అనువాద కథలు - 2
ముద్దబంతిపూలు

మూలకథ రచన: యుజీనియా.డబ్ల్యు. కాలియర్ (1969)

నా చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకుంటే, నాకు కన్పించేది నా స్వగ్రామం – ధూళి. వేసవి కాలంలో పొడారిన, నిర్జీవమైన గోధుమ రంగులో మెరిసేటి సన్నని ధూళి. నా నల్లటి కాళ్ల మధ్యలో, గొంతుకలో దూరే ధూళి. కళ్లలో పడి కన్నీళ్లు తెప్పించే ధూళి. ఎందుకు కేవలం ధూళి మాత్రమే గుర్తుకు వస్తుంది? అంటే ఏమో చెప్పలేను. తప్పకుండా మా ఊర్లో, పచ్చిక బయళ్లు, తిన్నని రహదార్లు, వాటిపై తమ నీడను సారించే చెట్లు ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయి. జ్ఞాపకాలు, మనోభావాలను మసక, మసకగా మనస్సుపై నీలిమబ్బుల్లా చిత్రించే దృశ్యమాలికేగాని, స్పష్టంగా ముద్రించే చిత్రపటంకాదు. అందుకే నేను ఎప్పుడు ఆ ప్రదేశాన్ని, సమయాన్ని తలుచుకున్నా నాకు సెప్టెంబరులో ధూళితో నిండిన, పొడారిన రహదార్లు, ఎండిన పచ్చికలతో నిండిన ఊరే జ్ఞాపకం వస్తాయి. ఆ ధూళిపై సూర్యుని బంగారు వన్నెలు వెదజల్లే మిస్ లోటీ ముద్దబంతులు అస్పష్టంగా, లీలగా నాకు కన్పిస్తాయి.

ఆ ముద్దబంతులు నా మనోఫలకంపై కదలాడిన ప్రతీసారి ఏదో తెలియనీ వింత అనుభూతి నామదిలో కాసేపు మెదలి అదృశ్యమవుతుంది. ఒక్కసారిగా యుక్తవయస్కులోని మనోభావాలు పెనుతుఫానులా నన్ను చుట్టుముట్టి ఉక్కిరి,బిక్కిరి చేస్తాయి. సంవత్సరాల క్రితం మిస్ లోటీ పెరట్లో, సంతోషం, కోపం, సిగ్గు, లజ్జ కలసికట్టుగా కట్టలు తెంచుకున్న ప్రవాహంలా నన్ను ముంచెత్తిన ఆ క్షణాల్లో, పద్నాలుగు నుంచి పదిహేను ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న నేను ఆకస్మాత్తుగా చిన్నపిల్ల నుంచి యువతిగా పరిణితి చెందాను. కాలాన్ని ఎలా వెలిబుచ్చాలో తెలియక చూస్తున్న ఎదురుచూపుల మధ్య ఆ చెదురు, మదురు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి.

నిరీక్షణ, ఎదురుతెన్నులే మా నిరుపేద గ్రామంలో పలికే జీవన రాగం కావచ్చు. దేశాన్ని కట్టికుదుపుతున్న ఆర్ధిక మాంద్యం మేరీల్యాండ్ లో జీవిస్తున్న మా నల్లజాతి గ్రామీణులకు కొత్తకాదు. అందుకే మా ఎదురుచూపులు దేనికో నాకు తెలియదు. సంతోషం, సౌభాగ్యం కోసమా? అవి మాకు ఎండమావుల వంటివే. ఆ పదాలు తెల్లజాతీయుల సొత్తు. వాటి యందు మాకు విశ్వాసం లేదు. అలాగని, మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కి ‘అమెరికా స్వప్నం’ నిజమవుతుందన్న ఆశ కూడా మాకు లేదు. ఇక దేనికి మా ఎదురుచూపులు. బహుశా, ఎదో అద్భుతం జరుగుతుందని ఆశ కావచ్చు! సూర్యుడు ఉదయించినప్పటి నుంచి, పొద్దుకుంకే వరకు ప్రతిరోజు అలుపెరుగకుండా, తెల్లజాతీయుల ద్రాక్షతోటల్లో రెక్కలు, ముక్కలు చేసుకొని మండుటెండల్లో చిన్న రొట్టెముక్క కోసం కష్టపడే జీవులకు ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశ అవసరమేమో!! ఆ దేవునికి కూడా మా పట్ల దయలేదు, అందుకే ఆయన చేసే అద్భుతాల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూనే ఉన్నాం.

అయితే, మా పిల్లలకి మా పేదరికం గురించి చూచాయగా మాత్రమే తెలుసు. రేడియోలు, దినపత్రికలు, వారపత్రికలు లేని ఆ కాలంలో మాకు బయట ప్రపంచం గురించి అంతగా ఏమీ తెలవదు. నేటి ఆధునిక యుగంలో, మిమ్మల్ని ‘నాగరికత’ లేనివారిగా జమకట్టి, మా గురించి పుస్తకాలు రాసి, సదస్సులు ఏర్పాటు చేస్తారు. అప్పట్లో మాకు తెలిసినవారంతా ఆకలికి అలమటిస్తూ, అనారోగ్యంతో బాధపడేవారే. పేదరికమనే సాలెగూడులో చిక్కుకున్న మాకు ఏదో తెలియని ద్వేషం. ఆకాశంలో స్వేచ్ఛగా తిరగడానికే పుట్టిన విహంగాన్ని బోనులో బంధించినట్టు అసహనం.

అప్పటి రోజులని తలుచుకుంటే, తగ్గుముఖం పడుతున్న తీక్షణ వేసవి కాలం, తీవ్రమవుతున్న చలి, తొందరగా ప్రొద్దుకుంకుతున్న అనుభూతి ఇవే నన్ను స్పృశిస్తాయి.

నాకు పద్నాలుగు ఏళ్లు వచ్చేసరికి మా ఇంటిలో నేను, నా తమ్ముడు జోయి మిగిలాం. మిగిలినవారంతా నగరాలకు వలస వెళ్లటమో, పెళ్లిచేసుకుని వేరు కాపురాలు పెట్టటమో చేశారు. ఇక పసిపిల్లలను మా దగ్గరకంటే మా చుట్టాల దగ్గరే బాగా పెరుగుతారన్న ఆశతో వారి వద్దకు పంపేశారు. జోయి నాకంటే మూడేళ్లు చిన్నవాడు. ప్రతిరోజు మా అమ్మ వేరే వాళ్ల ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్లిపోయేది. మా నాన్న ఎప్పటికీ దొరకని పని వెతుక్కొవడానికి వెళ్లేవాడు. నేను, మా తమ్ముడు మా పూరిగుడిసెలో చేయదగ్గ పనులు చేసి, మాలాంటి మరికొందరు పిల్లలతో కలిసి, ఊరంతా ఎండలో పడి బలాదూరు తిరిగేవాళ్లం.

చాలావరకు నాటి జ్ఞాపకాలు, అప్పుడే వేసిన రంగుల చిత్రపటాన్ని జోరుగా కురిసే వానలో వదిలేస్తే ఏలా ఉంటుందో అలా అస్పష్టంగా నా బుర్రలో కదలాడుతున్నాయి. కలగాపులగమైన ఆ చిత్రపటంలో, నేను మట్టిలో గీసిన చిత్రాలను, వెక్కిరిస్తూ కాళ్లతో చెరిపేసిన జోయి నవ్వు, బురద కాలువలో వట్టి చేతులతో చేపలను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే, నా దోసిటి నుంచి జారిపోతున్న చేపలను చేసి ఎగతాళిగా నవ్వే జోయి నాకు గుర్తుకొస్తున్నారు. ఆ సంవత్సరం చిరపరిచితమైనదేదో నా నుంచి దూరమవుతోందనే భావన, ఏదో తెలియని అసహనం నా శరీరాన్ని, మనస్సుని ఆవహించి, నన్ను భయాందోళనకు గురిచేశాయి.

వీటన్నింటి మధ్య ఒక ప్రత్యేకమైన రోజు మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు నాలోని అమాయకత్వం పటాపంచలై కొత్త అనుభావాలు నా జీవితంలో చోటుచేసుకున్నాయి. మా పెరట్లోని సింధూరం చెట్టు నీడలో కూర్చుని రొట్టె తింటూ, హ్యారిస్ బాయ్స్ గురించి నాలో నేను పగటి కలలు కంటున్నాను. దూరంగా జోయి మరికొందరు పిల్లలతో కల్సి చెట్టుకు వేలాడుతున్న టైర్ తో ఆడుకుంటున్నారు.

‘‘హే లిజబత్,’’ జోయి ఒక్కసారిగా అరిచాడు. జోయి ఎప్పుడు నెమ్మదిగా మాట్లాడనే మాట్లాడడు. ‘‘ఎక్కడికైనా వెడదాం, పద.’’

అయిష్టంగానే నా కలల ప్రపంచంలోంచి బయటపడి, ‘‘ఎక్కడికెళ్లాలనుకుంటావు? వెళ్లి ఏం చేస్తావని?’’ ప్రశ్నించాను.

నిజం చెప్పాలంటే, మా అందరికి ఈ వేసవికాలంలో చెప్పలేనంత అలసత్వం, నిరాశ కలుగుతున్నాయి. వసంతకాలంలో ఉండే, ఉత్సాహం, తీరికలేకుండా ఉండే పని పూర్తిగా కొరవడి కాలాన్ని ఎలా వెలిబుచ్చాలో తెలవక నీరసం వస్తోంది.

‘‘పదండి, కొండల మీదకి పోయి మిడతలదండుని పడదాం,’’ సూచించారెవరో.

‘‘మిడతలు, గిడతలక్కడ ఏమీ లేవు. మీరెప్పుడో వాటిని పట్టేశారన్నాడు’’ జోయి వెక్కిరిస్తూ.

అంతటితో అందరూ ఎక్కడికెళ్లాలని కాసేపు వాదులాడుకున్నారు. ఆ వాదనల మధ్యలో,

‘‘మిస్ లోటీ ఇంటికి వెళ్దా,’’ మెరిసే కళ్లతో అన్నాడు జోయి.

ఆ సలహా అందరికి బాగా నచ్చింది. మిస్ లోటీని ఏడిపించటమంటే అందరికి భలే సరదా. ఆ మాట వినటంతోనే అందరిలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకింది. నేను ఒక రకంగా చిన్నదానినే కావటంతో ఆ పిల్లల మందతో కల్సి చెట్లవెంట, తుప్పులవెంట పరిగెత్తాను. ఆడపిల్లలు మరీ పొడుగ్గా, లేదా మరీ పొట్టిగా ఉన్న గౌన్లతో, మగపిల్లలు అతుకుల నికర్లతో, తీక్షణమైన వేడి వల్ల ఛాతీపై చమటలు పట్టి దుమ్ముకొట్టుకుపోయి ఆ బంజరు భూమిలో చూడ్డానికి నవ్వు వచ్చేట్టుగా ఉన్న రూపాలతో ముళ్ల కంచెలను దాటుకుంటూ, చిరిగిన దుస్తులతో, చెప్పులు లేని మట్టి కాళ్లతో ఐదారుగురు మంది పిల్లలం పరుగెడుతుంటే, ధూళి మబ్బుల్లా లేచి మిమ్మల్ని కమ్మేసింది.

అంత దూరంలో మిస్ లోటీ ఇల్లు కన్పించగానే, మా ఆలోచన అమలు చేయడానికి ధైర్యం కూడదీసుకోవటం ప్రారంభించాం. మా ఇళ్లతో పోలిస్తే మిస్ లోటీ ఇల్లు మరీ అధ్వాన్నంగా శిధిలావస్థలో ఉంది. వర్షానికి తడిసి, ఎండకు ఎండి గోడలు, తలుపులు బూడిద రంగులోకి మారిపోయాయి. తలుపులు, చెక్కలు ఊడిపోయి చూడటానికి ఆ ఇల్లు చిన్నపిల్లాడు కట్టిన పేక ఇంటిలా గట్టిగా ఊదితే పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆ ఇల్లు పడకుండా ఉండటమే అద్భుతం. కాదు మహాద్భుతం. ఆ అద్భుతం అక్కడ వరండా లేకుండా, మెట్లు లేకుండా, మూయడానికి గేటులు లేకుండా గడ్డే కాదు, కనీసం కలుపు మొక్కలు కూడా లేని శిథిలంలా నిలబడి ఉంది.

ఆ ఇంటి ముందు, మిస్ లోటీ కొడుకు జాన్ బర్క్ కుర్చీలో కూర్చుని ఊగుతున్నాడు. బర్క్ ని అందరూ పిచ్చాడంటారు. ఆ కుర్చీలో పొద్దస్తమాను విసుగు, విరామం లేకుండా ఊగుతూ తన ఊహా లోకాల్లో బర్క్ విహరిస్తుంటాడు. చింపిరి జుట్టు మీద నలిగిన ఒక టోపీ పెట్టుకుని అలా కూర్చొనే బర్క్ కి బయట ప్రపంచంతో పనిలేదు. కానీ పొరపాటున ఏవరైనా అతనిని ఆ యోగ సమాధి నుంచి కదిపారా, ఇంక వారి సంగతంతే. ఎవ్వరికీ అర్థంకాని దేవభాషలో వారిని తిట్టిపోస్తాడు. మా పిల్లలకి అతనిని కదిపి అతనికి అందకుండా తప్పించుకోవడం ఒక ఆట.

కానీ మా భయమంతా మిస్ లోటీ గురించే. వందేళ్లుంటాయామో ఆమెకి. పొడుగాటి ఆమె ఆకారం చూస్తే వయస్సులో ఉన్నప్పుడు మంచి శక్తివంతమైన యువతి అయ్యుంటుందనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం నడుము కొంచెం వంగినా, ఎర్రని గోధుమరంగు ఛాయ కలిగిన మృదువైన చర్మంతో, ఇండియన్ ముఖకవళికలతో కఠినమైన, నిశ్చలమైన మనిషిగా కన్పిస్తుంది. ఆమెకి బయటవాళ్లు, ముఖ్యంగా పిల్లలు ఆమె ఇంటి ఛాయలకు రావటం ఇష్టం ఉండదు. ఆమె ఎప్పుడు ఆ ఇల్లు ఆవరణ వీడి వెళ్లలేదు, ఎవరూ ఆమెను చూడటానికి రాలేదు. ఆమె ఏం తింటుందో, తాగుతుందో, ఆమె నిత్యావసరాలు ఎలా జరుగుబాటవుతాయో మాకు తెలియదు. మాకు మరీ చిన్నతనంగా ఉన్నపుడు మేము మిస్ లోటీని మంత్రగత్తె అనుకునేవాళ్లం. ఆమె గురించి ఏవేవో ఊహించుకునే వాళ్లం. వాటిలో కొన్నింటి పట్ల మాకే నమ్మకం కుదిరేదికాదు. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక అవన్నీ ఊహాగానాలే అని అర్థం చేసుకున్నాం. కానీ పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోగాని పోవనట్టు, ఇప్పటికీ ఆ ఇంటి దరిదాపుల్లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తాం.

‘‘అదిగో అక్కడే ఉంది.’’ మేము ఆమెకు చాలా దూరంలో ఉన్నామన్న విషయం మర్చిపోయి మంద్రస్వరంలో చెప్పాను. ‘‘ఆమె తన పూల మధ్య తిరుగుతోంది.’’

మిస్ లోటీ ముద్దబంతిపూలు ఆ అంగణంలో ఎంతో వింతగా కన్పిస్తాయి. శిథాలవస్థలో ఉన్న ఆ ఇంటి ముందు, గోధుమ రంగు ధూళి పరుచుకున్న ముంగిటిలో సూర్యుని పసుపురంగు కాంతితో, ఆహ్లాదకరంగా, మిరుమిట్లుగొలుపుతూ, ప్రకాశవంతంగా మెరిసిపోతు, విచ్చిన ముద్దబంతులు తలలెత్తి చూస్తుంటాయి. జాన్ బర్గ్ కుర్చీ చప్పుళ్ల మధ్య, పాడుబడ్డ ఇంటి ఆవరణలో, ఆ నల్లని, వృద్ధ మంత్రగత్తె ఆ వేసవికాలంలోనే కాదు, ప్రతీ వేసవికాలంలో పాదులు చేసి, కలుపు మొక్కలు పీకి, ఆ ముద్దబంతులను నిరంతరం సాగుచేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలవదు కాని, మా పిలల్లకు ఆ ముద్దబంతులను చూస్తే అసహ్యం. ఆ పాడుబడ్డ ఇంటికి ఆ అందమైన బంతులు తగవు. ఏదో అర్థంకాని అసహనం మమల్ని ఆవరిస్తుంది. ఆ వృద్ధమహిళ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో కలుపుమొక్కలను ఏరిపారేస్తోంది. మగవారి టోపీ తలపై పెట్టుకొని, పెద్దటి నడుము ఊపుకుంటూ, ముందుకు వంగి ఆమె కలుపుమొక్కలు తీస్తున్న ఆ భంగిమ మాకు నవ్వు తెప్పించాలి, కానీ ఎందుకో మాకు నవ్వురాదు. ఆమెకి ఎలాగో, అలాగ చికాకు తెప్పించాలి, అసహనానికి గురిచేయాలనే మా తాపత్రయం. అందుకు మేము ఆమెలా నటిస్తూ, దుర్భాషలాడుతూ, ఆ పూల మొక్కల మీదకి గులకరాళ్లు విసరి మా ఆకతాయితనాన్ని ప్రదర్శించేవాళ్లం. నిజానికి మాకు ఆ పూలను నాశనం చేయాలని ఉంటుంది. కానీ ఆ ధైర్యం మాలో ఎవ్వరూ చేయలేరు. ఆఖరికి, అందరిలోకి తుంటరివాడైన జోయి కూడా.

‘‘రాళ్లేరండి,’’ జోయి అందరిని ఆదేశించాడు. అందరూ చిలిపిగా నవ్వుతూ రాళ్లేరడం మొదలుపెట్టారు. నేను మాత్రం కదలలేదు. ‘‘త్వరగా, లిజబత్.’’

నాక్కూడా వారితో కలవాలని ఒక వైపు అన్పించినా, మరోవైపు అది చిన్నపిల్లలతత్త్వంగా కూడా తోస్తోంది. ఏదీ తేల్చుకోలేక, పొదలమాటు నుంచి తొంగిచూస్తూ నుంచున్నాను.

“నువ్వు భయపడుతున్నావా, లిజబత్?”

ఒక్కసారిగా నాకు ఉక్రోషం పొడుచుకొచ్చి, ‘‘మీ పిల్లలందరూ రాళ్లుతెండి, వాటిని ఎలా విసరాలో నేర్పిస్తాను.’’

అలా చెప్పినప్పుడు నాకు తెలవదు, మా పిల్లలందరం ఎంతటి మూర్ఖులమో. అప్పటి మా తెలియనితనంలో కూడా బహుశా మా స్థితిగతులేమిటో, మా స్థాయేమిటో చూచాయగా తెలుసు. లేకపోతే, ప్రతీది నాశనం చేయాలన్న సంకల్పతో ఎందుకు ప్రవర్తిస్తాం. ఏదిఏమైనా, గులకరాళ్లు పోగుచేసి, అందరూ నామాట కోసం ఎదురుచూస్తున్నారు.

‘‘రండి, అందరూ.’’

మేము నెమ్మదిగా మిస్ లోటీ ఇంటికి ముందున్న రోడ్డుకి ఇవతల వైపున్న పొదల అంచుల దగ్గరకు నక్కి, నక్కి వెళ్లాం. బంగారు మడులలోకి కారుమబ్బులాంటి చేతులు దూర్చి, వంగి ఆవిడ పనిచేస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా జుయ్ మంటూ ఒకరాయి దూసుకెళ్లి పూవును తాకింది.

“ఎవరక్కడ?” వంగిన తలెత్తి తీక్షణమైన చూపులతో పొదలవైపు చూస్తూ మిస్ లోటీ హూంకరించింది. “జాగ్రత్త!”

వస్తున్న వెకిలినవ్వును ఆపుకుంటూ, పొదలమాటున నక్కుతూ, ఇంకొంచెం ముందుకు జరిగాం. మిస్ లోటీ రహదారి వైపు ఒకసారి దృష్టిసారించి, మళ్లీ కలుపు తీయడంలో నిమగ్నమయి పోయింది. జోయి వేగంగా విసిరిన రాయి తాకిడికి మరో ముద్దబంతి నేలకొరిగింది.

మిస్ లోటీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చేతికర్ర ఊతంతో తడబడుతూ లేచి నిలబడి, ‘‘పిల్ల రాక్షసులారా, ఇళ్లకు పొండి’’ అని అరించింది. పెద్దగా నవ్వుతూ, విచక్షణారహితంగా పిల్లలందరూ విచ్చలవిడిగా పూల మీద రాళ్ల వర్షం కురిపించారు. కోపంతో ఊగిపోతు, ఊతకర్రను ఊపుకుంటూ, వణుకుతున్న స్వరంతో, ‘‘జాన్ బర్క్, జాన్ బర్క్ రారా’’ అంటూ బర్క్ ని సాయానికి పిలుస్తూ మావైపు మిస్ లోటీ దూసుకు వచ్చింది.

దాంతో నాకు పూర్తిగా మతిపోయింది. ఎదో తెలియని వెర్రి ఆవేశం, బలం నన్ను ఆవహించి, రాళ్ల వర్షం కూడా లెక్క చేయకుండా పొదలమాటు నుంచి, ‘‘ముసలిదానా, ఏం చూసుకుని నీకు పొగరు, చిల్లర పెంకులు చూసుకుని ధనవంతురాలిననుకుంటున్నావా’’ అంటూ ఒక్కసారిగా మిస్ లోటీ ఉన్నవైపు పరిగెట్టాను. పిల్లలందరూ పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. రాళ్లు పడేసి, తేనేతుట్టను పట్టుకున్న తుమ్మెదలలా మిస్ లోటీ చుట్టుచేరి గేలిచేస్తేంటే, ఆమె నిస్సహాయంగా మామీద అరవ సాగింది. ఆ ఆవేశం, పిచ్చితనం ఒక్క క్షణం పాటే ఉంది. అలజడి విని జాన్ బర్క్ జూలు వదిలించుకున్న సింహంలా లేచాడు, అంతే మేమంతా ఎక్కడివారిమక్కడ పొదల్లోకి జారుకున్నాం. అదే సమయంలో మిస్ లోటీ చేతికర్ర నా బుర్రమీద పడింది.

మా ఇంటిముందు చెట్టు కింద చేరిన పిల్లలతో నేను కలవలేకపోయాను. సిగ్గు, లజ్జతో చితికిపోయాను. నాకలా సిగ్గుపడడం నచ్చలేదు. ఇదంతా సరదాగా చేసిన పని అని నాలోని చిన్నపిల్ల ఒకవైపు సర్థిచెపుతోంది. మరోవైపు నాలోని యువతి నేను చేసిన ఆ ద్వేషపూరితమైన పనికి చిగురుటాకులా కంపించింది. మధ్యాహ్నమంతా నేనా చిరాకులోనే ఉన్నాను. ఆ రాత్రి భోజనాల వేళ మా నాన్న నిశ్శబ్దంగా ఉండటం గమనించలేదు. కొన్నాళ్లుగా మా నాన్న నిశ్శబ్దంగానే ఉంటున్నారు. ఆ రాత్రి మా అమ్మ ఇంటి దగ్గర లేకపోవడం కూడా నేను గమనించలేదు. అందుకు కారణం, కొన్నిసార్లు మా అమ్మ పొద్దుపోయే వరకు పనిచేసేది. ఆ రాత్రి నేను, జోయి ఎందుకో బాగా వాదులాడుకుని, నెమ్మదిగా నిద్దరలోకి జారాం.

మధ్యరాత్రి మెలుకువ వచ్చింది. పక్కగదిలోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. చాలా నెమ్మదిగా, మధురంగా, మండుటెండలో ఒయసిస్సులా చల్లగా చీకటి గదిలోంచి మా అమ్మ మాటలు విన్పిస్తున్నాయి. మా అమ్మ మాటలు వినడం నాకెంతో ఇష్టం. అదే సమయంలో మా నాన్న గొంతులో తీవ్రత మాత్రం ప్రశాంతతను భంగపరుస్తోంది.

‘‘ఇరవై రెండేళ్లు, ఇరవై రెండేళ్లు, నీకు ఏమీ, ఏమీ ఇవ్వలేకపోయాను,’’ మా నాన్న అంటున్నాడు.

‘‘బాధపడకండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కడో, అక్కడ దొరక్కపోదు.’’

‘‘ఏ మగాడు, తన భార్య సంపాదనపై ఆధారపడి బతక్కూడదు. పిల్లలు అల్లరి, చిల్లరగా తిరుగుతుంటే, నిస్సహాయంగా చూస్తూ ఉండటం సరైన పని కాదు.’’

‘‘అన్నీ బాగున్నరోజుల్లో, మీరు మమల్ని బాగానే చూసుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎవ్వరికీ బాగలేవు.’’

‘‘వేరేవాళ్ల గురించి నేను మాట్లాడటం లేదు. నా గురించి మాట్లాడుతున్నాను. నేను కష్టపడుతున్నానని ఆ భగవంతుడికి తెలుసు.’’ మా అమ్మ ఏదో సర్ధచెప్పడానికి ప్రయత్నించింది. అదేమిటో నాకు విన్పించలేదు. మా నాన్న పెద్దగా ఏడవటం మాత్రం విన్పించింది. ‘‘నేనింకేం చేయగలను, చెప్పు?’’

‘‘మనమేమి ఆకలితో అలమటించట్లేదు. ప్రతివారం నాకు జీతం వస్తోంది.’’ మిసెస్ ఎలిస్ చాలా మంచి మనిషి. నాకు సహాయం చేస్తూనే ఉంది. ఆవిడ నీకోసం ఈ చలికాలానికి మిస్టర్ ఎలిస్ పాతకోటు కూడా ఇస్తానంది.’’

‘‘మిస్టర్ ఎలిస్ కోటు, డబ్బులు ఎవరికి కావాలి? ఆ తెల్లవాడి దయ ఎవరికి కావాలి?’’ అకస్మాత్తుగా బాధాకరంగా, నిస్సహాయంగా, ఆ చీకటి రాత్రి మా నాన్న ఎక్కి, ఎక్కి ఏడ్చాడు. మగవాళ్లు ఏడవడం నేనెప్పుడు వినలేదు. అసలు మగవాళ్లు ఏడుస్తారని కూడా నాకు తెలవదు. నా చేతులతో గట్టిగా చెవులు మూసుకున్నా మా నాన్న హృదయవిదారకమైన ఏడుపు లీలగా విన్పిస్తూనే ఉంది. మా నాన్న ఒక పిల్లాణ్ణి భూజానెత్తుకుని ఇల్లాంతా తిరగగల శక్తివంతుడు. మాకు బొమ్మలు చేసిచ్చి, మాకు చేపలు, కుందేళ్లు పట్టటం నేర్పించిన నాన్న నవ్వితే, మా ఇంటి ముందున్న సింధూర చెట్టు కూడా గల, గలా నవ్వుతుంది. అలాంటి శక్తిగల నాన్న ఎలా ఏడుస్తున్నాడు? నెమ్మది, నెమ్మదిగా మా నాన్న ఏడుపు తగ్గుముఖం పడుతుంటే, నిద్రలో భయపడ్డ పిల్లవాణ్ణి సముదాయిస్తున్నట్టు, మా అమ్మ మృదువుగా పాడుతున్న జోల నా చెవులను తాకింది.

ప్రపంచం తలకిందులైంది. ఎంతో సున్నితంగా, బలహీనంగా ఉండే మా అమ్మ మా కుటుంబానికి ధైర్యాన్నిచ్చే శక్తి, కాగా, మా ఇంటికి స్థిరత్వాన్నిచ్చే పునాదిలాంటి మా నాన్న బేలగా కన్నీళ్లు కారుస్తున్నాడు. మీటలు తెగిన వీణలా మా జీవనగీతం శృతి తప్పింది. ఈ పరిస్థితులలో నా స్థానమేమిటి? అప్పటి నా ఆలోచనలేమిటో నాకు గుర్తులేదు. భయంతో కూడిన సందిగ్ధావస్థ అంతే.

చాలాసేపటి తర్వాత మా నాన్న ఏడుపు, మా అమ్మ కూనిరాగం ఆగిపోయాయి. నా చెవులను చేతులతో మూసుకుని, కదలకుండా రాతిలా పడుకొని, నేను కూడా ఏడవగలిగితే బావుణ్ణు అనుకున్నాను. నన్ను కూడా ఎవరైనా ఊరుకోపెడితే చాలనుకుంటూ పరుపు మీద చాలాసేపు అలానే ఉండిపోయాను. ఇదేమీ పట్టకుండా ప్రశాంతగా నిద్రపోతున్న జోయి, కీచురాళ్ల శబ్దం మధ్య రాత్రి నిశబ్దంగా సాగిపోయింది. నేను మాత్రం ఒంటరితనం, భయాందోళనలు చుట్టుముట్టగా, నిద్ర రాకా రాత్రాంతా గడిపి, చివరికి నాలుగంటల సమయంలో జోయిని నిద్ర లేపాను.

మాంఛి నిద్రలోంచి లేపానన్న చిరాకుతో, ‘‘ఏమైంది నీకు? ఏం కావాలి?’’ కోపంగా అడిగాడు జోయి.

‘‘నిద్రలే!’’

‘‘ఎందుకు? నీకేమైనా మతిపోయిందా? పో!’’

నాకేం చెప్పాలో అర్థంకాలేదు. మాటలు రాలేదు. చివరికి, ‘‘నాకు భయమేస్తోంది. నాకు ఒంటరిగా ఉండాలని లేదు,’’ ‘‘నేను బయటకి వెడుతున్నాను. నువ్వు వస్తే రా,’’ అన్నాను.

ఆ సమయంలో బయటకి అనగానే ఉత్సాహంతో, “ఇప్పుడు బయటకా? ఎక్కడికి లిజబత్? ఏం చేయదల్చుకున్నావు?”

అప్పటి వరకు ఎక్కడికి అన్న ఆలోచన రాలేదు. బట్టలు మార్చుకుని ‘‘వస్తే రా,’’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాను.

సగం రోడ్డుమీదకి వచ్చేటప్పటికి వెనక నుంచి జోయి కూడా వచ్చి నన్ను చేరాడు.

‘‘ఆగు లిజబత్, ఎక్కడికి వెడుతున్నావు?”

ఎవరో తరుముతున్నట్టు పరుగెత్తడం మొదలుపెట్టాను. నిశబ్దంగా, ఆవేశంతో కొంతదూరం పరుగెట్టేటప్పటికి నాకు అర్థమైంది నేను ఎక్కడికి వెడుతున్నానో – మిస్ లోటీ ఇంటికి.

పూర్తి అంధకారం కంటే తెలవారుతన్నప్పుడు వచ్చే సన్నని వెలుగే ఎంతో అసహనానికి గురి చేస్తుంది. ఆ వెలుగురేఖల మధ్య కూలిపోయిన నా ప్రపంచంలా ఆ శిథిలమవుతున్న, పాత ఇల్లు అసంబద్ధంగా, బీటలువారి నన్ను వెంటాడుతోంది. అయినా నాకు భయం కలగట్లేదు.

‘‘ లిజబత్ నీకేమైనా మతిపోయిందా?” జోయి రొప్పుతూ అడిగాడు.

నాకు నిజంగానే మతిపోయింది. ఆ వేసవికాలం నాలో నివురుగప్పిన నిప్పులా దాగున్న భావోద్వేగాలు అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. నాకు చాలా అవసరమైనపుడు నా దగ్గరలేకుండా పోయిన మా అమ్మ, పేదరికం తెచ్చిన నిసహాయత, నిస్పృహ, దిగజారిన జీవన ప్రమాణాలు, కౌమార, యవ్వన దశల మధ్య నలుగుతున్న నా వయసు, రెండు దశలను ఏకకాలంలో అనుభవించే విపరీత క్షణాలు, మా నాన్న కళ్లనుంచి ఏరులైపారిన కన్నీరు, ఈ సంఘటనలన్నీ నన్ను విధ్వంసం సృష్టించడానికి ప్రేరేపించాయి.

‘‘ లిజబత్!’’

కట్టలు తెంచుకుని చేనులో పడి తొక్కేసే ఎద్దులా, ఆవేశంగా తోటలోపడి చేతికందినవి అందినట్టుగా కుదుళ్లతో పెకిలించి, తొక్కి పసుపుపచ్చని ముద్దబంతులను చిదిమేశాను. తొలిసంధ్య వెలుగురేఖలు వెదజల్లే పరిమళాలు, ముద్దబంతుల మీద ఉన్న మంచుబిందువులు నన్ను తడుపుతుంటే, కన్నీళ్లను వెనక్కినెడుతూ ఆ పూలవనాన్ని సర్వవిధాల నేలమట్టం చేస్తుంటే, నా వెనకాలే నా గౌను పట్టుకొని నన్ను ఆగమని బతిమాలుతూ, ఏడుస్తూ నన్ను చుట్టుకుపోయాడు జోయి.

నేను చేసిన విధ్వంసం మధ్య, నేలకొరిగిన పూబంతుల మధ్య నేను అలసి, సొలసి వెక్కి, వెక్కి ఏడ్చాను. అప్పటికే జరగవల్సిన ఘోరం జరిగిపోయింది. నేను సరిదిద్దుకోలేని పొరపాటు చేసేశాను. ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థలో మౌనంగా, భయంగా నా పక్కకు చేరాడు జోయి.

‘‘ లిజబత్, చూడు.’’

నెమ్మదిగా ఉబ్బిన నా కళ్లను ఎత్తి చూశాను. నా ఎదురుగా పొడవాటి కాళ్లు, నెమ్మదిగా ఆ వాచిన కాళ్లను, ఆ కాళ్లు మోస్తున్న వయసుపైబడిన శరీరాన్ని, తెల్లని జుట్టుతో కప్పబడిన మొహాన్ని చూశాను. ఇప్పుడు ఆ మొహంలో ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే ఇపుడు కాపాడుకోవడానికి ఆ ముద్దబంతి తోటలేదు, నాశనమైపోయింది.

‘‘మి…మి..మిస్ లోటీ,’’ తడబడతూ లేచి నుంచుని, సూటిగా ఆమె కళ్లలోకి చూసిన ఆ క్షణాన, నాలోని పసితనం పటాపంచలై, స్త్రీత్వం నాలో చోటుచేసుకుంది. అది నా పసితనం చేసిన చివరి హింసాత్మక, ఉన్మాదక పని. పాలిపోయిన, దుఃఖబరితమైన ఆ మొహం చూసిన ఆ క్షణం నాకర్థమయింది ఆ మంత్రగత్తె, ఒక మంత్రగత్తె కాదు. జీవితంలో అన్నీ కోల్పోయి, విసిగి, వేసారిన ఒక వృద్ధురాలు. బండబారిన జీవితంలో ఆనందరేఖలు సృష్టించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన విధివంచితురాలు. జీవితమే పోరాటంగా జీవనం సాగించిన నిస్సహాయురాలు. ఈ చరమాంకంలో ఆమెకున్నది కేవలం కుంగిన శరీరం, పాడుబడిన పూరిగుడిసె, మతిలేని జాన్ బర్క్, వీటితోపాటు ఈ నిర్జీవ సంగ్రామంలో ఏ మూలో చిరుగాలికి రెప, రెపలాడుతూ మిగిలివున్న ఆశావాదంతో ప్రేమగా పెంచుకుంటున్న ముద్దబంతులు.

ఇప్పుడు అన్నీ అర్థం చేసుకున్నా, మిస్ లోటీకి ఏం చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో సిగ్గుతో తలదించుకుని నిలబడిపోయాను. ఆ క్షణాన నాలో రేగిన నాటి భావాలకి అక్షర రూపం ఇవ్వడానికి నాకు చాలా కాలం పట్టింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరోజు, ఆ క్షణాన నాలోని పసితనం, అమాయకత్వం సమసిపోయి, స్త్రీత్వం చోటుచేసుకున్నాయి. చాలామంది స్త్రీత్వం చోటుచేసుకోవడం అంటే కన్యత్వం పోవడం అనుకుంటారు. అది నిజానికి చాలా విరుద్ధం. అమాయకత్వం అంటే నిజాన్ని గ్రహించలేకపోవడం, తన చుట్టూ ఉన్న నిజాన్ని చూడలేకపోవటం, సమాజ లోతుల్ని తెలుసుకోలేకపోవటం. అ అమానుష, అవమానకరమైన క్షణాలలో నేను నా గురించి మరచి, ఎదుటి మనిషి స్థితిగతులను లోతుగా పరిశీలించ గలిగాను. నాలో కరుణ, దయ మొదలయ్యాయి. దయ, అమాయకత్వం రెండూ ఒక మనిషిలో ఉండలేవు.

ఆ ధూళి నుంచి, ఆ మసిబారిన జీవితాల నుంచి, మసకబారిన బాల్యంతో నేను నాశనం చేసిన ఆ ముద్దబంతుల నుంచి, ఆ సమయం నుంచి, ఆ ప్రపంచం నుంచి కాలం నన్ను మరో తీరానికి తీసుకు వెళ్లిపోయింది. నేను చేసిన దుష్కార్యం తర్వాత మిస్ లోటీ మళ్లీ ముద్దబంతులను పెంచలేదు. చాలా కాలక్రితం ఆమె మరణించింది. ఆ ఇల్లు నేలమట్టమయింది. అయినా అప్పుడప్పుడా ఆ బాధకరమైన సంఘటన, క్షణాలు, పసుపు పచ్చని ముద్దబంతులు నా స్మృతిపథంలో మెలగుతుంటాయి. జీవితం నిస్సారమైన బంజరుభూమి అని తెలుసుకోవడానికి ఎవరు పేదవాళ్లు, అమాయకులు కానవసరంలేదు.

అందుకే నేను కూడా ముద్దబంతులను పెంచుతున్నా!!!

మూలకథ: మ్యేరీగోల్డ్స్

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *