సంక్రాంతి సంబరాలు


‘మాసానాం మార్గశిర్షోస్మి’ అన్నాడు గీతాచార్యుడు. అన్నిమాసాలలోకి ఉత్తమమైన ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ మాసాన్ని ధనుర్మాసమని పిలుస్తారు. కాలపురుషుడి రాశిచక్రాలలో పదోదైన మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయము ఇదే. అలాగే ఈ కల్పం ప్రారంభంలో జలప్రళయం సంభవించినపుడు ఆదివరహావతారమెత్తి భూమిని విష్ణుమూర్తి ఉద్దరించింది ఈ మకరసంక్రమణ రోజే. ఇలా సూర్యగమనాన్ని సూచించే సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా మూడురోజులు భోగి, సంక్రాంతి, కనుమ అని జరుపుకోవటం ఆచారం.

భోగి: ‘భుజ్’ అనే సంస్కృత ధాతువు నుంచి వెలువడిన పదమే భోగి. ఇది ధనుర్మాసంలో చివరిరోజు. భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి ధనుర్మాసవ్రతం చేసి మకరసంక్రమణానికి ముందు రోజైన భోగినాడు విష్ణుమూర్తిని వివాహమాడింది. ఆ పెళ్లికి సూచకంగా భోగిపండుగ జరుపుతారని పురాణాలు తెలుపుతున్నాయి. నేడు కూడా తిరులమలో భోగిపండుగరోజు గోదా కల్యాణం నిర్వహిస్తారు. ఆ రోజు ఆండాళ్ వేంకటేశునితో సహా భోగితేరుపై తిరువీథుల్లో విహరిస్తారు. సకల భోగములను ఇచ్చే యజ్ఞాగ్నికే మరో పేరు ‘భోగి’. అందుకు సూచనగానే భోగిమంటలు వేస్తుంటారు.

మకరసంక్రమణం లేదా సంక్రాంతి: సంక్రాంతి అంటే సంక్రమణం. సూర్యుడు ధనుస్సురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించే సమయం. సంక్రాంతి నుండి దక్షిణాయనం పూర్తయి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతి ప్రముఖంగా రైతుల పండుగగా మన తెలుగునాట ప్రసిద్ధి చెందినా, సంక్రాంతికి సంబంధించి ఒక పురాణగాథ కూడా లేకపోలేదు. వామనావతారమెత్తి బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు పాతాళానికి పంపించివేశాడాన్న ఆగ్రహంతో బలి సూర్యుని సంత్సరంలో ఆరుమాసాలు బంధించి ఉంచుతాడని, బలి చక్రవర్తి నుంచి విముక్తుడై వచ్చిన సూర్యాగమనాన్ని వేడుకగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని కథనం.

గొబ్బిళ్లు: గోపి అనే పదం నుంచి గొబ్బిళ్లు అనే పదం వెలువడి ఉంటుందని కొందరి అభిప్రాయం. గోదాదేవి విరచితమైన తిరుప్పావైలో కృష్ణుని గోపికలు ‘గోపియలో’ అని గాననృత్యాలతో కొలుస్తారు. గోపికలు చేసే ఈ నృత్యాలే కాలక్రమేణా గొబ్బినృత్యాలుగా ప్రాచుర్యం చెంది ఉండవచ్చు. ‘గొబ్బి’ అంటే మరో అర్ధం ‘నమస్కారం’ గోపికలు శ్రీ కృష్ణుని కొరకు పాడినట్టుగానే అన్నమయ్య కూడా ‘కొలనుదోపరికి గొబ్బిళ్లో, యదుకులస్వామికి గొబ్బిళ్లో’ అంటూ గొబ్బిపాటలతో స్వామివారి కీర్తిని స్మరిస్తూ నమస్కారాలు సమర్పించాడు.

గోమయేనచ గాంకృత్వా తథాగోవర్ధనం శుభమ్
గోపాలం పూజయేన్నిత్యం శ్రద్ధయా కురునందన

ధనుర్మాస నియమాలననుసరించి, మూడు గొబ్బిళ్లను – ఒకటి కృష్ణునికి, రెండోవది గోమాతకు, మూడొవది గోవర్ధనగిరికి సంకేతాలుగా – చేసి ముగ్గులలో ఉంచి వాటిపై గుమ్మడి పూవుల నుంచి పూజిస్తారు. చివరగా, నెలరోజులపాటు పెట్టిన గోబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వేసి యజ్ఞ పురుషునికి సమర్పిస్తారు.

ధనుర్మాస ప్రారంభం నుంచి మకరసంక్రమణ వరకు ప్రతీరోజు కన్యలు ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది, అందు గోమయంతో చేసిన గొబ్పిళ్లను ఉంచి, వాటి చుట్టూ తిరుగుతు, ‘చామంతిపువ్వంటి చెల్లెల్నియ్యవే, తామరపూవంటి తమ్ముణ్ణియ్యవే, మొగలిపూవ్వంటి మొగుణ్ణియ్యవే’ అంటూ పాటలు పాడి, నృత్యాలు చేయటం మన తెలుగునాట నేటికీ ఆనవాయితీ.

ముగ్గులు: ఇక సంక్రాంతి అనగా తెలుగు ఆడపడుచులకు గుర్తుకు వచ్చేది, ముత్యాలముగ్గులు, రత్నాల రంగవల్లులు. ఇంటి ఆవరణలో ప్రతిరోజు కన్పించే ముగ్గులకు సంక్రాంతి సందర్భంగా వేసే ముగ్గులకు తేడా ఉంది. ఈ మాసంలో వేసే ముగ్గులు సందర్భానుసారంగా ఉండి పండగ ప్రాముఖ్యాన్ని చెప్పకనే చెపుతాయి. ధనుర్మాసంలో గుచ్ఛ బంధం ముగ్గును, దానికి ఇరు వైపులా పాములను వేస్తారు. గుచ్ఛబంధం సూర్యుని రథచక్రాన్ని సూచిస్తే, సర్పాలు సూర్యునితోపాటు సంచరించే గుణాలు మహాపద్ముడు, కర్కోటకుడుకి సంకేతాలు. ముగ్గులలో వేసే రంగులలో ఎక్కువగా తెలుపు, ఎరుపు, పసుపు రంగులుంటాయి. ఈ మూడు రంగులు మనలోని సత్త్వరజస్తమోగుణాలకు ప్రతీకలు.

 కనుమ: సంక్రాంతి మూడురోజులలో చివరిరోజు కనుమ పండుగ. పంటలు చేతికి వచ్చి ఆనందంతోనున్న రైతు, తనకు తోడు,నీడగా నిలిచి వ్యవసాయంలో పాటుపడిన పశువులను కడిగి, అలంకరించి ఈ రోజు పూజించి తన కృతజ్ఞతను తెలుపుకుంటాడు.

సంక్రాంతికి కొత్త అల్లుళ్లని, కూతుర్లని పండుగకి పిలవటం, బొమ్మల కొలువులు, భోగిపళ్ల పేరంటాలు, గాలిపటాలు ఎగరవేయటం, కోళ్ల పందేలు, జల్లికట్టు (పోట్లగిత్తలు పోటీలు) హరిలోరంగ హరి అంటూ హరిదాసులు, గంగిరెద్దుల ఆట, పిట్టలదొర, బుడబుక్కలవాడు ఇలా అనేక సంబరాలు సంక్రాంతికే వన్నెతెస్తాయి.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp