వేంకటాద్రిపై నెలకున్న పుణ్యతీర్థాలు

మహర్షుల చేత, యోగాభ్యాసుల చేత సేవింపబడిన జలాలను కూడా పుణ్యతీర్థాలు అని పిలుస్తారు. అట్టి 66కోట్ల పుణ్యతీర్థాలు బ్రహ్మాండనాయకుడు విరాజిల్లే శేషాద్రినిలయాన ప్రకాశించుచున్నాయని బ్రహ్మాండపురాణం, స్కంద పురాణం తెలుపుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైన తీర్థరాజాలను ధర్మరతి ప్రదములు (1008), జ్ఞానప్రదములు (108), భక్తివైరాగ్య ప్రదములు (68) మరియు ముక్తి ప్రదములు (7) అని నాలుగు విధాలుగా విభంజిచవచ్చు.

ఈ తీర్థాల స్నానం మానవులకు ధర్మాసక్తిని కలుగజేసి కర్మ, భక్తి, వైరాగ్య యోగ సంపదన కలిగించటంతోపాటు సర్వపాపములను తొలగించి ముక్తిసాధనకు తోడ్పాడుతాయి. అయితే, ధర్మరతి ప్రదమగు తీర్థములకంటే జ్ఞానప్రద తీర్థాలు, వాటికంటే భక్తివైరాగ్య తీర్థములుత్తమమైనవని ప్రతీతి. కాగా, ముక్తిప్రదములగు ఈ సప్త తీర్థములు పరమోత్తమములగు తీర్థములుగా బ్రహ్మ పురాణం తెలుపుతోంది. ఈ సప్త తీర్థములు వరసగా – 1. శ్రీస్వామి పుష్కరిణీ తీర్థము, 2. కుమారధారా తీర్థము, 3. తుంబురు తీర్థము, 4. రామకృష్ణ తీర్థము, 5. ఆకాశగంగా తీర్థము, 6. పాపవినాశన తీర్థము, 7. పాండవ తీర్థము (గోగర్భ తీర్థము). వీటిలో రామకృష్ణ తీర్థము మినహా మిగిలిన ఆరు తీర్థాలను ముక్తిప్రదాతలుగా స్కంద పురాణం అభివర్ణించింది. రామకృష్ణ తీర్థం స్థానే దేవ తీర్థమును చేర్చి సప్త తీర్థాలను ముక్తి ప్రదములుగా వరహ పురాణం పేర్కొంది.

పర్వ సమయములు: తీర్థ స్నానం ఎప్పుడు ఆచరించినా, సేవించినా విశేష ఫలితాలు లభిస్తాయనటంలో సందేహంలేదు. మానవుల పాపాలను తొలగించే మూడుకోట్ల యేబది లక్షల పుణ్యతీర్థములు తమకు సంక్రమించిన పాపాలను తొలగించుకోవడానికి సప్తతీర్థాల పర్వ సమయాలలో వాటి యందు చేరుతాయి. అందుకే తీర్థాల పర్వసమయంలో స్నానమాచరిస్తే మూడుకోట్ల యేబది లక్షల పుణ్యతీర్థాలలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది.

1. శ్రీ స్వామిపుష్కరిణీ తీర్థము: ధనుర్మాసములో శుద్ధ ద్వాదశీదినమున అరుణోదయ కాలమునందు ఆరుఘడియల సమయము పర్వసమయము.
2. కుమారధారా తీర్థము: కుంభమాసమందు మఖా నక్షత్రముతో కూడిన పూర్ణిమ దినము పర్వదినము.
3. తుంబురు తీర్థము: మీనమాసమందు ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన పూర్ణిమ అపహర్ణా కాలము పర్వకాలము.
4. రామకృష్ణ తీర్థము: మకరమాసమందు పుష్యమీ నక్షత్రముతో కూడిన పూర్ణిమ పర్వదినము.
5. ఆకాశగంగా తీర్థము: మేషమాసమందు చిత్రా నక్షత్రముతో కూడిన పూర్ణిమ దినము పర్వదినము.
6. పాపవినాశన తీర్థము: ఆశ్వయుజ మాసమందు శుక్ల పక్షమున ఉత్తరాషాఢా నక్షత్రముతో కూడిన సప్తమీ ఆదివారము లేక ఉత్తరాభాద్రా నక్షత్రముతో కూడిన ద్వాదశీదినము పర్వ సమయము.
7. పాండవ తీర్థము: వృషభమానసమునందు శుద్ద ద్వాదశీ ఆదివారము గాని లేక బహుళ ద్వాదశీ మంగళవారముగాని ఉదయము ఆరు ఘడియల నుంచి 12 ఘడియల వరకు గల కాలము (సంగమ కాలం) పర్వదినము.

సప్తతీర్థాల విశిష్టత

స్వామిపుష్కరిణీ తీర్థం: ముల్లోకాములలో గల సకల తీర్థములకు స్వామియగునట్టి స్వామి పుష్కరిణీ తీర్థ విశేషాలు మనకు అనేక పురాణాలలో గోచరిస్తాయి. సర్వతీర్థ సమన్వయ కాలమున ఈ తీర్థాన స్నానమాచరించటం ద్వారా సర్వతీర్థ యాత్రసిద్ధి, స్నానఫలప్రాప్తి కలుగుతుందని బ్రహ్మ, మార్కండేయమునికి తెలిపినట్టుగా వామన పురాణం చెపుతోంది.
స్వామి పుష్కరిణీ స్నానం, వేంకటేశ్వర దర్శనమ్
మహాప్రసాదస్వీకారః, త్రయం త్రైలోక్యదుర్లభమ్

ముల్లోకాలందు శ్రీ స్వామి పుష్కరిణీ స్నానము, శ్రీవేంకటేశ్వర దర్శనము, మహాప్రసాదలాభము పూర్వజన్మసుకృతం వల్ల లభించగలదని భవిష్యత్తు పురాణం తెలుపుతోంది. అంతేకాక, ఈ పుష్కరిణీ స్నానం అపస్మారము, భూతావేశము వంటి సర్వదోషములను నివారించటంతోపాటు అశ్వమేధయాగ ఫలము, గోసహస్రదాన ఫలము, లక్ష్మీవైభవమును, బ్రహ్మజ్ఞానమును పొందగలరని స్కందపురాణం నిర్థేశిస్తోంది. అలాగే యే జలాశయమునందైన స్వామి తీర్థం, స్వామి తీర్థం, స్వామి తీర్థమని ముమ్మార్లు స్మరించి స్నానమాచరించిన స్వామిపుష్కరిణీ తీర్థము సకలవాంఛితాలతోపాటుగా బ్రహ్మ పదమును ప్రసాదించగలదని వేదవ్యాసులు తెలిపారని కూడా స్కందపురాణం ఈ తీర్థ మాహాత్మ్యాన్ని చాటుతోంది.

స్వామి పుష్కరిణి యందు మహాశక్తివంతమగు, మార్కండేయ తీర్థము, యామ్య తీర్థము, వశిష్ఠ తీర్థము, వారుణవాయు తీర్థములు, ధనదతీర్థము, గాలవ తీర్థము, సరస్వతీ తీర్థమను నవ తీర్థములున్నాయని బ్రహ్మపురాణంలో చెప్పబడింది. విష్ణుపాదోద్భవమై బ్రహ్మకరస్పర్శతో ప్రవిత్రమైనది ఈ స్వామితీర్థమని వరాహ, పద్మపురాణాలు కూడా స్వామిపుష్కరిణీ కీర్తించాయి.

కుమారధారా తీర్థము: తిరుమలలో వేంకటేశ్వరుని సన్నిధానానికి వాయువ్యదిగ్భాగమున అయిదుమైళ్ళ దూరంలో ఈ తీర్థం విరాజిల్లుతోంది. ఈ తీర్థమునకు సంబంధించిన ప్రశస్తి మనకు వరాహ, మార్కండేయ పురాణాలలో కన్పిస్తుంది. దేవాసుర యుద్ధంలో తారకాసురుని వధించం వల్ల బ్రహ్మహత్యాదోషాన్ని పొందిన కుమారస్వామి, ఆ దోషనివారణార్థం స్వామిపుష్కరిణి, పాపనాశనములో స్నానమాచరించి, పిదప కుమారధారాతీర్థం వద్ద వేంకటేశ మంత్రం జపిస్తూ తపస్సు చేశాడు. మాఘపూర్ణిమా బుధవారము, మాఘనక్షత్రమున మధ్యాహ్న సమయంలో శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్కరించి, కుమారస్వామిని దోషనివృత్తిని కావించటంతోపాటు, ఈ తీర్థము కుమారధారికా తీర్థంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చినట్టు మార్కండేయ పురాణం తెలుపుతోంది. అందుచే మాఘపూర్ణిమాదినమందు స్వామిపుష్కరిణీ తీర్థం కంటే ఈ తీర్థ స్నానమే శ్రేష్టం.

తుంబుర తీర్థం: వేంకటాద్రిపై స్వామిసన్నిధానానికి ఏడున్నర మైళ్ళ దూరంలో ఈ తీర్థం కలదు. బ్రహ్మోత్తర ఖండము, స్కంద పురాణాలలో ఈ తుంబుర తీర్థం గురించి విశిష్టంగా ప్రస్తావించబడింది. శాపవశాత్తు వేంకటాద్రి మధ్యముగా గల ఘోణతీర్థభాగమును చేరిన తుంబురుడు ఒక సంవత్సరంపాటు ఆ తీర్థ సమీపాన స్వామివారి కొరకు తపస్సు నాచరించాడు. ఫాల్గుణమాస పూర్ణిమతిథినాడు లక్ష్మీసమేతుడై స్వామివారు తుంబురనకు దర్శనమిచ్చినట్టుగా బ్రహ్మోత్తర ఖండం పేర్కొంది. తుంబురుడు స్నానమాచరించటం వల్ల ఈ తీర్థానికి తుంబుర తీర్థమని పేరువచ్చింది. ఈ తీర్థము ప్రాయశ్చితములకు సాధ్యపడని మహాపాపములను కూడా తొలగిస్తుందని బ్రహ్మోత్తరఖండం తెలుపుతోంది.

ఆకాశగంగ తీర్థము: వేంకటాద్రిపై ఆనందనిలయానికి రెండుమైళ్ళ దూరంలో ఆకాశగంగ తీర్థం ప్రకాశిస్తోంది. స్వర్గమర్త్యపాతాళముల యందు ప్రవహించే గంగను ‘త్రిపథ’ అని కీర్తిస్తారు. ఆకాశభాగన ప్రవహించే ఈ గంగ ఆకాశగంగగా సర్వేశ్వరుడు, ఆత్మేశ్వరుడైన శ్రీవేంకటేశుని అభిషేకారాధనాది కైంకర్యలకు వినియోగించబడుతోంది. భవిష్యోత్తర పురాణము, స్కాందపురాణము ఆకాశగంగ విశిష్టతను మనకు తెలుపుతున్నాయి. కేసరి భార్య అంజన ఆకాశగంగతీర్థంలో స్నానం చేసి, ఆ తీర్థ పరిసరాలలో 12సంవత్సరాలు తపస్సు చేసి దైవానుగ్రహం వల్ల హనుమంతునికి జన్మనిచ్చిందని భవిష్యోత్తర పురాణం చెపుతోంది.

పాపవినాశన పుణ్యతీర్థము: వేంకటేశ్వర సన్నిధానానికి రెండున్నరమైళ్ళ దూరంలో ఈ తీర్థం కలదు. స్కంద పురాణంలో బ్రహ్మరాక్షస బాధను, దారిద్ర్య నివారణను ప్రసాదించే ముక్తిదాయిని పాపవినాశన తీర్థ విశేష గాథలు మనకు అనేకం లభ్యమవుతాయి.

పాండవపుణ్య తీర్థము: ఐహిక ఫలప్రదాయిని, ఆముష్మిక ఫలప్రదాయినైన పాండవపుణ్య తీర్థం ఆనందనిలయానికి అరమైలు దూరంలో ఉంది. ఈ తీర్థ సమీపాన ధర్మరాజాది పాండవులైదుగురు ఇచ్చన సంవత్సరంపాటు ధార్మిక కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా పుణ్యయోగమును పొంది విజయలక్ష్మిని వరించారని వరహపురాణం తెలపుతోంది. పాండవులు రాజ్యలాభము పొందిన ఈ తీర్థం పాండవపుణ్యతీర్థంగా ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా, జ్ఞాతి వధచే లభించిన పాపాలను ప్రక్షాళను చేసుకోవడానికి ఈ తీర్థ మందు శ్రీ వేంకటేశ్వరుని ఆజ్ఞానుసారం స్నానమాచరించి పాపావిముక్తులయ్యారని, కాన ఈ తీర్థం పాండవ తీర్థంగా ప్రసిద్ధి కెక్కిందని పద్మపురాణం విశదీకరిస్తోంది.

రామకృష్ణ తీర్థము: మకరమాసంలో పుష్యమీ నక్షత్రముతో కూడిన పూర్ణిమనాడు శ్రీరామకృష్ణ తీర్థముక్కోటి అనే పేరుతో భక్తజనం ఈ తీర్థములో స్నాన, దాన, జపాలను ఆచరించి తదుపరి స్వామివారిని సేవిస్తారు. పూర్వం రామకృష్ణ మహర్షి ఈ తీర్థ ప్రాంతంలో తపస్సును ఆచరించ వల్ల ఈ తీర్థానికి రామకృష్ణ తీర్థమన్న పేరు వచ్చిందని స్కంద పురాణం వివరిస్తోంది.

ముక్తిప్రదములగు ఈ తీర్థ పర్వదినాలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవమేగాక, శ్రీస్వామిపుష్కరిణీతీర్థ ముక్కోటి, కూమారధారా తీర్థ ముక్కోటి, తుంబురతీర్థ ముక్కోటి అనే ఉత్సవాలు కూడా తిరుమలలో జరుగుతాయి. సర్వమంగళదాయకమైన అరవై ఆరుకోట్ల పుణ్యతీర్థాలు తిరుమల సప్తగిరుల యందు ప్రకాశిస్తూ, భక్తులకు ముక్తిని ప్రసాదిస్తున్నాయని బ్రహ్మపురాణం వివరిస్తూ, ఇందు కొన్ని మాత్రమే నామసంకీర్తనకు ప్రాతులని తెలిపింది. అలా నామసంకీర్తన గావించబడుతున్న ప్రధాన పుణ్య తీర్థాలలో సప్తర్షితీర్థములు, అష్టభైరవ తీర్థములు, నవప్రజాపతి తీర్థములు, దశావతార తీర్థములు, ఏకాదశ రుద్రతీర్థములు, ద్వాదశాదిత్య తీర్థములున్నాయి. ఇవికాక, శ్రీనివాసుని దివ్యాలయ పూర్వభాగంలో ‘అస్థి పరోవరమ’నే అపమృత్యునివారకమగు మహాశక్తివంతమైన పుణ్యతీర్థం కూడా ఉందని వరాహ, బ్రహ్మాండ పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణమ్
విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయకమ్

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *