తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

ఈ మధ్య మా స్నేహితులం కొందరం పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుండగా, మా చర్చ తెలుగు భాష మీదకు మళ్లింది. మా స్నేహితురాలు చప్పున ‘తెలుగు భాషలో, తెలుగువారిలో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత’ అని వాపోయారు. చర్చ అక్కడ నుంచి మాంఛీ రసపట్టు మీద సాగిందని మీకు నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటాను! చర్చ మాట ఎలా ఉన్నా, ఆవిడన్న మాటల్లో కొంత నిజం లేకపోలేదనిపించింది. ఏకాబిగిని పరభాషా పదం పడకుండా తెలుగు మాట్లాడేవారు మనలో ఎంత మంది అన్న అనుమానూ వచ్చింది. పండిత భాష, పామర భాష, వ్యాకరణ భాష, పత్రిక భాషా, వ్యవాహారిక, గ్రాంధిక భాష ఇలా అనేక తెలుగు భాషలు ఈ రోజు మనముందున్నాయి. కల్తీలేని అచ్చమైన తెలుగు భాషే లేదా అన్పిస్తోంది. పైన ఉదహరించినవి మాత్రం తెలుగు భాషలు కాదా అంటే కాదని అనగలమా! కాకపోతే తెలుగువారే తెలుగు పదాలతో రాసినా, మాట్లాడినా అర్ధం కావట్లేదు అంటే మాత్రం అనుమానం రాకపోదు.

మన భాష పుట్టుపూర్వోత్తరాలు పక్కన పెడితే, అసలు మన భాషకే చాలా పేర్లున్నాయి. తెలుగుని తమిళ, కన్నడ పుస్తకాలలో, శాస్త్రాలలో ‘వడుగ, వడగ, తెలింగ, తెలుంగు’ అని పిలిచేవారు. పోర్చుగీసువారైతే ఏకంగా ‘జెంటూ భాష’ అనే వారు. అంటే ఏమిటో? అయితే ఎక్కువగా వాడకంలో ఉన్న పేర్లైతే, ఆంధ్ర, తెలుగు మరియు తెనుగు. తెనుగు, తెలుగుగా ఎలా మారింది అనడానికి కూడా కథనాలున్నాయనుకోండి. అసలు ఆంధ్రులు వేరు, తెలుగువారు వేరు అన్న వారు లేకపోలేదు. ఇక్కడ ఈ చరిత్రకాదు, ముఖ్యం, మన భాష అందులో తెలుగెంత, అది మనకెంత దూరం అని.

ప్రాచీన తెలుగు చదివితే అది గ్రీకో, లాటిన్ అన్పించకమానదు మనకు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనవి చేయాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. మన తెలుగువాడు వాడిన మొదటి పదం ఏది? కంగారుపడకండి. అమరావతి స్తూపంపై గల ‘నాగాబు’ అనేది తెలుగులో మొట్టమొదటి పదం అని చారిత్రకారుల అభిప్రాయం. ‘‘అరహిణిష వాహిట్టి మాకనషతిరుహాత కణిష’’, సడన్ గా నాకు సుత్తి వీరభద్రరావు పూనాడనుకుంటున్నారా? కాదండి బాబు! ఇది తెలుగేనంటే నమ్ముతారా. అర్ధంకాలేదు కదా! నాక్కూడా! శాతవాహనకాలంలోని నాణాలపై ఒక వైపు ప్రాకృతం, మరోవైపు తెలుగు రాతలున్నాయని పరిశోధకులంటున్నారు. వారు వెలికి తీసిన ఒకానొక తెలుగు వాక్యమిది.

అనాదిగా మన తెలుగు మీద అన్య భాషల ప్రభావం ఉంది. సంస్కృతం ఏ భాషకైనా మూలం. అందుకని ఆ భాష ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. అదికాక, ప్రాకృతం, సంస్కృత-ప్రాకృతాల కలయికతో పుట్టిన పదాలు, ఇక పోర్చుగీస్, డచ్, ఉర్దూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు. సామరతకు సరైన అర్ధం మన తెలుగని ఈపాటికే మీకర్ధమయ్యుంటుంది! వీటన్నింటి ప్రభావం నుంచి బయటకి రాగలిగితే దేశ్యాలు, గ్రామ్యాలు అంటే అసలు, సిసలైన, అచ్చమైన తెలుగు భాషా, పదాలు మన ముంగిటుంటాయి.

‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు. ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’, ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు. ఇక్కడ అచ్చ తెలుగంటే ఏమిటి అన్న సందేహం కలుగకపోదు. సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు. ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు. మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే. ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం.

అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతున్నాయి. కిటికీ, కుర్చీ, స్టూలు, ఫ్యాన్, దర్వాజా, వరండా, రేడియో, టెప్ రికార్డర్, అంకుల్, ఆంటీ, ఫ్రెండ్, దోస్తు, కారు, క్యాబ్, జల్దీ ఇలా చెప్పుకుంటూ పోతే సగం భాష మనది కాని మన భాష. స్పీడ్ పెరుగుతున్నట్టే భాషలో మార్పు కూడా అతి వేగంగా పెరుగుతోంది. కొన్నిసార్లు రాయడానికి వీలుగా భాషని మార్చేస్తాం. కొన్నిసార్లు పలకడానికి అనువుగా భాషని కుదించేస్తాం. ఈ పదాలు చూడండి: ముఖము ఇది మొగము, మొగం నుంచి నేటి మొహంగా మారింది. అలాగే, తేనియు – తేనే, చిలుక – చిల్క, కొలది – కొద్ది, చలిది – చద్ది, తరుగు – తగ్గు, వంగకాయ – వంకాయ, రాతి చిప్ప – రాచిప్ప, ఫలకము – పలక, పీఠము – పీట. ఈ సద్దుబాటు కేవలం ఒక్కభాషకి పరిమితం కాదు. ఇవి చూడండి: కాగజ్ – కాగితం, కరార్ – ఖరారు, జప్త్ – జప్తు, ఖబర్ – కబురు, ఖండియా – కండువా, పహ్ర హుషార్ – పారా హుషార్, దుకాన్ – దుకాణం, జమీన్ దార్ – జమీందారు, రైల్ – రైలు, టికెట్ – టికెట్టు, కాలేజ్ – కాలేజీ, స్విచ్ – స్విచ్చు, క్లబ్ – క్లబ్బు. అకార, ఉకార, ఇకారాలను అనువుగా కలుపుకొని, ప్రతి భాషను మనదిగా చేసుకోవడం మన తెలుగు భాషకు మాత్రమే చెల్లిందేమో!

ప్రాంతాలను బట్టి కూడా భాష అనేక రూపాంతరాలు చెందుతుంది. ఉదాహరణకు రాయలసీమలో ‘మణి ఎంత’ అంటారు. అంటే టైమెంత అని అర్ధం. మణి అనేది తమిళపదం. అలాగే చిన్నాన్న, చిన్నమ్మలను సిత్తి, సిత్తయ్య అని కొన్ని చోట్ల అంటారు. సిత్తిసిత్తయ్య అనేవి కన్నడభాషా పదాలు. కన్నడం నుంచి వచ్చి చేరిన మరిన్ని పదాలు – హుటా, హుటి, హేమా, హేమీలు, హోరా, హోరీలు. అల్మార, అనాస, బొప్పాయి, బాల్చీ, కమీజు, ఇస్త్రీ, మేస్త్రీ వంటివి పోర్చుగీసు నుంచి వచ్చి చేరిన పదాలు.

మనం రోజు తినే ఇడ్లీ, దోశె, వడ, సాంబారు కూడా అరువు తెచ్చుకున్నవే. పెరుగువడ దహీవడగా మారడానికి ఎంత సమయం పడుతుంది మీరే చెప్పండి. కాకపోతే మాండలికాలు తెలుగు పదసంపద పెంచడానికి దోహదపడ్డాయనటంలో సందేహంలేదు. వాడుక భాషలో క్రమేణా ఏర్పడుతున్న మార్పులు నేడు అదే అసలైన, సిసలైన భాషగా చెలామణీ అవడానికి తోడ్పడుతున్నాయి. మదర్ టంగ్ ఈ ఆంగ్లపదాన్ని తెనుగీకరించి మాతృభాష అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇది సంస్కృత పదం అని మనకి ఎక్కడా అన్పించదు. తెలుగులో చెప్పాల్సి వస్తే ‘అమ్మమాట’ అనాలి. కానీ అలాఅంటే, అమ్మ చెప్పిన మాటగా నేడు మనం అర్ధం చేసుకుంటాం తప్పిస్తే, మాతృభాష అని అనుకోం.

ఇక రెండు భాషల కలయికతో ఉద్భవించి, తెలుగుగా ఆంధ్రదేశాన చెలామణీ అవుతున్న సంకరజాతి పదాలు కోకొల్లలు. కచ్చారోడ్డు, పక్కారోడ్డు – ఉర్దూ, ఇంగ్లీషుల మేలికలయిక. వ్యవసాయదారు – ఇది సంస్కృత, పారశీల జోడి. భీమా కంపెనీ – పారశీ లేదా సంస్కృతం ఈ రెండు భాషల్లోనూ భీమ అంటే భయం – ఇంగ్లీషు, రైతాంగం – అరబిక్ , సంస్కృతం.

అసలు అర్ధాన్ని పోగోట్టుకొని, కొత్తవిగా చెలామణీ అవుతున్నా పదాలు కూడా మన తెలుగులో అనేకం. ఉదాహరణకు చెంబు అంటే ఎర్రని రాగితో చేసిన పాత్ర అని అర్ధం. కానీ నేడు మనకి, ఇత్తడి చెంబు, ప్లాస్టిక్ చెంబు, స్టీలు చెంబు, ఇవనే ఏమిటి ఆఖరికి ‘రాగి చెంబు’ కూడా ఉన్నాయి. భోజనం అంటే భుజించేది అని అర్ధం కానీ నేడు దీన్ని మనం అన్నం తినడంగా నిర్ధారించేశాం. కోక అంటే మనకు తెలిసిన అర్ధం చీర. మరి శ్రీనాథుడంతటివాడు, ‘కొల్లాయి గట్టితి కోక చుట్టితి’ అన్నాడే! పూర్వం కోక అంటే వస్త్రం అని అర్ధం. అది చీర కావచ్చు, ధోవతి కావచ్చు మరేదైనా కావచ్చు. ఇలా రూపాంతరం చెందిన మరికొన్ని పదాలు చూడండి. ముష్టికి అసలు అర్ధం పిడికిలి, చాంధసుడు, చాదస్తుడు – చంధస్సు బాగా తెలిసినవాడు, ఫలహారం – పండ్లతో కూడిన ఆహారం, ఆగ్రహం – పట్టుదల, సభికులు – జూదం ఆడేవాళ్లు, ముహుర్తం – 12 క్షణాలు. కరుణశ్రీ ఒక పద్యంలో ‘ప్రతి తల్లి మన చిన్నప్పుడు పాకీదే కదా’ అంటారు. పాకీ అంటే అసలైన అర్ధం పవిత్రమైన.

ఇలా చెప్పుకుంటూ పోతే, అనేకానేక మార్పులు తర,తరాలుగా తెలుగు భాషలో వచ్చి ఉంటాయి. కాని వీటిని అడ్డం పెట్టుకొని, నేడు తెలుగుని ‘తెగులు’గా చూస్తే అంతకంటే పొరపొటు మరొకటి ఉండదు. భౌతిక, సామాజిక మార్పులకునుగుణంగా కొత్త పొంతలు తొక్కుతున్న భాషను వృద్ధిచేయటం, పరిరక్షించటం మనలోని ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకానీ, అమ్మమాట నేర్చుకుంటే అక్కరకు రాదని, పాశ్చాత్యమే పరమాన్నమనుకుని ఎండమావుల వెంట పరుగులిడితే, శతాబ్ధాల ఘన చరిత్రగల మన భాష మరుగున పడిపోక మానదు. పురాతన వస్తు పరిశోధన తవ్వకాలకి పరిమితం కాకమానదు. అందుకు మనం కూడా బాధ్యులమే అవుతామన్నది నేటి నిజం!

సౌమ్యశ్రీ రాళ్లభండి

One thought on “తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?”

  1. ‘తేటగీతి’ తేటతెల్లంగా ఉన్నది. భాషను కాపాడుకోవడం తెలుగువారి కర్తవ్యం. నానాటికి భాషను వికృతపరుస్తున్నారు. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు కానీ, మాతృ భాషను మరిచి ఆంగ్లమే జీవితంగా పరిగణించడం శోచనీయం. మరీ చిత్రసీమలోని భాషైతే ప్రమాధికారిగా మారుతోన్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మాతృ భాష కూడా పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదనిపిస్తున్నది. కరుణశ్రీ జంధ్యాల వారు ఓ పద్యంలో తల్లి చిన్నప్పుడు అందరికీ ‘పాకీదే’ అన్న వివరణ మాత్రం నవ్వును పుట్టించింది. ఈ అచ్చ తెలుగు పదం ఇప్పుడు గనుక పొరపాటున ఉపయోగిస్తే న్యాయస్థానాలు చుట్టూ తిరగక తప్పదు కాబోలు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *