అనువాద కథలు 3
మూడు ప్రశ్నలు

మూలకథ రచన: లియో టాలిస్టాయ్

ఒకానొక సమయంలో ఒక రాజుకి ఒక సందేహం కలిగింది. ఒక పని చేయాలంటే ఏది కీలకమైన సమయము? ఎలాంటి గుణగణాలున్న వ్యక్తి చెప్పే మాటలు వినాలి మరియు ఎలాంటి వ్యక్తుల సాంగత్యాన్ని వదలుకోవాలి? ఏది అతి ముఖ్యమైన పనో తెలిసేది ఎట్లా? ఈ విషయాలు తెలిస్తే తాను చేసే ఏ పని కూడా విఫలం కాదనే అభిప్రాయం కలిగింది.

ఈ ఆలోచన కలిగిన మరుక్షణం, తన సందేహాలను నివృత్తి చేసి, తాను చేసే ప్రతిపనికి సరైన సమయాన్ని తెలుసుకోవడం నేర్పి, విజ్ఞులైన వ్యక్తుల గురించి తెలియచేసి, తాను చేసే పనులలో అతి ప్రాధాన్యమైన పని ఏమిటో తెలుసుకోవడం ఎలాగో తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తానని రాజ్యమంతా దండోరా వేయించాడు.
రాజుగారి దండోరా విని అనేకమంది పండిత, పామరులు రాజుగారి ప్రశ్నలకు తమకు తోచిన విధంగా అనేక సమాధానాలు చెప్పారు.

మొదటి ప్రశ్నకు సమాధానంగా, కొందరు ముందుగానే తిధి, వార, నక్షత్రాలు, తేదీలు పట్టిక వేసుకొని దాని ప్రకారం తూ.చా తప్పకుండా పనులు సాగించాలని, అప్పుడు అన్ని పనులు సక్రమంగా నిర్ధారిత సమయంలో జరుగుతాయని చెప్పారు. మరికొందరు, ఏ పని చేయడానికైనా సరైన సమయాన్ని నిర్ధారించడం కుదరదని, గతంలో మునిగి తేలకుండా, తన చుట్టూ జరుగుతున్న కార్యాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరానికనుగుణంగా పనులు పూర్తిచేయాలని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది, రాజు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరైన సమయంలో కార్యక్రమాలు నిర్వహించటం సాధ్యంకాదని, అందుకు రాజుకు తగిన సూచనలు ఇవ్వగలిగే తెలివైన వ్యక్తులతో కూడిన మంత్రివర్గం ఉంటే, వారికి సమయానికి తగ్గట్టు రాజుకు సలహాలు ఇచ్చి తోడ్పడగలరని చెప్పారు.

కొన్నిసార్లు మంత్రివర్గం నిర్ణయాలు ఆలస్యం కావచ్చని, అంతవరకు రాజుగారు వేచిచూడటం కుదరదని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న విషయ పరిజ్ఞానంతో పాటు ఆ విషయాల గురించి ముందస్తుగా తెలవడం ఎంతో అవసరమని, ఇది కేవలం ఇంద్రజాలకులకు మాత్రమే సాధ్యమని కనుక వారిని సంపద్రించాలని, ఇలా ఎవరు మేధకు తగ్గట్టు వారు సమాధానాలిచ్చారు.

అదేవిధంగా రెండవ ప్రశ్నకు కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. రాజు ఎవరి మాటలు వినాలి అన్నప్రశ్నకు సమాధానంగా, కొందరు మంత్రులని, మరి కొందరు ధార్మికవేత్తలని, గురువులని, ఇంకొందరు వైద్యుల, సైనికాధికారుల మాటలను వినాలని అన్నారు. చివరగా, ప్రపంచంలో అతిముఖ్యమైనది శాస్త్రీయ పరిజ్ఞానమని కొందరు, కాదు యుద్ధ నైపుణ్యమని మరికొందరు, కాదు, కాదు మతాన్ని నిలబెట్టడం, ఆచరిచడం ముఖ్యమని ఇలా ఎవరికి తోచింది వారు ఏకరువు పెట్టారు. ఇన్ని అభిప్రాయాలలో ఏది రాజుగారిని సంతృప్తిపర్చలేకపోయింది. తన ప్రశ్నలకు తగిన సమాధానాల కోసం రాజుగారు ఒక ఋషిపుంగవుని ఆశ్రయించాడు.

ఆ ఋషిపుంగవుడు ఎల్లపుడు అడవులలోనే జీవనం సాగిస్తూ, సామాన్యులతో మాత్రమే సంభాషిస్తూ ఉండేవాడు. రాజుగారు కూడా సామాన్యుని వలే వేషధారణ చేసుకుని, తన మందిమార్భాలాన్ని అడవుల వెలుపలే వదలి, ఋషిపుంగవుని దర్శనార్థాం ఒంటిరిగా అడవిలోకి వెళ్లాడు. రాజుగారు వెళ్లేటప్పడికి ఋషి తన కూటీరం ముందు ఒక గుంట తవ్వుతూ కన్పించాడు. రాజుగారిని చూసి చిరునవ్వు నవ్వి, ఋషి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఋషి చూడటానికి సన్నగా, బలహీనంగా ఉన్నాడు. గునపంతో మట్టిని పెకిలించిన ప్రతిసారి ఊపిరి తీసుకొవడానికి ఇబ్బందిపడుతూ కన్పించాడు.

రాజుగారు ఋషిపుంగవుని సమీపించి, స్వామి నేను కొన్ని సందేహాలకు సమాధానాల కొరకు మీ వద్దకు వచ్చానని, ఒక పని చేయడానికి ఏది తగిన సమయమో తనకు ఎట్లా తెలుస్తుంది? ఏ వ్యక్తికి నేను ప్రాముఖ్యాన్నిచ్చి, వారి మాటలు వినాలి? నేను ఏ పనికి ప్రాధాన్యతనిచ్చి ముందుగా పూర్తి చేయాలో ఎలా తెలుస్తుంది? ప్రశ్నించాడు.
ఆ ఋషి మాటలకు సావధానంగా విని, తిరిగి మౌనంగా తన పనిలో నిమగ్నమైపోయాడు. కొంతసేపటి తర్వాత,
‘‘మీరు అలసిపోయారు, ఆ గునపం నాకవ్వండి, నేను తవ్వుతాను,’’ అన్నాడు రాజు.

రాజుగారి మాటలకు కృతజ్ఞతలు తెలుపుతూ, గునపమందించి తాను విశ్రాంతి తీసుకోవడానికి ఆ ఋషి నేలపై కూలబడ్డాడు.

కొంతసేపు తవ్వాక రాజుగారు తిరిగి తన ప్రశ్నలను అడిగాడు. ఎటువంటి సమాధానం చెప్పకుండానే ఆ ఋషి లేచి ‘‘ఇక నీవు కొంతసేపు విశ్రాంతి తీసుకో’’ అని నేలను తవ్వడానికి గునపం కోసం చేయి చాచాడు. ఋషి అభ్యర్ధనను తిరస్కరించి, రాజు తిరిగి నేలను తవ్వసాగాడు. క్షణాలు, నిమిషాలయ్యాయి. నిమిషాలు గంటలయ్యాయి. సూర్యుడు చెట్లమాటుకు చేరుకున్నాడు. చివరికి విసుగు చెంది గునపాన్ని నేలపై జారవిడిచి, ‘‘ఓ మునివర్యా నేను మీ వద్ద కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం వచ్చాను. మీకు వీలైతే తెలియచేయండి. లేదా వీలుకాదని చెప్పండి, నేను వచ్చిన దారినే వెళ్లిపోతాన,’’ని రాజుగారు కోరారు.

‘‘ఇటుగా ఎవరో పరుగెత్తుకొస్తున్నారు. పద వెళ్లి చూద్దా, ’’మని ఋషి ముందుకు నడిచాడు.

అడుగులు విన్పించిన వైపు రాజు తల తప్పి చూడగా, ఒక వ్యక్తి గాయాలతో చెట్లమాటు నుంచి తమ వైపు పరిగెత్తుకు వస్తూ కన్పించాడు. ఆ వ్యక్తి కడుపు నుంచి తీవ్రంగా రక్తం స్రవిస్తోంది. అతను రాజును చేరుకొని, ఆయన చేతులలో స్పృహ కోల్పోయాడు. రాజుగారు, ఋషి కల్సి ఆ వ్యక్తిని కుటీరంలోకి చేర్చి బట్టలు మార్చారు. రాజుగారు అతని గాయాన్ని నీటితో శుభ్రపర్చి కట్టుకట్టాడు. ఆ అజ్ఞాత వ్యక్తి కోలుకునేంతవరకు గాయాన్ని పలుమార్లు శభ్రపర్చి, రాజుగారు కట్టుకడుతూనే ఉన్నాడు. కొంతసేపటికి ఆ వ్యక్తి తెప్పరిల్లి, మంచినీళ్లు తాగి నెమ్మదిగా కళ్లుమూసుకుని నిద్రలోకి జారాడు.

సూర్యుడు పూర్తిగా అస్తమించి వాతావరణం కూడా చల్లబడింది. రాజుగారు కూడా పగలంతా కష్టపడి పనిచేసి అలసిపోవటంతో అంత వేసవిలో కూడా ఎప్పుడు లేని విధంగా నేలపైనే గాఢంగా నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూడగా, మంచంపై కూర్చుని ఆ అజ్ఞాత వ్యక్తి రాజుగారిని తేరిపార చూస్తున్నాడు. రాజుగారు తనని చూడటం చూసి, క్షమించండన్నాడు. ‘‘మీరెవరో నాకు తెలియదు. మిమల్ని క్షమించనవసరం లేదని’’ రాజు సమాధానమిచ్చాడు.

‘‘మీకు నేను తెలవదు. కానీ మీరు నాకు తెలుసు. మీరు ఒక వ్యక్తిని, అతని సోదరుడిని చంపించి, వారి ధనాన్ని స్వాథీనం చేసుకున్నారు. నేను వారి పగ సాధించడానికి, మిమల్ని చంపడానికి ఇక్కడ మాటువేశాను. మీరు ఈ ఋషి వద్దకు వస్తున్నట్టు నాకు సమాచారమందింది. మీ తిరుగు ప్రయాణంలో మిమ్మల్ని హతమార్చడానికి వేచి చూస్తుండగా, మీ అంగరక్షకులు నన్ను గుర్తుపట్టి దాడి చేశారు. గాయపడి, వారి నుంచి తప్పించుకుని ఈ కుటీరానికి చేరాను. చావు బతుకుల మధ్య ఉన్న నన్ను మీరు కాపాడారు. అందుకు నేను మీకు సదా కృతజ్ఞుడను. ఇక మీదట నేను, నా కుమారులు, మా వంశమంతా మీకు ఋణపడి ఉంటాము. మీ సేవకులుగా పనిచేస్తామని,’’ ఆ వ్యక్తి విశదపర్చాడు.

తన శత్రువుతో ఇంత సులువుగా సంధి కుదరడంతో రాజు ఎంతో సంతోషించాడు. తన తప్పిదాన్ని తెలుసుకొని, అతని ధనాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేయటంతోపాటు అతనితో మైత్రి బంధాలు పెంచుకుంటానని తెలిపి, అతని వద్ద సెలవు తీసుకున్నాడు.

తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోయే ముందు మరొక్కసారి తన ప్రశ్నలకు సమాధానం అర్థిద్దామని కుటీరం బయటకు వచ్చి ఋషి కోసం చూశాడు. ముందురోజు తామిద్దరం కల్సి తవ్వి, చదును చేసిన నేలలో వంగి ఆ ఋషి విత్తనాలు నాటుతూ కన్పించాడు. ఆయనను సమీపించి, ‘‘స్వామి చివరిసారిగా అర్థిస్తున్నాను. నా ప్రశ్నలకు సమాధానమివ్వమని’’ కోరాడు.

నేలపై చతికిలబడుతూ, నీ ప్రశ్నలకు నవ్వే సమాధానమిచ్చావని ఋషి బదులిచ్చాడు.

రాజు ప్రశ్నార్థకంగా ఋషి వైపు పరికించాడు.

‘‘నిన్న నువ్వు నన్ను చూసి జాలిపడకపోతే, ఇక్కడే ఉండి ఈ నేలను చదును చేసేవాడివి కావు. వెళ్లిపోయేవాడివి. లోనున్న వ్యక్తి నీపై దాడి చేసేవాడు. నువ్వు ఇంకొంతసేపు నా దగ్గరే ఉంటే బాగుండేదని విచారించేవాడివి. కావున నేలను చదును చేసే సమయం తగిన సమయం. నేను ఆ సమయంలో ప్రాథాన్యత గల వ్యక్తిని. నాకు మంచి చేయటమే నీకు అతిముఖ్యమైన పని. ఆ తర్వాత గాయపడ్డ వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు. నీవు అతనికి సపర్యలు చేసిన ఆ సమయం ఎంతో కీలకమైనది. నీవు అతనికి సపర్యలు చేసి బ్రతికించక పోయి ఉండి ఉంటే, అతను చనిపోయేవాడు, నీవు నీ శత్రువుతో సంధి చేసుకునే అవకాశాన్ని కోల్పోయే వాడివి. కావున అతను నీకు కీలకమైన వ్యక్తి, అతనికి నీవు చేసిన సపర్యలు అతిముఖ్యమైన పని. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. జీవితంలో అతి ముఖ్యమైన సమయం ఈ క్షణం. ఇదే కీలకమైన సమయం ఎందుకుంటే వర్తమానంలో మాత్రమే మనకు ఏ పనైనా చేయటం సాధ్యమవుతుంది. ఈ క్షణం మన చేతుల్లో ఉంటుంది. నీ జీవితంలో అతి కీలకమైన వ్యక్తి, ఈ క్షణాన్న నీతో ఉన్న వ్యక్తే. ఈ క్షణం గడిచాక నీతో ఎవరుంటారో నీకు తెలియదు, ఆ వ్యక్తికి తెలియదు. ఇక చివరగా, అతి ప్రాధ్యాన్యత గల పని, మంచి చేయటం. ఇతరులకు మంచి చేయడం ఒక్కటే మానవ జీవనానికి పరమావధి,’’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

మూలకథ: త్రీ క్వొశ్చన్స్

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *