శరన్నవరాత్రులు - శ్రీ త్రిపురసుందరి

దైవీ ప్రవృత్తులను కలసి అఖండ విశ్వవ్యాపక చైతన్యశక్తిని జాగృతం చేసి, లోక హింసాకారకులైన రాక్షసశక్తులన్ని నశింపజేసే విజయమే నిజమైన విజయం. మన చుట్టూ ఉన్న జగత్తులో ఆ విజయం సంభవిస్తే లోక క్షేమకరం. వ్యక్తిలో దనుజ ప్రవృత్తిని దైవీ ప్రవృత్తి జయిస్తే అది వ్యక్తికి సార్ధకత. ఈ విజయానికి సంకేతంగా జరుపుకునే పర్వదినమే ‘విజయ దశమి’.

నవరాత్రుల పూజ తరవాత దశమితో పండగలు ముగుస్తాయి. ‘నవ’ సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. తొమ్మిది పూర్ణ శక్తి. నక్షత్రాలలో మొదటిదైన ‘అశ్వని’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ‘ఆశ్వయుజం’. ఒక విధంగా – నక్షత్రగణనతో ఇది సంవత్సరానికి మొదటి మాసం. ఈ తొమ్మదిరోజులు విశ్వ చైతన్య శక్తిని (పరాశక్తని – ఆదిశక్తిని) ఆరాధించేవారు పూర్ణంగా సంవత్సరారాధన ఫలాన్ని పొందుతారు. యోగపరంగా అంతర్ముఖావలోకనమే రాత్రి. ఆ సాధనలో విశ్వమంతటా వ్యాపించిన అఖండ శక్తిని గమనించగలుగుతాం. అదే మనలోనూ సంచరిస్తోందని తెలుసుకున్నాక – మన అహంకారాలు, సంకుచిత దృష్టులూ అంతరిస్తాయి. ఆ అపరమిత శక్తినే వైష్ణవి, జగజ్జనని, శ్రీమాత, దుర్గ, లక్ష్మీ, సరస్వతి మొదలైన వివిధ నామాలతో భావించడం ఈ సాధనల విశేషం. మనలోని పరమిత శక్తిని ఆ అఖండ శక్తితో అనుసంధానం చేస్తే – ఈ వ్యష్టి చైతన్యం వ్యాప్తమై అనంతమైన శక్తులను జాగృతం చేసుకుంటుంది. ఆ శక్తిని ‘త్రిపురసుందరి’ అన్నారు. ఈ నామంలో ఎంతో వైశిష్ట్యం ఉంది. ఈ ప్రపంచమంతా ‘త్రిపురం’, ‘పురం’ అంటే చోటు అని అర్ధం. ఈ చోటు అనేది దేశకాలాత్మకం. ‘దేశం’ (స్థానం) లోకం. అదికాలానికి నిబద్ధమై ఉంటుంది. లోకం, కాలం కలిపి పురం.

ఈ విశ్వమంతా త్రిపురమే. మనమున్న చోటు నడిమిభాగం. దానికిపైన ఊర్ధ్వలోకాలు … కింద అధోలోకాలు. ఈ ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు – మూడు లోకాలు. అలాగే భూత, భవిష్య, వర్తమానాలు. వ్యాపించిన గుణాలు సత్త్వ, రజస్తమో గుణాలు. జరిగే పనులు – సృష్టి, స్థితి, లయలు. ముగ్గురు వేల్పులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఓంకారం మూడు అంగాలు – అ, ఉ, మ. వేదానికి ప్రధానంగా మూడు రకాల మంత్రాలు – ఋక్, యజు, స్సామములు.

ఇలా అన్నీ ‘త్రి’పురాలే. ఇక మనలో భౌతిక, ప్రాణిక, మానసిక శక్తులు మూడు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు. జాగ్రత్, స్వప్త సుషుప్తులు మూడు. యోగపరమైన నాడులు మూడు – ఇడా పింగళ సుషుమ్న. ఇలా బైటా, లోపలా ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే. ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే – త్రిపుర సుందరి.

ఇంతకీ ఏమిటీ సౌందర్యం? చైతన్యమే సౌందర్యం. ఈ చైతన్యమనే సౌందర్యమున్నప్పుడే జీవిలో ‘నేను’ అనే స్ఫురణ. అటుపై బుద్ధిశక్తి, మనశ్శక్తి, ఇంద్రియశక్తి పనిచేస్తాయి. సర్వశక్తులకు మూలం ఈ చైతన్యమే. కనుక దీనిని ‘ఆదిశక్తి’, ‘పరాశక్తి’ అని భావించారు. ఆ సౌందర్యాన్ని అమ్మా అని పిలిస్తే ‘సుందరి’. ఆ శక్తి అనుగ్రహమే అంతా అని తెలియనివాడు అంతా తన నిర్వాకమే అనుకుంటాడు. మన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో వ్యాపించిన ఆ శక్తిని పరాశక్తిగా గుర్తించని అజ్ఞానమే త్రిపురాసుర లక్షణం. దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి. ఆ జ్ఞానం లభించడమే త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర అజ్ఞానం నశిస్తేనే త్రిపురసుందరిని తెలుసుకోగలం.

త్రి-పురా, ఈ మాటా చాలా అద్భుత శబ్ధం. ‘పురా’ అంటే చోటు అనేకాకా ‘పూర్వము’ అని కూడా అర్ధం. ఈ మూడుచోట్లు (మూడు లోకాలు, మూడు స్థితులు, మూడు కాలాలు వగైరా) కలుగక ‘పూర్వమే’ ఉంది ఆ సౌందర్యం. మూడింటికీ పూర్వమున్నదీ, మూడు నశించినా తాను నశించనిది ‘త్రిపురం’. పదార్ధంకన్నా ముందున్నది శక్తి. అందుకే అది ‘త్రిపురా’, ‘పురాణాత్ పురా’ – ‘నిండినది’ అని కూడా ‘పురా’ శబ్ధానికి అర్ధం.

త్రి కూడిని విశ్వంలో నిండినది ఇదే. ముందున్నదీ, నిండినదీ అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం. అందుకే అది ‘లలిత’. జీవరాశి అంతా ఆ శక్తినే ‘ఆశ్రయించుకు’న్నది, ఆ శక్తినే ‘శ్రీ’ అంటారు. ఈ శబ్ధానికి ఆశ్రయమనేకాక, శోభ, కాంతి, ఐశ్వర్యం అనే అర్ధాలున్నాయి. ఈ వివరణను చూస్తే సౌందర్యానికన్నా ఐశ్వరమేమున్నది. చైతన్యమే లేకపోతే శోభ, కాంతి ఉండవు. అందుకే సౌందర్యలహరియే శ్రీమాత. ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని, దుష్టత్వాన్ని తొలగించడమే దుర్గారాధన. దుర్గతి, దుష్టత్వం వీటిని సమూలంగా నాశనంచేసే దివ్యత్వమే దుర్గాదేవి.

(సామవేదం షణ్మఖశర్మగారి ‘ఏష ధర్మః సనాతనః’లో త్రిపురసుందరి వివరణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *