శతక పద్యం – పురాణ భాండారం 2

హరికిదొరికెనందురా సిరియపుడె
దొరికెకాదె విషము హరునకరయ
ఎవనికెట్టులగునొ ఎవ్వడెరుంగును
విశ్వదాభిరామ వినురవేమ

క్షీరసాగర మథనం

క్షీరసాగర మథనంలో ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ హరిని చేరింది. అప్పుడే పుట్టిన హాలాహలాన్ని హరుడు మింగటంతో ఆ విషం శివుని కంఠంలో స్థిరపడింది.

దేవదానవులు మందరగిరి వద్దకు వెళ్లి దానిని సాగరంలోకి చేర్చాలని యత్నించారు. కాని సాధ్యపడలేదు. శ్రీహరి ఆనతి ప్రకారం గరుత్మంతుడు మందరపర్వతాన్ని క్షీరసాగరంలోకి చేర్చాడు. వాసుకిని ఒప్పించి కవ్వపుతాడుగా నియమించాడు. దేవతలు శిరస్సువైపు పట్టుకొన్నారు. దైత్తులు అభ్యంతరం తెలుపగా వారు తోకవైపు పట్టకొన్నారు. దానవులు తలవైపున పట్టకొని మధించబోగా మందరగిరి కుంగిపోసాగింది. దానిని పునరుద్ధరించడానికి విష్ణుమూర్తి బృహత్ కూర్మంగా ప్రభవించి మందరాద్రిని సునాయాసంగా ఎత్తారు. దేవదానవులు సాగరమధనాన్ని ప్రారంభించారు. బ్రహ్మాండమంతా భీభత్సభరితమవుతోంది. ప్రళయతాండవానికి సమస్తలోకాలు అల్లకల్లోలమవుతున్నాయి. అతి భయంకరమైన హాలాహలం ఉద్భవించింది. ఈ విషాగ్ని జ్వాలాతోరణాలను చూసి బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి భయంతో భక్తితో ‘‘ఫాలలోచనా! ఆ హాలాహల భీభత్సం నుంచి లోకాలను రక్షించగల సర్వసమర్ధడవు నీవే హరా! ప్రళయకారిణి అయిన హాలాహలాన్ని హరించి కాపాడవా! శివా! శంకరా! భక్త వత్సలా! ఆపద్భాందవా!’’ అని దీనాతిదీనులై వేడుకోగా భక్తవశంకుడైన శంకరుడు హాలాహలాన్ని మింగి నీలకంఠుడు, నీలకంధరుడై లోకాలను రక్షించి ఆపదోద్ధారకుడైనాడు. విశ్వనాధుడైనాడు. దేవదానవులు క్షీరసాగరాన్ని ఇంకా మంధించారు. సకల కోరికలను సిద్ధింపజే సే కామధేనువు ప్రభవించగా ఆ దివ్యధేనువును మునీశ్వరులు గైకొన్నారు. తరువాత ఉచ్ఛైశ్రవమనే దివ్యాశ్వం ఉద్భవించగా బలిచక్రవర్తి స్వంతం చేసుకొన్నాడు. మరింత మధించగా దివ్యగజమైన ఐరావతం ప్రభవించింది. దానికి దేవేంద్రుడు గ్రహించాడు. వెనువెంటనే మనోకామనలను తృటిలో తీర్చే కల్పవృక్షం రమణీయ దివ్య ప్రభలతో ప్రకటితమైంది. అది మహేంద్రుని నందనవనానికి శోభ చేకూర్చింది. తరువాత అప్సరసలు జన్మించారు. శీతల చంద్రికలతో జగాలను ఆహ్లాదపరచే చంద్రుడు, కలిమికి నెలవై అందచందాలకు మారుపేరైన దివ్యమంగళ స్వరూపిణి మహాలక్ష్మి ప్రభవించారు. అందువల్లనే తేజస్వరూపిణియైన లక్ష్మీదేవి ‘‘సముద్రతనయ’’ అయింది. క్షీరసాగరం ఆమెకు పుట్టిల్లు అయింది. శ్రీ లక్ష్మి శ్రీ మహావిష్ణువును వరించింది. హరి సిరి దివ్యదంపతులైనారు. శ్రీహరి, అష్టలక్ష్మీ రూపధారిణియైన ఆదిలక్ష్మిని తన వక్షస్థలంలో నిలుపుకుని ధర్మపత్ని స్థానానికి దివ్యత్వం ప్రసాదించాడు. చివరకు అమృత కలశం ఆవిర్భవించింది. అమృతం లభించింది. లోకకళ్యాణం జరిగింది. క్షీరసాగర మథనంలో హరికి సిరి, హరునికి హాలాహలం లభించటం జగన్నాటకంలో అంతర్నాటకం.

(సేకరణ: వేమన, సుమతీ శతక పద్యాలకు పురాణ కథలు: రచన శ్రీమతి కుసుమ.కె.మూర్తి)

One thought on “శతక పద్యం – పురాణ భాండారం 2”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *