పిట్ట కొంచెం కూత ఘనం...

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది – ఏమిటో చెప్పుకోండి. అంటే తడుముకోకుండా కవ్వం! అని చెప్పెస్తాం. చిన్నప్పటి నుంచి ఇలా అనేక ఆహ్లాదకరమైన పొడుపు కథల ద్వారా విజ్ఞాన సారాన్ని తల్లులు తమ పిల్లలకు చేరవేస్తూనే ఉన్నారు. మౌఖిక ప్రచారం ద్వారా జనజీవన స్రవంతిలో భాగమై పోయిన పొడుపు కథలు మన తెలుగుతనానికి, సాహిత్యానికి పట్టుగొమ్మలు. ఈ పొడుపు కథలు ఎప్పుడు, ఎలా మొదలైయ్యాయి అంటే చెప్పటం కష్టం. అయితే, ప్రాచీన, ఆధునిక, జానపద సాహిత్యాలన్నింటిలోనూ మనకు పొడుపు కథలు ముమ్మరంగా కన్పిస్తాయి. కొంచెం, విజ్ఞానం, కొంచెం చమత్కారం, కొంచెం భావావేశం, మరికొంత ఆలోచన కలగలపి మన పొడుపు కథలు రూపుదిద్దుకున్నాయి.

సూత్రప్రాయమైన ఆరంభ, ముగింపు అంశాలు కలిగి ఉండటం పొడుపు కథల ప్రధాన లక్షణం. అలాగే త్వరగా పరిష్కార సాధ్యం కాని సమస్యగా కన్పించడం కూడా దీని లక్షణం. పొడుపు కథకు అర్థం చెప్పాల్సివస్తే, గూఢ భావాలున్న చిక్కు ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం లోతుగా పరికిస్తే, నిగూఢమైన అర్థాన్ని ప్రకాశింప చేసేది, మనస్సుకు సూటిగా తగిలేది, వెంటనే అర్థం తోచక, చీకాకు పెట్టేది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పొడుపు కథలనే విచ్చుకత, విడికథ అని కూడా కొన్ని ప్రాంతాల్లో వ్యవహరిస్తారు. తెలంగాణాలోని నల్లగొండ జిల్లా ప్రాంతంలో వీటిని తట్టు, మారుతట్టు అని, వరంగల్లు, కరినగరి, జిల్లావాసులు శాస్త్రాలని, ఇందూరు వాసులు సమస్యలు లేదా సమిచ్చలు, రాయలసీమ ప్రాంతీయులు మారుకతలని, అనంతపురంలో ఒడ్డుకత లేతా అడ్డకతని, జానపదులు సిటుకలని, చిట్కాలని పిలుస్తారు.

త్వరగా సమాధానం చెప్పడానికి వీలుకానివి, ప్రశ్న ద్వారా చమత్కారాన్ని జొప్పించేవి, ఆశ్చర్యంలో ముంచెత్తేవి యక్షప్రశ్నలు. పొడుపు కథలు, యక్ష ప్రశ్నలు రెండు చిత్రమైన ప్రశ్నలతో యుక్తివంతమైన సమాధానాలు రాబడతాయి. ఈ రెండు ప్ర్రకియలలో ఉన్న సామీప్యం వల్ల యక్షప్రశ్నలేనే పొడుపు కథలని, పొడుపు కథలనే యక్షప్రశ్నలనవచ్చు. ప్రాచీన కాలం నుంచి మన జనజీవనంలో భాగమైన పొడుపు కథలని సంస్కృతంలో ప్రహేళిక, ప్రత్యుత్తర కూట మరియు సమస్యా గూఢ ఇలే అనేక పేర్లతో వ్యవహరిస్తారు.

కావడానికి పొడుపు కథలైనా, ఇవి కథా రహితాలు కూడా. పొడుపులో విషయ వర్ణనం, విడుపులో అర్థసూచన ఉంటుంది. ఒక వస్తువు, ప్రాణి లేదా ప్రకృతి గురించిన విశేషం గాని, రూప వర్ణన గాని, పొడుపు కథల నిర్మాణానికి మూలం. నిగూఢత, సంక్షిప్తత, దృశ్యాత్మకత, ఘటనా విశిష్టత, శబ్ధ తీక్షణ, లోకోక్తులు, లయ, అపార్థ కల్పన, రసస్ఫూర్తి, వినోదం, భావప్రకటన, అలంకారికత, సమస్యాత్మకత, కవితాత్మకత, ధ్వని పొడుపు కథల్లో నిక్షిప్తమైన లక్షణాలు. ఈ లక్షణాలని ప్రదర్శించే కొన్ని పొడుపు కథలను పరికిద్దాం. (సమాధానాల కోసం వ్యాసం చివర చూడండి)

1. నారీలలామ! నీ పేరేమి చెప్పుమన్న
తమి మీఱ నెడమ నేత్ర మునుజూపె
మత్తేభయాన! నీ మగని పేరేమన్న
తన చేత జీర్ణవస్త్రమును జూపె
వెలది! నీకేమైనా బిడ్డలా చెప్పుమన్న
కరమొప్పమింటి చుక్కలను జూపె
కుటిల కుంతలి! నీదు కులమునామంబన్న
పంజరంబున నున్న పక్షి చూపె
ప్రభువు మీకెవ్వరన్న గోపకుని చూపె
ధవుని వ్యాపారమేమన్న దండమిడియె
చతుర మతులార! ఈ ప్రౌఢ జాణతనము
తెలిసి కొనరయ్య బుద్ధి కౌశలము మెఱయ.

2. ఓహో సన్నాసి
నీపై నిండ విభూతి
నీ సేతులకు శంఖ చక్రాలు
నీ నెత్తిన రుద్రాక్షలు

3. కొనేటప్పుడు నల్లగ
తినేటప్పుడు ఎర్రగ
పారేసేటప్పుడు తెల్లగ

4. సూర్యుడు చూడని మడుగు
చాకలి తాకని గంగ

5. బంగారం కంటే
సింగారమైంది తెమ్మంది భార్య
అంగడి తిరిగి
గొంగడి సంకనేసుకొచ్చిండు భర్త
మర్మం విప్పి చెప్పింది
ఏందది?

6. ఆమడ నడచి అల్లుడు వస్తే
మంచం కింద ఇద్దరు
గోడమూల ఒకడు దాగున్నాడు.

7. గుండు మీద గుండు
పదహారు గుండ్లు
పదహారు గుండ్ల మీద
పట్టుకొచ్చు

8. సురసుర కత్తులు
సురారి కత్తులు
రాజులు దెత్తురు
రంభల కిత్తురు

9. ఆకులేదు, పోకలేదు నోరెఱ్ఱన
వానలేదు, వరదలేదు, వరిపచ్చన

10. అయిదుగురు భర్తలుందురుగాని ద్రౌపది కాదు

11. చెట్టు కింద లింగడు
ఎంత గొట్టినా వంగడు

12. మా తాత మూడెద్దులను
కాలవవతల నుండి తీసుకొస్తుంటే
ఒక ఎద్దు మునిగింది
ఒక ఎద్దు తేలింది
ఒక ఎద్దు కరిగింది

సమాధానాలు:

1, వామాక్షి, కుచేలుడు, ఇరువదియేడు, ద్విజ, శ్రీకృష్ణుడు, తపస్సు మొదలైనవి విడుపులు
2. ఆముదపు చెట్టు
3. అల్లనేరేడు పండు
4. కొబ్బరికాయలో నీళ్లు
5. కుంకుమ
6. చెప్పుల జత, చేతి కర్ర
7. మొక్కజొన్నకంకి
8. (మొగలి పువ్వు)
9. రామచిలుక
10. చేయి
11. నీడ
12. వక్క, ఆకు, సున్నం

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *