవర్ధనోద్ధరణ, విశ్వరూప దర్శనం వంటి దివ్యలీలలను కీర్తించాడు అన్నమయ్య.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *