మూలకథ రచన: ఆస్కర్ వైల్డ్
నగరంలోని ఎత్తైన ప్రాంతంలో ఒక స్థూపం మీద ఆనందాలు చిమ్ముతున్న ఒక రాజకుమారుని విగ్రహం ఉంది. ఒళ్లంత బంగారంతో పోత పోయబడి, మెరుపులు వెదజలుతున్నరెండు నీలమణులు పొదిగిన కళ్లతో, ఒరలో ఒక పెద్ద పగడం తాపిన ఖడ్గంతో నాలుగుదిశలా ఆ రాకుమారుడు ప్రకాశిస్తున్నాడు. అందరూ అతనిని ‘సంబరాల రాకుమారుడ’ని (హ్యాపీ ప్రిన్స్) పిలుస్తారు.
అతను నిజంగానే ఎంతో మనోహరంగా ఉన్నాడు. ‘‘అతనొక దిక్సూచి’‘ అని ఆ పట్టణ ప్రతినిధి పొగిడి తన కళాత్మకతను చాటుకుంటూనే, ప్రజలు తనని పనికిరానివాడనని అనుకుంటారేమోనన్న సందేహంతో ‘‘ఉపయోగంలేని దిక్సూచ’’ని తనని తాను సమర్ధించుకున్నాడు.
ఆకాశంలో చంద్రుడి కోసం ఏడుస్తున్న పిల్లవాణ్ణి చూసి, వాళ్లమ్మ, ‘‘నువ్వు ఆ రాజకుమారుడిలా మారాము చేయకుండా, ఏడవకుండా ఉండలేవా? ఆ రాకుమారుడు కలలో కూడా దేనికి మారాము చేయడు, ఏడవడని’’ అని ముద్దుగా కసుకురుకుంది. ‘‘ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరైనా సంతోషంగా ఉన్నారని,’’ జీవితంపై విరక్తితో ఒక వ్యక్తి ఆ మనోహర రూపాన్ని చూసి గొణుకున్నాడు.
తెల్లని దుస్తులపై, ఎర్రని శాలువా కప్పుకుని అప్పడే చర్చిలోంచి బయటకు వచ్చిన పిల్లలు ఆ విగ్రహాన్ని చూసి, ‘‘అతనొక దేవదూత’’లా ఉన్నాడన్నారు. ‘‘అది మీకెలా తెలుసు?’’ అని ఒక హేతువాది వారిని ప్రశ్నించాడు. ‘‘మా కలలోకి వచ్చాడన్న’’ వారి సమాధానం విని ఆ హేతువాది నిశ్చేష్టుడయ్యాడు.
ఇదిలావుండగా, ఒకనాడు రాత్రి ఒక చిట్టి బంగారు పిట్ట(swallow) ఆ నగరం మీదుగా ఎగర సాగింది. ఆరు వారాల క్రితమే దాని స్నేహితులందరూ ఈజిప్టుకు వలస వెళ్లిపోయారు. కానీ ఈ చిట్టి బంగారు పిట్ట గుబురుగా పెరిగిన రెల్లు గడ్డిని చూసి మురిసిపోతూ, వెనకబడి పోయింది. వసంతకాలం మొదట్లో ఒక సీతాకోకచిలుక వెంటపడుతూ, సన్నగా, నిటారుగా ఉన్న రెల్లును చూసి ఆనందంతో దోబూచులాడుతుంటే, రెల్లు తలవంచి బంగారు పిట్టకి దారిచ్చింది. తన చిన్నారి రెక్కలతో నీళ్లపై వలయాకారంగా అలలు చేసి తన ప్రతిభను చూపించుకుంటూ వేసవి కాలమంతా గడిపేసింది.
‘‘దానికి డబ్బా, దస్కమా, అన్నా, చెల్లా,’’ ఆ చిట్టి బంగారు పిట్ట ఎలా ఎగిరితే మనకేంటని ఇతర బంగారు పిట్టలు గుస, గుసలాడుకున్నాయి. ఇంతలో శరదృతువు రానే వచ్చింది. బంగారు పిట్టలన్నీ వలస వెళ్లిపోయాయి. అందరూ వెళ్లిపోవడంతో చిట్టి బంగారు పిట్ట ఒంటరయింది. గాలి వీస్తేనే రెప, రెపలాడే రెల్లు గడ్డితో స్నేహం దానికి ఇంక రుచించలేదు. అయినా ఉండబట్టలేక, నేను వలసపక్షిని, నువ్వు కూడా నాతో వస్తావా అని గడ్డిని అడిగింది. దానికి గడ్డి, ఇదే నా ఇల్లని సమాధానమిచ్చింది. ‘‘అయితే నేను పిరమిడ్ల వద్దకు వెళ్లిపోతాను. వీడ్కోలు,’’ అని ఎగిరిపోయింది.
పగలంతా ఎగరుతూనే ఉన్న చిట్టి బంగారు పిట్ట రాత్రయ్యేటప్పటికి నగరానికి చేరుకుంది. ‘‘ఈ రాత్రి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? ఈ పట్టణంలో సరైన ప్రదేశం దొరుకుతుందా?’’ అని ఆలోచనలో పడింది. అదే సమయంలో నగరం మధ్యలో నున్న రాజకుమారుడి విగ్రహం కన్పించింది.
‘‘ఈ విగ్రహం బావుంది. చాలా ఎత్తులో ఉంది. చల్లని గాలి వీస్తుంద’’ని భావించి రాకుమారుడి కాళ్ల మధ్య ప్రదేశంలో ఆనందంగా పొదవుకుని కూర్చుంది. నిద్రకుపక్రమించే ముందు చుట్టూరా పరికించి, ‘‘నాకు బంగారు పడకగది’’ దొరికిందని సంబరంతో, తలని తన మెత్తటి రెక్కల మధ్య పెట్టుకునే లోపల పై నుంచి ఒక నీటిచుక్క బంగారు పిట్టపై పడింది. ‘‘ఆకాశంలో మచ్చుకైన ఒక్క మేఘం లేదు, తళ, తళలాడుతూ చుక్కలన్నీ, నింగి నిండా పరుచుకునున్నాయి, వర్షం ఎక్కడ నుంచి వస్తోంది?’’ అని ఆ బంగారు పిట్ట ఆశ్చర్యచకితురాలైంది. ఇంతలో మరో చుక్క మీద పడింది.
‘‘ఇంత పెద్ద విగ్రహం వాన చినుకల నుంచి కాపాడలేకపోతే ఇంకెందుకు? నేను ఏదైనా చిమ్నీ చూసుకుని అందులో తలదాచుకుంటాన’’నుకుని ఎగిరి పోబోయింది.
రెక్కలు విప్పుకునే లోపల మూడో చుక్క వచ్చి మీద పడింది. తలపై కెత్తి చూసి పిట్ట తెల్లబోయింది. ‘‘తాను చూసింది కలా? నిజమా?’’
రాజకుమారుడి కంటి నిండా నీరు. ఆ కన్నీరు అతని బంగారు బుగ్గల మీదుగా జారుతున్నాయి. చంద్రకాంతిలో మెరసిపోతున్నఆ రాకుమారుని మొహం చూస్తే చిట్టి పిట్టకు జాలి కలిగింది.
‘‘ఎవరు నువ్వు?’’ బంగారు పిట్ట ప్రశ్నించింది.
‘‘నేను సంబరాల రాకుమారుడు.’’
‘‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీటిలో నేను ముద్దయి పోయాను’’ అంది బంగారు పిట్ట.
‘‘నేను బ్రతికున్న కాలంలో నాకు అందరి లాగే గుండె ఉండేది. కన్నీళ్లంటే ఏమిటో తెలవకుండా, ఏ చీకుచింతా లేకుండా పెద్ద భవంతిలో నివసించే వాడిని. బాధ అనేది ఆ భవంతి పరిసరాల్లోకి కూడా వచ్చేది కాదు. పగలంతా నా స్నేహితులతో కలిసి, ఉద్యానవనాల్లో ఆడుకునే వాణ్ణి. రాత్రయిందంటే అందరం కల్సి విశాలమైన గదిలో నృత్యాలు చేసేవాళ్లం. మా భవంతి చుట్లూ ఎత్తైన గోడలుండేవి. ఆ గోడలకి అవల ఏముందని నేను ఎప్పడు ఆలోచించలేదు. నా జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయింది. నా రాజ్యంలో సభికులందరూ నన్ను ‘’సంబరాల రాకుమారుడు’’ అని పిలిచేవారు. వాళ్లన్నట్టుగానే నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని. ఆనందంలో జీవించాను, చనిపోయాను. నేను చనిపోయాక నన్ను ఇలా నగరం మధ్యలో నిలబెట్టారు. ఇంత ఎత్తు నుంచి నాకు నా రాజ్యంలో నెలకొన్న దుఃఖం, బాధ, విచారం అన్నీ కనిపిస్తున్నాయి. నా గుండెని లోహంతో తయారు చేశారు. అయినా నా గుండె కరిగి కన్నీళ్లు వస్తున్నాయి.’’
‘‘ఈ విగ్రహం మొత్తం బంగారంతో చేయలేదా? పూత పూసారా?’’ బంగారు పిట్ట తనలో తాను అనుకుంది.
‘‘దూరంగా … దూరంగా చిన్నవీథిలో ఒక పూరిగుడిసె ఉంది.’’ విగ్రహం చెప్పసాగింది. ‘‘తెరిచి ఉన్న గుడిసె కిటికి వద్ద ఉన్న టేబుల్ దగ్గర ఒక స్త్రీ కూర్చుని ఉండటం నాకు కన్పిస్తోంది. కాయకష్టం చేయటం వల్ల ఆమె చేతులు మొద్దుబారి పోయాయి. ముఖం కళావిహీనమై పాలిపోయి, దీనస్థితిలో ఉంది. త్వరలో జరగబోయే విందు కార్యక్రమంలో మహారాణి ధరించడానికి తయారు చేస్తున్న అందమైన పట్టు గౌనుపై ఆమె పువ్వులను కుడుతోంది. ఆ గదిలో ఒక మూలగా ఆమె కుమారుడు అనారోగ్యంతో నిదురపోతున్నాడు. జ్వరంతో బాధపడుతున్న ఆ పిల్లాడు, బత్తాయిలు అడుగుతున్నాడు. కానీ ఆ పిల్లవాడి తల్లి దగ్గర పూచికపుల్ల కూడా లేదు. దాంతో నీళ్లతోనే ఆ పిల్లాడి కడుపు నింపుతోంది. ఆకలికి అలమటిస్తూ ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట… నా ఖడ్గంలో ఉన్న పగడాన్ని తీసుకువెళ్లి ఆమెకు ఇవ్వలేవా. నేను ఈ విగ్రహంలో పాతుకుపోయి కదలేకున్నాను’’ అని రాకుమారుడు ప్రార్థించాడు.
‘‘నేను ఈజిప్టుకు వెడుతున్నాను.’’ నా స్నేహితులు ఇప్పటికే నైలు నదీతీరంలోని పొద్దుతిరుగు పూల మధ్య విహరిస్తుంటారు. తొందరలోనే వారు ఈజిప్టు రాజుల సమాధుల్లో (పిరమిడ్లు) విశ్రాంతి తీసుకుంటారు. అందమైన రంగులతో అలంకరించిన శవపేటికలో, పసుపు పచ్చని పట్టు వస్త్రంలో చుట్టబడి, అనేక సుగంధ ద్రవ్యాల మధ్య రాజు నిదురిస్తుంటాడు. అతను కృశించినా, మెడలో మాత్రం పచ్చల పతకం మెరుస్తుంటుంది,’’ పిట్ట చెప్పుకు పోతోంది.
‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట… ఈ ఒక్క రాత్రికి నీవు ఇక్కడ ఉండలేవా. ఆ పిల్లవాడు దాహంతో అలమటిస్తున్నాడు. ఆ తల్లి విచారంలో మునిగిపోయింది. నా దూతగా వారి వద్దకు వెళ్లలేవా,’’ రాకూమారుడు బ్రతిమాలాడు.
‘‘నాకు మగపిల్లలంటే ఇష్టంలేదు. గత వేసవి కాలంలో, నదీతీరంలో నేను విహరిస్తుంటే, ఇద్దరు ఆకతాయి మగపిల్లలు నాపై రాళ్లు రువ్వారు. నేను వేగంగా ఎగురుతాను. అందుచేతే ఆ రాళ్లు నన్ను తాకలేకపోయాయి. మా కుటుంబంలో అందరూ ఎంతో పటిష్టంగా ఉంటారు. అయినా వారి ప్రవర్తన గౌరవప్రదంగా లేదంది’’ బంగారు పిట్ట.
అంతలోనే రాజకుమారుడి దీనవదనం చూసి జాలితో, ‘‘ఇక్కడ చాలా చల్లగా ఉంది. అయినా ఈ ఒక్క రాత్రి నీతో ఉండి, నీ కోరిక తీరుస్తాను,’’ అంది. అందుకు రాకుమారుడు బంగారు పిట్టకు కృతజ్ఞతలు తెలిపాడు.
బంగారు పిట్ట వెంటనే రాకుమారుడి ఖడ్గంలోని పగడాన్ని ముక్కున కరుచుకుని రివ్వున ఎగిరింది. అలా ఎగురుతూ, తెల్లని పాలరాతితో చెక్కిన దేవదూతలున్న విశాలమైన చర్చిని దాటుకుని ముందుకు వెళ్లింది. రాజభవంతి నుంచి వస్తున్న సుమధుర సంగీతం ఆ బంగారు పిట్టను తాకింది. ఇంతలోనే భవంతి నుంచి అందమైన అమ్మాయి తన ప్రియుడితో బాల్కనీలోకి వచ్చి వినీల ఆకాశంలో మెరుస్తున్న చుక్కలను చూపిస్తూ, ప్రేమావేశంతో మాట్లాడడం పిచుకు చూసింది. ‘‘రేపు విందు సమయానికి నా దుస్తులు తయారవుతాయో, లేదో? బంగారు తీగలతో పువ్వులు కుట్టమని ఆదేశించాను. కానీ ఆ కుట్టే అమ్మాయి సోమరి అనుకుంటా, ఇంకా తయారు చేయలేదని’’ చిరు కోపంతో పలికింది.
ఓడల తెరచాపలకు కట్టిన లాంతర్ల నుంచి వస్తున్న వెలుగుతో నిండిన నది మీదుగా ఎగురుతూ బంగారు పిట్ట మరికొంచెం ముందుకు వెళ్లింది. అక్కడ వర్తకులు తమ సరుకులను అమ్ముకుంటూ కన్పించారు. వారందరిని దాటుకుని చివరకు పూరిగుడిసె ఉన్న చోటకు చేరి, లోపలికి తొంగి చూసింది. గదిలో ఒక మూల అలసి, సొలసి తల్లి నిదురపోతోంది. మంచంపై జ్వరంతో నిద్ర పట్టక పిల్లవాడు అటు, ఇటు పొర్లుతున్నాడు. చటుక్కున ఆ స్త్రీ పక్కన ఉన్న టేబుల్ పై పగడాన్ని చప్పుడు చేయకుండా జార్చింది. తర్వాత పిల్లవాడి వద్దకు వెళ్లి, నెమ్మదిగా తన రెక్కలతో గాలి వీచింది. ఆ చల్లని గాలి ఒంటికి తగిలి స్వాంతన చేకూరటంతో పిల్లవాడు మగతనిద్రలోకి జారుకున్నాడు.
పిట్ట వెనక్కి వచ్చి జరిగినదంతా, రాకుమారునికి చెప్పింది. బంగారు పిట్ట చెప్పింది విన్న రాకుమారుడు, ‘‘ఇంత చలిలో కూడా నాకు వెచ్చదనం కల్గుతోందని,’’ పలికాడు. ‘‘నువ్వు చేసిన మంచిపని వల్ల నీకు అలా అన్పిస్తోందని,’’ చెప్పి పిట్ట ఆలోచిస్తూ నిదురపోయింది.
మర్నాడు పొద్దున నదీతీరంలో విహరిస్తున్న బంగారు పిట్టను చూసి, పక్షుల పరిశోధకుడు చలికాలంలో ఈ బంగారు పిట్ట ఏమిటని ఆశ్చర్యపోతుంటే, ‘‘ఇవాళ రాత్రి నేను ఈజిప్టుకు వెళ్లిపాతాను,’’ అనుకుంది ఆ బంగారు పిట్ట. ఉత్సాహంగా నగరమంతా ఎగిరింది. చర్చి గోడల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంది. చెట్టు కొమ్మలపై ఉన్న పక్షులతో కబుర్లు చెప్పింది. అలా సాయంత్రం వరకు గడిపి, చంద్రోదయం కాగానే, రాకుమారుని శిలావిగ్రహం వద్దకు చేరి, ‘‘నేను బయలుదేరుతున్నాను. నీకు ఈజిప్టులో ఏమైనా పనుంటే చెప్పు. చేస్తాను,’’ అంది.
‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట… మరొక్క రాత్రి నా కోసం ఉండగలవా?’’ అని కోరాడు రాకుమారుడు.
‘‘నా స్నేహితులు నా కోసం ఈజిప్టులో ఎదురు చూస్తుంటారు. మేమంతా కలిసి జలపాతాలపై ఎగురుతాము. ఒకవైపు చిత్తడి నేలలో నీటి గుర్రాలు సేద తీరుతుంటాయి. మరోవైపు పెద్ద రాతి సింహాసనంపై మెమ్నన్ కూర్చుని రాత్రంతా నక్షత్రాలను చూస్తుంటాడు. తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రసరించగానే ఆనందంతో ఉప్పొంగి పోయి, మౌనాన్ని వహిస్తాడు. మధ్యాహ్న సమయానికి పచ్చగా మెరుస్తున్న కళ్లతో సింహాలు ఠీవిగా నడుచుకు వచ్చి, నదితీరంలో నీరు తాగుతాయి. వాటి గర్జనలు జలపాతాల హోరును మించి ఉంటాయి.’’ అని పిట్ట చెప్పుకుపోతోంది.
దాని వాగ్ధాటికి ఆనకట్టవేస్తూ, ‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట… నగరానికి దూరంగా పాడుబడ్డ మేడ మీద ఒక వ్యక్తి టేబుల్ పై చిందర, వందరగా పడున్న కాగితాలపై తలవాల్చి పడుకుని ఉన్నాడు. అతని ప్రక్కన గ్లాసులో వాడిపోయిన పూలున్నాయి. అతని జట్టు తైల సంస్కారం లేక ఎండిపోయింది. అతని పెదాలు దానిమ్మపండు రంగులో ఎర్రగా ఉన్నాయి. అతని పెద్దని కళ్లో ఎన్నో కలలు. అతను ఒక నాటకాన్ని రాస్తున్నాడు. కానీ చలి వల్ల రాయలేకపోతున్నాడు. ఆకలి, దప్పికలు అతని శక్తిని నీరు గార్చుతున్నాయి.’’
దయార్ద్రహృదయం గల ఆ పిట్ట నిట్టూర్చి, ‘‘నేను ఇంకొక్క రాత్రి ఇక్కడ ఉంటాను. అతనికి కూడా ఒక పగడమిచ్చిరానా?’’ అని ప్రశ్రించింది.
‘‘నా దగ్గర ఇంక పగడాలు లేవు. ఇక మిగిలింది నా కళ్లే. అవి భారతదేశం నుంచి వేలసంవత్సరాల క్రితం తీసుకువచ్చిన అరుదైన నీలాలతో చేయబడ్డాయి. ఒక నీలమణి పెకిలించి, అతనికి తీసుకొని వెళ్లి ఇవ్వు. అతను దానిని అమ్మి మంటవేసుకోవడానికి కావల్సిన కట్టలు, భోజనం కొనుక్కుని నాటకం పూర్తి చేస్తాడన్నాడు’’ రాకుమారుడు.
‘‘అయ్యో రాకుమారుడా, నేనా పని చేయలేనని’’ కన్నీరు పెట్టుకుంది పిట్ట.
‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట…’’ నేను చెప్పినట్టు చేయమని రాకుమారుడు ఆదేశించాడు.
రాకుమారుడు చెప్పినట్టే అతని కంటి నుంచి నీలమణి పెకిలించి ఎగిరిపోయింది పిట్ట. ఇంటి పైకప్పుకున్న చిల్లులోంచి లోపలికి దూరింది. చేతుల్లో మొహందాచుకుని కూర్చొన్న అతను పిట్టరాకని గమనించలేదు. కాసేపటి తర్వాత తలెత్తి చూసేటప్పకి, వాడిన పూల మధ్య మెరుస్తూ నీలమణి కన్పించింది. దాన్ని చూడగానే అతనిలో ఉత్సాహం పెల్లుబుకింది. ‘‘ఎవరో దయామయుడు నాపై కరుణ చూపించాడు. నాకు మంచిరోజులు వచ్చాయి.’’ ఇక నేను ఏ ఆటంకం లేకుండా నాటకం పూర్తి చేయగలనని అతను సంతోషపడ్డాడు.
మర్నాడు పిట్ట రేవు వైపు వెళ్లింది. విశాలమైన ఓడ మీద కూర్చుని, పెద్ద, పెద్ద పెట్టెలను, పీపాలను తాళ్లతో కట్టి దింపుతున్న నావికులను చూసి ఉత్సాహంగా, నేను ఈజిప్టుకు వెడుతున్నాను అని పొలికేక పెట్టింది. దాని కిచ, కిచలను ఎవరూ పట్టించుకోలేదు. నెమ్మదిగా చంద్రుడు నీలాకాశంపైకి ఎగబ్రాకాడు. పిట్ట మరోసారి రాకుమారుని వద్దకు వెళ్లింది.
‘‘నీకు చెప్పి వెళ్దామని వచ్చానంది’’ పిట్ట.
‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట… ఇంకొక్క రాత్రి ఉండకూడదా?’’ అని రాకుమారుడు ప్రాధేయపడ్డాడు.
‘‘శీతాకాలం వచ్చేసింది. ఇక మంచు కురవటం ప్రారంభమవుతుంది. ఈజిప్టులో. పచ్చని ఈత చెట్లని వెచ్చని సూర్యకిరణాలు తాకుతుంటాయి. ఆ వెచ్చని వాతావరణంలో మొసళ్లు బురదలో సెగ కాచుకుంటుంటాయి. నా తోటివారంతా బాల్బెక్ దేవాలయం మీద గూళ్లు కట్టుకుంటుంటే, తెల్లని, గులాబీరంగుల్లో ఉన్న పావురాళ్లు వాళ్లని చూస్తూ, కబుర్లు చెపుతుంటాయి. ఓ రాకుమారుడా, ఇక నేను నిన్ను విడిచి వెళ్లక తప్పదు. అయినా నేను నిన్ను మర్చిపోను. వసంతకాలంలో వచ్చేటప్పుడు నేను నీకోసం రెండు రత్నాలు తీసుకు వస్తాను. నువ్వు ఇచ్చేసిన వాటి చోటిలో పొదగడానికి తెచ్చే ఆ పగడం ఎర్రగులాబీ కంటే ఎర్రగానూ, నీలమణి మహాసముద్రం కంటే నీలంగాను ఉంటాయి.’’
‘‘ఆ నాలుగు వీథుల కూడలిలో ఒక చిన్న పాప ఉంది. ఆ పాప వద్ద ఉన్న అగ్గిపుల్లలు బురదలో పడి పాడైపోయాయి. అగ్గిపుల్లలు అమ్మిన డబ్బుతో ఇంటికి వెళ్లకపోతే, వాళ్ల నాన్న కోడతాడు. ఆ అమ్మాయి ఏడుస్తోంది. ఆ అమ్మాయి కాళ్లకు కనీసం చెప్పులు లేవు. వంటినిండా కప్పుకోవడానికి తగిన దస్తులు కూడా లేవు. నా రెండో కన్నులో ఉన్న మణి తీసి, ఆ అమ్మాయికి ఇవ్వు. వాళ్ల నాన్న ఆ అమ్మాయిని కొట్టడు,’’ అన్నాడు రాకుమారుడు.
‘‘నేను ఇంకొక్క రాత్రి తప్పకుండా ఇక్కడ ఉంటాను. కానీ, నీ కంటిలో మణిని మాత్రం తీయను. అలా చేసే నువ్వు పూర్తిగా గుడ్డివాడివైపోతావు’’ అని సమాధానమిచ్చింది ఆ పిట్ట.
‘‘బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట…’’ నా మాట కాదనకని రాకుమారుడు శాసించాడు.
వెంటనే పిట్ట మణిని తీసుకుని ఎగురుకుంటూ వెళ్లి అమ్మాయి చేతిలో జారవిడిచింది. ఆ మణిని చూసి సంబరపడుతూ ఆ పాప ఇంటికి పరుగెత్తింది.
తిరిగి వచ్చిన పిట్ట రాకుమారుడిని చూసి, ‘‘నీవు పూర్తిగా గుడ్డివాడివడవయ్యావు. ఇక నేను ఎక్కడికి వెళ్లను నీతోనే ఉంటానంది.’’
‘‘వద్దు, ఓ బంగారు పిట్ట నువ్వు ఈజిప్టుకు వెళ్లిపోవాలని,’’ వేదనతో పలికాడు రాకుమారుడు.
మర్నాడు రోజంతా పిట్ట రాకుమారుని భుజంపై కూర్చుని, తాను తిరిగిన దేశ, దేశాల విశేషాలను కథలు, కథలుగా చెప్పింది. నైలూ నదీతీరాన బారులుగా తీరి ఉన్న ఎర్రని కొంగలు, బంగారు చేపలను ముక్కున కరుచుకుని ఎగిరే వైనాన్ని వివరించింది. ఈ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి ఎడారిలో నివసిస్తున్న సింహిక వృత్తాతం తెలిపింది. ఎడారిలో ఒంటెలపై ప్రయాణించే వ్యాపారులు, వారి వద్ద ఉండే వైఢూర్యాల గురించి, నైలు నదీతీరాన ఉన్న నల్లని ఎత్తైన పర్వతశ్రేణుల గురించి, ఈత చెట్లను ఆశ్రయించి ఉండే పచ్చని సర్పం దానికి ఆహారాన్ని అందించే ఇరవైమంది పూజార్లు, విశాలమైన ఆకులను తెన్నలుగా చేసుకుని నదిలో విహరిస్తూ, అందమైన సీతాకోకచిలుకలతో నిరంతరం తగువులుపడే మరగుజ్జుల గురించి ఇలా అనేక విశేషాలను చెప్పింది.
‘‘ఓ బంగార పిట్ట, నువ్వు నాకు అనేకానేక అద్భుతాల గురించి చెప్పావు. కానీ ఈ ప్రపంచంలో అన్నింటి కన్నా అద్భుతమైంది స్త్రీ, పురుషుల బాధాజనితమైన జీవితం. మానవుల ఈ దుఃఖం అంతుచిక్కనిది. నా నగరం మీదుగా విహరించు. నీవు చూసిన విశేషాలు నాకు విన్పించు’’ అన్నాడు రాకుమారుడు.
రాకుమారుడు కోరినట్టే, బంగారు పిట్ట విశాలమైన నగరం మీదుగా ఎగిరింది. ధనికులు పెద్ద, పెద్ద భవంతుల్లో ఆనందంగా కాలం గడుపుతుంటే, వారి భవంతుల గేటులు పట్టుకుని బీదవారు కూటికి గతిలేక విలపిస్తుండటం; చీకటి సందుల్లో, పాలిపోయిన ముఖాలతో ఆకటికి అలమటిస్తూ పిల్లలు నల్లని రహదార్ల వైపు చూపులు నిలిపి ఎదురు చూడటం; వంతెన కింద ఇద్దరు పిల్లలు చలికి తట్టుకోలేక, ఒకరిని, ఇంకొరు వాటేసుకుని పడుకోవటం; వారిని చూసి పహారీ కాచే వ్యక్తి ఇక్కడ పడుకోవడానికి వీలులేదని తరిమి కొట్టడం చూసింది.
తిరిగి వెనక్కి, రాకుమారుడి వద్దకు వెళ్లి తాను చూసిన విషయాలను ఏకరువు పెట్టింది.
‘‘నా ఒళ్లంత బంగారు రేకులతో పూతపూయబడి ఉంది. ఏ రేకుకారేకు విరిచి, పేదవారికి ఇవ్వు. జీవించి ఉన్నకాలంలో ప్రతివారూ బంగారం సంతోషాన్ని కల్గిస్తుందని అపోహపడతారు.’’ అన్నాడు రాకుమారుడు.
రాకుమారుడు చెప్పినట్టుగానే విగ్రహానికున్న బంగారాన్ని పిట్ట ఒలిచి వేసింది. ఒక్కొక్క బంగారు రేకు బీదబిక్కికి సంతోషాన్ని కల్గించాయి. పిల్లల మోములపై సంతోషం వెల్లివిరిసింది, ఆకలి తీరి వారందరూ ఆనందంగా మైదానాలలో ఆడుకున్నారు. రాకుమారుడు మాత్రం ఒట్టిపోయిన ఆవులా, కళావిహీనుడై, నిస్తేజంగా తయారయ్యాడు.
నెమ్మదిగా మంచు కురవసాగింది. ఆ మంచు పేరుకొని గడ్డ కట్టింది. రహదారులన్నీ వెండి చిమ్మినట్టుగా, మంచుతో నిండి మెరుస్తున్నాయి. ఇళ్ల కప్పుల నుంచి మంచుజారి స్పటికాలుగా రూపుదిద్దుకున్నాయి. అందరూ చలిదస్తులు ధరించారు. పిల్లలు ఎర్రని టోపీలు ధరించి మంచులో ఆడుకున్నారు.
చిన్నారి పిట్ట, బంగారు పిట్ట మాత్రం చలికి చిగురుటాకులా వణికిపోయింది. అయినా, రాకుమారుడిని మాత్రం వీడి వెళ్లలేదు. అతని దయా గుణానికి ఆ పిట్ట ముగ్ధురాలయ్యింది. దుకాణదారుడు చూడనప్పుడు రొట్టెముక్కలను ముక్కున కరుచుకుని, తన చిన్ని రెక్కలతో వేడిగాలిని ఊపుకోసాగింది.
ఈ చలికి తాను చనిపోతానని ఆ పిట్టకు అర్థమయింది. తన శక్తినంతా కూడదీసుకుని ఎగిరి, రాకుమారుని భూజాల మీద వ్రాలింది. ‘‘రాకుమారా, ఇక సెలవు, వీడ్కోలుగా నీ చేతిని ముద్దాడనా?’’ అని మంద్ర స్వరంతో పలికింది.
‘‘నీవు ఎట్టకేలకు ఈజిప్టుకు వెళ్లిపోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. బంగారు పిట్ట, ఓ బంగారు పిట్ట, చిన్నారి బంగారు పిట్ట నాకోసం నువ్వు ఇక్కడ చాలాకాలం ఉండిపోయావు. నా పెదాలపై చిరుముద్దు ఇచ్చి వెళ్లు,’’ అన్నాడు రాకుమారుడు.
‘‘నేను ఈజిప్టుకు వెళ్లట్లేదు. నేను మృత్యువు ఒడిలోకి చేరుతున్నాను. మృత్యువే కదా శాశ్వత నిద్రకు తోబుట్టువు?’’
అంటూ, మృదువుగా రాకుమారుని పెదాలపై ముద్దుపెట్టి, అతని పాదాల చెంత ఒరిగిపోయింది.
అదే సమయంలో ఆ శిలావిగ్రహం లోపల ఏదో పగిలినట్టు శబ్ధం వెలువడింది. నిజానికి ఆ శబ్ధం రాకుమారుని గుండె రెండు ముక్కలుగా చీలిన శబ్ధం. నిజంగానే అతని హృదయం మంచుతో కరుడుగట్టింది.
మర్నాడు ఆ నగర మేయరు ఇతర అధికారులతో కలసి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ, రాకుమారుని ప్రతిమను చూసి నిర్ఘాంతపోయాడు. ‘‘ఈ సంబరాల రాకుమారుడు ఎంత అధ్వానంగా తయారయ్యాడు.’’ అధికారులందరూ మేయరు మాటలతో ఏకీభవించారు.
‘‘అతని ఖడ్గం నుంచి పగడం రాలిపోయింది. రెండు కళ్లు మూసుకుపోయాయి. ప్రతిమకు గల బంగారు వన్నె తగ్గింది. ఇతనికి బిచ్చగాడికి పెద్ద తేడా ఏమీలేదు,‘‘ అని మేయరు పెదవి విరిచాడు.
‘‘ఇతనికి బిచ్చగాడికి పెద్ద తేడా ఏమీలేదు.’’ అందరూ ముక్తకంఠంతో వత్తాసు పలికారు.
‘‘అది చాలదనట్టు, అతని పాదాల వద్ద పక్షి చచ్చిపడుంది. పక్షలు ఈ శిలా ప్రతిమ వద్ద చావడానికి వీలులేదని ఆదేశాలు జారిచేయాలి.’’ నగర పురపాలక సంఘ గుమస్తా మేయరు ప్రతీ మాటను రాసుకున్నాడు.
‘‘ఈ విగ్రహం తన అందాన్ని కోల్పోయింది. దీని వల్ల ఈ నగరానికి ఇంక ఏమీ ఉపయోగం లేదని’’ సంబరాల రాకుమారుడి విగ్రహాన్ని కూల్చివేశారు.
విగ్రహాన్ని కరిగించేశారు. మేయరు అధికారులతో సమావేశమై, విగ్రహాన్ని కరిగించగా వచ్చిన లోహం ముద్దను ఏం చేయాలని చర్చ జరిపి, ‘‘రాకుమారుని విగ్రహం స్థానంలో నిస్సందేహంగా మరో విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఈసారి నా విగ్రహాన్ని ప్రతిష్టిద్దామని’’ మేయరు తీర్మానించాడు.
కాదు నా విగ్రహం ప్రతిష్టించాలని ఒక అధికారి అన్నాడు, కాదు నాదని మరో అధికారి. ఇలా అధికారులందరు తమలో తాము గొడవకు దిగారు. ఇంకా వారు అలా గొడవపడుతూనే ఉన్నారు.
దూరంగా కర్మాగారంలో, రాకుమారుని విగ్రహాన్ని కరిగించిన కార్మికులు ఆశ్చర్యపోతున్నారు. ‘‘శతవిథాల ప్రయత్నించినా ఈ విరిగిన గుండె కరగట్లేదు. ఇది ఎందుకూ పనికిరాదు.’’ అని విసిగిపోయి, విరిగిన హృదయాన్ని చెత్లలో పారేశారు. ఆ చెత్తలోనే చచ్చిన బంగారు పిట్టకూడా ఉంది.
ఆకాశంలో దేవుడు, తన దూతలను భువికి వెళ్లి, ఏమైనా రెండు విలువైన వస్తువులను తీసుకురమ్మన్నాడు. దేవతలు రాకుమారుని పగిలిన గుండె, చచ్చిపడున్న పిట్టను తీసుకువచ్చారు.
అది చూసి భగవంతుడు, ‘‘మీరు తగిన వస్తువులనే తెచ్చారు.’’ ఈ బంగారు పిట్ట తన గానంతో ఈ స్వర్గధామాన్ని పరవశింప చేస్తుంది. ఈ బంగారు మందిరాలకు రాకుమారుడు మరింత వన్నెతస్తాడన్నాడు.’’
అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి