అన్నమయ్య పదాలలో పురాణాలు

‘‘పురా ఆగతా నాగతౌ అణతి కథయతీతి పురాణం’’ – అంటే జరిగిన దానిని, జరుగుతున్న దానిని తెలిపేది పురాణమని అర్ధం. శ్రీ మద్భాగవతం సృష్టి, విసృష్టి, స్థితి, పాలన, కర్మవాసన మన్వంతరం, ప్రళయం, మోక్షం, హరిసంకీర్తనం, దేవతల వర్ణన, వంటి పదిలక్షణాలు కలిగినది పురాణమని నిర్వచించింది. పురాణాలు ఎప్పుడు, ఎలా పుట్టాయో నిర్ధారించటం కష్టం. అయితే, వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను మానవాళికి అందించాడని విజ్ఞుల అభిప్రాయం. వేదవాఙ్మయాన్ని నిక్షేప్తం చేసుకున్న అనేకా పురాణాల ప్రస్తావన, సూచన అన్నమయ్య తన కీర్తనలలో చేయటమేకాక, పురాణేతిహాసాల సారాన్ని ‘ఎందుఁజూచిన పురాణేతిహాసములు నీ చందమే యధికమని’ తన కీర్తనల ద్వారా చాటాడు.

‘‘శృతులై శాస్త్రములై, పురాణకథలై సుజ్ఞాన సారంబులై
యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్ధంబులై నీతులై
కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళ్ళపాక అన్నమయ్య వచోన్నత క్రియలై చెన్నగున్’’

అన్నమయ్య పదములలో శ్రుతిత్వము, శాస్త్రత్వమే గాక పురాణేతిహాసాల గాధలు కలవని చిన్న తిరుమలయ్య పై పద్యంలో చెప్పాడు. ‘సకల పురాణ రసముల మధురమిది, ఆకుటిలపావనం హరినామ’మని ‘వేద వ్యాసుల చదవిన చదువు’ ‘వేసులుఁ మాకుఁ జెప్పె’, ‘వినరో భాగ్యము విష్ణుకథ…. వదలక వేద వ్యాసుల నుడిగిన’ విష్ణుకథ అంటూ వేదవ్యాసుడు అందించిన పురాణభాంఢారాన్ని తన కీర్తనలలో నిక్షేప్తించి ఆ విష్ణుభక్తులకు అందించాడు అన్నమయ్య.

అన్నమయ్య సంకీర్తనలలో వరాహ, బ్రహ్మాండ, మార్కండేయ, పద్మ, మత్స్య, స్కాంద, భవిష్యోత్తర పురాణాల ప్రస్తావనతోపాటు, భాగవత, విష్ణుపురాణాలలోని అనేక కథలు, భాగవతోత్తముల గాథలు కూడా మనకు అగుపిస్తాయి. ధ్రువుడు జపించిన రంగగు వాసుదేవ మంత్రాన్ని అన్నమయ్య తన అనేక కీర్తనలలో భక్తులకు అందించటంతోపాటు భాగవత, బ్రహ్మ, పద్మ పురాణాలలో విస్తృతంగా మనకు కన్పించే నృసింహావతార గాథను, నృసింహ క్షేత్ర మహిమను వెల్లడి చేశాడు. శ్రీ నారసింహావతార కథను ‘నరసింహ విజయము’ పేర పదకొండు చరణాలలో, ‘వినరయ్య నరసింహ విజయము జనులారా, అనిశము సంపదలు నాయువు నొసఁగును’ అంటూ భక్తులకు తన కీర్తనల ద్వారా ఆయురారోగ్యాలను ప్రసాదించాడు అన్నమయ్య. అలాగే ‘ఆకసమొక పాదము అట్టె భూమొక పాదము, పైకొని యొక పాదము పాతాళము, యేకమై నాడేండ నున్నా యిందులో వారే జీవులు’ అంటూ, దేవహితార్ధము విష్ణువు వామనావతారమెత్తిన విధానాన్ని కన్నులకు గట్టినట్టుగా మనకు తన కీర్తనలలో చూపాడు అన్నమయ్య. ‘అల గజేంద్రుడు మూలమని మొరపెట్టునాఁడు, వెలయ నేదేవుడు విచ్చేసి కాచెను’ అని గజేంద్ర మోక్షాన్ని, ‘అమరుల మొరలాంచి అసురబాధలు మాన్పె, అమరుల కెక్కుడౌట కదియే సాక్షి, అమృతము పంచినట్టి యాదిలక్ష్మీఁగైకొనె, అమృత మథనమే అన్నిటికి సాక్ష’ని అమృతోద్భవంతోపాటు, భాగవత అంతర్గతమైన అంబరీష, బాణాసుర, అక్రూరని వృత్తాంతాలను తన కీర్తననలో పొందుపర్చి మనకు అందించాడు అన్నమయ్య.

‘జాతి చండాలము దీరు జన్మాంతరములును, యేతులఁ గర్మచండాల మెన్నఁడూఁ బోదు, యీతన స్వర్గము చోర నియ్యకుండఁ గాఁద్రిశంకుం డాతలం దాం బ్రతిస్వర్గమందు నున్నాండదిగో’ అని కులం కన్నా, కర్మ ముఖ్యమని, కర్మచంఢాలుడు ఆ పాపాన్ని తప్పించుకోలేడని, త్రిశంకుని కథ ద్వారా అన్నమయ్య పురాణసారాన్నిసరళంగా పామరులకు తన కీర్తనలలో ఉద్భోధించాడు. భాగవత, విష్ణుపురాణాల అంతర్గతమైన బాలకృష్ణుని లీలలు, దశావతార వృత్తాంతాలు అన్నమయ్య కీర్తనలలో కోకొల్లలు. ఇక దేవీభాగవతంలోని మధుకైటభులను, మహాభారతంలోని నలమహారాజు చరిత్రను, బ్రహ్మాండ పురాణంలోని రుక్మాంగదుని కథ, మార్కండేయ పురాణంలోని సత్యహరిశ్చంద్ర కధ, భవిష్యోత్తరపురాణం నుంచి పుండరీకుని కథలను తన కీర్తనలలో ఊటంకించాడు అన్నమయ్య.

కృష్ణావతారానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో, రామావతారానికి కూడా అన్నమయ్య తన కీర్తనలలో అంతే చోటిచ్చాడు. ‘నరుడా ఇతడు ఆదినారాయణుడుగాక’,‘రామచంద్రుడితడు రఘువీరుడు’ అంటూ పద్మపురాణంలోని వాల్మీకి చెప్పిన రామాయణమును ‘ఇతడే పరబ్రహ్మమిదియే రామకథ, శతకోటి విస్తరము సర్వపుణ్యఫలము’ అని బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు గల రామకథను అనేక కీర్తనలో వర్ణించాడు అన్నమయ్య. అలాగే మత్స్యపురాణం నుండి మత్స్యావతార, వరాహావతార కథలను ఊటంకించాడు. ధర్మవేత్తలకు ధర్మశాస్త్రంగా, ఆథ్యాత్మవిదులకు వేదాంతంగా, నీతి విచక్షలకు నీతిశాస్త్రంగా, ఐతిహాసికులకు ఇతిహాసంగా, కవులకు మహాకావ్యంగా, పౌరాణికులకు బహుపురాణ సముచ్ఛయంగా అన్నమయ్య సంకీర్తనలు గోచరిస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

అయితే

విష్ణువాఙ్మయని చెప్పేనిధి సంకల్పమేడది
విష్ణుమాయని చెప్పే విశ్వమంతా నెవ్వనిది
‘‘విష్ణుమయం సర్వ’’మనే వేదవాక్య మెవ్వనిది
విష్ణువు శ్రీవేంకటాద్రి విభుఁడే ఆదేవుఁడు.

అంటూ పురాణేతిహాసాలలో నిగూఢమైయున్న ధర్మ, భక్తితత్త్వాలను తన పదకవితలలో మేళవించి పామరులకు అందించాడు అన్నమయ్య.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *