శివ తాండవం

ప్రపంచాన్ని సృష్టించి, వృద్ధిపొందించి, ధర్మమార్గమున నడిపి, అంతమొందించి, తన యందులీనమొనర్చుకునే సృష్టి ప్రక్రియను సృష్టి, స్థితి, లయకారుకులైన త్రిమూర్తులు నిర్వహిస్తుంటారు. ఈ సృష్టి ప్రక్రియ కనుగుణంగా ఆ పరమేశ్వరుడు అనేక రీతులలో నృత్యాన్ని ప్రదర్శించగా, తనువున సగభాగమైన పార్వతీ దేవీ సర్వేశ్వరునితో గూడి నర్తిస్తుంది. నటరాజు తన నివాసమైన కైలాస పర్వత నాలుగు దిక్కులలో నున్న స్వర్ణ, మణిమయ, రజత, చిత్ అనే నాలుగు నర్తన మండపాలయందు ప్రతి నిత్యము సల్పే నృత్యానికి సంబంధించిన వర్ణన ‘శివ రహస్యం’ అనే గ్రంధంలో సవిస్తారంగా వివరించబడింది. శివ అంటే చైతన్యం. ప్రాణ స్పందనకు ప్రతిరూపం. ఆ చైతన్యం లేని ఈశుడు శవం. చైతన్యవంతమైన విశ్వంలోని ప్రకృతి ఆ సర్వమంగళైన పార్వతి. ఆ శివ, పార్వతుల నాట్య, లాస్యాలు జీవ, ప్రకృతి స్పందనలకు నిదర్శనాలు.

ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాఙ్మయం
ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివమ్.

లోకేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడయిన పరమశివుడు సనాతన, సనందనుల పర్యవేక్షణలో, నంది, భృంగి, రిటీశ్వర, గణపతి, తండు, హుండ, బాణ, రావణ, చండిక మొదలైన వారితోపాటుగా, దేవమునీంద్రులందరూ వీక్షిస్తుండగా, ‘తకఝం, తకఝం తకదిరికిట నాదమ్ములతో,’ తాండవమాడితే, ‘అలలై, బంగరు కలలై, పగడపు బులుఁగుల వలె, మబ్బులు విరిసినవి’ అదియే శివలాస్యంబట అంటారు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తమ ‘శివ తాండవం’ పద్య కావ్యంలో.

ఒక చేతిలో డమరుకం, రెండవ చేతిలో ప్రజ్వలాగ్నియు, వేరోక చేతిలో అభయహస్తం, వరద హస్తమందు వేళ్లకున్న రతనాల ఉంగరాలు తళ, తళలాడుతుండగా, పులితోలును వస్త్రంగా ధరించి, మెడలో ధరించిన బ్రహ్మతల నాయకముగా అమర్చిన పుర్రెల పేరు ఎగసిపడుతుంటే, కాళ్లకున్న సరిమువ్వలు ముచ్చటగా మ్రోగుతుంటే, ఆ నటశేఖరుడు, ఆ నటరాజమూర్తి సలిపే నర్తన శోభ ముల్లోకాలను ఆనందడోలలాడిస్తుంది.

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్
డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్

తలపైన గంగ ఉప్పొంగి తరంగములుగా నల్లని ఆ జటాల మధ్య నుండి ప్రవహించగా, అందు వికసించిన కమలాల శోభ నిర్మల గంగాజలమున ప్రతిబింబిస్తుంటే, ఆ పవిత్ర గంగాజలంతో అభిషేకించబడిన ఆదిశేషుడు తన చేతికి అలంకారమవ్వగా, ఆదిశేషుని ఉచ్ఛ్వాస, నిశ్వాసలు డమరుక ధ్వనులై ప్రతిధ్వనించగా, ఆదిదేవుడు ప్రచండ శివతాండవం సలుపుతుంటే, ఆయన పాదముల నుండి వెలువడిన ధ్వనులే శబ్ధమై, వర్ణములై, మాటలై, వాక్యములై, సూత్రములై, భాష్యములై సకల చరాచరములను అలరిస్తాయి, కదలిస్తాయి.

నటరాజు ఈ విధంగా ఆనంద తాండవం చేస్తుంటే విష్ణువు మృదంగం, సరస్వతి వీణ వాయించగా, బ్రహ్మ తాళం వేయగా, సనక సనందనాదులు వీనులవిందుగా వీక్షిస్తుంటే, చివరన ముక్తాయింపుగా 14 మార్లు నటరాజు ఢమరుకం మ్రోగించాడుట. ఈ ఢమరుక నాదాలను శివ సూత్రాలంటారు. ఈ పద్నాలుగు ఢమరుక నాదాల నుంచి అక్షర రవాలు ఉద్భవించాయి.

నృత్తావసానే నటరాజ రాజః ననాద ఢంకా నవపంచమాః
ఉద్ధార్ధుకామః సనకాది సిద్ధనేతత్ విమర్శే శివసూత్రజాలం

ఈ పద్నాలుగు అక్షర రవాలు: 1 ఆ ఇ ఉ న్ 2. ఋ లుక్ 3. ఏ ఓ ఇంక్ 4. ఐ ఔ చ్ 5. హ య వ ర ట్ 6. ల న్ 7. న్య మ ఇంక్ నన మ్ 8. ఝు భన్ 9. ఘ ద ధ ష్ 10. జ బ గ డ డ శ్ 11. ఖ ఫ ఛ ఠ థ చ త త వ్ 12. క ప య్ 13. శ ష సర్ 14. హ ల్.

ఈ అక్షర రవాలని పాణి శబ్దానుకూలంగా క్రోడీకరించి, వాటికి అక్షర రూపాన్ని ఇచ్చినట్టు పెద్దలు చెపుతారు.

శివతాండవ తత్త్వం: శివతాండవ తత్త్వాన్ని మూడు విధాలుగా విశదీకరించుకోవచ్చు. ఇందు మొదటిది సర్వ ప్రపంచ సృష్టి స్పందన చైతన్య స్వరూపమే శివనృత్యము. భ్రమనొంది పాశబద్దలైన జీవకోటికి ముక్తి నొసంగే సంహార ప్రక్రియకు ప్రతీకయే రెండవదైన ప్రళయ తాండవం. పునఃసృష్టికి అవసరమైన ప్రసన్నతను సమకూర్చటమే ఈ తాండవం ఉద్దేశము. ఇక చివరిది, మూడోవ తాండవమునకు రంగభూమి చిత్ (అనగా మనసు). అంబరము మానవ హృదయాంతర సీమయే. ఇచ్చట పరమశివుడు రంగస్థల మేర్పర్చుకుని నృత్యమాడి జీవునికి మోక్షాన్ని ప్రసాదించే, ఆ నటరాజుని భంగిమ శివతాండ రహస్యాన్ని ప్రతిపాదిస్తోంది.

నటరాజు నృత్య భంగిమ: దక్షిణోర్థ్వ భుజముకున్న డమరు – సృష్టిక్రియా సూచకము, వామోర్థ్వ భుమున ఉన్న అగ్ని – సంహార సూచకము, దక్షిణహస్త పతాకము – విజయ సూచకము, వామ హస్తాభయముద్ర – వరప్రదాన సూచకము, ఊర్థ్వప్రసారితమగు పాదము – శాంతి, భవ, బంధ విమోచక సూచకము.

సకల భువనంబు లాంగికముగా శంకరుఁడు
సకల వాఙ్మయము వాచికము గాఁగ మృడుండు
సకల నక్షత్రంబులు కలాపములు గాఁగ
గణనఁ జతుర్విధాభినయాభిరతిఁ దేల్చి
తన నాట్యగరిమంబుఁ దనలోనె తావలచి
నృత్యంబు వెలయించి నృత్తంబు ఝళిపించి
నృత్త నృత్యములు శబలితముగాఁ జూపించి
లాస్యతాండవ భేద రచనాగతులు మీఱ
వశ్యులై సర్వదిక్పాలకులు దరిఁజేర
ఆడెనమ్మా శివుఁడు
పాడెనమ్మా భవుఁడు

శివుడు నిర్వర్తించే సృష్టి కార్యక్రమంలోని పంచక్రియలను తెలిపే సప్త తాండవాలను ఆలయాలందు పూజా సమయంలో ప్రదర్శిస్తారు. శంకరుని సప్త తాండవములు:

1. ఆనంద తాండవము: ప్రపంచ సృష్టిని చూసి ఆనందమును వెలిబుచ్చుతూ ఈశ్వరుడు సలిపే తాండవమే ఆనంద తాండవము. ‘డుమడుమత’ అంటూ శివుని కుడిచేతిలోని డమరుకం సృష్టికి కారణహేతువైన నాదాన్ని పలుకుతుంటే, సృష్టియందలి జీవకోటి సంచలనం శివుని ఆంగికాభినయంలో ప్రజ్వరిల్లుతుంది. ప్రకృతిలోని వివిధ నాదములే అతని వాచికాభినయము. చంద్రతారలాతని అలంకారములు. మానవుని చిత్త ప్రవృత్తియే అతని సాత్వికాభినయము.

2. సంధ్యా తాండవము: సృష్టి నిరాటంకముగా సాగిపోతోందన్న సంతోషంతో శంభుడు చేయు నృత్యమే సంధ్యా తాండవము. పార్వతీ దేవి మణిమయ సింహాసనాధిష్టితయై ఉండా, ఇంద్రుడు మురళిని ఊదుతుంటే, బ్రహ్మ తాళానికనుగుణంగా విష్ణువు మృదంగమును, సరస్వతీదేవి వీణను వాయిస్తారు. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు ఆనందముతో రుద్రుని ఆనంద తాండవాన్ని కనులారా వీక్షిస్తారు.

కైలాస శిఖరములు కడఁగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగధ్వానములు బొదలఁ
తుందిలాకుపార తోయపూరము దెరలఁ
జదలెల్లఁ గనువిచ్చి సంభ్రమత తిలకింప
నదులెల్లఁ మదిఁబొంగి నాట్యములు వెలయింప
వనకన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధయెల్లను జీవవంతమై బులకింప
నాడెనమ్మా శివుఁడు
పాడెనమ్మా భవుఁడు

3. కలిక తాండవము: అజ్ఞానము, అవినీతి వంటి దుష్టశక్తులను తుదముట్టించి, అఖండ జ్యోతిని వెలిగించి. ప్రపంచాభివృద్ధిని కొనసాగించటానికి దుష్టశక్తుల చంఢాడే అంగచలనమే కపాలధరుని కలిక తాండవము.

4. విజయ తాండవము: పూర్వము కొందరు ఋషులు ప్రపంచ శ్రేయస్సుకు భంగం వాటిల్లే విధంగా తమ శక్తులను వినియోగించ సాగారు. వారిని సన్మార్గమునుకు తీసుకురావడానికి అర్థనారీశ్వరుడు ఋషి రూపము తాల్చి అరణ్యములకు వెళ్లెను. ఆ మునులు రుద్రుని వల్ల భంగపాటుకు గురై పరమేశ్వరుని పరిమార్చడానికి హోమకుండములో ఒక క్రూర వ్యాఘ్రమును సృష్టించారు. రుద్రుడా పులిని పట్టుకుని దాని చర్మాన్ని తన చిటికెన వ్రేలితో ఒలిచి తన నడుము చుట్టూ అలంకారముగా ధరించాడు. దానితో మునులు క్రూరమైన ఉరగమును సృష్టించారు. దానిని శివుడు మాలగా ధరించి, నాట్యమాడెను. చివరగా, గజాసురుడనే దుష్టశక్తి ఆ హోమకుండం నుంచి శివునిపై కురికెను. దానిని పరమేశ్వరుడు తన పాదంతో తొక్కి, వెన్నుముక్క విరిచి, దానిపై విజయతాండవం చేసెను.

అగర్వసర్వమంగళా కళాకదంబ మంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

5. ఊర్థ్వ తాండవము: సృష్టికి ఆధారభూతమైన ప్రకృతి, పురుష శక్తుల అంతః కలహమే దీనియందలి అంతరార్థము. తాండవమందు శివుడు నిపుణుడు. లాస్యమున నేర్పరి పార్వతి. వారి మధ్య నాట్య సంవాదాన్ని వీక్షించడానికి రెండు కన్నులు చాలవు. విష్ణువు చేతిలో పెళ, పెళమని మృదంగం మోగింది. బ్రహ్మ లయకు సరస్వతి చేతిలో వీణ ఝూంకరించింది. ఇంద్రుడు మురళి ఊదగా, నారదుడు తంబుర మీటెను. ‘భాంభోం’ మని శంఖనాద ప్రతిధ్వనించగా, తళతళమని చంద్రరేఖ మెరిసింది. దూరాన నిలిచియున్న కుమారస్వామి వాహనమగు నెమలి శంకరునితో కలిసి అడుగులు వేయసాగెను. సరస్వతి సమీపానున్న మరాళము మందగమనమును సవరించుకున్నది. అప్సరసాదులు తమ నృత్యకరణులు, చారులు, రేఖలలోని దోషాలను దిద్దుకున్నారు. గౌరి శంకరుల ఈ ద్వంద్వ నృత్యమే ఊర్థ్వ తాండవము.

6. ఉమా తాండవము: ఉమాశంకరులు భూతగణముతో కూడి స్మశానవాటిక యందు సల్పే నృత్యమిది. తమోగుణ ప్రధానుడై పదిభుజములతో వీరభద్రుడు, వీరభైరవుడని శివుడు, వీరభైరవియని అంబయు పిలవబడతారు. మండుతున్న చితుల నుంచి వెలుగు రూపంలో శరీరములను వదలిన జీవాత్మలు ఒక్కొక్కటిగా వచ్చి వీరిలో ఐక్యమవుతుంటే, పటపట ధ్వనులతో భూమి దద్దరిల్లుతోంది. ధూళి మింటికేగుతుంటే,

భావాంబరమున కావల వెల్గు దైవంబు
భావగోపీనాథుఁడై వేడ్కఁ జెలఁగించి
రాగిణీవిభ్రమము లక్కడక్కడ దీర్చి
రాగాలపనజన్య రమణీయతలు బేర్చి
యొకయడుగు జననంబు, ఒకయడుగు మరణంబు
ఒకభాగమున సృష్టి, యొకవైపు బ్రళయంబుఁ
గనువింపఁ దిగకన్నుఁగొనలు మిన్నుల నంట
మునిజనంబుల హృదయములు దత్పదం బంట
నాడెనమ్మా శివుఁడు
పాడెనమ్మా భవుఁడు

7. సంహార తాండవము: ప్రతి జీవాత్మ తుది గమ్యం విశాలమైన స్మశాసన వాటికే అన్న జీవన సత్యాన్ని తెలుపుతున్నట్టుగా దేహమంతా విభూతి ధరించి, జడలు కట్టిన శిరోజాలపై చంద్రకళాప్రభ శోభిల్లుతుంటే పద్మాసనోపవిష్టుడైన పరమశివుడు ఇచ్చట ధ్యానముద్రలో మనకు దర్శనమిస్తాడు. జీవికోటిని తనలో మరల ఐక్యంబొనర్చుకుంటూ, సృష్టి, స్థితి, సంహార, అనుగ్రహ, తిరోధానము అనే పంచకృత్యములను సూచించే సప్త శివతాండవములలో కడపటిది ఈ తాండవం.

ప్రతితారకము విచ్చి, ప్రత్యణువుఁ బులకించి
శితికంఠునకు నపుడు సెల్లించినది సేవ,
యానందసాగరం బంతటనుఁ గవిసికొన
మీనములుఁ దిమిఘటలు మేదినీజీవములు
బ్రతి ప్రాణిహృదయమ్ము వల్లకీవల్లరిగ
మతిమఱచి పాడినది మధురసంగీతమ్ము,
జగమెల్ల భావంబె, సడియెల్ల రాగంబె
జగతియే యొక నాట్యసంరంభముఁనుగాగ

నాడెనమ్మా శివుఁడు
పాడెనమ్మా భవుఁడు

 

 

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *