
రచన: కొడవటిగంటి కుటుంబరావు
ఆరోజు పంతులు మాకయిదు లెక్కలిచ్చాడు. అయిదింటికి అయిదు మార్కులూ తెచ్చుకున్నాను… మర్నాడు మళ్ళీ మామూలే.
ఆరోజు మాఅమ్మా నాన్నా పోట్లాడుకోలేదు. మా అమ్మ చెప్పిందల్లా మా నాన్న ఒప్పుకున్నాడు. ఆయన చెప్పిందల్లా ఆవిడ ఒప్పుకుంది. మా కొంప నెవరో మంత్రించినట్టయింది…. తరవాత మళ్లీ యథాప్రకారమే.
జీవితం ఈ విధంగా ఒక చిన్న వెలుగు వెలిగి వెంటనే ఎందుకు కొడారి పోతుందో తెలిసేది కాదు.
ఇదంతా దేవుడిచేసే పరీక్ష అనుకునేవాణ్ణి…
ప్రెస్సుకు కొత్తటయిపు తెప్పించాం. అచ్చగా దాంతోనే కొంత మేటరు కంపోజు చేయించాం. ప్రూఫులు చూస్తుంటే మా ప్రింటింగూ బాగున్నట్టే తోచింది. ఎప్పుడూ మా ప్రింటింగు అట్లాగే ఉండకూడదూ?…. ఎప్పుడూ కొత్త టైపే వాడుతుంటే ఎందుకుండదూ? అయితే మరి, ఈ కొత్త టైపు పూర్తిగా అరిగితేగాని ఇందులోంచి మళ్ళీ కొత్త టైపుకు డబ్బురాదాయె!
విషమ సమస్యగా కనిపించింది….
వాళ్ల అల్లుడు ఆరు నెల్లకోసారి పెళ్ళాన్ని అత్తవారింట దిగవిడిచి తనకు అయిదొందలిస్తేగాని మళ్ళీ తీసుకుపోడు. వాళ్ళిట్లాగే ఇస్తున్నారు… కానీ ఎంత కాలమిస్తారు?
బాగా కలవాడు. అన్నదమ్ములులేరు. ఒకడే కొడుకు. ఒకత్తే కూతురు. హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చొనే పరిస్థితి. మూడు తరాలు వెళ్లిపోతై, నందోరాజా భవిష్యతి… ఆయన కొడుకు నాతోపాటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఉద్యోగం పోతే వీధిలో నిలబడవలసిందే!… ఏమిటి కర్మ?
‘‘ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండగలందులకే మన పూర్వీకులు వర్ణ వ్యవస్థ తెచ్చి పెట్టారు. అందరకీ పనులు చూపించారు. తురకలూ, పాశ్చాత్యులు రావటంతో అంతా పాడయిపోయింది. వాళ్ళని బయటికి పంపించు. అంతా చక్కబడుతుంది’’ అన్నాడొక హిందు మహాసభ మనిషి.
నమ్మకం చిక్కలేదు.
డై కాస్టింగ్ యంత్రంముందు నిలబడ్డాను. పూర్తిగా అరగంటసేపు నడిపించిన మీదట యంత్రం సరిగా పని చెయ్యటం ప్రారంభించింది. అచ్చులు నున్నగా, నిగనిగలాడుతూ, పొట్టలూ, మట్టలూ లేకుండా రాసాగినై.
‘‘ఆహా, ఈ విధంగా యంత్రం రోజల్లా పనిచెయ్యగూడదూ?’’ అన్నాడు. పని చేసే కుర్రాడు అచ్చుల్ని ప్రేమతో చూసుకుంటూ.
నాకా ప్రశ్నకు సమాధానం తెలిసింది!
‘‘అసంభవం’’ అన్నాను.
‘‘ఏం?’’ అన్నాడు.
‘‘బాగా రాకుండా పోవడానికి కారణం ఇప్పుడు మంచి అచ్చులు రావటంలోనే ఉంది.’’ అన్నాను.
వాడు నా మాట నమ్మలేకపోయినాడు.
‘‘చూడు. బాగా వస్తున్నంత సేపు అచ్చులు గబాగబా లాగేస్తావు. లాగిన కొద్దీ నీ తొట్టిలో ఉన్న లోహం తగ్గిపోతుంది. అందుకని కొత్త లోహపు దిమ్మెలు వేస్తావు. తొట్టి చల్లబడుతుంది. నీ అచ్చులు సరిగారావు. అదీగాక, నీరై క్రమంగా వేడెక్కుతుంది. దాన్ని తగినంత చల్లబడేస్తేగాని అచ్చులు సరిగా రావు.’’
‘‘తొట్టి ఎంత వేడిగా ఉండాలో, డై ఎంత చల్లగా ఉండాలో తెలిస్తే అచ్చులు బాగా వస్తాయోమో?’’ అన్నాడు మా వాడు.
‘‘అంతేకాదు. తొట్టి ఏ వేగాన ఖాళీ అవుతుందో, డై ఏవేగాన వేడెక్కుతుందో తెలిసి, దానికి ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్స చెయ్యగలిగితే తియ్యకుండా మంచి అచ్చులు వస్తా’’యని చెప్పాను.
సంఘంలో మటుకు ఇంతేకాదా? ఒక వ్యక్తిగాని, వ్యక్తుల సముదాయం గాన శాశ్వతంగా సుఖంగా ఉండటానికి సులువుగా పద్దతులెక్కడున్నై?
ధనికుల సంతతి ధనికులగానే ఉండగలందులకు వారసత్వం పెట్టారు. ఏమవుతున్నది? లక్షధాకారికి కాలక్రమాన లక్షమంది వారసులవుతున్నారు. దీన్ని కూడా తప్పించుకుందామని రాజరికాలకి ఒకడే వారసుణ్ణి పెట్టారు. ఈ సులువు మార్గం పనిచేసి తీరాలి! పనిచేసిందా? ఆ సులువు మార్గం మూలంగానే రాజరికం సంఘానికి అనర్హంగా తయారయింది – వాళ్ళ అల్లుడు వాళ్ళమ్మాయికి ఆనందం ఇవ్వడానికి అనర్హుడయినట్టుగానే.
మార్పు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా, దానిక అనుగుణమైన మనుష్య ప్రయత్నం చేయ్యకుండా, ఏదో ఒ మంచి జాగా చూసుకుని ‘‘అమ్మయ్య!’’ అని చతికిలబడి ఆమీదట శాశ్వతమైన ఆనందం పొందుదామని మానవుడు చేసే ప్రయత్నాలు భరించడానికి వీల్లేదు. పరిణామస్వరూపుడైన భగవంతుడామోదించడు. అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళమీదికి సంఘాన్ని లేవదీస్తాడు.
(ప్రథమ ముద్రణ: ఆగష్టు 1945, ఆంధ్రజ్యోతి మాసపత్రిక)