గాలి – నీరు – శబ్దము

రచయిత: ఎన్ తారక రామారావు

‘‘డాక్టరుగారు! మా బాబుని చూడండి ఎలాగైనాడో?’’

డాక్టరు విశ్వరూపం బాబుని చూశాడు. అతని తల్లి భూదేవి ఆత్రుత, ఆందోళన గమనించాడు.

‘‘అసలేం జరిగింది?’’

‘‘బాబుకు నీళ్లుపోశాను. పౌడరద్దాను. లాగు చొక్కా వేశాను. కాళ్లకు సాక్స్ తొడిగాను. బూట్లు వేశాను!’’

‘‘ఊ! తర్వాత?’’

‘‘ఆడుకో బాబూ అని పంపాను!’’

‘‘ఎక్కడకూ?’’

‘‘సుందర నందనోద్యానవనానికి.’’

సుందర నందనోద్యానవనము! ప్రాతఃకాలం! సూర్యుని లేత బంగారు కిరణాలు చెట్ల మీద, విరసిన మొగ్గల మీది మంచుబిందువుల మీద, ఎగిరే పంచెవన్నెల సీతాకోకచిలుకల మీద, ఆకులో ఆకుగా, పూవులో పూవుగా వున్న చిరు రెమ్మల పైన ఆకుపచ్చని చీర ధరించిన నేల మీద పడుతున్నాయి.

బాబు ముద్దుగా ఉన్నాడు అనడం కంటే అప్పుడే పూచిన మల్లెపూవ్వులా ఉన్నాడు అనడం సబబు. అడుగులో అడుగు వేసుకుంటూ, ప్రకృతి ఒడిలో అందాల పాప – ఆ బాబు!
నల్లని మేఘం లాగా, పొగ – ఫ్యాక్టరీ గొట్టాల నుంచి, యంత్రాల నుంచీ, మోటారు వాహనాల నుంచీ కాదు! యావత్ నాగరికతా ప్రపంచం నుంచీ …. పొగ, దుమ్ము, ధూళి ప్రకృతి అంతా వ్యాపించింది.

బాబును సుడిగాలిలా, పెనుతుఫానులా పొగ చుట్టేసుకుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు, వాటిని ప్రసాదించిన తల్లి, తండ్రీ అయిన ప్రకృతి కూడా కారు నలుపులా, కేన్సర్ రోగిలా అయిపోయినాయి. ఇక బాబు సంగతి వేరే చెప్పాలా!

‘‘ఊ తర్వాత.’’

‘‘బాబు నల్లగా అయిపొయ్యాడు. డాక్టర్! ఆ నలుపు తాత్కాలికమేనని, బాబుని ఊరు దగ్గరలోగల పుణ్యనది దగ్గర ఆడుకోమని పంపాను!’’

‘‘ఏమైంది?’’

అది పుణ్యనది. శంభుని శిరంబు నుండి, హిమాచలం మీదకు వచ్చి, కన్నెపిల్లగా పెరిగి, భగీరథుని వెంట, ఎండి బీటలు వారిన భూమాత ఆర్తిని తీర్చేందుకు, సకల జనావళికి భోగభాగ్యాలు, ధనధాన్యాలు ఇచ్చేందుకు అవతరించిన పుణ్యనది. ఆ నదిలో ఎందరో పునీతులయ్యారు! వేదంలా ఆ నది భూతకానం నుంచి భవిష్యత్తులోకి ప్రవహిస్తున్నది.

బాబు ఆ నదీ జలాలను చూచి, బంగారు రజనులా ఉన్న ఇక రేణువులను చూచి సంతోషపడ్డాడు. ఆశగా, ఆబగా, ఆ అమృతాన్ని తనివితీరా త్రాగాలని ముందుకెళ్ళాడు.
దోసెడు నీటిలో …. మరకలు, మాలిన్యాలు… పురుగులు, శవాలు, మలం, మూత్రం ఒకటేమిటి … ఎన్నో.. ఆ నీరు త్రాగిన బాబు???

‘‘జ్వరమైంది! ఆ తర్వాత?’’

డాక్టర్ గారు! నా బాబు ఆడుకునేందుకు, పాడుకునేందుకు ఈ భూమ్మీద చోటే దొరక్క…’’ భూదేవి గొదు గద్గదమైంది.

‘‘చెప్పమ్మా…’’

‘‘బాబును ఇల్లు కదలొద్దురా అని చెప్పాను … కానీ…’’ భూదేవి మొహం బాధతో, నిస్సహాయతతో ఉంది.

‘‘కానీ గదిలో ఒంటరిగా క్షణం ఉన్నాడో, లేదో వాడికేం వినపడం లేదని గ్రహించాను.’’

‘‘ఎందువల్లో గుర్తించావా అమ్మా?’’

‘‘తెలియదు.’’

‘‘నిశ్శబ్దాన్ని మించిన సంగీతం లేదని సామెత! ఆధునిక ప్రపంచంలో నిశ్శబ్దం కరువైంది! మోత… యంత్రాలు! ఫ్యాక్టరీలు … విమానాలు… అరుపులు… ఆందోళనలు… ఉపన్యాసాలు… ఒహ్!’’

‘‘డాక్టర్ గారూ మా బాబు … చూడండి ఎలా అయినాడో… జుత్తు నెరసింది! కళ్లకు అద్దాలొచ్చాయి. పళ్ళు ఊడిపోయ్యాయి! నడిచేందుకు కర్ర ఊతం కావాలి! తింటే అరగదు! జబ్బు! వీటిలతో అరవైయేళ్ల వాడిలా అయ్యాడు… వీడికి విముక్తి లేదా డాక్టర్?’’

ఆ తల్లి వేసిన ప్రశ్నలో… కోట్లాది మానవుల ఆక్రందన, ఆందోళన, ఆవేదనా ఉన్నాయి కానీ! ఏదీ జవాబు

డాక్టర్ విశ్వరూపం తలొంచుకున్నాడు.

(అర్ధానుస్వారం – కథల సంపుటి నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *