‘హాస్య బ్రహ్మ’ సంభాషణా చతురత

ఈ కాలంలో ఎవరైనా తెలుగువారితో కలుషితంలేని, కలగూరగంప కాని తెలుగులో అంటే, ఇంగ్లీషు, హిందీలాంటి పదాలు వాడకుండా మాట్లాడితే, స్వాతి, ఆంధ్రప్రభ తదితర పత్రికలలో అచ్చుగాని నవలల పేర్లు చెప్పినా మాకు అంతగా తెలుగురాదండీ, సాహిత్యం గురించి తెలియదండీ అనడం మామూలైపోయింది. ఇక విదేశాల్లో పెరుగుతున్న మా పిల్లలకి పెద్దమనుష్యులు, నర్తనశాలలాంటి పాత సినిమాలు చూపిస్తే వాళ్లు తెలుగు అలా మాట్లాడుతున్నారేంటి అంటారు. విదేశాల్లో పెరిగే పిల్లలే కాదు ఆంధ్రదేశంలో పెరుగుతున్న పిల్లలు కూడా ఇలాగే అంటారనడంలో సందేహంలేదు. సినిమా భాష, పత్రికా భాష, పామురుల భాష అంటూ వ్యత్యాసం ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు అంటువంటి తేడాలేమి లేవు. అంతా అర్ధమైతే మన భాషే కాకపోతే అది భాషే కాదు. సినిమాల్లో వాడే భాష మనకి అర్ధంకాని భాషేమి కాదు. మనం రోజువారి నిజజీవితంలో వాడేదే, కేవలం వాడే తీరు, వాడిన సందర్భం ఆ భాషకు విన్నూత్నత చేకూరుస్తుంది. రౌతు కొద్ది గుర్రం అన్నట్టు, రచయిత కొద్ది సంభాషణలు.

ఒక చిత్రం వెయ్యి పదాల భావం తెలిపేదయినా, ఒక్కొక్కప్పుడు ఒక మాట చిత్రంలోని భావానికి పదును పెడుతుంది, వన్నె తెస్తుంది, మనోభావాలని ఆకళింపు చేసుకొనేందుకు ఉపయోగపడుతూ చిత్రానికి ఒక పరిపూర్ణతను తెస్తుంది. దృశ్య కావ్యమైన సినిమాలో మాటలు కనిపించని రాగాలై కమనీయంగా వినిపిస్తాయి. ఇదివరలో మన సినీరంగం నాటక రంగంపై పూర్తిగా ఆధారపడి ఉండటంతో దాని ప్రభావం సినిమాలలో మనకు అగుపించేది. అలాగే నాటకరంగంలో విశేష అనుభవం గడించిన పెద్దలు సినీరంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగారు. నాటక రంగాన్నుంచి వచ్చిన అలాంటి ప్రముఖుల్లో రచయిత, దర్శకుడు శ్రీ జంధ్యాల ఒకరు.

ఒకప్పుడు రచయిత కథ కనుగుణంగా దర్శక, నిర్మాతలు నటీనటులను తీసుకునేవారు. కానీ నేడు హీరోకనుగుణంగా కథా, మాటలు మన దర్శక, నిర్మాతలు రాయిస్తన్నారు. ఇలాంటి యుగంలో అటు కమర్షియల్, ఇటు కళాత్మక చిత్రాలలలోనూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకొన్న కొద్దిమంది రచయితల్లో జంధ్యాల ప్రముఖులు. ఈ కింది సంభాషణలు గమనించండి మీకే అర్ధమవుతుంది.

“పాశ్చాత్య నాగరికత పెనుతుఫాను లో రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపుకాయడానికి తన రెండు చేతులు అడ్డు పెట్టిన మహామనీషికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను,” శంకరాభరణంలో పతాక సన్నివేశంలోని ఈ సంభాషణ, “ఈస్ట్ కోస్ట్ మాష్టారు తనకిష్టమైన అతికష్టమైన బారిష్టర్ టెస్ట్ ఫస్ట్ లో పాస్ అయినందుకు తన పక్కింటివాడిని ఫీస్ట్ కనిపిలిచి చికెన్ రోస్ట్ టేస్ట్ ను బెస్ట్ బెస్ట్ అనుకుంటూ సుస్టుగా లాగించి బ్రేవ మన్నాట్ట” అంటూ ప్రాసకోసం అతి ప్రయాసపడి రాసిన వేటగాడులోని ఈ సంభాషణ జంధ్యాలలోని రచయితలోని వేర్వేరు రూపాలను మనకు చూపిస్తాయి.

ఆత్రేయ రాసి ప్రేక్షకులని, రాయక నిర్మాతలనీ ఏడిపిస్తాడని అంటారు. అదే విధంగా జంధ్యాల గురించి చెప్పాలంటే, జంధ్యాల హాస్యంతో హాస్య ప్రియులని, ఆర్ద్రతతో అందరినీ కంటతడిపెట్టస్తాడని చెప్పవచ్చు. వినోదమే ప్రధానమైన సినిమాలో వినోదాన్ని ఎంత బాగా పంచగలిగారు అన్నదాని మీద సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. దీనిలో సాధ్యాసాధ్యాలకుగాని, వాస్తవికతలకుగానీ చోటులేదు. ఇలాంటి సందర్భాల్లో రచయిత హాస్య సన్నివేశాలకి హాస్య సంభాషణలు వ్రాయడమే కాక ఆ సన్నివేశం రక్తి కట్టేటట్టు రూపొందించగలగాలి. ఇటువంటి కధలో ప్రేక్షకుడికి వినోదం కలిగించటానికి కల్పించే సన్నివేశాలు సృష్టించడంలో జంధ్యాల దిట్ట. మూడు గంటల పాటు వీక్షకులను కట్టిపడేసే శక్తి ఆయన స్వంతం. ఉదాహరణకు జగదేకవీరుడు, అతిలోక సుందరిలో ఈ సంభాషణ చూడండి,

అమృతం ఉన్నదా మానవా, (చేతితోచూపిస్తూ) ఆ ఉంది ఫుల్ బాటిల్, కొట్టుకు రమ్మంటావా.
కొట్టుకు అనగా నేమి మానవా
(అప్పటికే ఈ ప్రశ్నలతో విసిగిపోయి) నేను చెప్పలేనే తింగర బుచ్చి
తింగర బుచ్చి అనగానేమి మానవా.
ఈ సంభాషణ చదవడాని కంటే సందర్భోచితంగా ఉండి సునిశితమైన హాస్యాన్ని పుట్టిస్తుంది. జంధ్యాల గారి చాకచక్యం సన్నివేశాల కనుగుణంగా ఆయన ఏరి కోరి పదాలను ఉపయోగించే విధానంలో మనకు కన్పిస్తుంది. అలాగే ఇంకొక సన్నివేశం చూడండి.

మీ పేరు: సు సు సునాదమాల
అదేమిటి మూడు సు లు ఉన్నాయా
లేదు ఒక సు నే
నాపేరు వి విహారి, (ఒక క్షణం ఆగి) రెండు వి లండోయ్, ఒకటి ఇంటి పేరు, రెండు వంటి పేరు.

నిజంగా ఈ మాటలు పెద్దగా నవ్వు తెప్పించవు. కానీ ఆ సన్నివేశంలో సందర్భానుసారంగా వాడిన పదాలు ప్రేక్షకుల పెదాలపై చిరునవ్వులు చిందించక మానవు.

హాస్యం రెండురకాలు, ఒకటి సంభాషణపరమైనవి, రెండు నటనపరమైనవి. సన్నివేశాలకు తగినట్టు మాటలు వ్రాసి, అనవసర కామెడీ జోలికి పోకుండా, పాత్రోచితంగా సున్నితమైన హాస్యం అల్లి, తనదైనశైలిలో ప్రేక్షకులను మురిపించిన రచయిత జంధ్యాల. జంధ్యాలలోని రచయితకు మెరుగులుదిద్దిన చిత్రాలు కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వెలువడ్డ సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, శుభోదయం, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం మరియు ఆపద్భాంధవుడు. ఈ చిత్రాల్లోని ప్రతీ పాత్రను ఆకళింపు చేసుకుని అందకు తగ్గట్టుగా జంధ్యాల సంభాషణలు రాశారు. శంకరాభరణం సినిమాలో ఈ డైలాగ్ చూడండి,

“ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని ఒకలా అంటాడు, ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్ధుష్టమైన నాదం ఉంది. ప్రయోగాల పేరిట ఆ అమృత తుల్యమైన సంగీతం అపభ్రంశము చేయకు దాసూ”, ఇది శంకర్ శాస్త్రికి సంగీతంపై గల మక్కువను, దాని పట్ల గౌరవాన్ని చెప్పకనే చెపుతాయి.

సాగరసంగమంలోని ఈ డైలాగ్స్ లో… “మృతిలోన ముగిసినా చితిలోన రగిలినా కడతేరి పోనీదీ మధురానుబంధము, ఎద వీడిపోనిదీ మమతాను రాగము,”

“పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి, రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యలా మలిచేవాడు మనిషి.”

“రోగం పేరుతో దానికి, దాని మొగుడి హోదాలో నాకు బానే మర్యాదలు జరుగుతున్నాయండి.”
ఎంత ఆర్ధ్రత, భావుకత ఉట్టిపడుతన్నాయో చూడండి. జంధ్యాల మాటలు వ్రాయడంలో, కధను ముందుకు తీసుకెళ్లడమే కాదు ఆ పాత్రల స్థితి గతులకి స్వభావానికి దగ్గరగా ఉండే మాటలు అల్లుతాడు. పాత్రల తీరు తెన్నులు, ఆయా పాత్రలు సహజ సిద్ధంగా అనే మాటలలోని ఔచిత్యం రచయిత గ్రహించగలిగితే ఆ సంభాషణలను సహజంగా, హృద్యంగా రక్తి కట్టించగలడు. జంధ్యాల ఈ విషయంలో సిద్ధహస్తుడు.

భావోద్వేగాలను వ్యక్తపర్చేటప్పుడు అతి చోటుచేసుకోకుండా జాగ్రత్తపడాలి. హృదయానికి హత్తుకునే విధంగా ఉండాలి. ఒక్కక్కసారి పాత్ర తనకు భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శస్తే సంభాషణలు అభాసుపాలు కాకుండా చూడటం రచయితకు కత్తిమీద సామలాంటి పనే. ఉదాహరణకు శంకరాభరణంలో మాధవ పాత్రను గుర్తుచేసుకోండి. పూర్తి హస్యంపాత్ర. అల్లురామలింగయ్యగారు అద్భుతంగా పోషించారు. శంకరశాస్త్రి స్నేహితుడైన మాధవ్ ఆయన పట్ల భయ,భక్తులు కలవాడై అవసరమైతే స్నేహితుని కడిగి ఎండయగల పాత్ర. ఒకానొక సందర్భంలో ఈ పాత్రచేత సందర్భోచితంగా ఎంత ఆవేదనను, ఆక్రోశాన్ని, వేదనని, బాధని జంధ్యాల గారు ఎంత అద్భుతంగా పలికించారో చూడండి.

“అవసరం లేదురా నీకేదీ అవసరం లేదు, కానీ శారదకు పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం, ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టువి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండేరము తొడిగించుకున్నవాడివి, ఈ వేళ ఎవడన్నా కచేరికి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడురా, శుభ్రమైన బట్ట కట్టి ఎన్నాళ్లైయిందిరా, సంతృప్తిగా మూడు పూటలు భోంచేసి ఎన్నాళ్లైయిందిరా , పోనీ శారదకన్నా ఒక రవికలగుడ్డ కొనిపెట్ట గలుగుతున్నావా, ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ సేవ, ప్రజలకి నీ సంగీతం అఖ్ఖర్లేనప్పుడు ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు ఎందుకురా నీ కింకా ఆ వ్యామోహం?…… “

ఈ మాటలు కేవలం శంకరశాస్త్రిని ఉద్దేశించినవి కాదు. ఎరువు తెచ్చుకున్న పాశ్చాత్య వ్యామోహంలో పుట్టిన గడ్డలోని సంస్కృతిని సాంప్రదాయాలని పట్టించుకోని, తమ ఉనికికి కారణమైన కళలను, కళాకారులను గుర్తించలేని నేటి యువతరంను కూడా ఉద్దేశించినవే. ఈ మాటలలో ఆగ్రహం, ఆవేదన, భంగపాటు, సమాజానికి ఒక నిఘూడమైన హెచ్చెరిక. ఒక సందేశం. ఒక రచయిత ఈ సన్నివేశంలో, తమ మూలాలు మర్చిపోతున్న యువతరం మీద తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ కూడా, సన్నివేశంలో ఔచిత్య భంగం కలుగకుండా, సందేశం వినిపించడంలో కృతకృత్యుడయితే, సమాజం మీద తన కొరడా ఝడిపించగలిగితే, అది ఆ రచయిత ప్రతిభకి దర్పణం పట్టుతుంది. అంతటి ప్రతిభ కలవాడు కనుకనే కళాత్మక సినిమాల్లోని ఆలోచనా ధోరణులని, సున్నితత్వాన్ని, మాస్ సినిమాల్లోని జనాకర్షణ పద్ధతులని మేళవించి ప్రేక్షకులను మెప్పించాడు జంధ్యాల.

మాయాబజార్ సినిమాలో అనుకుంటాను ఒక డైలాగ్ ఉంది. ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయని. ఎంత నిజం. కొత్త మాటలను పుట్టించి వాటికి బహుళ ప్రాచుర్యం తీసుకురావటంలో రచయిత పాత్ర ఎంతైనా ఉంటుంది. జంధ్యాల మార్క్ డైలాగ్ లు, మాటలు నేడు ఎంతగా జనవాహినిలోకి వెళ్లాయంటే, ఇవి సినిమా సృష్టించిన మాటలని చెప్పినా ఎవరూ నమ్మరు.

తమ్ముడూ భరతా! పితృవాక్య పరిపాలనా దక్షుడిగా, ఆడిన మాట తప్పని ఒక బాధ్యాయుతుడైన కొడుకుగా, ప్రజల సంక్షేమం ఎల్లప్పుడు కోరుకునే ఒక ఆదర్శవంతమైన రాజుగా, ధర్మం నాలుగు పాదాలా నడపవలసిన ముగ్గురు తమ్ముల అన్నగా, నేను ఆ రాజ్య పదవి తీసుకోలేను తమ్ముడూ తీసుకోలేను.

తమ్ముడూ నేను రాను అని ఒక్క మాట చెబితే సరిపోదా, దీనికి అంత సుత్తి ఎందుకు? సుత్తి అనే మాట త్రేతాయుగంలో భరతుడి సృష్టిగా, జంధ్యాల మార్కు చమత్కారంతో సుత్తివేలు చేత నాలుగు స్థంభాల ఆట సినిమాలో చెప్పించారు. అప్పటినుంచి ఈ సుత్తి పదం ప్రజలకి ఒక వాడుక మాటగా తయారైంది. సుత్తి సినిమా, సుత్తి వేస్తున్నాడు, సుత్తి ఆపు, చాలా సుత్తిగా ఉంది, మొదలైనవి. ఇది పురాతన కాలం నించి ఉన్నమాట లాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది.

విజయా పిక్చర్స్ కి చాలా సినిమాలకు మాటలు వ్రాసిన రచయిత పింగళి నాగేంద్రరావుగారు ఇలాంటి పదసృష్టికి నాంది పలికారు. ఇవి ప్రజల వాడుక భాషలో అతి సహజంగా, ఎప్పటినుంచో ఉన్న మాటల్లాగా, భాషలో భాగమై పోయాయి. ఉదాహరణకు అస్మదీయులు/తస్మదీయులు, అలమలం, గిల్పం, వీరతాడు మొదలైనవి. పింగళి తరువాత జంధ్యాల ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇటువంటి పదాలు అప్పటిదాకా నిఘంటువులో కానీ, వాడుకలో కానీ లేకపోయినా, అచిర కాలంలోనే ప్రజల నాలుకులపై తాండవించాయి.

జంధ్యాల తన మాటల చమత్కారంతో మరుగున పడుతున్న సున్నితమైన హాస్యానికి జవసత్వాలు ప్రసాదించి ప్రాణం పోసాడంటే అతిశయోక్తి కాదేమో. పొద్దున్నే లేచి పరగడుపున ఒక చుట్ట ముట్టించి, వర్షం వస్తే విస్కీ రాకపోతే రమ్ము పుచ్చుకుంటాడే తప్పితే మరే మాదక ద్రవ్యాల జోలికి పోడయ్యా, సాయం కాలం పూట సరదాగా ఒక సిల్క్ జుబ్బా వేసుకుని అలా సానివాడల గుండా రాత్రికి ఇంటికి చేరుకుంటాడే తప్పితే పిల్లవాడికి ఎలాంటి దురలవాట్లు లేవండయ్యా … అదేంటయ్యా, పిల్లవాడు చూడడానికి మంచి వాడిలాగానే కనిపిస్తాడు. దాని దేముందయ్యా మీరు కనపడరూ వంటి మాటలు, సంభాషణలు, ఏం మావయ్యా ఇదేనా రావడం, సామాన్లు ఏమైనా ఉన్నాయా. లేవురా ఉన్నది ఈ ఒక్క సంచినే, ఇందులో కూడా ఉన్నవి మీ అక్క చేసిన విదేశీ అట్లు, మీ నాన్న తిట్టిన దేశవాళీ తిట్లు, ఆ అట్లు తినలేక ఈ తిట్లు వినలేక చచ్చాననుకో, లాంటి మాటలగారడీలు ఆయనకే చెల్లు.

జంధ్యాల కి సాహిత్యం మీదా వాడుక భాష మీద ఉన్న పట్టు ఈ రకమైన హాస్యాన్ని పుట్టించడానికి ఉపయోగపడింది. ఈ రెంటినీ సమన్వయంతో ఉపయోగించి వాడుక భాషలోని వాచలత్వంతో హాస్యం సృష్టించడం జంధ్యాలకే చెల్లింది.

అయ్యా! ప్రభువు వారి వ్యాకరణంలో తృతీయ తత్పురుష లేదు, మచ్చుకి మొన్న వారిని కరిచిన కుక్కకి పిచ్చిపట్టి చచ్చిందనుకోండి, నన్ను కరిచి నువ్వు చచ్చిపోయావంటారు,
ఒరేయ్ ఒరేయ్ అలా చేతులు వణికించావంటే నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరుతానురా కుంకా.

ఒరేయ్ మీ అయిదు తొమ్ముదులు నలభైఐదు పిండాకూళ్ళు పిచ్చికలకి పెట్టా. దీనికి వెంటనే ప్రతిసమాధానం వస్తుంది . అరే నా అంతిమ కోరిక మీరెలాగ తెలుసుకోగలిగారు.

ప్రతీ భావానికి ఒక స్పష్టమైన భాష ఉంది ( జంధ్యాల మాటలలో .. ఒక్కో అనుభూతికి ఒక్కొక్క నిర్దుష్టమైన శబ్దం ఉంది ) ఆ భాష నుంచి కొద్దిగా పక్కకు వెళ్ళినా రసాభాస అవుతుంది, ఒక్క హాస్యంలో తప్ప. హాస్యానికి ఒక ప్రత్యేకమైన భాష, పద జాలం ఉంది. పవిత్రమైన మహాభారతం ఎవరు వ్రాసినా శుద్ధమైన భాషలో పవిత్రమైన భావనతో వ్రాస్తారు. ఒక ప్రత్యేక యాసలో జంధ్యాల గారి మాటలలో తప్ప…

సావిత్రమ్మని జూసి మిక్కిలినేని గాడు రాయే అన్నాడు . నేను రాను పోరా అన్నది. మళ్ళీ రాయే అన్నడు మళ్ళీ రాను పోరా అన్నది. గంతే భై సావిత్రమ్మ జుట్టు బట్టుకొని బర బరా ఈడ్చుకొచ్చేసిండు. జక్కడ మన భీముడు అదే మన ఎంటివోడు భై గద పిసకతా ఉన్నాడు పిసకతా ఉన్నాడు ఏం జేస్తాం అన్న.

దేశ విదేశీ వంటకాల మీద వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ , చికెనవా ఉస్తిమోవ్ అనే రష్యా వారి పాయసం, బెట్టిబోని సెమి అనే జపాన్ వారి వంటకం తయారు చేసే స్త్రీ, అప్పుడే చూసి వచ్చిన సినిమా అక్షరం పొల్లుపోకుండా మొదటినుంచి చివరి పతాక సన్నివేశం శుభం దాకా వివరంగా వర్ణించి చెప్పే స్త్రీ (శ్రీ లలితా శివ జ్యోతి పిక్చర్స్ వారి లవకుశ, తారాగణం N.T. రామారావు, అంజలి దేవి ….. సౌండ్ రికార్డింగ్ వెస్ట్రేక్స్ ఆడియో … దుస్తులు పీతాంబరం…. ఔట్ డోర్ యూనిట్ ఆనంద్ సినీ సర్వీసెస్ …. పోరాటాలు జూడో రత్నం … ), పెళ్లి చేసుకున్న పడతి తనతో పాట పాడక పోయినా, తనకు వండి పెట్టక పోయినా సర్దుకు పోయే దురదృష్టవంతుడు ( ముష్టివాడు కూడా వీళ్ళ ఇంటిదగ్గర అయ్యా మాదాకోళం అయ్యా అనే అరుస్తాడు, ఆయన టెలిమార్కెటింగ్ వాళ్ళ వంటింటి పరికరాలికి, వంట సామాగ్రి కి కూడా బలి అవుతాడు), మార్నింగ్ వాక్ లో దోవలో కనిపించిన దురదృష్ట వంతులు అందరికీ తన జీవిత కధ చెప్పి ఆనందించే ఒక పెద్దమనిషి ( ఏమిటీ నీకు కస్తూరి గురించి తెలియదా, పద అలా నడుస్తూ మాట్లాడుకుందాము), చిన్న తనంలోనే తప్పి పోయిన తన కొడుకు జ్ఙాపకాలను ఎవరైనా గుర్తు చేస్తే తన్మయత్వం చెందే తల్లి ( బాబూ చిట్టీ , మా చిట్టి కూడా అలానే కత్తి బాకు అని అంటుండే వాడు బాబు అని అనేది ఎవరైనా కుర్రాడు కత్తిలా ఉన్నాడు అని అంటే), తన రచనలు పత్రికా సంపాదకులు తిరిగి పంపినా , ప్రచురించటానికి తిరస్కరించినా సరే , తను గొప్ప కవయిత్రి నే అని నమ్మే స్త్రీ (నేను కవయిత్రిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాడిని రాయితో కొడతా … అంటూ సాధించే ఆవిడ). ఇటువంటి అనేక రకాల విపరీత ప్రకృతి గల్గిన పాత్రలని వాటికి విపరీతమైన భావాలు, స్వభావాలను సృష్టించి భాషకు, హాస్యానికి కూడా కొత్త ఒరవడులు దిద్దన ఘనుడు జంధ్యాల.

జంధ్యాల అపర సృష్టిని తమదిగా చేసుకుని అనేక రచనలు చేసినవారున్నారు. ఉదాహరణకు మల్లాది కృష్ణమూర్తి, ఒడ్డున పడ్డ చేప (ష్ గప్ చుప్), పొరపాటు పడిన పోలికలు (రెండు రెళ్ళు ఆరు), సఫలము కాని ప్రేమలు (కనీసం చివరి వరకు) (నీకూ నాకు పెళ్ళంట ), మొదలైనవి ఈ కోవకు చెందినవే.

జంధ్యాల వారి మాటలలోనే చెప్పాలంటే, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వుకు నాలుగు విధాల అర్ధాలను చెప్పి, నేర్పి, ఏం నాన్నా ఇప్పుడే వచ్చావా? , లేదు, నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా ! లాంటి సంభాషణలతో, చిన్న, చిన్న పదాలతో బ్రహ్మాండమంత హస్యాన్ని సృష్టంచగలగటం జంధ్యాలకే తప్ప ఇంకెవరికీ సాధ్యంకాదు. తెలుగు భాష చేసుకున్న అదృష్టమేమో జంధ్యాల మార్కు సంభాషణలను తనలో ఇమిడ్చుకోగలిగింది.

(ఈ వ్యాసానికి భూమిక జంధ్యావందనం బ్లాగ్ లో ప్రచురితమైన హాస్యబ్రహ్మ జంధ్యాల … (వెలుగునీడలు). జంధ్యాల గురించి, ఆయనలోని దర్శక, రచయిత ప్రతిభ గురించి శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారు ఇంగ్లీషులో రాసిన వ్యాసానికి స్వేచ్చానువాదం శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు చేశారు. ఈ వ్యాసంలోని కొంతభాగాన్ని తేటగీతి ఇక్కడ మీ కొరకు అందించింది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *