శ్రీకృష్ణ తులా భారము – ఒక పునర్విమర్శ

పోతనగారి భాగవతం ప్రథమ స్కంధంలో “శ్రీకృష్ణుఁడు ద్వారకా నగరంబు ప్రవేశించుట”, “శ్రీకృష్ణుఁడంతఃపుర కాంతలం జూడఁబోవుట” అనే కథలు ఉన్నాయి. హస్తినాపురమునుండి శ్రీకృష్ణుడు తిరిగి తమ ద్వారకకు వచ్చాడని తెలుసుకొన్న పుర జనులందరూ ఆనందముతో గానం చేస్తూ, నృత్యాలు చేస్తూ ఆయనకు స్వాగతం ఇస్తారు. అందరి సత్కారాలు అందుకొని, అందరితో సంభాషించి, అందరి యోగక్షేమములను కనుగొని, శ్రీకృష్ణుడు అంతఃపురము లోనికి ప్రవేశిస్తాడు. ఎంతో కరుణాసముద్రుడైన ఆయన అందరు కాంతలనూ సంతోష పరిచే ఉద్దేశ్యంతో, అందరి భార్యల గృహాలలో ఒకే సమయంలో దర్శనమిస్తాడు. “నా విభుడు నా వద్దకే ముందుగా వచ్చాడు” అని భావించి ఆయా భార్యామణులు తన్మయత్వంలో మునిగిపోతారు. విరహంతో చిక్కిపోయిన ఆ కామినీమణుల క్షేమాన్ని పరమాత్ముడు తెలుసుకొన్నాడని పోతనగారు ఎంతో మృదుమధురంగా, చక్కగా ఈ కింది సీస పద్యంలో వర్ణించారు.

సీ. తిలకమేటికి లేదు తిలకినీతిలకమ? పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి?
కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి?తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంసఁ బెంపుదే కలహంసగామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతు వా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?

ఆ. మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన? గురుల నాదరింతె గురువివేక?
బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు.

తమ కుశలాన్ని వాకబు చేస్తున్న వాసుదేవుని ముందు మనస్సుతో, తరువాత చూపులతో, అటుపిమ్మట చేతులతో ఆనందాతిశయంతో వారు కౌగలించుకుని, క్రీడించినా, ఆ సర్వసంగ పరిత్యాగి మనస్సును మాత్రం చలింపదు. సరిగ్గా ఈ రెండు సందర్భాల మేళవింపుతో మొదలవుతుంది “శ్రీకృష్ణ తులా భారము” చలనచిత్రం. నరకాసురుడిని సంహరించి ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు, సత్యభామలకు (ఎన్టీ రామారావు, జమున) ద్వారకా వాసులు స్వాగత, సత్కారాలు అందించే నేపథ్యంతో చిత్రం ప్రారంభమవుతుంది. సాక్షాత్ శ్రీమహాలక్ష్మి రుక్మిణీదేవి (అంజలీదేవి) స్వయంగా హారతి పట్టి వారిని ఆహ్వానిస్తుంది. నరకాసురుని మరణ వార్తతో బాణసంచా కాలుస్తూ ఇక్కడ భూమిపై మానవులూ, అక్కడ స్వర్గంలో దేవతలూ తమ హర్షాన్ని ప్రకటిస్తారు. వారి ఆనందాతిశయాలను తిలకించి స్వర్గం నుండి పారిజాత కుసుమాన్ని తీసికొని వస్తున్న నారదుని పాత్ర ద్వారా (కాంతారావు) పైన వివరించిన పోతన భాగవత ఘట్టాన్ని (“ఓహో మోహనరూపా, కేళీ కలాపా”) చూపటంలో దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు ఆ లీలా మానసుని రాసకేళీ విశేషాలను అద్భుతంగా వెండితెరపై చూపి ఎంతో సాహసం చేశారనే చెప్పాలి.

కథా సారాంశం

స్వామివారి ప్రేమలో మునిగి, తానే సర్వస్వం అనే భ్రమలో సత్యభామ, అప్రమేయుడైన వాసుదేవుని మహత్త్వాన్ని గుర్తించకుండా, మానవులకు ఉండే అనుభూతులు ఆయనకు కూడా ఉంటాయనే అపోహతో పరమాత్ముని తన వశం చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. వాసుదేవుని లీలా మహ్మాత్యాన్ని గ్రహించిన రుక్మిణి భక్తితో పరమాత్మునికి దగ్గరవుతుంది. భక్తికి, రక్తికి మధ్య సంఘర్షణగా చిత్రం మలుపు తిరిగినా భగవంతుని లీలా విశేషాలు అన్నింటినీ మైమరపిస్తాయి. ఒకానొక సందర్భాన, రుక్మిణీదేవి మందిరంలో పారిజాత పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చి ‘నీకు ప్రియమైన భార్యకు అందజేయమ’ని నారదుడు అంటాడు. ఆ పుష్పాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి జడలో అలంకరిస్తాడు. నారదుడు సత్యభామను నిందించి, రుక్మిణిని స్తుతిస్తాడు. స్వర్గంలోని పారిజాత వృక్షాన్ని పెకలించి, తన ఉద్యానవనంలో నాటేంత వరకు సత్యభామ క్రోథం చల్లారదు. విభుడు తన మాట చెల్లించాడన్న అహంభావంతో కన్నుమీన కానక సపత్నులను చులకనగా చూస్తుంది. ఇదే సమయంలో రుక్మిణిదేవీ తులసి వ్రతం సంకల్పిస్తుంది. స్వర్గంనుండి ఇంద్రుని ఇల్లాలు శచీదేవి ముత్తయిదువ రూపంలో వచ్చి తులసి దళాలను వాయనముగా తీసికోవటమేకాక, తన నందనోద్యానవనంలో ఉండవల్సిన పారిజాత వృక్షం సత్యభామ ఉద్యానవనంలో చేరిందంన్న బాధతో తులసీ దళాలను, పారిజాత పుష్పాలుగా మార్చి తనతో తీసుకొని వెడుతుంది. రుక్మిణీ దేవి మందిరం నుండి పారిజాతా పుస్పాలతో ముత్తయిదువ వెళ్లటం చూసిన పరిచారిక సత్యభామకు వెల్లడిస్తుంది. ఆగ్రహంతో సత్యభామ, రుక్మిణీ దేవిని తూలనాడటంతో కథ పాకానపడుతుంది. సత్యభామ అహంకారాన్ని నేలమట్టం చేస్తానని శచీదేవికి అభయం ఇచ్చి నారదుడు భూలోకానికి చేరుతాడు. శ్రీకృష్ణుడు కేవలం తన నాథుడే కాదు, జగన్నాథుడన్న జ్ఞానోదయం సత్యభామకు కలిగించి, ఆమెలో భక్తిభావాన్ని నింపటమే తర్వాతి కథ. అందుకు నాందిగా ‘పతి ప్రణయ సిద్ధి’ వ్రతాన్ని చేబట్టి, వ్రతంలో భాగంగా పారిజాత వృక్షంతో పాటు పతిని కూడా ఒక బ్రహ్మర్షికో, దేవర్షికో దానంగా ఇవ్వాలనీ, ఆ తరువాత ఆ దానగ్రహీతకు పతి ఎత్తు ధనం కానీ, ధనేతరం కానీ ఇచ్చి పతిని తిరిగి పొందటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చని నారదుడు సత్యభామను ప్రేరేపిస్తాడు. అలా ఈ వ్రతము చేసిన సతికి పతి ఎల్లకాలమూ విధేయుడై ఉంటాడని చెప్తాడు. అజ్ఞానంతో సత్యభామ వ్రతంచేసి, దేవర్షి నారదునికే పారిజాత వృక్షాన్నీ, శ్రీకృష్ణుడినీ దానముగా అర్పిస్తుంది. తదనంతరం తన ఏడు వారాల నగలతో, శమంతకమణి ప్రసాదించిన బంగారంతో, ఇంకా ఎన్నెన్నో విలువైన వస్తువులన్నీ శ్రీకృష్ణుని తూచ ప్రయత్నించి విఫలరాలవుతంది.. శ్రీకృష్ణుని ఎత్తు ధనంతోకానీ, ధనేతరంతోకానీ తూచి పరమాత్మతను గైకొనమని నారదడు ఊరి,వాడలలో శ్రీకృష్ణుడిని అమ్మ ప్రయత్నం చేస్తాడు. ఆ లక్ష్మీనాథుని ఎవరు కొనగలరు? శ్రీకృష్ణుడిని ఎవరు, ఏమి పెట్టి తూచగలరు? ఆయనకు దాస్యవిముక్తి ఎలా కలుగుతుంది? సత్యభామకు జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? ఇది స్థూలంగా మిగిలిన కథ. ఈ చిత్రంలో ఒక్కొక్క అంశాన్నీ పరిశీలిద్దాం.

అభినయము

ఈ చలన చిత్రాన్ని పరిశీలిస్తే ఉండిలేన్నట్టు ఉండే పాత్ర కృష్ణునిది. ‘జగన్నాటక సూత్రధారి’ అని ఆయనను ఊరకే అనలేదు. నాటకం ఆడుతున్నట్లు కనిపించకూడదు. కానీ ఆడాలి. ఆయన అసత్యం పలుకడు. అయినా అసత్యమని లోకులు భ్రమపడతారు. శ్రీకృష్ణుని పాత్రలో నటించడం కత్తిమీద సాములాంటిది. రామారావుగారు ఎంతో అవలీలగా ఈ పాత్రను పోషించారు. అన్ని చోట్లా కనబడుతూనే, ఏమీ చేయనట్లుగా ఉండడం ఆయనకే చెల్లింది. ఈ చిత్రంలో ప్రధానంగా సత్యభామ శ్రీకృష్ణుడిని నారదునికి దానంగా ఇస్తాను అని చెప్పినప్పుడు, భయపడినట్లు నటించిన తీరు అద్భుతం. ‘ఆ కలహాశనుడు, ఆ త్రిలోకదమనుడు’ అని నారదుడిని దూషించినట్లు చేతులు త్రిప్పుతూ ఆయన చేసిన అభినయం ఆయనకే చెల్లు. అందం, సొగసు, దర్పం, పొగరు, నేనే అందఱి కంటె గొప్ప అనే భావం, ప్రేమ, శ్రీకృష్ణుడు నాకే కావాలి అనే స్వార్థం, లాలిత్యం ఇలా అనేక రూపాలను తనలో ఇనుమడింపచేసుకున్న పాత్ర సత్యభామ. నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఈ పాత్రకు ప్రాణం పోశారు జమున గారు. ‘మీరజాలగలడా నా యానతి’ పాటలో సత్యభామ మెట్లమీద నుండి దిగివచ్చే ఒక్క దృశ్యం చాలు సత్యభామే జమున, జమునే సత్యభామ అనడానికి.

చిత్రంలో మఱొక ప్రధాన పాత్ర నారదుడు. ‘కలహ భోజనుడు’గా పేరు పడినా ఎప్పుడూ ధర్మాన్ని నిర్వర్తించే నారదునిగా కాంతారావుగారి అభినయం ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. ‘నా వద్ద ఉన్న ధనంతో … వేయి కృష్ణులను కొనగలను’ అని సత్యభామ అన్నప్పుడు, తడబడుతూ ‘నారాయణ’ అన్న, సేవలందుటే గాని సేవలు చేయటం ఎరుగని ఆ స్వామి తనకు సేవలందించిన సందర్భంలో నారదునిగా కాంతారావుగారి నటన ముచ్చటగా ఉంటుంది. ఇక శ్రీకృష్ణుని చెలికాడు వసంతకుడుగా పద్మనాభం, సత్యభామ పరిచారికగా వాణిశ్రీ తమ ఉనికిని నిలుపుకున్నారు. చక్కని వాచకంతో వారిరువురు పండించిన హాస్యాం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

పాటలు-పద్యాలు

పౌరాణిక చిత్రం అనగానే తెలుగువారికే సొంతమైన పద్యాలు మనకు జ్ఞప్తికి వస్తాయి. సుశీల, ఘంటసాలగార్ల గళాల నుండి కురిసిన అమృతధారలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. సుశీలగారు పాడిన‘మీరజాలగలడా నాయానతి, వ్రతవిధాన మహిమఁ సత్యాపతి’ నాటికి నేటికి ఎప్పటికీ తెలుగునాట చిరస్థాయిగా నిల్చిపోతుంది. ఘంటసాలగారు పాడిన ‘ఓహో మోహనరూపా, కేళీకలాపా’, ‘భలే మంచి చౌక బేరము’ తెలుగుజాతి ఎన్నెన్నో వందల సంవత్సరాలు గుర్తుంచుకోదగ్గ, గర్వపడే పాటలు. ఈ రెండు పాటలు నారదునిపై చిత్రీకరించపడటం మరో విశేషం. ఇక ‘ఓ చెలీ కోపమా, అంతలో తాపమా’ ప్రతీ తెలుగు భర్త నాలికపై తేలియాడే సుమధుర గీతం.

తెలుగువాడి ఉనికిని చాటే పద్యాలు ఈ చిత్రానికి వన్నెతెచ్చాయి. సురభి ముత్తరాజు సుబ్బారావుగారు వ్రాసిన రంగస్థలం కోసం రాసిన పద్యాలు, ఈ చిత్రానికి సొగసులద్దాయి. ‘విభుడు నీ మాట జవదాట బెరకునంచు మురిసిపోకుము’ అంటూ వరలక్ష్మిగారు (శచీదేవి) పాడిన పద్యం ఒక మచ్చుతునక మాత్రమే. సుశీల, లీలగార్లు ప్రాణం పోసిన ‘నీ మాహత్యం ఒక్కింతయున్ గనక అంగీభూతచేతస్తనై’, ‘ఫలమో ఘనరసంబో పత్రమో పుష్పమో కొనుచు’, ‘సూర్యాన్వయాంభోధి సుభ్రాంశుడైన సాత్రాజిత్తునింట’, ‘వ్రతమొనర్చు కాలమున… వ్రతాచరణాభిలాషలై’, వంటి పద్యాలు ఒక ఎత్తైతే, ‘అండపిండవేదోండ సంహతుల నెల్ల గుప్త’, ‘ఏమి తపంబొనర్చి జనియించివాడనో నేడు’, ‘సర్వేశ్వరుండగు శౌరికింకరు సేయు ధనమున్నదే’ అంటూ ఘంటసాలగారు ఆలపించిన పద్యం ఈ చిత్రానికి మకుటం వంటింది.

సంభాషణలు

పద్యాలకి ధీటుగా మాట ఉండకపోతే చిత్రం వెలవెలబోతుంది. సంభాషణలు ఈ చిత్రానికి ఊపిరి. సముద్రాలగారి సంభాషణా చాతుర్యం మనకు ప్రతి మాటలోను కన్పిస్తుంది. ‘నీ మందిరంలో విందుకు రాకపోతే’ అని శ్రీకృష్ణుడు సత్యభామను అడిగే సన్నివేశం రక్తికట్టిందంటే అక్కడ వాడిన ప్రతి లలితమైన మాటే కారణం. ‘నీ వల్ల కాకపోతే శ్రీకృష్ణుడిని అంగడివీథిలో పెట్టి విక్రయిస్తాను’ అని నారదునితో ఎంత సరళంగా అన్పించారో, దేవేంద్రుని చేత ‘దిక్పాల కిరీట సంఘటిత రత్నప్రభా సంభావిత పాద జీవుడైన మహేంద్రునకు ఒక ఆడదాని భిక్ష ప్రదానమా’ అంటూ అంతే గంభీరంగాను పల్కించారు.

కథనం

చలనచిత్రాన్ని చూసిన ప్రతి పర్యాయమూ ఒక కొత్తదనాన్ని ప్రదర్శించడం దర్శకుని ప్రతిభకు తార్కాణం. ఎన్ని సార్లు చూసినా చిత్రంలో తులా భారం ఘట్టం వచ్చే సమయానికి, ఒక విధమైన గగుర్పాటు, శ్రీకృష్ణునికి దాస్యవిముక్తి ఎలా కలుగుతుందోనన్న ఆతృత ఇప్పటికీ కలుగుతాయి. పారిజాతాపహరణ ఘట్టాలు, సత్యభామ రుక్మిణిని దూషించడం, సపత్నులతో వైరం, తులాభారం భగవంతుడు భక్తుల మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని వసంతకుడు, నారదుడు పాత్రల ద్వారా చూపటం ఇలా ప్రతి సన్నివేశాన్ని, చిత్ర కథను నడిపిన తీరు దర్శకుని ప్రతిభకు, తెలివికి నిదర్శనం.

ముందుగా నాటక రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈ నాటకాన్ని ముత్తరాజు సుబ్బారావు గారు రచించగా, స్థానం నరసింహారావు గారు సత్యభామగా నటించారు. పల్లెపల్లెలా చిరపరిచితమైన, ప్రఖ్యాతిగాంచిన కృష్ణతులాభారం నాటకను, వెండితెరకెక్కించటం సాహసంతో కూడుకున్న విషయం. ఒక చలనచిత్రంలో అన్ని భాగాలు – కథ, కథనం, నటన, నటులు, అభినయం, పాటలు, మాటలు, సంగీతం, దర్శకత్వం, నిర్వహణ సరైన పాళ్ళలో కుదరటం అంటే కత్తిమీద సాములాంటిది. ఇక బహుళ ప్రాచుర్యం పొంది, అప్పటికే ప్రజాదరణ పొందిన కథ అయితే దానిని అందరికి ఆమోదయోగ్యంగా రక్తికట్టించటం మరోక దుష్కార్యం. మూడుసార్లు ఈ నాటకాన్ని సినిమాగా రూపొందించారు. 1935, 1955లో వచ్చిన సినిమాలు అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదు. మూడవసారి ముచ్చటగా 1966లో సాహసంతో ఈ చిత్రానిని నిర్మించి విజయాన్ని సాధించిన నిర్మాత రామానాయుడు కూడా అభినందనీయుడే.

ప్రసాద్ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *