శతక పద్యం – పురాణ భాండారం 1

కావ్యం కవితలు చెపుతుంది
ఇతిహాసం హితవులు చెపుతుంది
పురాణం బుద్ధులు చెపుతుంది
శతకం సూక్తులు చెపుతుంది

అలాంటి శతకాలలో వేమన, సుమతీ, దాశరధీ శతకాలు తెలియని, చదవని తెలుగువాడుండు. చిరుప్రాయంలోనే పిల్లలకు ఈ నీతి శతకాలను వల్లెవేయించి, ముద్దు,ముద్దుగా వారు ఆ పద్యాలు చదవుతుంటే మురిసిపోవటం కద్దు. అక్షరాభ్యాసానికి ముందే సుమతి, వేమనాది సూక్తినిధులను పిల్లలకు నేర్పించి, సద్భావన, సదాచారం, పెద్దలయెడ గౌరవం ఇత్యాది విషయాలను చెప్పకనే చెపుతుంటాం.

అల్పు డెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

వేమన ఆటవెలదులలో మూడవపాదములన్నీ సూక్తులు, లోకోక్తులు, నగ్నసత్యాలతో ముగుస్తాయి.

శ్రీరాముని దయ చేతను
నారూఢిగ సకలజనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ చవులుబుట్ట నుడివెద సుమతీ!

ఈ సుమతీ శతక పద్యాన్ని తమ పిల్లలకు నేర్పని తల్లితండ్రులుండరంటే అతిశయోక్తి కాదేమో! కాలక్రమేణా ఈ నీతి శతకాలు మన దైనందిన జీవితంలోంచి తొలగిపోతున్నాయన్నది కూడా వాస్తవమే. నరసింహ శతకంలోని ఈ పద్యం చూడండి…

తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమెగాని, మెఱుగుబంగారంబు మ్రింగబోడు
విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి, దానధర్మము లేక దాచిదాచి
తుదకు దొంగల కిత్తురో! దొరల కవునొ!
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు!
భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర
!

జీవన నగ్న సత్యాలనకు కళ్లముందు సాక్షాత్కరింపచేసే ఇలాంటి శతక పద్యాలు మానవ వికాసానికి ఎంతగానే తోడ్పడతాయి. అయితే ఈ పద్యాలకు ప్రతిరూపాలుగా నిలిచే పురాణ గాథలకు వీటిని అన్వయించటం అందరికి సాధ్యమయ్యే పనికాదు. మన భాగవత, రామాయణ, భారతాలాంటి ఇతిహాసాలు, కార్తీక, శివపురాణాలు చెప్పే నీతి సూత్రాలు, శతక పద్యాలు ఘోషించే నీతిబోధలు ఒక్కటే. పద్యానికి అనువైన కథనాన్ని విన్నప్పుడు అది హృదయానికి మరింత హత్తుకపోతుంది. ఈ ప్రయత్నాన్నే శ్రీమతి కుసుమ. కె.మూర్తిగారు చేశారు. వేమన, సుమతీ శతక పద్యాలకు సరిసమానమయ్యే 116 పురాణగాథలను రచించారు. విజ్ఞానాత్మక, వినోదాత్మకమైన ఈ కథలను కొన్నింటినైనా మా పాఠకులకు అందచేయాలని ‘తేటగీతి’ ఉవ్విళ్లూరుతోంది. ముందుగా ఆదికవి వాల్మీకి గాథను తెలియచేసే ఈ వేమన పద్యాన్ని, పురాణగాథను అందచేస్తున్నాం.

రామనామ పఠనచే మహి వాల్మీకి
పరగ బోయయయ్యు బాపడయ్యె
కులము ఘనము కాదు గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినురవేమ!

వాల్మీకి వృత్తాంతం

ఒక రోజు మహర్షులు శ్రీహరిని, శ్రీదేవిని యథావిధిగా పూజించి, పుణ్యతీర్ధాలను, పుణ్య క్షేత్రాలను దర్శించాలని భూలోకానికి వేంచేశారు. అడవి మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక బోయపల్లె కన్పించింది. ఆ పల్లెలోని బోయవాడు మెరుపుదాడి చేసినట్టు ఋషుల దగ్గరకు వచ్చి ‘‘మీ సర్వాభరణాలు, సంపద సర్వస్వం నా కైవసం చేయ్యండి.’’ అని ఆజ్ఞాపించాడు. ‘‘బోయా! నువ్వేదో అలవాటు కొద్ది అడుగుతున్నావు కాని దైవధ్యానంతో కాలం గడిపే ఋషులం, మా దగ్గరే ముంటుంది?’’ అన్నారు. ఆ మాటలకు కోపించిన బోయ వారి కాషాయ వస్త్రాలు, దండాలు, కమండలాలను లాగి విసిరి కొట్టి అవమానించాడు. ఋషులు ఆ క్షణం బాధపడినా మళ్లీ దైవధ్యానంలో గడిపి శాంతంగా, ‘‘ ఓ నిషాదుడా! ఈ విధంగా దారికాచి, మునులను, శాంతస్వరూపులను, బాటసారులను దోచుకొని ఆ పాపపుకూడు తిని అంతులేని పాపం మూటకట్టుకుంటున్నావు. ఈ పాపపు సంపాదనతో నీ భార్య బిడ్డలను పోషిస్తున్నావు. నీ పాపంలో వాళ్లు పాలుపంచుకుంటారేమో కనుక్కురా!’’ అన్నారు. బోయ పరుగున ఇంటికి వెళ్లి ‘‘నేను పెట్టే తిండి తింటున్నారు. నేను చేసే పాపంలో పాలుపంచుకుంటారా’’ అని అడిగాడు. ‘‘మాకు తిండి పెట్టటం నీవిధి. నీ పాపం పంచుకోవల్సిన అవసరం మాకు లేదు’’ అని నిష్కర్షగా చెప్పారు భార్యాబిడ్డలు. కిరాతుడు తిరిగి వచ్చి, దైవస్వరూపులారా మీరే నాకు దిక్కు. నేను తరించే మార్గం ఉపదేశించండి నా పాపాన్ని ప్రక్షాళనం చేయండి’’ అని పశ్చాతాపంతో వెక్కి, వెక్కి ఏడ్చాడు. మహార్షుల మనస్సు వెన్నవంటిది. అతని దుఃఖానికి కరిగిపోయి ‘‘బోయా! నీవు ‘మరా మరా’ అనే మంత్రాన్ని ఆపకుండా జపించు తరించు’’ అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. అది మహామహిమాన్వితమైన ‘‘రామమంత్రం’’ అయింది. అనతి చుట్టూ పుట్ట పెరిగింది. ఏకాగ్రతతో అతను చేస్తున్న తపస్సుకు ముల్లోకాలు కంపించాయి. మహర్షి నారదుడు ఆ వల్మీకం వద్దకు వచ్చి, ‘‘వాల్మీకి! నీకు జ్ఞానోదయమైంది. కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలను రామనామ జపంతో జయించావు. పురుషోత్తముడైన శ్రీరాముని గాథను రామయణంగా రచించి తరించు. ఇది ఆదికావ్యమై భాసిస్తుంది అన్నాడు. ఆనాటి నుంచి నిషాదుడు వాల్మీకి అయ్యాడు. కులము కాదు, గుణం ప్రధానమని, మంచినడవడికతో బోయవాడు కూడా మహర్షి కావచ్చని నిరూపించాడు.

తేటగీతి

(సేకరణ: వేమన, సుమతీ శతక పద్యాలకు పురాణ కథలు: రచన శ్రీమతి కుసుమ.కె.మూర్తి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *