అన్నమయ్య-వేమన పదాలలో అభ్యుదయం

సాహిత్యం సామాజిక స్థితిగతులకు ప్రతిబింబం. ప్రతి రచయిత తాను జీవించిన సమాజ వ్యవస్థను తన రచనలలో పొందుపర్చి ముందు తరాల వారికి అందజేయటం సర్వసాధారణం. శ్లోకం, పద్యం, గేయం, కథ, కీర్తన, పురాణం, ఇతిహాసం సాహిత్యం ఏ రూపంలో ఉన్నా ఆయా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. రచయిత సామాజిక, మానసిక వికాసాన్ని పెంపొందించే ధర్మ, నీతి సూక్తులను అందు నిక్షేపిస్తారు. విశ్వశ్రేయస్సును కోరేదే కావ్యం. అట్టి కావ్యం ‘సూక్తి’ అనగా ‘మంచిమాట’ లను ప్రజలకు అందించి వారి మానసిక వికాసానికి తోడ్పడుతుంది. అలా సులువైన పదాలలో నీతిని, ధర్మాన్ని బోధించిన శతకకర్త వేమన.

అల్పుడెపుడు పల్కునాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ

సామాజిక విశ్లేషణతో నగ్నసత్యాలను మనసుకు హత్తుకునే విధంగా చెప్పి, మనిషి సత్ప్రవర్తనకు దోహదపడే 17వ శతాబ్దనాటి వేమన శతకం నిత్యపారాయణం. అంతకు రెండు శతాబ్ధాల ముందే వేంకటేశ్వరుని మీద సంకీర్తనలు రచించిన అన్నమయ్య కూడా ఆ కాలంనాటి సామాజిక రుగ్మతలను తన కీర్తనలలో ఎండగట్టడమే కాక ముక్తిమార్గానికి మూలమైన ధర్మార్ధకామమోక్షాలను విశ్వశ్రేయోదాయకమైన సూక్తులను తన కీర్తనలో పొందుపర్చి ప్రజలకు అందించాడు. తరచి చూస్తే వేమన, అన్నమయ్య వీరిరువురు చెప్పిన సూక్తులో మనకు ఎంతో సామీప్యం కన్పిస్తుంది.

ఆసవిడిచినఁగాని యధికసుఖము లేదు
యీసు విడిచినఁగాని యిహము లేదు
వాసి విడిచినఁగాని వైపగు విరతి లేదు
వాసుదేవభక్తిఁగాని వరముక్తిలేదు

అనువుకాని చోట నధికుల మనరాదు
కొంచెముండు టెల్ల కొదువకాదు
కొండ యద్దముందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినురవేమ

సంసారజంజాటంలో పడి కొట్టుమిట్టాడే పామరులు ఆశ అనే గాలానికి చిక్కుకొని కష్టాలపాలవుతారనే ఉద్దేశాన్ని వేమన, అన్నమయ్య తమ పదాల ద్వారా ప్రజలకు అవగతం చేశారు. ’నీరులోపలి మీను నిగిడి యామిషముకై, కోరి గాలము మ్రింగి కూలబడినట్లు‘ నశిస్తారని అన్నమయ్య అంటే, వేమన ఇదే భావనని ఈ కిందివిధంగా తెలిపాడు.

నీళ్లలోని చేప నెరిమాంస మాశకు
గాలమందు చిక్కి కూలినట్లు
ఆశబుట్టి మనుజుడేరీతి చెడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ

వేంకటేశ్వరునిపై సంకీర్తనలందించిన అన్నమయ్యను కేవలం ఒక వాగ్గేయకారునిగా తలిస్తే తప్పే అవుతుంది. భక్తి, ముక్తి మార్గాలనే కాదు తన కీర్తనలలో సామాజిక రుగ్మతలను చూపి జ్ఞానమార్గాన్ని కూడా ప్రజలకు చూపాడు. సమాజంలో పేర్కోనిపోయిన కులజాడ్యాన్ని కడిగి ఆధునిక అభ్యుదయ కవులకు మార్గదర్శకుడైనాడు.

నిండార రాజూ నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే
చండాలుడుండేటి సరి భూమి యొకటే

కందువగు హీనాధికము లిందులేవు
అందరికి శ్రీ హరే అంతరాత్మా
ఇందులో జంతుకుల మింతా ఒకటే
అందరికి శ్రీ హరే అంతరాత్మా

అంటూ మనుష్యులలో తారతమ్యాలు లేవని, ఏ కులమయినా, మతమయినా మనుష్యులంతా ఒక్కటే అనే సర్వమత సౌభ్రాత్త్వాన్ని నాడే చాటిచెప్పాడు అన్నమయ్య. ఇదే భావనతో రెండు దశాబ్ధాలనంతరం వేమన మరోసారి తన శతకపద్యాల ద్వారా ప్రజలను జాగృతపర్చాడు.

మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వదాభిరామ! వినురవేమ!

కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు
కాశీ కరుగఁ బంది గజము కాదు
వేరుజాతి వాడు విప్రుండు కాలేడు
విశ్వదాభిరామ! వినురవేమ!

కుల,మతరహిత వ్యవస్థను అకాంక్షిస్తూ అన్నమయ్య, వేమన ఇద్దరు పదాలల్లారు. జాతులు, కులాలు మనుష్యులు ఏర్పరుచుకున్న తొడుగులని, అవి అశాశ్వతమని, పరిశుద్ధమైన ఆత్మే ప్రధానమని ఇద్దరు పదకర్తలు ఉద్భోదించారు.

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు
సానుజాతమయ్యె సకల కులము
హెచ్చు తగ్గు మాటల లెట్లెరుంగగవచ్చ
విశ్వదాభిరామ వినుర వేమ

అలాగే ఒక దేశం ప్రగతిపథాన నడవాలంటే వివేకవంతుడైన నాయకుడుండాలని, డబ్బు, అధికారంతో మూర్ఖుడు రాజుకాగలడేమో కాని, నాయకుడు కాలేడని అధికార వ్యవస్థపై –

అల్పజాతివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ

పుడమి నుప్పరంబు పురికొల్పి జగముల
రక్షసేయగల్గు రాజులెవరు
మహిపతి యను పేరు మనుజున కేడదో
విశ్వదాభిరామ వినురవేమ

అంటూ వేమన చురకలు వేస్తే, మనషిని నమ్ముకుని, వేడుకొని మోసపోవటం కంటే అడవిలో మానుగా పుట్టటం మేలని, అధికార ప్రాపకాన్ని పొందాలనకునే వారిని నిరసిస్తూ, ప్రభోదాత్మకమైన కీర్తనలు రచించాడు అన్నమయ్య.

ఏలికను దైవముగా నెంచి కొల్చువాఁడేబంటు
తాలిమి గలిగిన యాతఁడే బంటు
పాలుమాలక యేపొద్దు పనిసేయువాడే బంటు
వేళ గాచుకువుండేటి వెరవరే బంటు
తను మనోవంచనలెంతటా లేనివాఁడేబంటు
ధనమునట్టున శుద్ధాత్మకుఁడే బంటు
అనిశము నెదురు మాటాడనివాఁడే బంటు
అనిమొనఁదిరుగనియతఁడే బంటు
చెప్పినట్లనే నడచిన యాతడేఁ బంటు
తప్పులేక హితుఁడైనాతఁడే బంటు
మెప్పించుక విశ్వాసాన మెలగువాఁడే బంటు
యెప్పుడును ద్రోహిగాని హితుఁడే బంటు
అక్కర కలిగి కడు నాప్తుడైనవాఁడే బంటు
యెక్కడా విడిచిపోని యిష్టుఁడే బంటు
తక్కక రహస్యములు దాఁచినవాడే బంటు
కక్కసీఁడుగాక బత్తిగలవాఁడే బంటు
కాని పనులకు లోనుగానివాఁడే బంటు

పుట్టుకతోనే ఎవరు బ్రహ్మజ్ఞానం పొందలేరని, మనిషి ప్రవర్తన, మంచి గుణాల వల్లనే అతనికి, అతని వంశానికి, పేరు ప్రతిష్టలు వస్తాయే తప్ప జాతి, కులం మనిషి ఉనికికి నిదర్శనాలు కావని, జాతివిధ్వేషాలను వేమన, అన్నమయ్య గర్హించారు. ఇదే విషయాన్ని తమ కీర్తనలలో, పద్యాలలో ఒద్దికా పొందుపర్చారు.

తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను
యిల్లిదె నట్టనడుమ నింతేసి మెరసీ

పుట్టినప్పుడే దేహి బుద్ధులేమీ నెఱఁగఁడు
యిట్టె లోకులఁ జూచి యింత నేరిచె
ముట్టుకొన్న యింద్రియాల ముదిసి ముదిసి రాఁగా
తట్టువడి తనమేను తానే మరచె

మనుజుఁడైనప్పుడే తా మాటలేమి నెరఁగఁడు
జనులాడుకొనఁగానె సంగడి నేర్చె
దినదినభోగాల దృష్టాంతములెల్ల
అనుభవనై(???) తన కడియాలమాయ

తచ్చి తాఁ గలప్పుడే దైవము నెఱఁగఁడు
నిచ్చ నాచార్యునివల్ల నేఁ డెఱిఁగె
అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతర్యామై యుండి
యిచ్చఁ గరుణించఁగాను యెక్కుడాయఁ దాను

ఇదే భావనలను ప్రతిపాదిస్తూ మంచినడవడిక వల్ల బ్రహ్మజ్ఞానం వస్తుందని నిరూపించాయి ఈ కింది వేమన పద్యాలు.

రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకా
విశ్వదాభిరామ వినురవేమ

పూజకన్న నెంచ బుద్ధిప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ

బ్రహ్మమనగవేరె పరదేశమున లేదు
బ్రహ్మమనగ తానె బట్టబయలు
తన్నుదా నెరిగిన తానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ

పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోగాని పోవనట్టు, పుట్టుకతో వచ్చిన మనిషి గుణగణాలు అంత సులువుగా వీడిపోవు. ఎంత ప్రయత్నించినా మనిషిలోని దుర్లక్షణాలు వీడవని, మనిషిలోని అరిషడ్వర్గాలే అతని పతనానికి హేతువులని అన్నమయ్య, వేమన అభిప్రాయపడ్డారు.

ఎలుకతోలుఁదెచ్చి యేడాది ఉతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొమ్మబొమ్మ దెచ్చి కొట్టినఁబలకునా
విశ్వదాభిరామ వినురవేమ

వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపింజెందబోదు
ఓగునోగెగాక యుచిజ్ఞుడెటులౌను
విశ్వదాభిరామ వినురవేమ

పాలుపంచదార పాపర పండ్లలోఁ
చాలబోసి వండఁచవికి రాదు
కుటిల మానవులకు గుణమేల గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ

ఇదే అభిప్రాయాన్ని మనం అన్నమయ్య పదకవితల్లో చూడవచ్చు.

భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక/ని దియ్యనుండీనా |

పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి నాను
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా||

కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా ||

ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా|

పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా ||

కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా |

వేరులేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా ||

కోపం వల్ల నేరాలు చెప్పటం, పరదూషణ, పరులను హింసించటం, ఇతరులలో దోషాలు ఎన్నటం, సజ్జనులను బాధించటం వంటి ఎనిమిది దోషాలు కలుగుతాయని మనుస్మృతి తెలపుతోంది. క్రోధం మనిషి బుద్ధిని నశింపచేసి పశుప్రవృత్తిని బయలుపరుస్తుంది. కోపం వల్ల కలిగే దోషాలను ఎత్తిచూపుతూ కోపాన్ని వీడాలని అన్నమయ్య, వేమన పలు సూక్తులను తమ పదాల ద్వారా తెలిపారు.

తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్విజనులకెల్ల నుండు దప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ

శాంతమె జనులను జయమునొందించును
శాంతముననె గురుని జాడ తెలియు
శాంతభావ మహిమ జర్చింలేమయా
విశ్వదాభిరామ వినురవేమ

ఇదే భావనను ‘కోపము మానితేను కోటి జపాలు సేయుట’, ‘కోటి చదువఁగవచ్చు కోపము నిలుపఁగరాదు’, ‘కోపము దయ యెఱఁగదు కూటమి సిగ్గెఱఁగదు’, ‘పెదవుల చేటింతే పేదవాని కోపము’, ‘కోపమే కూడుగఁ గుడిచిన యీ బుద్ధి, కోపము విడువుమంటే గుణమేల మాను’,‘వెన్నుకొన్న కోపము విడిచితే మేలు’ ఇలా వేర్వురు కీర్తనలలో అన్నమయ్య బహిర్గతం చేశాడు.

వేమన కేవలం మానవ గుణాలు, సామాజిక స్పృహ కల్గించే సూక్తులే వల్లించాడనుకుంటే పొరపాటే, అన్నమయ్య తన ఆధ్యాత్మిక సంకీర్తనలలో ఏలాగైతే తత్త్వదర్శనము, వేదాంత భావనలు వెదజల్లాడో, వేమన కూడా ఆత్మదర్శనం చేసి యోగి అయ్యాడు.

తానె తత్త్వమనుచు తన్నెరుంగగలేక
మాయ తత్త్వమనుచు మరుగుచుండు
ధర్మ కర్మములను దగరోమ తత్త్వమౌ
విశ్వదాభిరామ వినురవేమ

సుతులు సతులు మాయ సుఖదుఃఖములు మాయ
సంస్కృతియను మాయ జాలిమాయ
మాయబ్రతుకునకనె మాయ గల్పించరా
విశ్వదాభిరామ వినురవేమ

ఆత్మశుద్ధిలేని ఆచారమది యేల, చిత్తశుద్ధిలేని శివపూజయేలరా అన్నా, తనువులోన నున్నతత్త్వంబు దెలియక వేరే యత్రబోవు వెర్రివాడన్నా, దర్శనంబులందు ధరషణ్మతములందు, వర్ణాశ్రమముల వదలకెపుడు తిరుగుచుండువాడు ధరలోన అంధుడన్నా, పుస్తకము సదువ బొందునా మోక్షంబని ప్రశ్నించిటంతో ఆగక,

నీళ్ల మునగనేల నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపల కల్మషములు కడుపులో నుండగా,

అంటూ మనిషిలోని కల్మషభావాలను నిలువుటద్దంలో చూపాడు వేమన. శరీరమనే కుండలో నిక్షిప్తమైయున్న, ‘ఆత్మ కలుషపంక మడుగుబట్ట, తెలిసి విరిచెనేని దివ్యామృతము తేరు’ అని ఉద్భోదచేశాడు. చివరగా, మనిషి తనలోని రజ, సత్త్వ, తమో గుణాలనే త్రిగుణాత్మలను లోబర్చుకున్ననాడు పరబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకొని పరబ్రహ్మ పథాన్ని చేరుకోగలడని ఈ కింది పద్యాల్లో అవగతం చేశాడు.

ఆత్మలోన శివుని ననువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వముక్తుడౌను సర్వంబు దానౌను
విశ్వదాభిరామ వినురవేమ

బ్రహ్మ జంపి విష్ణుభాగంబులో గలిపి
విష్ణుజంపి శివుని వీటగలిపి
శివుని జంపి తాను శివయోగి గావలె
విశ్వదాభిరామ వినురవేమ

‘పాతకపు దేహమిది ప్రకృతి ఆధీనము’, ‘నానాటి బ్రదుకు నాటకము, కానక కన్నది కైవల్యమం’టూ, ‘మూడే మాటలు మూడుమూండ్లు తొమ్మిది, వేడుకొని చదువరో వేదాంత రహస్యమని’ నర్మగర్భంగా తెలియచేస్తూ, ‘దేహము దానస్థిరమట దేహి చిరంతునుఁడౌనట, దేహపు మోహపు సేఁతలు తీరుట లెన్నండొకో’ అన్ని ప్రశ్నించి, ‘పంచమహాభూతములు పంచవన్నెకోకలు, పాపపుణ్యములు రెండు పక్కనున్న చీలల’ని తెలియ చెప్పాడు అన్నమయ్య.

దేహినిత్యుడు దేహము లనిత్యాలు
యిహల నా మనసా యిది మరువకుమీ ||

ముది బాతచీరమాని కొత్త చీరగట్టినట్టు
ముదిమేను మాని దేహముమొగి గొత్తమేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లితని
గదసి యగ్నియు నీరు గాలి జంపగ లేవు ||

ఈతడు నరకు వడ డీతడగ్ని గాలడు
యీతడు నీటమునుగ డీతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండూ చెలియించ డేమిటను
యీతల ననాది యీ తడిరపు గదలడు ||

చేరికానరానివాడు చింతించరానివాడు
భారపు వికారాల పాసిన వాడీ ఆత్మ
ఆరయ శ్రీవేంకటేశునాధీన మీతడని
సారము తెలియుటే సత్యం జ్ఞానము

అభ్యుదయ, మానవతావాదులైన ఈ కవుల భాషలో, భావాల్లోని సామీప్యం ప్రతిపదంలో మనకు గోచరిస్తుంది. వేమన చెప్పిన మాటలు సామంబున సకల వేదసారంబులైతే, వేదంబులు, పౌరాణిక వాదంబులు, కృత సుజనాహ్లాదంబులు అన్నమయ్య పదాలు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *