మావూరు మాట్లాడింది

మా యిల్లు దాటి, ఆ యిల్లూ దాటి ఆ యిల్లూ దాటి నడుస్తున్నాను వీధిలో. ఆ మూలమలుపు నుంచి, పూరి గుడిసె నుంచి ఒక పాట వినిపిస్తోంది. అది కేవలం గాత్రం నుంచి ఉబికిన పాట కాదు. దానికో వాద్యంతోడు కూడా ఉంది. వాద్యమంటే ఏ వాయులీనమో, హార్మోనియమూ, వీణో, వేణువో కాదు. ఏమిటా వాద్యం? అది గానానికే కాదు, మానానికీ తోడుగా ఉంటుంది. దాని పేరు రాట్నం. రాట్నం వడుకుతూ, ఆ ఝంకారమే తంబూరా శ్రుతిగా తనకు తెలిసిన పాట పాడుతున్నది ఒక పండు ముత్తయిదువు.

‘‘ఉసికాల ఆడేటీ
కుసుమా సిరిబాలా
మా బాలా వచ్చిందా
మిమ్ము కూడంగ’’

ముంగిట్లో నుంచుని వింటున్న నేను ముగ్ధుణ్నయిపోయాను. తీగసాగినట్టున్న ఆ రాగానికే కాదు, అమాయక హృదయం నుంచి పొంగి వచ్చిన ఆ ఆత్మీయతకు, ఆ నిసర్గ రసవద్గీతకు. ఒక తల్లి ఒక పాప నడుగుతున్నది తన పాప గూర్చి. ఆ పాప యెవరు? ‘ఉసికాల ఆడేటి కుసుమా సిరిబాల’ – ఇసుక ఉసికగా మిసిమి పెంచుకుంది. మరి ‘కుసుమా సిరిబాలా!’ ఇది వ్యాకరణం దృష్టిలో వైరిసమాసం. కానీ ఎంత వింత పదమైత్రి. అటు కుసుమం – ఇటు బాల. మధ్యలో సిరి. కుసుమా సిరిబాల – కుసుమంలా సిరులొలికే బాల – రెండు తత్సమాల నడుమ ఇమిడిపోయిన ఆ దేశిసిరి ఏమంటుంది? అమాయకులైన జానపదులు ప్రయోగించే సిరిసమాసాలైనా కలకండ పలుకుల్లా రుచులొలుకుతాయని, అసమర్థులైన కవులు పనికట్టుకుని సృష్టించే మిశ్రమ సమాసాలు పెరుగూ వడ్లూ పిసికినట్లు రసాభాసపాలౌతాయని.

నేను ఇలాఇలా అనుకుంటూ పోతూవుంటే ఎదురయింది పసుల పోశమ్మ. ఎదురయ్యింది కాదు, నేను అలాఅలా నడుస్తూ ఆ పోశమ్మ గుడిసెను చేరుకున్నాను. ఎడాపెడా చెంపలు వాయిస్తున్నది పోశమ్మ ఒక పదేళ్ల కుర్రాడిని. ‘‘ఏమిటి పోశమ్మా ఎవరతను? ఎందుకు కొడుతున్నావు పాపం’’ – ‘‘మైసడు బాపూ. నా మనమడు. ఎండుకు లారబోసిన. గైండ్ల గూసోరా అంటే ఊరుదిరుగబోయిండు.’’

“ఏమిటేమిటి? నీ మనుమడా? ముద్దోస్తున్నాడు. మైసడు కాదు మైసయ్య అనాలి. కొట్టకు పాపం. ఇంతకు అంత చేసిన తప్పేమిటి?” అని నేను అంటూనే ఉన్నా ‘గైండ్ల గూసోరా అంటే ఊరుదిరుగబోయిండు’ అన్న పోశమ్మ పలుకు గీపెట్టింది మనసులో. చిన్ననాటి స్మృతులే – స్మృతులే కాదు – శబ్ధశ్రుతులు – బిలబిలా మూగుతున్నాయి. గైండ్ల ఇది నాకు కొత్త పలుకు కాదు. చిన్ననాటి నుంచి నాతో చెలిమి చేసుకున్న పలుగే. బాల్యదశాక్యులతో కలిసి పయనించే ప్రాబలుకే. గైండ్ల అంటే వాకిలి. ఎలా? నిఘంటువు ఘోషిస్తున్నది. గవను అంటే దుర్గపుద్వారమని. పురద్వారమైనా తలుపేకదా – తొలి తలుపుండెదెక్కడ? వాకిట్లోనేకాదా. అంతవరకెందుకు? అభినవకవి జాషూవా పలుకు రెక్కలు విప్పుతున్నది ‘శ్మశానం’లో ‘కవుల కలాలు గాయకుల కమ్మని కంఠము లీ శ్మశాసపుంగవనుల’ -శ్మశాసనపుంగవనులు అంటే వల్లకాటి ముంగిళ్లన్నమాట.

నా అంతశ్చేతనలో ‘గవను’ తిరుగుతూనే ఉన్నది. పోశమ్మ మనమణ్ణి గూర్చిన చిరాకు వడ్డిస్తూనే ఉన్నది – తనమాట ససేమీ విడని, ఉన్నచోట ఉండడని, ఆవూళ్లో వాడెక్కని చెట్టులేదని, దూరని పుట్టలేదని. నన్ను నేను వీపు తట్టుకుని అన్నాను. ‘‘ఏమిటి పోశమ్మా ఏమంటున్నావు’’ అని. ‘‘మనమని సంగతే బాపూ సెప్పి, సెప్పి యాష్టకొచ్చె.’’ మరో మాండలింకం మణిపూసలా రాలింది పోశమ్మ నోటి నుంచి. యాష్ట-అలిష్టలాగే వుందిది. అలసభావం అలసత. అలసతే తద్భవించి అలసటగా రూపొందింది. అంతటితో ఆగిపోదే వ్యవహారం. అలసట గమ్మత్తుగా అలిష్టగా మారింది. అలసటే వికృతి. దానికి మరింత వికృతి అలిష్ట. కానీ ఇది ప్రకృతికంటే తాతగా ధ్వనిస్తున్నది. అభిష్ట ధనిష్ఠలా. ‘యాష్ట’ కూడా ఈ గోత్రానికి చెందిప మాటే. ‘యాష్ట’ అంటే విసుగు. మనమణ్ణి అరికట్టలేక పోశమ్మకు విసుగొచ్చింది. అది సరే ఈ యాష్ట ఏ విత్తులోంచి వచ్చింది. ‘వేసట’ నుంచి. వేసట చాలా పాతమాట. భావకవిత్వంలోకి కూడా ఆ మధ్య చొరబరింది. ‘వేసటలేని వెర్రి అన్వేషణమ్ము’ అని కృష్టశాస్త్రిగారు వినిపించింది ఈ వేసటే. వేసట యేసటగా, యేసట యాసటగా, యాసట యాష్టగా – కొండకచో యాష్టగా రంగులు మార్చుకుంది. వేసట ఒక దేశినుడి. ఆ దేశి నుడికి ఇన్ని వికృతులు. చివరిమాట యాష్ట. ఇది సంస్కృతంలోని ‘ఇష్ట’ శబ్దానికి పిన్నమ్మ కూతురులా రూపొందడంలో ఉన్నది చమత్కారమంతా. పోశమ్మ ఊరుకోలేదు. మాట్లాడుతూనే ఉంది. ‘‘యీడు నేను సెప్పిన మాట యినడుగాని బంగరిద్దోడయ్యా’’ పాట పాడితె పానమే లేసస్తది. ఒకేసారి నా బుర్ర మాటమీదికి, పాటమీదికి పరుగులు తీసింది. ‘బంగరిద్దోడు.’ వెనక ఎప్పుడో ‘కైత్కాలాడు’ మాట విని దాని వెనుక కవిత్వాలవాణ్ని కనిపెట్టిన నా బుద్ది ఈసారి ‘బంగరిద్దోడు’ మాటు దాగున్న చోద్యంవైపు ఉరకలు వేసింది. బంగరు+ఇద్దె+వాడు అనేవి అన్యోన్యంగా కలుసుకుంటే ‘బంగరిద్దోడు’ పుట్టుకొచ్చాడు. బంగారు విద్యవాడు. అంటే స్వర్ణకార విద్య ఎరిగినవాడన్నమాట. పరుసవేది మనకు కొత్తకాదు. ‘పరుసవేది సోకుటయును, పరుషలోహమధికశుద్దసువర్ణమయైన పోల్కి’ అని నాచన ఉత్తరహరివంశం ఉద్ఘోషిస్తున్నది. ఇనుమును బంగారంగా మార్చే విద్య స్వర్ణకార విద్య. అది సామాన్యవిద్య కాదు. వానిది మామూలు తెలివి కాదు. అసాధారణ ధిషణకు ప్రతీకగా జానపదులు వాడుకునే పదం ‘బంగరిద్దోడు.’ పోశమ్మ మనమడి తెలివి కూడా అలాంటిదే అన్నమాట. అంటే అది ఇనుమును బంగారం చేసే తెలివికాదు. పదం పలికితే ప్రాణాలను జుమ్మనిపించే తెలివి. పాట గుర్తుకొచ్చి మాటను పక్కకు నెట్టి ప్రశ్నించాను. ‘‘ఏది మైసయ్యా ఒక పాట’’ అని. సిగ్గుతో అష్టవంకరలు తిరిగిపోయాడు ఆ సిసింద్రీ చిట్టిబాబు. పోశమ్మ గదమాయించింది మనమణ్ని. ‘అగో పాడు. మొత్తం యాదికి లేకపోతే నాలుగు నుడుగులన్న అను.’ పాట వినాలనే కుతూహలంతో ఉన్న నాకు మళ్లీ ఆ పానకం అందకముందే మాటల పుడుకులు దొరుకుతున్నాయి. ‘యాది’, ‘యాద్’ అనే ఉర్దూ మాటకి తెనిగింపు. మరి ‘నుడుగు’. నుడి అంటే మాట. నుడువు ధాతువు కృదంతరూపం. ఇది అచ్చ తెలుగుబడి. తెలుగుబడి అంటే తెలుగు స్కూలు అని కాదు. తెలుగు పలుకుబడి. ఇదేమిటి అని మీరు విస్తుపోనక్కరలేదు. ఇంతకూ ‘నుడుగు’ అంటే పలుకు, పదం అన్నమాట. పరమప్రాచీన గ్రాంధిక రూపమిది. ‘నుడుగురేడు’ అంటే బృహస్పతి. దీనికి దాఖలా కావాలా? అయితే తొలి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర నడగండి. నోరారాపాడుతుంది. ‘అరయ వేల్పులకెల్ల నయగారనందగు నుడుగురేనికి కూర్మి కొడుకుకుఱ్ఱ’ అని. ఇంతటి ప్రాచీన దేశ్యపదం ఇప్పటికీ పల్లెతల్లి నాలుకపైన పదిలంగా ఉన్నందుకు పరవశింత కలిగింది. ‘నాలుగు నుడుగులన్న’ అను అన్న పోశమ్మ హృదయం నాలుగుమాటలైనా లేక నాలుగు పంక్తులైనా చదువని ప్రబోధించింది. ఈ నుడుగు కడలిలో నేను మునకలేస్తూ వుండగా ‘అగో… అగో… యాడికి యాడికి’ అని పోశమ్మ ఉచ్ఛైస్వరం వినిసించింది. ఏడి మైసయ్య? తుర్రుమన్నాడు… దూరాన చింతచెట్టెక్కి చిటారుకొమ్మల్లో కూచుని పాడుతున్నాడు.

‘‘పచ్చిమానూ తొర్రలోనే
పంచరంగుల పచ్చిపలికె
పచ్చిపలికె పచ్చిపలికె
పచ్చీపలికె పచ్చీపలికె’’

ఎంతకూ పచ్చిపలికె అనే ఆ రెండు నుడుగులనే తిప్పి తిప్పి పాడుతున్నాడు. రకరకాల లయల్లో, గతుల్లో దరువులు విసురుతున్నాడు. కేరింతలు కొడుతున్నాడు. దరువుకీ దరువుకీ మధ్య నోటితో మద్దెల వాయిస్తున్నాడు.

(తెలంగాణా మాండలిక పదాల మాటున దాగిన మాటల మూటల గురించి సి. నారాయణరెడ్డిగారు చేసిన పద పరిశోధనల వ్యాస సంకలనం ‘మా ఊరు మాట్లాడింది’ నుంచి సేకరించిన వ్యాసం.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *