శతక సాహిత్యం - 1

ఆంధ్ర వాఙ్మయంలో వెలువడిన అనేకానేక ప్రక్రియలలో శతకప్రక్రియ కూడా విశిష్ట ప్రక్రియే. శతకము అల్ప కావ్యమే అయినప్పటికీ ఒక విశిష్టత లేకపోలేదు. ఉదాత్త కావ్య శ్రేణిలో నిలువలేకపోయినప్పటికి కవితా శక్తి విరాట్ స్వరూపం అందులో పరిపూర్ణంగా ప్రదర్శితం కాకపోయినప్పటికీ, రస చర్చకు తావు లేకపోయినప్పటికీ, కవిహృదయానికది కమనీయ దర్పణము. పండితుల్ని, అపండితుల్ని సరిసమానంగా రంజింపజేసే విశిష్టరచనా ప్రక్రియ. శతకం ఎంత ప్రాచీనమో అంత ఆధునికం కూడా.

వెల్లువలా ఎన్ని సాహిత్య ప్రక్రియలు వచ్చిన మొగం ఎత్తని పాత ప్రక్రియ ఇది. తెలుగులో వేల సంఖ్యలో శతకాలు వాడుకలోనికి వచ్చాయి. తమిళం, కన్నడ భాషలో శతకాలు ఉన్నప్పటికీ తెలుగులో వున్నన్ని లేవు అనడం అసత్యమేమి కాదు. తెలుగువారికి శతకం ఆదర్శ ప్రాయమైనది.

‘‘మకుటాత్మకమగు శతముక్తక సముచ్చయమే శతకము’’, అని సాహితీవేత్త గోపాలకృష్ణారావు గారు నిర్వచించిరి.

సంఖ్యా నియమము, మకుట నియమము, రసవృత్త నియమము అనునవి శతక లక్షణములు. ఈ లక్షణములను సంస్కృత శతకములను అనుసరించి తెలుగు శతకకర్తలు గ్రహించిరి.

మల్లిఖార్జున పండితారాధ్యుడు (క్రీ. శ. 1160-1170 ) శతక రచనకు మార్గదర్శకుడై ‘శివతత్వ సారమ’నే శతకాన్ని రచించి ప్రథమాంధ్ర శతకకర్తననే గౌరవము పొందియున్నాడు . ఈ శతకములో కొన్ని వందల పద్యములన్నాయి. ఇందు అజా, మహేశ, శివ, సర్వానంద అనే మకుటములు కానవస్తాయి. పరమేశ్వరుని నిజస్వరూపమును నారాయణుడు, బ్రహ్మ మొదలైనవారే వర్ణించలేనపుడు నేనెట్లు నిరుపింతునని కవి ఈ విధంగా వచించినాడు.

‘‘శ్రీ పతి వాక్పతి ముఖ్య మ
హా పురుషులు నెఱుగ నోప రతి వాఙ్మానస
వ్యాపారమైన నీ నిజ
రూపము నేనెట్టిదని నిరూపింతు శివా.’’

శివ కవులలో అగ్రేసరుడైన పాలకూరికి సోమన ‘వృషాధిప శతకము’ను సమగ్ర లక్ష్ణోపేతంగా, అష్టోత్తర సంఖ్యా నియతిలో ఏకైక మకుటతో రచించినాడు.

‘నాయెడ యుండ నావిభుడ నాహృదయేశ్వర నా మనోరమా
నాయిలవేల్పా నా వరద నా గురులింగమ నాదు జంగమా>
నాయధినాధ నావరుడ నన్ను గృపామతి బ్రోవమయ్యదే
వాయమీ బృంద వంద్య బసవా! బసవా! వృషాధిపా!’

బసవని నామస్మరణము చేతనే భక్తి పారవశ్యమున మునిగినాడు. ఆంత్య ప్రాసలు, యమకాను ప్రాసలు, ముక్తపద గ్రస్థాలంకారాలు, అన్నిటికి మించి శివభక్తి తత్పరత సోమనాధుని వృషాధిప శతకములోని విశిష్ట గుణాలు.శ్రీనాధుని యుగమునాటి శతక కర్తలలో వెన్నెల కంటి జన్నయ, పోతన, శరభాంకుడు, అయ్యలరాజు, త్రిపురాంతకుడు, తాళ్లపాక అన్నమాచార్యుడు, సదానందుడు మున్నగువారు పేర్కొన దగినవారు.ఆనాటి నుండి నేటివరకు సుమారు 5 వేల శతకములు వెలువడినవి.శతక వాఙ్మయంలో పరిశోధన గావించిన వారిలో క్రీ. శే. వంగూరి సుబ్బారావుగారు, కొమర్రాజు లక్ష్మణ రావు, కాశీనాధుని నాగేశ్వరరావు, వేటురి ప్రభాకర శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, డా. కె. గోపలకృష్ణారావు మొదలైనవారెందరో కలరు.

భక్తి, నీతి, శృంగార, వైరాగ్య, అధిక్షేప, తత్త్వ, చారిత్రక, కథాత్మక, శాస్త్ర సంకలన, సంకీర్ణ, ప్రహేళికా, వివిధ వస్తుక మరియు అనువాద శతకములు అని శతక సాహిత్యాన్ని వర్గీకరించవచ్చు.

భక్తి శతకాలలో శైవ, వైష్ణవ భక్తిని తెలుపు శతకములు కలవు. మల్లికార్జున శివతత్త్వ సారము, అన్నమయ్య సర్వేశ్వర శతకము, సోమన వృషాధిప శతకము మొదలైనవి శైవమత ప్రభావమును చాటు శైవ శతకములు. వీటిని ఆదర్శంగా అనంతర కవులు పెక్కు శతకములు రచించిరి.

హరి భక్తి శతకాలలో రామకృష్ణ, నృసింహావతారముల గూర్చి వెలువడిన శతకములధికము. తెలుగునాట వెలసిన వెలిసిన ప్రతి క్షేత్రమును గూర్చి ఆ శతకములు వెలువడినవి. రఘువీర, దాశరధి, రామచంద్ర, సీతపతి, భద్రాద్రి రామ మున్నగునవి అగణితములు.

ప్రవక్తలు, అవతార పురుషులైన బుద్ధుడు,మహమ్మదు, ఏసుక్రీస్తులపై కూడా శతకములు వెలువడినవి. ఆచార్య బోధి భాస్కరుల బుద్ధ శతకము, చౌదరి పురుషొత్తమ కవి ఏసునాయక, ఏసుక్రీస్తు శతకములు, షేక్ దావూదు గారి రసూల్ ప్రభు శతకములందు ఆయా మతతత్వము, బోధనములు ప్రధాన అంశములుగా రచింపబడినవి.

ధర్మ రహస్యములను,నీతిమార్గమును సంగ్రహరూపమున ఉపదేశించిరి నీతి శతక కర్తలు. భక్తి శతకముల తర్వాత అసంఖ్యాకములుగ వెలసినవి నీతిశతకములు. వీనిలో రాజనీతి ప్రధాన శతకాలు, లౌకిక నీతి ప్రధానములని ద్వివిధములు. రాజనీతి శతకములలో బద్దెన నీతిశాస్త్రముక్తావళి ఆద్యమైనది. లౌకిక నీతి శతకములలో బద్దన సుమతీ శతకము మొదటి నీతి శతకముగా ప్రశస్తినందినది. శతక కర్తలు నీతులను ఉపదేశించుటలో కొందరు దృష్ట్యాంత పూర్వకముగను, మరికొందరు అన్యాపదేశముగను నీతిబోధ చేసిరి. భాస్కర శతకము, దృష్టాంత నీతి ప్రధాన శతకమేగాక అకారాదిగా వ్రాయబడుట ఈ శతక మరో ప్రత్యేకత.

ఈవి కాక కుమారీ, కుమార శతకములు కూడా విశిష్టమైనవి. ఇవన్నీ ఒక ఎత్తు. వేమన శతకము మరో ఎత్తు. వేమన మానవతా వాది, తాత్త్వికుడు. భావము సూతిగా స్పష్టముగా, సుబోధముగా , హృదయమునకు హత్తుకొనునట్లు పద్యరచన గావించుట ఇతని సొత్తు. వేమనలో వివిధదక్పదాలు కనిపిస్తాయి. ఆ ప్రజా కవి బహు విషయాలను గూర్చి తన పద్యాలలో పేర్కొన్నాడు.

తెలుగులో వెలువడిన శృంగాక శతకములు గోపికాకృష్ణుల ప్రణయము, పార్వతీ పరమేశ్వరుల ప్రణయము, అలమేలుమంగా వేంకటేశ్వరుల ప్రణయము ఆధారముగా వెలసినవి. వెన్నెలకంటి జన్నయ రచించిన దేవకీనందన శతకము, తాళ్ళపాక అన్నమాచార్యుల వేంకటేశ్వర శతకము, పెద తిరుమలాచార్యుని శృంగార వృత్తాల పద్య శతకము అనునవి తెలుగులో వెలసిన ప్రప్రథమ శృంగార శతకాలు.

‘అందవు కోసియిమ్ము విరులంచును జేరలమేలు మంగ ని
న్నుం దగ గోర జెక్కులట నొక్కిన నాకును నందవంచు, న
య్యిందు ముఖం ఖ్రియంబలర నెత్తుచు బువ్వులు కోయజేయ ని
ష్యంద మరంద ఘర్మరస సంగతులబ్బెను వేంకటేశ్వరా!’

15వ శతాబ్దిలో జీవిం చిన అన్నమాచార్యుడు ప్రబంధ శృంగారం విశృంఖల విహారం చేస్తున్న కాలంలో అలమేలు మంగా వేంకటేశ్వరుల నాలంబముగ దివ్య దాంపత్య శృంగార ప్రధానంగా రచించిన వేంకటేశ్వరుల శతకములోని దే పై పద్యము. ప్ర ణయ రసాంబుధిలో జలక్రీడలాడిన దివ్య దంపతుల సరసాన్ని అన్నమయ్య సరసంగా చిత్రించినాడు.

దేవులపల్లి శేష భార్గవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *