శతక పద్యం – పురాణ భాంఢారం 3

నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు
బైటకుక్క చేత భంగపడును
స్థానబలిమిగాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినురవేమ!

నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది. అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు. ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని గజేంద్ర మోక్షం కథ.

త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు. ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు. కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివంతమైన తొండముతో చుట్టి విసిరివేసి చంపగలదు. కానీ నీటిలోని మొసలి గజేంద్రుని కంటే బలమైనది. అది గజరాజుని చీల్చి, తోకతో కొట్టి బాధించి మరణసదృశంగా చేయగలిగిందంటే అది స్థానబలంకాక మరియేమిటి?

తాను బలశాలినని గర్వపడే గజేంద్రుడు తన శక్తినంతా వినియోగించి మొసలి బారి నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. గజేంద్రుని పరివారం నిలబడి చోద్యం చూడటం తప్ప మరియేమి చేయలేకున్నాయి. మొసలి గజమును నీటిలోకి, గజేంద్రుడు మకరిని బయటకు లాగుతూ వేయి సంవత్సరములు నిర్విరామంగా పోరాడాయి. క్రమం, క్రమంగా గజేంద్రుని శక్తి క్షీణించ సాగెను.

లావొక్కింతయులేదు ధైర్వము విలోలంబయ్యె ప్రాణంబులన్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెతనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్పనితఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!

అంటూ తనను రక్షించవల్సిందిగా ఆ శ్రీహరిని శరణువేడుకున్నాడు. భక్తుని ఆర్తనాదం విన్న హరి హుటాహుటిని వచ్చి తన సుదర్శన చక్కంతో మకరిని వధించి గజేంద్రుని రక్షించాడు.

(సేకరణ: వేమన, సుమతీ శతక పద్యాలకు పురాణ కథలు: రచన శ్రీమతి కుసుమ.కె.మూర్తి)

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *