మహాభారతం – యక్షప్రశ్నలు 1

‘‘యతోధర్మస్తతోజయః’’ – ధర్మం ఎక్కడున్నదో అక్కడే జయం. ఇవి గాంధారి దుర్యోధనుని ఆశీర్వదిస్తూ అన్నమాటలు. అటువంటి ధర్మానికి ప్రతీకగా నిలిచి ధర్మక్షేత్రంలో విజయాన్ని పొందిన ధర్మరాజునకు యక్షుడు అరణ్య పర్వంలో సంధించిన ప్రశ్నలే యక్షప్రశ్నలు. ఈ ప్రశ్నోత్తరాలలో ధర్మం, సత్యం, తపస్సు, యజ్ఞం, దానం, త్యాగం వంటి సద్గుణ స్వభావాలు, కామక్రోధలోభ మదమాత్సర్యాల వంటి దుర్గణాల తీరుతెన్నులు, శత్రు,మిత్ర లక్షణాలు, ద్వంద్వాతీత స్థితి, మాతాపితృభక్తి, అతిథి దేవతారాధన, స్వర, నరక వివేచన, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటి మానవాళిని జాగృతి పర్చే అనేక అంశాలు వ్యక్తీకరించబడ్డాయి. సకలధర్మ సారాంశం ఈ ప్రశ్నల్లో నిగూఢమైయున్నాయి. అటువంటి యక్షప్రశ్రలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు:

1. సూర్యుణ్ణి ఉదయింపచేసేది ఏది?   బ్రహ్మ అనగా పరబ్రహ్మ

2. సూర్యుణ్ని అనుసరిస్తూ, ఆరాధిస్తున్నది ఎవరు?    దేవతలు

3. సూర్యుణ్ని అస్తమింపచేసేది ఎవరు?   ధర్మము – ఇక్కడ సూర్యడంటే జీవుడు. ధర్మాచరణ వల్ల జీవుడు ‘స్వస్థానం’ చేరుకుంటాడు

4. సూర్య తేజస్సుకు ఆధారామేది?    సత్యము

5. మానవుడు దేనివల్ల శ్రోత్రియుడు అవుతున్నాడు?    వేదప్రామాణ్యాన్ని అంగీకరించడం వల్ల

6. మానవుడు దేనివల్ల గొప్పవాడు అవుతున్నాడు?   తపస్సు వల్ల

7. ద్వితీయుడు ఎవరు?    ధైర్యం కలవాడు

8. మానవుడు దేనివల్ల బుద్దిమంతుడు?   పెద్దలను సేవించడం వల్ల

9. బ్రాహ్మణులకు దివ్యత్వము ఏది?    వేదాధ్యయనము

10. వారికి సదాచారము ఏది?    శమ, దమాలతో కూడిన తపస్సు – ఇక్కడ శమము అనగా మనస్సును నిగ్రహించడము, దమము అంటే బాహ్యేంద్రియములను నిగ్రహించడము)

11. బ్రాహ్మణులకు మానుష్యభావాన్ని కలిగించేది ఏది?    మరణం

12. బ్రాహ్మణులకు తగనిది ఏది?    పెద్దలను నిందించడం

13. క్షత్రియులకు దివ్యత్వ ఏది?   ధనుర్విద్య

14. క్షత్రియులకు సదాచారము ఏది?    యజ్ఞం చేయటం

15. క్షత్రియులకు మనుష్యత్వం ఏది?    పిరికితనం

16. క్షత్రియులకు తగనిది ఏది?    శరణుకోరినవారిని కాపాడలేక వదలి పెట్టడం.

17. యజ్ఞ సంబంధమైన సామం ఏది?    ప్రాణం – ప్రాణాయామం వంటి యోగసాధన

18. యజ్ఞ సంబంధమైన యజుర్వేద మంత్రం ఏది?    మనస్సు – మనో నిగ్రహం

19. యజ్ఞాన్ని వరించింది ఏది?    ఋక్కు

20. యజ్ఞం దేనిని అనుసరించి ఉంటుంది?    వేదవాక్కును

21. వ్యవసాయదారులకు ఏది శ్రేష్టము?   సకాలంలో కురిసిన వర్షం

22. వ్యవసాయదారులకు ముఖ్యమైనది ఏది?    మంచి విత్తనము

23. కీర్తి ప్రతిష్టలు పొందాలంటే ఏం చేయాలి?    గోసేవ

24. సంతతి కోరుకునేవారికి ఫలం ఏమిటి?    సత్పుత్రులను పొందటం

25. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలున్నా, జీవించనివారు ఎవరు?    దేవతలను, అతిథిలను, తన కుటుంబ పరివారాన్ని, పితృదేవతలను, ఆత్మజ్ఞానాన్ని పెంచి, పోషించనివాడు, అలాంటివాడు జీవచ్ఛవమే కదా.

26. భూమి కంటే గొప్పది ఏది?    తల్లి

27. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది?    దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశము ఇచ్చే తండ్రి

28. గాలికంటే వేగంగా నడిచేది ఏది?    మనస్సు

29. గడ్డిపరకలకంటే హేయమైనది?    చింత

30. నిద్రిస్తున్నప్పుడు కూడా కన్నుమూత పడినది ఏది?    చేప

31. పుట్టినా కదలని ఏది?   గ్రుడ్డు

32. హృదయం లేని వస్తువు?    బండ

33. వేగం వల్ల వృద్ధి పొందేది ఏది?    నది

34. ప్రవాసంలో ఉన్నవాడికి మిత్రుడు ఎవరు?    తనతోపాటు ప్రయాణం చేసేవాడు.

35. ఇంటిలో ఉన్న మిత్రడు ఎవరు?    భార్య

36. రోగికి మిత్రుడెవరు?    వైద్యుడు

37. అశాశ్వతమైన మానవ జీవితంలో శాశ్వతమైన మిత్రుడెవరు?    దానము

38. అతిథి ఎవరు?    అగ్ని – ప్రాణుల హృదయంలో ఉన్న వైశ్వానరుడనే అగ్ని)

39. సనాతన ధర్మం ఏది?    మోక్షహేతువైన కర్తవ్యం

40. అమృతం ఏది?    చంద్రుడు, గోవు (చంద్రుని వెన్నల, ఆవుపాలు)

41. జగత్తు అంతటా ఉన్నది ఏది?    వాయువు

42. ఒంటరిగా సంచరించేది ఎవరు?    సూర్యుడు

43. పుట్టి, మళ్లీ మళ్లీ పుట్టేది ఎవరు?    చంద్రుడు, మనస్సు

44. మంచుకు ఔషధం ఏది?    అగ్ని – అజ్ఞానమనే మంచు ఆవరించి ఉన్నప్పుడు సత్యం గోచరించదు. జ్ఞానాగ్నియే దానికి మందు

45. గొప్ప క్షేత్రము ఏది?    భూమి – శరీరము

46. ధర్మానికి స్థానం ఏది?    దక్షత (సామర్థ్యం)

47. కీర్తికి స్థానం ఏది?   దానము

48. స్వర్గానికి స్థానం ఏది?    సత్యము

49. సుఖానికి స్థానం ఏది?   శీలము

50. మానవునికి ఆత్మ ఏది?    పుత్రుడు – ఆత్మావై పుత్ర నామాసి అని వేద వచనం

51. దైవమిచ్చిన మిత్రుడు ఎవరు?    భార్య

52. జీవనానికి ఆధారము ఏది?   మేఘము

53. జీవిత పరమార్థము ఏది?   దానము

54. ధనసంపాదనకు ఉత్తమ మార్గం ఏది?    కర్మాచరణ కౌశలము

55. ఉత్తమ ధనము ఏది?    విద్య

56. అన్నింటికంటే గొప్ప లాభం ఏది?    ఆరోగ్యము

57. శ్రేష్టమైన సుఖము ఏది?    సంతృప్తి

58. శ్రేష్టమైన ధర్మము ఏది?    సర్వభూతదయ

59. ఎప్పుడూ పండేది ఏది?    త్రయీధర్మము – త్రయీ అనగా వేదము

60. శోకం లేకుండా ఉండాలంటే, దేన్ని అదుపు చేసుకోవాలి?    మనస్సును

61. ఎవరితో స్నేహం శాశ్వతంగా ఉంటుంది?    సజ్జనులతో

62. మానవుడు అందరికీ ప్రీతిపాత్రుడు కావాలంటే దేన్ని వదలి పెట్టాలి?    అహంకారాన్ని

63. దేన్ని వదలితే శోకం ఉండదు?    క్రోథం

64. దేన్ని వదలితే జీవితం సార్థకం అవుతుంది?    కామమును

65. సుఖం పొందాలంటే దేనిని విడిచిపెట్టాలి?    లోభమును

66. బ్రాహ్మణునికి దానం చేయడం ఎందుకు?    ధర్మము కొరకు

67. కళాకారులకు దానం చేయడం ఎందుకు?    కీర్తి కోసం

68. సేవకులకు దానం చేయడం ఎందుకు?    వారిని పోషించడానికి

69. రాజులకు దానం (పన్నులు) ఎందుకు?    భయం వల్ల (శత్రుభయం, చోరభయం)

70. ఈ జగత్తును అంతటినీ ఆవరించి ఉన్నది ఏది?    అజ్ఞానము

71. ఎందువల్ల ఈ జగత్తు ప్రకాశించట్లేదు?   తమస్సు (అనగా చీకటి, అజ్ఞానము, తమోగుణము)

72. మానవుడు తన స్నేహితులను ఎందువల్ల పోగట్టుకొంటున్నాడు?    లోభం వలన

73. మానవుడు ఎందువల్ల స్వర్గాన్ని పొందలేక పోతున్నాడు?    ప్రాపంచిక వ్యామోహం వల్ల

74. మానవుడు దేనివల్ల జీవచ్ఛవం అవుతాడు?   పిసినారితనం వల్ల

75. దేశం ఎందువల్ల మృతప్రాయం అవుతుంది?   రాజులేనప్పుడు (దేశం – దేహం, రాజు – చైతన్యం, జ్ఞానం)

76. శ్రాద్ధకర్మ ఎందువల్ల వ్యర్థమవుతుంది?    శ్రోత్రియులైన బ్రాహ్మణులు లేకపోవడం వల్ల

77. యజ్ఞం ఎందువల్ల నిష్ఫలం అవుతుంది?    దక్షిణ లేనందువల్ల

78. దిక్కు ఏమిటి?    సత్పురుషులే (దిక్కు అంటే ఆధారం)

79. నీరు ఏది?    ఆకాశమే

80. అన్నమంటే ఏమిటి?   భూమి

81. విషం ఏది?    కోరిక

82. శ్రాద్ధకర్మకు తగిన కాలం ఏది?   వేదవిదుడు, జ్ఞాని అయిన బ్రాహ్మణుడు లభించిన కాలమే.

83. తపస్సు అంటే ఏమిటి?    స్వధర్మము (వర్ణాశ్రమ ధర్మాలు, విధ్యుక్త ధర్మాలు)

84. దమము అంటే ఏమిటి?    ఇంద్రియమును నిగ్రహించడమే

85. క్షమాగుణము అంటే ఏమిటి?   ద్వంద్వాలను సహంచడం (శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలు, నిందాస్తుతులు, కలిమిలేములు మొదలగునవి ద్వంద్వాలు)

86. లజ్జ అంటే ఏమిటి?   తగని పనులు చేయకుండా ఉండటం

87. జ్ఞానమంటే ఏమిటి?   పరమార్థతత్త్వం తెలుసుకోవడం

88. శమము అంటే ఏమిటి?    చిత్తవృత్తులు అదుపులో ఉండటం

89. దయ అంటే ఏమిటి?    అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం

90. ఆర్జవం అంటే ఏమిటి?    సమచిత్తము

91. మానవుడు జయించలేని శత్రువు ఎవరు?    క్రోధము

92. అంతులేని వ్యాధి ఏది?    లోభము

93. సాధుగుణం అంటే ఏమిటి?   సర్వభూతహితం కోరటం

94. చెడ్డ గుణం ఏది?    నిర్దయ

95. మోహం అంటే ఏమిటి?    ధర్మాన్ని గుర్తించలేని మానసిక స్థితి

96. మానం అంటే ఏమిటి?    ఆత్మాభిమానము

97. ఆలస్యం ఏది?   కర్తవ్యాన్ని నిర్లక్షం చేయటం, ధర్మాన్ని నిర్వర్తించకపోవటం

98. శోకం అంటే ఏమిటి?   అజ్ఞానమే

99. స్థైర్యం ఏమిటి?    స్వధర్మ నిర్వహణలో నిశ్చలంగా నిలబడడం

100. ధైర్యం అంటే ఏమిటి?   ఇంద్రియ నిగ్రహం

101. ఉత్తమమైన స్నానం ఏది?   మనోగత మాలిన్యాన్ని తొలగించేది

102. దానం అంటే ఏమిటి?    సాటి ప్రాణులను రక్షించడం.

103. పండితుడు ఎవరు?    ధర్మం తెలిసినవాడు

104. నాస్తికుడు ఎలాంటివాడు?    మూర్ఖుడు, వేదంపట్ల ప్రామాణ్యం లేనివాడు

105. మూర్ఖుడు ఎవరు?   నాస్తికుడు

106. కామం అంటే ఏమిటి?  సంసార హేతువైన విషయవాసన

107. మాత్సర్యం అంటే ఏమిటి?    మనస్తాపం

108. అహంకారం అంటే ఏమిటి?   అజ్ఞానం

109. దంభం అంటే ఏమిటి?    తన్నుతాను ధార్మకునిగా చాటుకోవడం

110. దైవమంటే ఎవరు?   దానఫలం

111. పైశున్యం అంటే ఏమిటి?    చాడీలు చెప్పటం

112. పరస్పర విరుద్ధాలైన ధర్మార్థ కామాలు మూడు ఒక చోట సంభవించడం ఎలా?

అగ్నిహోత్రము, దానధర్మాలు, భార్య తనవశంలో ఉన్న మానవుడికి ఇది సాధ్యమవుతుంది. అగ్నిహోత్రం వల్ల ధర్మం, దానం వల్ల ధనం, భార్య వలన కామం ఏకత్రా నిలుస్తాయి.

113. అంతులేని నరకం ఎవరికి ప్రాప్తిస్తుంది?

సదాచారము, సచ్చీలము, వేదజ్ఞానముగల బ్రాహ్మణుణ్ణి భోజనానికి ఆహ్వానించి, తీరా అతడు వచ్చిన తరువాత భోజనం పెట్టని వారికి, వేదశాస్త్రాల పట్ల, ధర్మం పట్ల, పితృదేవతలపట్ల గౌరవం లేని వారికి, సంపదలున్నా తనవారిని అనుభవించనీయకుండా, తానూ అనుభవించక, దానధర్మాలు ఆచరించకుండా లోభంతో ప్రవర్తించే వారికి అక్షయమైన నరకం ప్రాప్తిస్తుంది.

114. దేనివల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది?

పుట్టుకగానీ, వేదాధ్యయనంగానీ, శాస్త్రపాండిత్యంగాని, బ్రాహ్మణత్వాన్ని నిర్ణయించవు. ఉత్తమ శీలమే బ్రాహ్మణత్వము.

115. ప్రియవాదికి లాభం ఏమిటి?    అందరికీ ప్రీతిపాత్రుడు కావడం

116. బాగా ఆలోచించి, పనిచేసినవానికి లాభం ఏమిటి?    కార్యసాఫల్యం

117. అనేకమంది మిత్రులున్న వానికి లాభం ఏమిటి?    సుఖశాంతులు

118. ధర్మాత్ముడికి లాభం ఏమిటి?    ఇహలోకంలో సుఖం, పరలోకంలో శాంతి, స్వర్గం

119. ఎవడు సంతోషంగా ఉంటాడు?   బ్రతుకు తెరువుకోసం ప్రయాసపడి, విదేశసంచారం చేయవలసిన అవసరం లేనివాడు

120. ఆశ్చర్యం ఏది?    ప్రతి నిత్యమూ యమసదనానికి ప్రయాణం కట్టేవాళ్ళని చూస్తూకూడా, తాను మాత్రం శాశ్వతంగా ఉంటానని భ్రాంతిపడటం ఆశ్చర్యం

121. ఏది సరైన మార్గం?    సత్పురుషులు తమ జీవితంలో అనుసరించిన మార్గం

122. వింత వార్త ఏది?    ప్రపంచమనే పెద్దగిన్నెలో సూర్యుడనే అగ్నితో రాత్రింబవళ్ళు అనే ఇంధనంతో కాలచక్రం అనే గరిటతో కాలపురుషుడు అనే వంటవాడు జీవులందరిని ‘పచనం’ చేయడం.

123. పురుషుడెవరు?    భూమ్యాకాశాలు వ్యాపించిన కీర్తి గలవాడు

124. సర్వధని ఎవరు?    ద్వందాలకు అతీతంగా సమదృష్టి గలవాడు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *