అనువాద కథలు 4
బాటసారి

మూలకథ రచన: రే బ్రాడ్ బెరి

నవంబరు మాసంలో సన్నని పొగమంచులో రాత్రి ఎనిమిదింటి నిశీధి సమయాన, అల్లి, బిల్లి రహదారులను దాటుకుంటూ, మెత్తని పచ్చికల మధ్య జేబులో చేతులు దూర్చి నగరపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నడవటమంటే లియోనార్డ్ మీడ్ కు ఎంతో ఇష్టం. ఆకాశం నుంచి జాలువారుతున్న సిరివెన్నెల కాంతుల మధ్య నాలుగు రహదార్లు కలిసే కూడలి అంచున నిల్చుని ఏ దిక్కుకు వెళ్లాలా అన్న అతని ఆలోచనల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఆ క్రీ.శ. 2053వ సంవత్సరంలో అతను ఒంటరి బాటసారి. చివరికి ఎటువెళ్లాలో నిర్ణయించుకుని ఆ నిశీధి రాత్రిలో అడుగులు వేసుకొని వెడుతుంటే, సిగరెట్ నుంచి వెలువడే పొగలా మంచు అతని చుట్టూ రింగులు చుడుతోంది.

కొన్నిసార్లు మీడ్ అవిరామంగా మైళ్ల కొద్ది నడచి ఎప్పుడో అర్ధరాత్రి వేళకు ఇల్లు చేరుకుంటాడు. అలా ఇల్లు చేరే దారిలో అతను కారుచీకట్ల మధ్యలో చిన్న, పెద్ద ఇళ్ల గుండా నడుస్తుంటే, వాటి కిటీకీల పరదాల వెనుక నుంచి మిణుగురు పురుగుల్లా దీపకాంతులు అక్కడ, అక్కడా తళుక్కుమంటూ, స్మశాన దృశ్యాన్ని తలపిస్తుంటాయి. అప్పుడప్పుడు ఆ సమాధులను తలపోసే తెరిచి ఉన్న ఇళ్ల కిటికీల నుంచి గుస, గుసలు మంద్రస్థాయిలో వినిపిస్తూ, గోడల మీద అకస్మాత్తుగా నీలి నీడలు ఎగబ్రాకుతుంటాయి.

ఆ మౌనాన్ని ఆశ్వాదిస్తూ, వీక్షిస్తూ, పరికిస్తూ తన అడుగుల సవ్వడి కాకుండా నెమ్మదిగా మీడ్ నడిచి వెడుతుంటాడు. అతను బూట్లను ధరించటం ఎపుడో మానేసాడు. గట్టి పాదరక్షలు చేసే శబ్దాలు వల్ల కొన్నిసార్లు కాపలా కుక్కలు అరచి అతని వెంటబడటం జరిగేది. మరికొన్నిసార్లు, చప్పుడుకి వీధి, వీధంతా గుడ్డిదీపాల నడుమ నవంబరు శీతాకాల సంధ్యా సమయంలో వాహ్యాళి కెళ్లె అతనిని నిశ్చేష్టతో పరికించే కన్నులను దాటుకు వెళ్లడం మీడ్ కు గగనమయ్యేది.

ఈ రోజు మీడ్ పశ్చిమదిశగా ఉన్న సముద్రతీరం వైపు తన గమనం సాగించాడు. గాలిలో మంచు సన్నని స్ఫటిక కాగితంలా ముక్కును కోసేస్తూ, ఊపిరితిత్తుల నిండా క్రిస్మస్ చెట్టులా వ్యాపించి సూదంటి ముల్లుతో గుచ్చుతున్న అనుభూతి కలుగుతోంది. చెట్ల మీద మంచు తళుక్కుమంటూ చంద్రకాంతిలో మెరుస్తోంది. మీడ్ నడుస్తుంటే అతని పాదాల కింద నలిగి ఆకులు చేస్తున్న శబ్దాన్ని అతను ఆలకస్తూ, మధ్య, మధ్యలో నేల మీద పడ్డ ఆకులను తీసుకొని వాటి ఆకృతులను పరిశీలిస్తూ, వాటి సువాసనలను పీలుస్తూ, ఆ శరత్కాల చలికి పళ్లు వణుకుతుంటే సంతృప్తితో నడక సాగించాడు.

దారికి ఇరువైపుల ఉన్న ఇళ్ల వైపు చూస్తూ, ‘‘హలో, ఎవరైనా ఉన్నారా?’ అని మృదువుగా వినీ విన్పించనట్టు ప్రశ్నిస్తూ మీడ్ ముందుకు సాగాడు. ‘ఏముంది ఈ రాత్రి ఛానల్ 4, ఛానల్ 7, ఛానల్ 9లో? కౌబాయ్స్ ఎక్కడకి హడావుడిగా వెడుతున్నారు, ఆ కొండల మాటున కన్పిస్తున్నది అమెరికా అశ్వికదళమేనా? అనే ఆలోచనలు కందిరీగల్లా అతన్ని ముసిరేస్తుంటే నెమ్మదిగా నడవ సాగాడు.

నిశ్సబ్దంగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ విశాల వీథుల్లో మీడ్ నీడ, పల్లెటూరు మధ్యలో వినీల ఆకాశంలో తిరుగుతున్న డేగ నీడలా ఉంది. ఒక వేళ అతను కళ్లుమూసుకుని ఆ క్షణాన, అక్కడే స్తంభించిపోయినట్టుగా నిలబడిపోతే, గాలి కూడా చొరబడని ఆరిజాన్ ఏడారి నట్టనడుమ, కనుచూపు మేర ఎక్కడా నివాస గృహాలు కూడా కానక, ఎండిపోయిన నదీతీరాలు, నిస్తేజమైన రహదారుల అతని మనోఫలకంపై సాక్షాత్కరిస్తాయి.

తన చేతి గడియారాన్ని చూసుకుంటూ, ‘ఎంతైంది ఇప్పుడ?’ని తన చుట్టూ ఉన్న ఇళ్లను ప్రశ్నించాడు, ‘ఎనిమిదిన్నరా?’ ‘క్రమబద్దంగా ఓ డజను హత్యలు చేసే సమయమా?’ ‘ఒక క్విజ్ కార్యక్రమా?’ ‘ఓ అసందర్భ హాస్య కార్యక్రమా?’ ‘ఏదైనా వినోద కార్యక్రమా?’

ఆ ఇంటి నుంచి వస్తున్న శబ్దాలు, ముసి, ముసి నవ్వులా? ఒక్క క్షణం సందిగ్ధావస్థ అనంతరం అతను ముందుకు సాగిపోయాడు. కనుమరుగవుతున్న పచ్చదనం, పూల నడుమ ఎత్తుపల్లాల బాట మీద తడబడుతూ నడక సాగించాడు. అతని 10ఏళ్ల సుదీర్ఘ వ్యాహాళిలో ఎప్పుడ, ఎన్నడు పగలుగానీ, రాత్రిగానీ మరో మనిషి అతనికి ఎదురుపడలేదు.

ఎటువంటి అలికిడి లేని రెండు హైవేలు కలిసే నాలుగు కూడళ్ల జంక్షన్ వద్దకు వచ్చి చేరాడు. పగటిపూట వేగంగా దూసుకుపోయే కార్ల రణ,గణ ధ్వనులతో, అక్కడే ఉన్న పెట్రోలు బంక్ మొత్తం బెల్లం మీద ముసిరే ఈగల హోరులా హడావుడిగా, కార్ల నుంచి వెలువడే పొగతో ఎంతో గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వేసవికాలంలో ఎండిపోయిన కాలువలా నిస్తేజంగా ఉంది.

అక్కడ నుంచి పక్కసందులోకి గుండ్రంగా తిరిగి, తన ఇంటికి వైపు దారితీసాడు. ఇంకో పది గజాల్లో తన ఇంటికి చేరుకుంటాడనంగా, హఠాత్తుగా ఒక కారు వచ్చి అతనిపై తీక్షణమైన వెలుగుని సారించింది. ఈ హఠత్ పరిణామానికి నివ్వెరపోయి, ఉన్నచోటే శిలలా నిలబడి, అంతలోనే తేరుకొని, కాంతి వచ్చిన వైపు కదిలాడు.

అంతలోనే ఒక కంచు కంఠం, ‘కదలకు. ఉన్నచోటే నిలబడు,’ విన్పించింది. అతను వెంటనే ఆగిపోయాడు.

‘చేతులు పైకెత్తు.’

‘కానీ..’ అతను ఎదో చెప్పబోయాడు.

‘చేతులు పైకెత్తు. లేదా కాల్చేస్తాను.’

సందేహం లేదు పోలీసులు. అయితే అదొక అద్భుత దృశ్యం. 30లక్షల మంది జనాభా గల ఆ నగరమంతటికి మిగిలినది ఒకేఒక్క పోలీసు కారు. గత సంవత్సరం 2052లో ఎన్నికల సందర్భంగా మూడు పోలీసు కార్ల నుంచి ఒక్క కారుకు తగ్గించారు. నేరాలు తగ్గుముఖం పట్టుతుండటంతో పోలీసు కార్ల అవసరం తగ్గింది. ఈ ఒక్క కారే నిర్మానుష్యంగా ఉండే ఊరంతా గస్తీ తిరుగుతుంటుంది.

‘నీ పేరేంటి?’ పోలీసు కారు గంభీరమైన స్వరంతో ప్రశ్నించింది. కళ్లలో లైట్ కాంతి పడుతుండటంతో కారులో మనుష్యులెవరూ కన్పించలేదు.

‘లియోనార్డ్ మీడ్’, అతను బదులిచ్చాడు.

‘గట్టిగా చెప్పు.’

‘లియోనార్డ్ మీడ్’

‘వ్యాపారమా, ఉద్యోగమా?’

‘మీరు నన్ను రచయిత అని పిలవచ్చు.’

‘నిరుద్యోగి,’ తనలో తాను మాట్లాడుకున్నట్టుగా పోలీసు కారు పలికింది.

సూదంటురాయితో గుచ్చినట్టుగా కాంతిపుంజం ఒకటి అతనిని మ్యూజియంలో నమూనాను తాకినట్టు అతని ఛాతీలోకి చొచ్చుకెళ్లింది.

‘నిరుద్యోగనుకోవచ్చు,’ మీడ్ సమాధానామిచ్చాడు. అతను చాలా సంవత్సరాలుగా ఎటువంటి రచన చేయలేదు. పుస్తకాలు, పత్రికలు ఇప్పుడు అమ్మట్లేదు. అవన్నీ చీకటి గుయ్యారాలాంటి, సమాధులని పోలిన ఇళ్లలో సమాధైపోయాయని అతని స్మృతిలో మెదిలింది. ఆ సమాధుల్లో టెలివిజన్ నుంచి వచ్చే గుడ్డి దీపాల ముందు జీవచ్ఛవాల్లా కూర్చుటారు. నల్లని, రంగ, రంగుల దీపకాంతులు వారి మొహాలను తాకుతున్నాయే గాని, వారిని తాకలేకపోతున్నాయి. అతని ఆలోచనలను భంగపరుస్తూ,

‘నిరుద్యోగి,’ గ్రామఫోన్ లోంచి వచ్చినట్టు కీచు శబ్ధమొకటి విన్పించింది. ‘ఈ వేళప్పుడు బయట ఏం చేస్తున్నావు?’

‘సరదాగా నడుస్తున్నాను,’ సమాధానమిచ్చాడు మీడ్.

‘నడుస్తున్నావా!’

‘అవును కేవలం నడుస్తున్నాను,’ నిర్లిప్తంగా సమాధానమిచ్చాడు. కానీ, అతని మదిలో మాత్రం ఎదో అలజడి బయలుదేరింది.

‘నడుస్తున్నావు. కేవలం నడుస్తున్నావు?’

‘అవునండి.’

‘ఎక్కడికి నడుస్తున్నావు? ఎందుకు నడుస్తున్నావు?’

‘చల్లగాలి కోసం. చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటానికి.’

‘ నీ ఇంటి అడ్రసు.’

‘11, సౌత్ సెయింట్ జేమ్స్ స్ట్రీట్.’

‘మీ ఇంట్లో గాలుందా, ఏయిర్ కండిషన్ ఉందా, మిస్టర్ మీడ్?’

‘ఉన్నాయి.’

‘మీ ఇంట్లో టెలివిజన్ ఉందా?’

‘లేదు.’

‘లేదా?’ ఆ ప్రశ్నలో ఆశ్చర్యం కంటే ఆరోపణ ఎక్కువగా ప్రతిధ్వనించింది.

‘నీకు పెళ్లయిందా, మిస్టర్ మీడ్?’

‘లేదు.’

‘పెళ్లి కాలేదు,’ కోపాగ్నితో కూడిన స్వరం పలికింది. అప్పటికి నిండు చంద్రుడు చుక్కల మధ్య మెరుస్తూ, ఆకాశం నట్టనడుమకు చేరుకున్నాడు. కింద ఇళ్లని బూడిదరంగులో, నిశ్శబ్దంగా బారులు తీరి ఉన్నాయి.

‘నా గురించి ఎవరూ ఎదురు చూడట్లేదు,’ వాతావరణాన్ని ఆహ్లాదపర్చడానికన్నట్టు చిరునవ్వుతో పలికాడు మీడ్.

‘అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు.’

మరి మాట్లాడకుండా మీడ్ ఆ చలిలో నిరీక్షిస్తూ ఉండిపోయాడు.

‘కేవలం నడుస్తున్నావు, మిస్టర్ మీడ్?’

‘అవును.’

‘కానీ, ఎందుకు నడుస్తున్నావో, చెప్పలేదు.’

‘చల్లగాలి కోసం, బయట ప్రపంచం చూడటానికి నడుస్తున్నానని ఇందాకే చెప్పాను.’

‘ఇలా ఇంతకు ముందు ఎన్నిసార్లు నడిచావు?’

‘కొన్నేళ్లుగా. ప్రతి రాత్రీ నడుస్తూనే ఉన్నాను.’

రహదారి మధ్యలో ఉన్న ఆ పోలీసు కారు రేడియో కూనిరాగం పాడుతోంది.

‘సరే మిస్టర్ మీడ్.’

‘అంతేనా ఇంకేమైనా ప్రశ్నించాలా,’ నమత్రగా అడిగారు మీడ్.

‘అంతే,’ అన్న సమాధానం పూర్తయ్యేలోపలే, పోలీసు కారు వెనకాల తలుపు తెరుచుకుని, ‘కారెక్కు’ అని విన్పించింది.

‘ఒక్క క్షణం. నేనేం తప్పు చేయలేదు.’

‘కారెక్కు.’

‘ఎక్కకపోతే!’

‘మిస్టర్ మీడ్.’

ఏదో మంత్రం వేసినట్టు నెమ్మదిగా కారువైపు నడిచి, కారు అద్దంలోంచి లోపలకి తొంగి చూశాడు. ఊహించినట్టే, డ్రైవర్ సీటులోనే కాదు, కారు లోపల కూడా మనుష్యులెవరు లేరు.

‘కారెక్కు.’

కారు తలుపు తీసి, వెనకాలవైపు తొంగి చూశాడు. అది ఒక చిన్న గది. నల్లని ఊచలున్న జైలుగది. క్రిమికీటకాలను చంపే ఒక రకమైన మందు వాసన, లోహపు వాసనతో ఎంతో శుభ్రంగా, దృఢంగా, కాఠిన్యంగా, మృదుత్వమనేదే అక్కడ కన్పించలేదు.

‘ఒక వేళ నీకు భర్య ఉండి, తన కనుక నీ గురించి చెపితే…. కానీ…’ కర్కశమైన గొంతు పలికింది.

‘నన్ను ఎక్కడికి తీసుకు వెడుతున్నావు?’

ఒక్క క్షణం సంశయం తర్వాత, ఒక బటన్ కార్డు మీదో ఏదో సమాచారం ముద్రించింది. ‘మానసిక చికిత్స మరియు మందబుద్ధి పరిశోధన కేంద్రం.’

నెమ్మదిగా మీడ్ కారెక్కాడు. చిన్న శబ్దం చేస్తూ కారు తలుపు మూసుకుంది. మిణుకు, మిణుకుమంటున్న దీప కాంతుల మధ్య కారు ఆ అంధకారపు రాత్రిలోకి జారుకుంది.

గాఢాంధకారం అలుముకున్న ఆ నగరంలో, ఆ వీథిలో ఒక ఇల్లు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రతి కిటికీ నుంచి చీకటిని చీల్చుకుని వెచ్చటి వెలుతురు నలుదిక్కులా వ్యాపిస్తోంది.

‘అది నా యిల్లు,’ అన్నాడు లియోనార్డ్ మీడ్.

ఎవ్వరూ బదులు చెప్పలేదు.

నిర్జీవమైన ఆ నదీతీర పరివాహక ప్రాంతం గుండా, నిర్మానుష్యంగా ఉన్న వీథుల, రహదారుల గుండా అలికిడిలేని నిశ్శబ్ద వాతావారణంలో, వణుకు పుట్టిస్తున్న ఆ నవంబరు నిశీధి రాత్రిలో కారు ముందుకు సాగిపోయింది.

మూలకథ: పెడస్ట్రియన్

అనువాదం: సౌమ్య శ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *