చాటువులు

చాటువులు విజ్ఞానానికి, వినోదానికి, ధారణకు, ఆటపట్టువంటివి. అలంకారికులు చెప్పిన ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతం మాట తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం. శ్రీ కోట్ర శ్యామల కామశాస్త్రిగారు తమ ‘ఆంధ్రవాచస్సత్వం’లో అప్పుడప్పుడు కవి ఆశువుగా చెప్పిన పద్యములు అనే అర్ధమిచ్చారు.

ఉబికి వచ్చిన భావాన్ని పద్యం మలచి చిమ్మి చేయడమే తప్ప ఇతరేతరమైన, ఏ నియమనిబంధనలకు ఒదగనిది చాటుపద్యం. సామెతకు ఉన్న సంక్షిప్తత, సూటిదనం, జనప్రియత్వం, స్ఫుర్తి, నిష్ప్రయత్నంగా, ప్రాచుర్యాన్ని సంపాదించుకునే శక్తి చాటు పద్యానికి ఉంటాయి.

‘చాటుపద్యమిలను చాలాదాయొక్కటి’ అని వేమన అన్నట్లుగా చాటు పద్యం ఎప్పటికైనా అందంగానే ఉంటుంది. కొడిగట్టిన చాటు దీపాలను వెలికి తెచ్చి, చాటు వాఙ్మయంపై పరిశోధన చేసిన వారిలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి ‘చాటు పద్య మణిమంజరి’, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి ‘చాటుపద్య రత్నావళి’ ప్రశస్తమైన గ్రంధాలు.

రామాయణావతరణానికి దారితీసిన ‘మానిషాద’ శ్లోకము చాటువే. క్రౌంచపక్షి పతనాన్ని చూసిన వాల్మీకి గుండె ఆక్రోశించింది. ఆ శోకం శ్లోకంగా అవతరించింది.

చాటుపద్యాలను ఏ కవి కర్తృత్వం అని నిర్ణయించటం కష్టము. కొన్నిసార్లు పద్యం ప్రజల నాల్కలపై నాట్యమాడినా కవిపేరు మరుగున పడిపోవడం జరుగుతుంది. చాటు రచనలో శ్రీనాథునికి మించిన వాడు లేడని ప్రతీతి. ఇతని చాటువులు తెలియని వారు సాహిత్య కులంలో ఉండరు.

‘‘సిరిగల వానికి చెల్లును
తరుణుల బదునారు వేలం దగ బెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా! గంగను విడుము పార్వతిచాలున్!’’

అని హరిహరుల గుట్టు బయట పెట్టెను. పలనాటి ప్రాంతమున శ్రీనాథుడు సంచరిస్తున్నప్పుడు దప్పికతో నీరు దొరకక పలనాటి నీటి ఎద్దడిని వ్యంగ్యంగా చిత్రీకరించిన పద్యమిది.

సిరి ఉన్న శ్రీకృష్ణనకు 16వేలమంది స్త్రీలను చేసుకోవడానికి సాధ్యమవుతుంది. బిచ్చమెత్తుకొని తిరిగే నీకిద్దరు ఎందుకు పార్వతినుంచుకొని గంగను వదిలేయమని అని అనడంలోని హాస్య చాతుర్యం ఆనందకరమైనది. శ్రీనాథుని చాటువుల వలన ఆయన జీవితవిశేషాలనెన్నింటినో తెలుపుతున్నవి. శ్రీనాథుడు దేశయాటన చేస్తూ పలుప్రాంతాలను సందర్శించాడు. కన్నడ, తమిళ, తెలుగు ప్రజల జీవిత వృత్తాలనీడలు ఆయన చాటు పద్యదర్పణాలలో లీలగా కన్పిస్తాయి. శ్రీనాథుని చాటువులలో ఆయనను ఆదరించిన మంత్రుల, దండనాథులు, బంధువులు, శిష్యులు, సామాన్యులు, పల్లెలు, పట్టణాలు, గుళ్లు గోపురాలు, వెలయాలు, సంతలు మొదలైనవెన్నో ఆయన చాటువులలో దర్శనమిస్తాయి.

శ్రీనాథుని ఆత్మవిశ్వాసాన్ని ఆయన భిషణాహూంకృతిని సాక్షాత్కరింప చేసుకోవడానికి ఒక చాటుపద్యం చూస్తే తెలుస్తుంది.

రెడ్డిరాజులంరతించి వడ్డిరాజుల కాలం వచ్చింది. వారు శ్రీనాథ మహాకవి విలువను గుర్తించలేదు. భోగవిలాసాలలో నిద్వద్గోష్టులలో జీవితం గడిపిన మహాకవిది వడ్డిరాజుల కాలంలో చరమదశ. ఆ దశలో ఆయన శృంఖలాబద్ధుడై వీపున బండమోస్తూ, అపార కవితా సంపదను తెలుగు ప్రజలకందిచ్చి దివంగతుడైనాడు. ఆ స్థితిలో కూడా ఆయన ఆత్మవిశ్వాసం సడలలేదు. ప్రతిభ పోలేదు. తాను స్వర్గానికి పోతే అక్కడి కవివరుని స్థానం తాను ఆశ్రయిస్తాడుట. దేవతల కవివరుడు బృహస్పతి గుండెలు గుబగుబలాడుతున్నాయిట, శ్రీనాథుడొస్తే తన పదవి గతేమిటని.

‘‘ కవిరాజు కంఠంబు కౌగలించెనుగదా
పురవీధినెదురెండ పొగడదండ
సార్వభౌముని భుజ స్తంభమెక్కెను గదా
నగర వాకిట నుండ నల్లగుండు
ఆంధ్ర నైషధకర్త మంష్రియుగ్మమ్మున
దగరి యుండెనుగదా నిగళయుగము
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజాత
వియ్యమందెను గదా వెదురుగొడియ
కృష్ణవేణమ్మ గొనిపోయెనింత ఫలము
బిలబిలాక్షులు దినిపోయె తిలలు పెసలు
బొడ్డుపల్లెను గొడ్డారిమోసపోతి
ఎట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు
దివజ కవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి’’

ముక్తకాలైన చాటువుల్లో అనేక శాస్త్రసంపద ఉన్నది. మహాకవులు తమ కావ్యాలలో చెప్పలేనివి కొన్ని ఉంటాయి. మహాకావ్యాల రచనలో కొన్ని ఔచిత్యాలను పరిమితులను పాటించవల్సివస్తుంది. కాని చాటువులలో ఈ విషయాలు అడ్డమురావు కనుక ప్రతిభ చిమ్ముకొస్తుంది.

వెలయాలు, శిశువల్లుడు
నిలమేలిక, యాచకుండు నేగురుధరలో
గలిమిము, లేమిము, దృపరు
కలియుగము నంగీర్తికామ! కాటయవేమా!

కాటయవేముని సంభోధిస్తూ, కీర్తిస్తూ ఎవరోకవి చెప్పిన పద్యమిది. ధర్మబోధ, సంతానం పట్ల వాత్సల్యం, పౌరుషహీనమైన సంపాదన పట్ల అసహ్యభావం, విచక్షణ, పేదరికాలు కలసివుండననే యధార్ధ్యం, రాచరికంలోని నిష్టురత్వం వీటనన్నింటిని ఈ పద్యంలో కళ్లకు కట్టినట్లు చూపినాడు కవి.

వెలయాలు, శిశువు, అల్లుడు, రాజు, యాచకులకు ఇచ్చేవాడి కలిమయిలేములతో పనిలేదు. అవివాళ్ల తలపునకే రావు. ఇవన్నీ నిత్యసత్యాలు. అందుకనే చాటూక్తి ఒక సూక్తి.

చాటుపద్యాల వీధుల్లో మనం పచార్లు చేస్తుంటే అడుగడుగునా పురాణేతిహాసాల్లోని కథలు, సన్నివేశాలు, వ్యక్తిత్వాలు మనలకు పలకరిస్తాయి.

అన్నాతి గూడ హరుడగు
అన్నాతి గూడకున్న నసురగురుడౌ
అన్నా! తిరుమలరాయా
కన్నొక్కటిలేదు కాని కౌరవపతివే!

తిరుమలరాయలకే రాజు రామలింగని పిలిచే తనను పొగడనున్నాడట. ఆ పొగడ్త సహజంగా ఉండాలని, గోరంతదాన్ని కొంతంత చేసి చెప్పకాడదన్నాడట. ఆ రాజు ఒంటికంటివాడు సహజంగానే వర్ణిస్తే భీభత్సంగా ఉంటుంది. మహా కవులకు సాధ్యం కానిదేముంది?

శివునికి మూడు కన్నులు. తిరుమలరాయుడు భార్యతో కలిసి ఉన్నప్పుడు శివుడు. భార్య లేనప్పుడు శుక్రాచార్యుడు. ఆ కన్ను కూడా లేకపోతే నీవు ధృతరాష్ట్రుడవే అని ఎంత నేర్పుగా చమత్కరించినాడు.

మహాకావ్యాల్లో ఇలాంటి పద్యాలు అరుదుగా కన్పిస్తాయి. చాటువుల్లోనే ఇవి ఎక్కువుగా కన్పిస్తాయి. ‘‘సరసిజనేత్రా శ్రీవిభుని చారు తరంబగు పేరు చెప్పుమా; అరయగ నీవు నన్నడుగు నాతని పెరిదె చిత్తగింపుమా; బిరుదుగా వ్రాయగ నడిమి యక్కరముల్ గణుతింపబేరగున్; పద్మాక్షీ నీభర్త అందమైన పేరు చెప్పవా; తెలుసుకోవడానికి నన్ను నీవడుగు, ఆయన పేరిదే చిత్తగించు.’’

‘కరి – సారంగం (ఏనుగు), వారిరాశి – సాగరం, హరు కార్ముకము – పినాకం, శరము – సాయకం (బాణం), అద్దం – మకురం, శుకము – చిలుక.’

పై ఆరు పదాల్లోని నడిమి అక్షరాలను కలిపితే ‘రంగనాయకులు’ అవుతుంది. ఆ సుందరాంగి భర్తపేరు రంగనాయకులు అని ఎంత సుందరంగా చెప్పింది.

ఈ విధంగా చూస్తూపోతే ఎన్నో వందల చాటు పద్యలు తెలుగులో ఉన్నాయి.

దేవులపల్లి శేష భార్గవి

2 thoughts on “చాటువులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *