పరిచయం 1 చిలకమర్తి లక్ష్మీ నరసింహం

తే.గీ. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

తే.గీ. భరతఖండంబె యొక గొప్ప బందెఖాన
అందులోనున్న ఖయిదీలు హిందుజనులు
ఒక్క గదినుండి మార్చి వేరొక్కగదిని
బెట్టుటెగాక చెరయంచు వేరెగలదె

జాతీయోధ్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ప్రసంగాల సారాంశానికి ఇచ్చిన ఈ పద్య రూపం ప్రతి తెలుగువాని నోట వందేమాతర గీతంలా ప్రతిధ్వనించింది. ఈ పద్యాన్ని చెప్పి బ్రిటీషు ప్రభుత్వ గుండెల్లో రైల్లు పరిగెట్టించింది మరెవరో కాదు ‘ఆంధ్రా మిల్టన్’గా ప్రసిద్ధికెక్కిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు. ఎప్పుడో 1905లో చిలకమర్తివారు ఈ పద్యం చెప్పినా నేడు కూడా వింటే మన ఒళ్లు గొగుర్పొడుస్తుంది. నాటకకర్తగా, నవలా రచయితగా, సంఘసంస్కర్తగా ఆంధ్రుల మనసులను దోచుకున్న చిలకమర్తివారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రాసిన ‘గయోపాఖ్యానం’ పద్య నాటకం, మహారసిక, గయ్యాళి గంగమ్మ, బధిర చతుష్టయము, బలవంత బ్రాహ్మణార్ధం, కైలాస దూత వంటి ప్రహసనాలు, ‘గణపతి’ నవల నభూతో నభవిష్యతి అన్నట్టు నేడు కూడా పరిమళాలు వెదజల్లుతూ, ఆంధ్ర సాహిత్యాభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.

చిలకమర్తివారి పద్యాలు పండిత పామరులను రజింపచేసిన రసగుళికలు.‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే…’, ‘అల్లుడా రమ్మని యాదరమ్మున బిల్వ’, ‘జలనిధులింకుగాక’, ‘పాతాళమునకేగి బ్రతుకు వచ్చునటన్న’, ‘ఫాలనేత్రుని గెల్చి పాశుపతముగొంట’, ‘పారె చీరలు నగలును జాలగొనుచు’, మరియు ‘నిటలౌక్షుండిపుడెత్తివచ్చినను రానీ…’ వంటి పద్యాలలో తెలుగుదనపు తియ్యదనాన్ని రుచి చూసిన నాటకప్రియుల నాల్కలమీద ఈ పద్యాలు నేడు డా నాట్యమాడుతున్నాయి. చిలకమర్తివారు నల్లిని గురించి రాసిన కింది పద్యం చూడండి.

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట రాజీవాక్షుం
డ అవిరళముగ శేషుని పై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ.

అలాంటిదే మరో హాస్యగుళిక –

తోటకూర దెచ్చి దొడ్డిలోన తరిగి
కుండలోన బెట్టి కుదురుగాను
క్రింద మంటబెట్ట వుడకకేంజేస్తుంది?
దాని కడుపుకాల ధరణిలోన

ప్రజానాడితెలిసిన రచయిత చిలకమర్తివారు. అందుకే తనకు తెలిసిన సామెతలు, నుడికారాలు, పాత్రల నోటివెంట విన్నప్పుడు ప్రేక్షకుడు ఎంత ఉప్పొంగిపోతాడో గ్రహించి, తమ నాటకాలలో చిలకమర్తివారు సామెతలను, లోకోక్తులను, జాతాయాలను అడుగడుగునా పుష్కలంగా ప్రయోగించి జనాదరణ పొందారు. ఉదాహరణకు ఆయన రాసిన గయోపాఖ్యా నాటకమే చూడండి. కంచెయే చేను మేసినట్లు, నిజమాడిన నిష్టూరం, వ్రతము చెడ్డా ఫలము దక్కవలను, గుడి మ్రింగువానికి లింగమెంత, నీట ముంచినను, పాలముంచినను భారము నీదే, ఈ కన్నులకీ రెప్పలు దూరమువావు, అడ్డాలనాడే బిడ్డలుగాని గెడ్డాలనాడు కాదు, ఏరుదాటి తెప్పగాల్చినట్టు వంటి సామెతలు, నల్లేరుమీద బండి, కీడులో మేలు, తలకు మీరని పని, కత్తితో సాము, గీచినగీటు దాటక, గాజులు తొడిగించుకొను, గతజలసేతుబంధనం, మూటగట్టకొను వంటి జాతీయాలు మనకు అడుగడున తటస్థిస్తాయి.

హాస్యం చిలకమర్తివారి ఇంటిపేరంటే అతిశయోక్తికాదేమో. చిలకమర్తివారి గణపతి “శ్రీ రఘురామ” పద్యానికి చెప్పిన వివరణ వింటే మీకే అర్ధమవుతుంది. “శ్రీరఘురామ చారు తులసీ దళ” – శ్రీరాముడు ఒకసారి చారు కావాలనుకున్నాడట.. ఆ వూరిలో (ఏదీ అయోధ్యా నగరంలో…హతవిథీ) కర్వేపాకు దొరకటం దుర్లభం కావటంతో తులసీ దళములను ప్రత్యామ్నాయంగా వాడారుట. అట్టి చారు తాగడంతో శ్రీరాముడికి “సమక్షమాది శృంగార గుణాలు” కలిగి, అన్నిలోకాలను జయించే “శౌర్య రమాలలాముడై”, “దాశరధి కరుణాపయోనిధియై ” వెలుగొందాడట. అలాంటిదే మరో ఉదాహరణ సంస్కృతంరాని పండితుడు జితం భగవతేన అన్న రామాయణ శ్లోకానికి వానరులు రాముడిని జీతం అడిగారంటూ అర్ధం పద్యం చెప్పటం, మేలిమి బంగారం తనను ముక్కలు చేసినందుకుగాన గురువిందగింలతో వడ్లగింజలతోనూ సమానంగా తూచినందుకు బాధపడుతున్నదంటూ చెప్పిన పద్యాలు ఆయన హాస్యరచనకు మచ్చుతునకలు.

సమయస్ఫూర్తితో ఆయన హాస్య సంభాషణలు చేయడంలో ఆరితేరినావరు అనడానికి ఈ కింది ఉదాహరణే చాలు. 1890 కాలంలో ఎవరో ఒకమారు లక్ష్మీనరసింహముగారిని “పకోడీల” మీద పద్యం వ్రాయమని అడిగారట. పద్యానికి ఒక పకోడీ బహుమానంగా ఇస్తాము అని కూడా చెప్పారట . “కవుల కక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది !. పద్యమునకు పకోడిలు ఇచ్చెడి దుర్దినములు వచ్చినవని” ప్రత్యుత్తరమిచ్చి ఆయన ఆశువుగా పకోడీలపై ఈ కింది పద్యాలు అల్లారు.

ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ యా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందులేవు నిజము పకోడీ.

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మున్ను బ్రాహ్మణులు వేధ నతండున్
కోడి వలదా బదులు ప
కోడిం దిను మనుచు జెప్పె కూర్మి పకోడీ !

ఆ రామానుజు డా గతి
పోరున మూర్ఛిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి యెరుగడు గాక య
య్యారె నిను గొనిన బ్రతుకడటవె పకోడీ !

అని రామాయణానికి తెలుగువారి పకోడీకి లంకెపెట్టిన సమర్ధులు చిలకమర్తివారు.

పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో 1867 సెప్టెంబరు 26న జన్మించిన చిలకమర్తివారి తొలి నాటకం ‘కీచకవథ’. అప్పటినుండి సుమారు 25నాటకాలను వారు రచించారు. వీరు రచించిన నాటకాలలో గయోపాఖ్యానము, ద్రౌపది పరిణయము, శ్రీ రామ జననము, పారిజాతాపహరణము, ప్రసన్నయాదవము, ప్రహ్లాద చరిత్ర మొదలైనవి ప్రసిద్ధమైనవి. 1920లో మొట్టమొదటిసారిగా ఆయన పద్యనాటకాలను రాయటం మొదలుపెట్టారు. అంతేకాక భాసుని నాటకాలను సంస్కృతం నుంచి ఆంధ్రీకరించారు. పార్వతీ పరిణయం ఆయన తొలి ఆంధ్రీకరణ. చిలకమర్తివారి నవలలు ‘హేమలత’, ‘సౌందర్యతిలక’, ‘అహల్యాబాయి’లు చింతామతి పత్రిక నిర్వహించిన నవలల పోటీలలో ప్రథమ బహుమతులను పొందాయి. చిలకమర్తివారు ‘సరస్వతి’, ‘మనోరమ’, ‘దేశమాత’ పత్రికలను స్థాపించారు. ఆయన నవలలు, నాటకాలు, ప్రహసనాలు కలిపి మొత్తం 96 రచనలు గావించారు. గ్రాంథికభాషోద్యమానికి వెన్నొడ్డిన చిలకమర్తివారిని ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు గౌరవించింది. 1946, జూన్ 17న చిలకమర్తివారు మరణించారు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *