
‘‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్’’
సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం మరియు వంశానుచరితమనే ఐదు లక్షణాలు కలిగినదే పురాణం. సర్గ అనగా ప్రపంచం సృష్టి, ప్రతిసర్గ – సమస్త ప్రపంచం యొక్క ప్రళయం, వంశం – రాజులు మరియు ఋషుల సంతాన పరంపర, మన్వంతం – మనువు, మనుపుత్రులు, ఋషులు, దేవతలు, ఇంద్రుడు మరియు విష్ణువు యొక్క అవతారాలు వంటి ఆరు అంశాలను తెలిపేది. చివరగా, వంశానుచరితం అనగా రాజ వంశాల్లోనూ, ఋషివంశాల్లోనూ పుట్టినవారి చరిత్ర. పంచమవేదంగా పిలవబడే పురాణాలను శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన వేదవ్యాసుడు రచించినట్లు తెలుస్తోంది. వ్యాసవిరచిత పురాణాలను సూతుడు, నైమిశారణ్యవాసులకు, శౌనకుడు మొదలైన 88వేల మంది ఋషులకు ప్రవచించాడు. పురాణాలు ముఖ్యంగా రెండు రకాలు: మహాపురాణాలు, ఉపపురాణాలు.
వ్యాసభగవానుడు రచించిన అష్టాదశ పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకంలో క్లుప్తంగా చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ,
బ్రత్రయం వచతుష్టయమ్
అనాపలింగ కూస్కాని,
పురాణాని ప్రచక్షత
మద్వయం: మకారంతో 2 – మత్స్యపురాణం, మార్కండెయ పురాణం, భద్వయం: భ కారంతో 2 – భాగవత పురాణం, భవిష్యద్ పురాణం, బ్రత్రయం: బ్ర కారంతో 3 – బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, వచతుష్టయం: వకారంతో 4 – వాయు పురాణం, వరాహపురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లిం కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కందపురాణం.
బ్రహ్మం పాద్మం వైష్ణవం చ వాయవీయం తథైవ చ|
భాగవతం నారదీయం మార్కేండేయం చ కీర్తితమ్|
ఆగ్నేయం చ భవిష్యంచ బ్రహ్మవైవర్తలింగకే|
వారాహం చ తథా స్కాందం వామనం కూర్మసంజ్ఞకమ్|
మాత్స్యంచ గారుడం తద్వద్ర్బహ్మాండాఖ్యమితి త్రిషట్||
ఈ శ్లోకాన్ననుసరించి అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు పదునెనిమిది అవయాలతో ఋషులు పోల్చారు. వీటి వివరాలు: 1. బ్రహ్మపురాణం – శిరస్సు, 2. పద్మపురాణం – హృదయం, 3. విష్ణు పురాణం -కుడిచేయి, 4. వాయు పురాణం – ఎడమ చేయి, 5. శ్రీమద్భాగవత పురాణం – తొడలు, 6. నారద పురాణం – నాభి, 7. మార్కండేయ పురాణం – కుడి పాదం, 8. అగ్ని పురాణం – ఎడమ పాదం, 9. భవిష్య పురాణం – కుడి మోకాలు, 10. బ్రహ్మవైవర్త పురాణం – ఎడమ మోకాలు, 11. లింగ పురాణం – కుడి చీలమండ, 12. వరాహ పురాణం – ఎడమ చీలమండ, 13. స్కాంద పురాణం – కేశములు, 14. వామన పురాణం – చర్మం, 15. కూర్మ పురాణం – వీపు భాగం, 16. మత్య్స పురాణం – మెదడు, 17. గరుడ పురాణం – మాంస సారం, మరియు 18. బ్రహ్మాండ పురాణం – ఎముకలు.
వేదాంతార్థాలను తెలిపే ఈ పురాణాల రచన కూడా ఒక క్రమబద్ధంగా జరిగింది. సృష్టి, లయ, స్థితులను తెలిపే పురాణాలను గురించి ఆలోచించినపుడు ప్రతి ఒక్కరికి కలిగే మొదటి సందేహం ఈ బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు? అందుకు సమాధానమే బ్రహ్మాండ స్వరూపాన్ని, దాని సృష్టికర్తను అవగతపర్చే బ్రహ్మపురాణం. బ్రహ్మ పుట్టుక ఎలా జరిగింది? ఈ రెండవ ప్రశ్నకు సమాధానం విష్ణు నాభికమలం నుండి బ్రహ్మ పుట్టాడని పద్మపురాణం అందిస్తుంది. ఈ కమలం ఏమిటి? అన్న ప్రశ్నకు విష్ణు పురాణం వివరణ ఇస్తే, విష్ణువుకాధారమేమిటి? అనే ప్రశ్నకు శేషతల్పమని వాయుపురాణాలు జవాబిస్తుంది. ఆ ఆదిశేషునికి క్షీరసాగరమాధరమని, క్షీరసాగరవర్ణన శ్రీమద్భాగవతంలో కన్పిస్తుంది. క్షీరసాగరశయుని సన్నిధిలో ఉండే నారదమహర్షిని గురించిన వివరాలు నారదపురాణం నుంచి గ్రహించవచ్చు. ఈ ఆరు పురాణాల సంకలనం మార్కండేయ పురాణం.
ఇక ఎనిమిదవదైన అగ్నిపురాణం అగ్నిదేవుని మహాత్మ్యాన్ని తెలపగా, చరాచర సృష్టినిర్మాణంలో, అగ్నిభట్టారకుని ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించిన సూర్యభగవానుని తత్త్వాన్ని భవిష్యపురాణం వివరిస్తుంది. బ్రహ్మసృష్టి పరిణామాలని బ్రహ్మవైవర్తపురాణం పునరుద్ఘోషిస్తుంది. కాగా, సృష్టికి మూలమైన సగుణ బ్రహ్మను ఉపాసించే మార్గాలను, శివతత్వాన్ని లింగ, స్కాందపురాణాలు ఉపదేశిస్తాయి. మహావిష్ణువు అవతారాలను, లీలను వరాహ, వామన, కూర్మ, మత్స్యపురాణాలు వర్ణిస్తున్నాయి. గరుడ పురాణం సృష్టిచక్రంలో సంచరించే జీవుల కర్మల వలన పొందే జన్మల వివరాలను తెలుపుతుంది. సృష్టిలోని లోకాలకు ఆధారమైన స్థితిగతులను చివరగా బ్రహ్మాండ పురాణం.
అష్టాదశ పురాణానాం నామధేయాని యః పఠేత్
త్రిసంధ్యం జపతేనిత్యం సోశ్వమేధ ఫలంలభేత్
ఎన్నో మోక్షదాయక, ఆథ్యాత్మిక విశేషాలను అందించే అష్టాదశ మహా పురాణాల పేర్లను ఉదయ, మధ్యాహ్న సాయం సమయాల్లో ఎవరైతో పఠిస్తారో వారు అశ్వమేథయాగ ఫలాన్ని పొందగలరని పై శ్లోక భావం.
తేటగీతి