పొడుపు కథలు

పొడుపు కథలు ఎలా ఎప్పుడు పుట్టాయో చెప్పడం కష్టమేమో! ఎక్కువగా వ్యావహారిక భాషలో, జానపద ప్రక్రియలో మనకివి ఎక్కువగా కన్పిస్తుంటాయి. సంఘంలోని, బంధాలు, బాంధవ్యాలు, వృత్తులు, కళలు, పురాణాలు, వేదాంతాలు ఇలా ప్రతి ఒక్కటి అందంగా, సున్నితంగా, వాడుక భాషలో సుకుమారంగా పొడుపు కథలుగా పొడవడం కూడా ఒక కళే. ఊహాజనితమైన భావనలను చిన్ని, చిన్ని వాఖ్యాలలో పొందుపర్చటం అంటే యశోదకు శ్రీ కృష్ణుడు తన చిన్ని నోటిలో సకల భువనాలను చూపించటంలాంటిదే. “తోక లేని పిట్ట తొంబై మైళ్లు పోతుంది.” ఇలా చెప్పగానే మీకు గబుక్కున ఉత్తరం జ్ఞాపకం వచ్చి ఉండాలే? పూర్వకాలంలో పావురం ద్వారా ఉత్తరాలు పంపటం మన ఆనవాయితీ. దానిని దృష్టిలో పెట్టుకుని మనవాళ్లు ఈ పొడుపు కథను పుట్టించి ఉంటారు. ఈ పొడుపు కథ నాటి, నేటి నాగరికతలకు సంధిలాంటిది.

పొడుపు కథలకు అపార్థ కల్పన ఒక ముఖ్య లక్షణం. దానిలో భావస్ఫూర్తి ఉంటూనే ఉంటుంది. తెలుగు సాహిత్యంలోని అనేకానేక ప్రక్రియలకు ఇవి లక్షణాలని నిర్ధేశించగలిగారు. కానీ పొడుపు కథలకు మాత్రం అటువంటి గీటురాయిని కల్పించటం సాధ్యంకాదు. అయితే పొడుపు కథలు ఎలా ఉండాలి అన్నప్పుడు మాత్రం, సంక్షిప్తంగా, కొండంత భావాన్ని, గోరంతంగా చెప్పగలగాలి. అర్ధ, భావ, విషయ, పద, పదార్ధ స్వరూపాలలో ఎదో ఒకటి నిగూఢంగా ఉండాలి. వినోదాత్మకంగా, సమస్యపూరితమై, పరిష్కారాన్ని ఆశించేదిగా ఉండాలని మాత్రం సాహిత్యకులు భావించారు. ఇందులో అన్నీ కాకపోయినా ఏ కొన్నైనా లక్షణాలు పొడుపు కథకు ఉండాలన్న నిబద్ధన లేకపోయినా, ఉండే ఉంటాయి. మీ మెదడుకు మేత కల్పించేందుకు ఇక్కడ కొన్ని పొడుపు కథలిస్తున్నాం. ప్రతివారం ఇలాగే కొన్ని ఇస్తుంటాం. విప్పగలిగితే, శహబాష్. లేదా మా సమాధానాల కోసం వేచి చూడండి. అలాగే మీ దగ్గరేమైనా పొడుపు కధలుంటే పాఠకుల మెదడుకు మేత వేయండి.

1. అందరికి ఒకే కొడుకు, ఒకే కూతురు.

2. అక్క ఇంటికి చెల్లి పోతుంది, కానీ చెల్లింటికి అక్కరాదు.

3. కళ్లున్నాయి కానీ చూపు లేదు.

4. ఇంత పిల్లలేదు, ఇల్లంతా గుల్ల చేసింది.

5. ఇంతింత గుడికాదు, ఈశ్వరుని గుడి కాదు; కంచు గోపురం కాదు, అది కదలదు మెదలదు.

6. ఈడ ఢమ, ఢమ, ఆడ ఢమ,ఢమ; మద్దిరేవుల కాడ మరీ ఢమ, ఢమ

7. ఉదయం నాలుగు కాళ్లతో నడిచేది, మధ్యాహ్నం రెండుకాళ్లతో నడిచేది, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది.

8. ఎగిరిన ఎగురును, పోయిన పోవును, నడిచిన నడువును, నోట మాట లేదు

9. ఎనిమిది చేతుల ఏబ్రాసి, ఎపుడు తిరిగే సోబ్రాసి, వెన్నున జందెం వేళ్లాడుతూ, తీసిని కొద్దీ తేర్లాడు.

10. ఇంతి ఇంటాయనుకొని, తడబడి గుండెరాయి చేసుకుంది.

One thought on “పొడుపు కథలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp