అనువాద కథలు 6 - వ్నాకా

మూలకథ రచన: ఆంటోన్ చెకోవ్

తొమ్మిదేళ్ల వ్నాకా జుకోవ్ గత మూడునెలలుగా అల్ యహీన్ అనే చెప్పుల వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. అది క్రిస్మస్ ముందు రోజు రాత్రి కావటంతో వ్యాపారి, ఆయన భార్య, మిగిలిన పనివారందరూ చర్చికి ప్రార్థనలు చేయడానికి వెళ్లారు. ఆ అదును చూసుకుని వ్నాకా వ్యాపారి బీరువాలోంచి సిరాబుడ్డీ, పాళీ ఉన్న కలం తీసుకొని, ఒక నలిగిన కాగితం ముందేసుకుని రాయటం ప్రారంభించాడు. కాగితం మీద కలం పెట్టేలోపల భయం, భయంగా, బిక్కు, బిక్కుమంటూ అటూ, ఇటూ పదిసార్లు పరికించి, ఎవరూ లేరని నిర్థారించుకున్నాక నెమ్మదిగా కాగితం మీదకు దృష్టి సారించాడు.

‘‘ప్రియమైన తాతయ్య, కొంస్ట్నాటిన్ మాకర్టిచ్, ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. నీకు ఆ ఏసుప్రభువు అన్ని శుభములు కలిగించాలని వేడుకుంటున్నాను. నాకు అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. ఉన్నదల్లా నువ్వు ఒక్కడివే, అందుకే నేను ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను.’’

అలా రాసి తలెత్తి చూసిన వ్నాకాకు ఎదురుగా ఏసుక్రీస్తు పటంపై కొవ్వొత్తి వెలుతురులో తన తాత రూపం కదలాడింది. వ్నాకా తాతయ్య జివరెవ్ అనే కుటుంబం ఇంటిలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. అతను 65 ఏళ్ల వృద్ధుడైనా, మత్తు కళ్లతో, సన్నగా, చాలా చలాకీగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. పలగలంతా ఆ ఇంట్లో పనిచేసే వంటవాడి ఇంట్లో నిద్ర పోవడమో, లేక వంటవాడితో కబర్లాడుతూనో కాలక్షేపం చేస్తూ, రాత్రి మాత్రం ఇంటి చట్టూ గస్తీ తిరుగుతూ, చేతిలో ఉన్న కర్రతో పహారా కాస్తుంటాడు. తాత వెనకాలే తలలు వంచుకుని రెండు కుక్కలు ముసలి కష్టాన్కా మరియు ఎల్. నల్లగా, పొడవుగా ముంగిసలా ఉండే ఎల్ చూడటానికి అమాయకంగా, ముద్దుగా కొత్తవారిని కూడా యజమానిలాగే చూసినట్టు కన్పించినా, జిత్తులమారి నక్కలాంటిది. సామన్ల గదిలోకి చొరబడటం, నక్కి,నక్కి పక్కింటివాళ్ల కోడిని పట్టుకోవడం దానిని నుంచే నేర్చుకోవాలి. ఈ సందడిలో ఒకటి, రెండుసార్లు దాని వెనకాళ్లు తలుపు సందుల్లో చిక్కుకుని ప్రాణం మీదకు వచ్చినా, అది మాత్రం బతికి బయటపడింది.

ఈ సమయంలో మాత్రం తాతయ్య, నిస్సందేహంగా, గేటు దగ్గర నుంచుని, చర్చి కిటికీల వైపు చూస్తూ, బూటు కాళ్లతో నేలను తంతూ, పనివాళ్లతో ముచ్చట్లాడుతుంటాడు. చలికి వణకుతుంటే, చేతులు రెండూ ముడుచుకుని, ముసి, ముసి నవ్వులు రువ్వుతూ, పనమ్మాయితో, వంటవాడితో పరాచకాలాడుతు ఉంటాడు.

పనమ్మాయిలకి ముక్కుపొడి డబ్బా చూపించి కావాలా అని అడుగుతాడు. ఆ అమ్మాయిలు కొంచెం నస్యం ముక్కున పట్టి, ఆపైనా తమ్ముల వర్షం కురిపిస్తారు. అది చూసి తాతయ్య హుందాగా పడి, పడి నవ్వుతూ ఆటపట్టిస్తుంటాడు.

కొన్నిసార్లు కుక్కలకి కూడా నస్యం వాసన చూపిస్తాడు. కష్ట్నాకా తుమ్ముతూ కోపంతో మొఖం తిప్పుకుంటూ దూరంగా వెళ్లిపోతుంది. కానీ ఎల్ మాత్రం మర్యాదగా అన్నట్టు తుమ్మకుండా తోక తెగ ఆడించేస్తుంది. ఆ వాతావరణం చల్లని, స్వచ్ఛమైన వీస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ చీకటి రాత్రిలో తెల్లటి ఇంటి కప్పులపైన ఉన్న చిమ్నీల నుంచి వలయాకారంలో పొగలు విరజిమ్ముతుంటే, మంచు దుప్పటి చెట్లపై పరుచుకుని వెండి వెన్నెల విరిసినట్టుంది. ఆకాశమంతా మిణుకు, మిణుకుమంటూ నక్షత్రాలు వెదజల్లినట్టుగా వ్యాపించగా, పాలపుంతను తెల్లటి మంచులో శుభ్రంగా కడిగి. తుడచి సెలవులకు సిద్ధం చేసినట్టు తళ, తళలాడుతోంది…..

ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, వ్నాకా కలాన్ని సిరాలో ముంచి, తిరిగి వ్రాయసాగాడు.

‘‘నిన్న నాకు బాగా తిట్లు, చీవాట్లు పడ్డాయి.’’ నిన్న నేను యజమాని పిల్లవాడి ఉయ్యాల ఊపుతూ, అనుకోకుండా నిదురలోకి జారుకున్నాను. అది చూసి యజమాని నా జట్టు పట్టుకుని బయటకి ఈడ్చుకు వెళ్లి బూటికాలితో గట్టిగా తన్నాడు. అలాగే వారం క్రితం, మా యజమానురాలు, సొరచేపను శుభ్రం చేయమని ఇచ్చింది. నేను దాని తోక నుంచి శభ్రం చేయటం చూసి, సొరచేపను లాక్కుని నా ముఖాన్నేసి కొట్టింది. ఇక్కడ పనివాళ్లు కూడా నన్ను బాగా ఏడిపిస్తున్నారు. నన్ను యజమాని చావడిలో ఉన్న, ఓడ్కా, ఊర దోసకాయలు దొంగతనం చేసి తీసుకురమ్మని పంపిస్తారు. యజమాని నన్ను చేతికి అందినదానితో గొడ్డుని బాదినట్టు బాదుతాడు. ఇక్కడ నాకు తినడానికి కూడా ఏమీ ఇవ్వట్లేదు. పొద్దున, సాయంత్రం ఒక బ్రెడ్ ముక్క, రాత్రికి కొంచెం గంజి పోస్తున్నారంతే. యజమాని, యజమానురాలు మాత్రం పంచభక్ష్య పరమాన్నాలతో విందులు ఆరగిస్తుంటారు. రాత్రి వరండాలో పడుక్కోవాలి. ఒకవేళ వాళ్లబ్బాయి నిద్దరలేచాడా, ఇంక నాకా రాత్రి నిద్దర ఉండదు. రాత్రంతా ఉయ్యాల ఊపుతుండాలి. తాతయ్య, నా మీద కొంచెం దయతో నన్ను మన ఊరికి తీసుకెళ్లిపోవా! నేనింక భరించలేకున్నాను. నీ కాళ్లకు మొక్కుతాను. నీకు ఆయురారోగ్యాలిమ్మని ఆ దేవుడిని ప్రార్థిస్తాను. నేను ఇక్కడ ఇంక ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నువ్వు తీసుకెళ్లకపోతే, చచ్చిపోవటం కన్నా వేరే మార్గంలేదు.’’

పొరలివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నల్లబారిన చేతులతో వ్నాకా కళ్లు తుడుచుకున్నాడు.

‘‘నీ నస్యం కోసం నేను ముక్కు పొడి కొడతాను. నువ్వేం చెబితే, అది చేస్తాను. నీ మాట వినకపోతే నీ ఇష్టం వచ్చినట్టు బాదు. నేను పనిపాట లేకుండా, గాలికి తిరుగుతున్నాననిపిస్తే, గొర్రెలు కాస్తాను,’’ ఇలా వ్నాకా రాసుకుంటూ పోతున్నాడు. తాతయ్య ఇంక నేను భరించలేకున్నాను. ఇక్కడ నాకు బ్రతుకే లేదు. ఇక్కడి నుంచి పారిపోవాలని ఉంది. ఇంత మంచులో పారిపోవాలంటే, చలికి నా కాళ్లు మొద్దుబారిపోతాయని భయంగా ఉంది, ఎందుకంటే, నాకు వేసుకుందామంటే బూట్లు కూడా లేవు. నేను పెద్దయ్యాక నిన్ను కనిపెట్టుకుని ఉంటాను. నువ్వు చనిపోయేంతవరకు జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ తర్వాత కూడా అమ్మను తలుచుకుంటున్నట్టు, నిన్ను కూడా తలుచుకుని నీ ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తాను.

మాస్కో చాలా పెద్ద నగరం. ఒక్కడ అందరూ ధనవంతులే. ఇక్కడ చాలా గుర్రాలున్నాయి కానీ, గొర్రెలు కనిపించవు. ఇక కుక్కలు చాలా క్రూరమైనవి. ఇక్కడ కుర్రాళ్లు రాత్రుళ్లు బయటకు వెళ్లరు, ప్రార్థనా గీతాలు ఆలపించరు. ఒకసారి నేను బజారులో తిరుగుతుంటే, ఒక దుకాణం కిటికీలోంచి వివిధ రకాల చేపలు పట్టడానికి అనువైన అనేక గేలాలను చూశాను. ఒక గేలం ఎంత పెద్దగా ఉందంటే, దానితో దాదాపు 20కేజీల బరువుండే చేపను పట్టచ్చు. అలాగే ఇక్కడ తుపాకీలు అమ్మే అనేక దుకాణాలు కూడా ఉన్నాయి. మా యజమాని దగ్గరున్నలాంటి తుపాకీ కనీసం వంద రూబీలైనా ఉంటుంది. ఒక్కడ మాంసం దుకాణంలో అయితే , బాతులు, కౌజు పక్షులు, చేపలు, కుందేళ్ల మాంసంతో నిండి ఉంటాయి. కసాయివాడు వీటన్నింటిని ఎక్కడ నుంచి చంపి తీసుకువస్తాడో?’’

‘‘తాతయ్య, లేడీ ఓల్గా ఇగ్నాట్యవేనా వాళ్ల ఇంట్లో క్రిస్మస్ చెట్టును అలంకరించినప్పుడు, ఆవిడని అడిగి బంగారు రంగు వాల్నట్ వ్నాకా కోసమని అడిగి తీసుకుని పచ్చరంగా ట్రంకు పెట్టలో దాచిపెట్టు.’’

అంతలోనే వ్నాకా పెద్దగా నిట్టూర్చి, వీధి కిటికీ వైపు పరికించి చూశాడు. తాతయ్య వాళ్ల యజమాని కోసం క్రిస్మస్ చెట్టును తీసుకురావడానికి అడవిలోకి వెళ్లినప్పుడల్లా తనని వెంట తీసుకువెళ్లడం జ్ఞాపకం చేసుకున్నాడు. అదొక అద్భుతమైన కాలం. తాతయ్య గొంతులో ఏవో వింత శబ్ధాలు చేసేవాడు, అడవి మంచు దుప్పటిలో కరిగిపోయేది, ఆ దృశ్యం చూసి వ్నాకా ఉత్సాహంతో ఊగిపోయేవాడు. క్రిస్మస్ చెట్టును కొట్టే ముందు, తాతయ్య పొగ తాగేవాడు. తర్వాత కొంచెం ముక్కుపొడి పీల్చేవాడు, వణుకుతూ నిల్చున్న వ్నాకా వైపు చూసి సుతిమెత్తగా నవ్వేవాడు… దట్టమైన మంచుతో కప్పబడ్డ దేవదారు వృక్షాలు, నిశ్చేష్టులై, ఎవరి ప్రాణానికి ముందు ముప్పు వాటిల్లనుందో అని నిలబడి చోద్యం చూసేవి. ఆ వృక్షల మధ్య ఎటుచూసినా విల్లు నుంచి విడిచిన బాణంలా మంచుఫలకాలను ఛేదిస్తూ కుందేళ్లు దూసుకుపోతుండేవి. వాటిని చూసి తాతయ్య, పట్టుకో, పట్టుకో, వదలకు అని రంకెలేసేవాడు.

మొదలు నరికిన క్రిస్మస్ చెట్టుని తాతయ్య పెద్ద యింటికి ఈడ్చుకొచ్చి నిలబెట్టాక…. అలకంరణ ఆరంభమయ్యేది. వ్నాకాకు ఎంతో ఇష్టమైన యువతి ఓల్గా ఇగ్నాట్యవేనా అందరికంటే ఎంతో ఉత్సాహంగా క్రిస్మస్ చెట్టుని అలంకరించేది. వ్నాకా తల్లి పెలగేయా బ్రతికున్న కాలంలో వాళ్లింట్లో పనిచేసేది. లేడీ ఓల్గా, రాయటం, చదవటం నేర్పటంతోపాటు, వంద వరకు లెక్కించటం, నాట్యం చేయటం నేర్పించటంతోపాటు బహుమతులు కూడా ఇచ్చేది. అమ్మ చనిపోయాక, వ్నాకా తాతయ్య, వంటవాళ్లుండే వంటగదికి, వంటగది నుంచి మాస్కోలో చెప్పుల వ్యాపారి ఇంటికి చేరాడు.

‘‘తాతయ్య ప్లీజ్ రావా,’’ వ్నాకా ఉత్తరం రాయటం కొనసాగించాడు. ‘‘ఆ భగవంతుడి మీద ఆన. వచ్చి నన్ను తీసుకువెళ్లు నీ కాళ్లు పట్టుకుంటాను. ఎంతో బాధపడుతున్న నా వంటి అనాథ మీద కనికరం చూపరాదా. ఇక్కడ నన్ను అందరూ కసుకుంటున్నారు. ఆకలేస్తోంది. ఈ బాధను వర్ణించలేను. నేను అలుపెరగకుండా ఏడుస్తూనే ఉంటాను. నిన్న యజమాని నా తల మీద బాదితే, సొమ్మసిల్లాను. నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి లాగుంది…. అల్యోనాని, ఒంటికన్ను యెగోర్కాని అడిగానని చెప్పు. నా కొంసర్టినా (ఒక రకమైన వాయిద్యం)ను ఎవరికి ఇవ్వకు. నేను ఎప్పటికీ నీ ఇవాన్ జుకోవా. ప్రియమైన తాతయ్య, తప్పకుండా రా.’’

గ్రామంలో ఉన్న తాతయ్యకు.

కొద్దిసేపు బుర్రగోక్కుంటూ ఆలోచించి, కొంస్ట్నాటిన్ మాకర్టిచ్ అని రాశాడు. ఏ అడ్డంకి లేకుండా ఉత్తరం రాయగలిగినందుకు సంతోషపడి, నెత్తి మీద టోపీ పెట్టుకుని, పైన కోటు వేసుకోకుండానే వీథిలోకి పరిగెత్తాడు.

ముందురోజు, మాంసందుకాణం అతను ఉత్తరాలని పోస్టుబాక్స్ లో వేస్తే, అవి ప్రపంచంలో ఏమూలకైనా సరే, గంట వాయించుకుంటూ పోస్టుమాన్లు చేరవేస్తారని చెప్పాడు. వ్నాకా అతివేగంగా దగ్గరలో ఉన్న పోస్ట్ బాక్స్ వద్దకు వెళ్లి, తన అపురూపమైన ఉత్తరాన్ని అందులో జారవిడిచాడు…

ఇక తాతయ్య వస్తాడన్న ఆశతో, ప్రశాంతంగా ఒక గంట తర్వాత ఆదమర్చి నిద్రపోయాడు…. ఆ నిద్రలో ఒక సుందర స్వప్నం, వంటగది పొయ్యి దగ్గర, గట్టు మీద కూర్చుని, కాళ్లూపుకుంటూ తాతయ్య తన ఉత్తరాన్ని పనివాళ్లందరికి విన్పిస్తున్నట్టు…

ఆ పక్కనే ఎల్ తోకాడించుకుంటూ!

మూలకథ: వ్నాకా

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *