రామాయణము(లు) 3 తెలుగు రామాయణాలు

భారత దేశంలో ఏ మూలకెళ్లినా రామాయణ గాథ వినపడక మానదు! తెలుగునాట నాలుగు ఇళ్లున్న వాడలో రామ మందిరం లేకుండా ఉండదు! తెలుగునాట రామాయణం నిత్య పారాయణ గ్రంథం. ‘శ్రీరామ’ పదం చుట్టకుండా తెలుగువాడెవడు రాత మొదలెట్టడు.‘శ్రీ రామ రక్ష’ అని బిడ్డలను ఆశీర్వదించని తల్లీ ఉండదూ. పవిత్ర గోదావరీ తీరం సీతారాముల పాద స్పర్శతో పావనమగుచేత కామోసు సీతారాముడు ఆంధ్రులకు ఆరాధ్య దైవమైనాడు. శ్రీరామ గాథ తెలుగు కవులకు ఎంతో ప్రీతికరమైన, పుణ్యప్రదాయక, మోక్షదాయక ఇతివృత్తం. తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు మరో భాషలో లేవంటే అతిశయోక్తికాదు. దాదాపు 85 రామాయణ కావ్యాలు (ఇందు సంస్కృత, ఇతర భాషా అనువాదాలు, వాల్మీకి రామాయణానికి అనువాదాలు, పద్య,గద్యాలు కలవు), 61 జానపద రామాయణాలు కలిపి మొత్తం 146 రామాయణాలున్నాయని పరిశోధకుల అభిప్రాయం.

తిక్కన మహాకవి తన ఉత్తర రామాయణంలో,

‘‘ ఎత్తఱి నైనను ధీరో
దాత్తనృపోత్తముడు రామధరణీపతి స
ద్వృత్తము సంభావ్య మగుట
నుత్తర రామాయణోక్తియుక్తుడనైతిన్’’

అని ధీరోదాత్తనృపోత్తముడైన రామచంద్రుని చరిత్రం సర్వదా సర్వదా సత్కవులకు సంభావ్యమని నిర్వచించాడు. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, కంకటి పాపరాజుగారు తన ఉత్తర రామాయణంలో, ‘‘చారు కవిత్వము నేర్చి జానకీ జానికథల్ వచింపక యసత్కథలెన్ని రచించెనేనియున్, వాని వివేక మేమిమటికి? వాని కవిత్వ మహత్త్వ మేటికిన్?’’, తాను కవినని చెప్పుకున్న వాడెవడైనా రామాయణ చరిత రాయకున్న వ్యర్ధమని నొక్కివక్కాణించాడు. అందుకనే నాటి తిక్కన నుండి నేడి విశ్వనాథుని వరకు అనేకానేకులు రామయణ గాథ అక్షర రూపమిచ్చారు. రామ కావ్యం రాయని వారుకూడా ఏదో విథంగా రామ వృత్తాంతాన్ని తమ కావ్యాలలో జోడించారు. ఉదాహరణకు పోన్నకంటి తెలగన్న తన ‘యయాతి చరిత్ర’లో రామకథను కూర్చగా, మను చరిత్రాది ప్రబంధాలలో దశావతార వర్ణనలో రామావతార వర్ణను విస్తృతంగా చేర్చాడు.

వీరేకాకా భారత, భాగవతాలను ఆంధ్రీకరించిన తిక్కన, ఎఱ్ఱాప్రగడలు, పోతనామాత్యుడు కూడా రామయణాన్ని విస్మరించలేదు. ఉభయఫ్రౌడి తిక్కన వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను నిర్వచన పద్యకావ్యం, ‘నిర్వోచణోత్తర రామాయణం’గా ఆంధ్రీకరించాడు. మార్కండేయుడు ధర్మరాజుకు విశిదీకరిస్తున్నట్టుగా, ఆంధ్రమహాభారతం అరణ్యపర్వంలో 300ల పద్య, గద్యాలతో ఎఱ్ఱాప్రగడ రామాయణాన్ని వర్ణించాడు. కాగా, పోతన ఆంధ్రమహాభాగవతం తొమ్మదివ స్కంధంలో 100 పద్యాలతో రామచరితను తెలిపాడు. అలాగే పిళ్లమర్రి పినవీరభద్రుడు జెమినీ భారతంలో లవకుశ ఘటాన్ని చేర్చాడు. ఇవి ఉపాఖ్యాన రామయాణాలుగా ప్రసిద్ధి చెందాయి.

ఇక దేవభాషని ఖ్యాతిగాంచిన సంస్కృతంలో తప్ప రామాయణ గొప్పదనం, తెలుగు భాషల్లో ఉండదనేవారికి సమాధానంగా,

తెనుగు చదువున బున్నియంబెనయదనుచు
గొందఱాడుదు రాడిన గొఱతయేమి
సిరిమరాయంచు నుడివిన చెనటిబోయ
నెఱ నిరాబరియగుటయె గుఱుతుగాదె.

కూచిమంచి తిమ్మకవి తన అచ్చతెనుగు రామయణంలో, భాష ప్రధానం కాదు. భక్తిభావమే తప్ప అని పైవిధంగా తెలియచేశాడు. ఈ విధంగా కవులు అనేకరీతుల్లో తెలుగుభాషా విశేషాన్ని, రామాయణ కావ్య రచనా విశిష్టతను చాటారు.

ఇకపోతే, తెలుగు రామాయణాలన్నింటిలోనూ మొట్టమొదటిది గోనాబుద్ధారెడ్డి దేశీ సంప్రదాయాలను జోడించి రాసిన ద్విపద రామాయణం – ‘రంగనాథ రామాయణం’. రెండవది మార్గకవితా పద్దతిలో వెలువడిన ‘భాస్కర రామాయణం.’

రంగనాథ రామాయణం: ‘‘ఆతత కృతిపేర అతిపుణ్యుపేర, మా తండ్రి విట్టలక్ష్మానాథు పేర’’ , ఈ రామాయణ గాథను రచిస్తున్నట్టు బుద్ధారెడ్డి అవతారికలో చెప్పుకున్నాడు. ఇందు ఆరుకాండాలలో మొత్తం 17,290 ద్విపదలున్నాయి. కాగా ఉత్తరకాండములోని 5640 పద్యాలను బుద్ధారెడ్డి కుమారులు కాచవిభుడు, విట్టలనాథుడు పూర్తి చేశారు. ‘ఆదికవీశ్వరుడైన వాల్మీకి చెప్పిన తెరగున శ్రీరాము చరితము చెప్పుదు’, నని గోన బుద్ధారెడ్డి చెప్పాడు. అయినా ఇందు అవాల్మీకాలు చోటు చేసుకున్నాయి. చమత్కారం కోసం, రసపుష్టికోసం, కథాగమనం కోసం ఇతర రామాయణాల నుంచి, జనవాణి నుంచి కథనాలను తీసుకోని రంగనాథ రామాయణమందు కవి చొప్పించాడు.

ఉదాహరణకు లక్ష్మణుడు పర్ణశాలలో సీతను ఒంటరిగా వదలి వెళ్లుతూ ఏడుగీతలు గీసి ఏ పరిస్థితిలోనూ వీటిని దాటి రావలదని చెప్పె ఘట్టం, రావణుని సభలో హనుమంతుడు తన వాలాన్ని సింహాసనంగా చేసుకొని కూర్చొనుట, సేతుబంధ సమయంలో ఉడత సహాయం చేయటం, సంజీవిని తీసుకురావడానికి వెళ్లిన మారుతిని కాలనేమి అడ్డగించటం వంటి కథనాలు, రావణుని వల్ల వెడలుగొట్టపడ్డ విభీషణుడు తల్లి వద్దకు వెళ్లి కర్తవ్యం బోధించమనగా, తల్లి అతనిని రాముని శరణు కోరమనడం కూడా అవాల్మీకాలు.

భాస్కర రామాయణం: ఈ రామాయణ రచన సుమారు క్రీ.శ. 1290-1310 మధ్యకాలంలో జరిగినట్టు తెలుస్తోంది. దీనిని నలుగురు కవులు కల్సి రచించారు. వీరు హుళక్కి భాస్కరుడు, ఆయన పుత్రుడు మల్లిఖార్జునభట్టు, నిశ్శంక వీరమారయ కుమారుడు, భాస్కరుని శిష్యుడు కుమార రుద్రదేవుడు చివరగా అయ్యలార్యుడు. ఇందు బాలకాండములో 785, కిష్కింధ కాండములో 832, సుందరకాండములో 573 మొత్తం 2190 గద్య, పద్యములను మల్లిఖార్జునభట్టు రచించాడు. అరణ్యకాండములో 784, యుద్ధకాండములో 1140 గద్య, పద్యములను హుళ్ళక్కి భాస్కరుడు, యుద్ధకాండములో 1546 గద్యపద్యమలను అయ్యలార్యుడు, మిగిలిన అయోధ్యకాండలో 455 గద్య, పద్యములను కుమార రుద్రదేవుడు రచించారు. భాస్కర రామాయణము స్వతంత్రానువాదమైనప్పటికీ ఇందు ఆథ్యాత్మిక రామాయణంలోని కథాంశాలతోపాటు కొన్ని అవాల్మీకములు లేకపోలేవు.

భాస్కరా రామాయణం ఆథ్యాత్మిక, రంగనాథ రామాయణాలతో ప్రేరణచెందినట్టుగా మనకు అన్పిస్తుంది.. అందులో వలె ఇందులో కూడా గౌతముడు అహల్యను శిల కమ్మని శపించటం, రాముడు చిన్ననాడు మందరను కాలుతో తన్నటం, శూర్పణఖ కుమారుడైన జంబుకుమారుని వథ, కాలనేమి కథ ఉన్నాయి. భర్తావియోగంతో తార రామునికి జానకీ వియోగం కలుగునట్టు శాపం ఇవ్వటం, రావణుని నాభియందు అమృత కలశం వృత్తాంతాలు మనకు భాస్కర రామాయణంలో కన్పిస్తాయి. అలాగే భాస్కర రామాయణంలో సీతారామలక్ష్మణులు నార వస్త్రాలు ధరించి వననానికి వెళ్లినట్టుగా ఉంది, కానీ వాల్మీక రామాయణంలో కేవలం రామలక్ష్మణులు మాత్రమే నార వస్త్రాలు ధరిస్తారు. భాస్కర రామాయణంలో రావణుడు సీతను కొనిపోతు తనకు అడ్డం వచ్చిన జటాయువును నేలకూల్చటాన్ని బ్రహ్మదివ్య దృష్టితో చూసి ‘‘నాకారిచేటింక నిక్కమయ్యే ననుచు నిశ్చయించె’’ అన్నట్టుంది. కానీ వాల్మీకి రామాయణమున బ్రహ్మ ‘కృతం కార్యమితి’ (కార్యంబైయినది) అంటాడు.

ఆచార వ్యవహారాలకనుగుణంగా కూడా భాస్కర రామాయణం కొంతమార్పులు చేసింది. నలుడు సేతుబంధనం ఆరంభించేముందు, ‘‘విఘ్నేశాయ నమో,నమో భగవతే వేదండతుండాయని, ర్విఘ్న క్షేమకృతే నమోస్తు భవతే విశ్వప్రభో’’, అంటూ గణపతి ధ్యానం చేస్తాడు. ఏదైనా కార్యారంభంకు ముందు గణపతిని పూజించటం మన ఆనవాయితీ. దీనిని భాస్కర రామాయణం ప్రతిపాదిస్తుంది. కానీ వాల్మీకి రామాయణమున ఇది లేదు. ఇటువంటి అనేక అవాల్మీకాలు భాస్కర రామాయణంలో చోటుచేసుకున్నాయి.

మొల్ల రామాయణం: తన పేరుకు తగినట్టుగానే తొమ్మది వందల పద్య, గద్యాలతో కమనీయంగా రామయణ మాలికను ఆరు కాండాలలో మొల్ల రచించింది. ఈమె తాను గురులింగ జంగమార్చనపరుడూ, శివభక్తిరతుడూ అయిన కేసయ వరపుత్రినని చెప్పుకుంది. శివభక్తుల ఇంట జన్మించినా మొల్ల తన కావ్యాన్ని రామునికి అంకితమిచ్చింది. పోతన వలె ఈమె కూడా రామకథను చెప్పిన నోటితో పృధ్వీపతులను కొనయాడలేనని ఖశ్చితంగా చెప్పింది.

సల్లలిత ప్రతాపగుణసాగరుడై విలసిల్లి ధాత్రిపై
బల్లిదుడైన రామనరపాలకునిన్ స్తుతిజేయు జిహ్వకున్
చిల్లరరాజలోకమును చేకొని మెచ్చగ నిచ్చపుట్టునే
అల్లము, బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస చేయునే.

రాముని స్తుతించిన నోరు రాజులను స్తుతింపదని అందమైన సామెతలో బెల్లము తినువాడు అల్లమున కాసపడడని తేటతెల్లం చేసింది. అదేవిధంగా, పలికెడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడని , పోతన ఎలా చెప్పుకున్నాడో, మొల్ల కూడా అదే పంథాలో ‘‘చెప్పుమని రామచంద్రుడు, చెప్పించిన పలుకు మీద చెప్పుచు’’ న్నానని సవినయంగా మనవి చేసింది.

అలాగే తాను బాగా చదువుకున్నదానిని కాదని, వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టా ఆవర్జాలు వల్లించి, ఇవిఏవియూ రాయుట తనకు సాధ్యం కాదని నమ్రతతో చెప్పి పండితుల ముక్కున వేలు వేయించింది!

దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి
.

అలాగే పదిమంది చదవి అర్ధంచేసుకోలేని కవిత వ్యర్ధమని కవిత ఎలా ఉండాలన్న విషయాన్ని చక్కగా వివరించింది —

తేనె సోఁక నోరు తీయన యగురీతి
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును!

అంటూ —

కందువమాటలు సామెత
లందముగా గుర్చి చెప్ప నది తెలుగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధుల మదికిన్!

నాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని, తెలుగు పదాలు, సామెతలు చేర్చి చెప్పితే అందంగా ఉంటుందని ఆమె అభిమతం! అందుకుతగ్గట్టుగానే తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాంటివి ఆమె తన కవితల్లో చేర్చింది.

మొల్ల కూడా ఇతర రామాయణాలతో ప్రేరణ పొందిందని చెప్పవచ్చు. పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం భాస్కరరామాయణంనలో కన్పిస్తుంది. అలాగే రామాభ్రదుని పాదాలను గుహునిచేత రామచరితమానసలో తులసీదాసు కడిగించినట్టు మొల్ల కూడా కడిగించింది.

శ్రీమద్రామాయణ కల్పవృక్షం: ‘‘వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివం చనిపించికో వృథా, యాసముగాక కట్టుకథలైహికమాః పరమా!’’> అన్న తండ్రిగారి శాసనాన విశ్వనాథ సత్యనారాయణగారు రామాయణ కల్పవృక్ష రచన చేశారు.

‘అత్రి ఆశ్రమంలో విమానం బయలుదేరుతుండగా, అనసూయాదేవి నడచి వచ్చి శ్రమ పడుచు మెట్లెక్కి రెండుఫలంబులు సీత చేతిలో నిడి దిగిపోవుచుండ సీత యా ఫలంబులు రాముని చేతికిచ్చి ఆమెను మెట్లుదించి’ వచ్చిందట అని చెప్పటం ద్వారా ఆయన ఉత్తర కాండ చరిత్ర నంద విశిదీకరించారు.

అచ్చతెలుగు రామాయణం: కవిసార్వభౌమ బిరుదాంకితుడు కూచిమంచి తిమ్మన్న(1690-1757) ‘అచ్చతెలుగు రామాయణాన్ని రచించి, తమ కులదైవమైన కుక్కుటేశ్వరునికి అంకితమిచ్చాడు.

‘‘హాటక గర్భవధూలీ
లాటన చలితాంఘ్రీనూపురారావశ్రీ
పాటచ్చరములు; తేనియు
తేటలు మా కూచిమంచి తిమ్మయ మాటల్.’’
అని ఈయన కవితలకు పేరు.

తెలుగులో ఇతర రామాయణాలు: అయ్యలరాజు రామభద్రుడు (1540) 1800 పద్యాలతో ఎనిమిది భాగాలలో ‘రామాభ్యుదయాన్ని’ రచించాడు. కట్టా వరదరాజు 23,170 పద్య, గద్యాలతో వాల్మీకి రామాయణానికి అనువాదం ‘కట్టా వరదరాజ రామయాణమ’నే ద్విపదను రాశాడు. ఇది యథా వాల్మీకం. ఇక నాయక వంశస్తుడైన రఘనాథుడు (1600-1673), వాల్మీకి రామయణంలోని బాలకాండ వరకు ‘రఘునాథ రామాయణం’ గా తీర్చిదిద్దాడు. 19వ శతాబ్ధానికి చెందిన వేంకటకవి గోపీనాథ రామాయణాన్ని, అభినవాంధ్ర వాల్మీకి అని పేరుగాంచిన జానమంచి శేషాద్రిశర్మ (1882-1953) ‘ఆంధ్ర శ్రీమధ్రమాయణా’న్ని, రామయణంలోని ధర్మసారాన్ని విశ్లేషిస్తూ ఆయనే ‘ధర్మసార రామాయణా’న్ని రచించారు.

కంకటి పాపిరాజుగారు ‘పూర్వరామాయణం, ఉత్తర రామాయణం’ అని రెండు భాగాలుగా సంపూర్ణ రామాయణ రచన గావించారు. ‘ఆంధ్ర వాల్మీకిరామాయణం’ పేరుతో రామాయణాన్ని రచించి ఒంటిమిట్ట కోందడరాముడికి అంకితమిచ్చారు వావిలికొలను సుబ్బారావుగారు. ఈయన తన కావ్యంలో ఏ అంశాలైతే అవాల్మీకాలో వాటికి చుక్కలు పెట్టి ప్రత్యేకంగా జనావళికి తెలిపారు. తాడేపల్లి వెంకటప్పయ్య ‘శ్రీ రామ కథామృతము’, శ్రీపాద కష్ణమూర్తి శాస్త్రి (1866-1960) ‘శ్రీ కృష్ణ రామాయణా’న్ని రచించారు. శ్రీపాద వారి రామయణంలో సీత భూమాతలో కలిసిపోవటం, రాముని మరణంలాంటి సంఘటనలు లేవు. అలాగే ఈయన రామయణంలో అహల్య, కైకేయిలు నిర్ధోషులు, పుత్రవియోగంతో విలపిస్తున్న శూర్పణఖకు సీత ఆశ్రయం ఇవ్వటం, శబరి ఎంగిలి ఫలాలను రామునికి తిన్పించటం వంటి కథనాలు చోటుచేసుకున్నాయి. ఈయన ‘‘శ్రీ కృష్ణ భారతము’’, ‘‘శ్రీ కృష్ణ భాగవతము’’ కూడా రచించారు.

గాంధీయవాదాన్ని రామరాజ్యానికి అన్వయిస్తూ, ఆత్మకూరి గోవిందాచార్యులు ‘గోవింద రామాయణా’న్ని రాశారు. సీరము సుభద్రాయాంబ రెండువేలకుపైగా పద్యాలలో ‘సుభద్రా రామాయణం’, చేబ్రోలు సరస్వతి ఉత్తరకాండ సహితంగా ‘సరస్వతీ రామాయణం’, తేటగీతి, ఆటవెలది పద్యాలతో రమణీయంగా తెలుగు వాల్మీకమని పిలవబడే ‘మానికొండ రామాయణా’న్ని మానికొండ సత్యనారాయణ శాస్త్రి, చిల్లరిగె యోగానందయ్య పంతులు ‘యోగానందాంధ్ర రామాయణం’, తంగిరాల జగన్నాథ శాస్త్రి ‘జగన్నాథ రామాయణం’, కొత్తపల్లి అచ్చయ్య ‘దాశరథీ విలాపం’ రచించారు.

చిన్నయసూరి సమకాలీకుడైన రంగయ్యకవి, భాస్కర, రంగనాథ మరియు ఆథ్యాత్మిక రామాయణాలను ఆధారంగా చేసుకొని ‘రామోదయం’, 18వ శాతబ్ధం కంటే ముందుకాలానికి చెందిన ఘట్టు వెంకటరామకృష్ణకవి ‘పట్టాభిరామాయణము’, పుట్టపర్తి నారాయణాచార్యులు ‘జనప్రియ రామాయణం’, బులుసు వేంకటేశ్వర్లుగారు తేటగీతులతో పండితపామర రంజకంగా ‘గీత రామాయణం’ రాశారు.

సంస్కృతలోని వివిధ రామాయణాలను కూడా అనేకులు తెనుగీకరించారు. భోజదేవుని చంపురామాయణాన్ని, వెంకటచలపతి, అల్లంరాజు, రంగసాయి, బులుసు సీతారామకవి, పుసపాటి రంగనాయకామాత్య, జయంతి రామయ్యపంతులు, బుద్ధవరపు మహాదేవా మొదలైన వారందరూ తెనుగీకరించారు. వంగీపురం వెంకటశేషకవి జానకీ పరిణయంఅను పద్యనాటకాన్ని ‘శ్రీశేష రామాయణం’గా, ఆనంద రామాయణాన్ని గుండు లక్ష్మణకవి పద్యకావ్యంగా, నూతలపాటి పెరరాజు వచనకావ్యంగా తెనుగీకరించారు.

అలాగే ఆధ్యాత్మ రామాయణాన్ని, కంచర్ల శరభ, కందం పెద్దన సోమయాజి, మామిడన్న సుభద్రాంబ, బులుసు వెంకటేశ్వర్లు మొదలైనవారు తెలుగులోకి అనువదించారు. మునిపల్లి సుబ్రహ్మణ్యంగారు కీర్తనల రూపానిచ్చారు. గద్వాల్ సంస్థానానికి చెందిన సోమభూపాలుడు తన ఆస్థానంలోని ఆరుగురు కవులచేత ‘యథశ్లోకతాత్పర్య రామాయణాన్ని’ రచింపచేశారు.

రామాయణాన్ని తెలుగులో పద్యకావ్యంగానేకాక, వచనకావ్యంగా కూడా పలువురు తీర్చిదిద్దారు. వావిళ్ల రామస్వామిశాస్త్రి, దేవరాజసుధి నేరి గురులింగశాస్త్రి, దొడ్డ వెంకటరామిరెడ్డి, సరస్వతుల సుబ్బరామశాస్త్రి, మోడేపర్తి గున్నయ్య, శిరోమణి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (1891 – 1951), పురిపండ అప్పలస్వామి మరియు ఉషశ్రీ. కల్లురి చంద్రమౌళి ‘రామాయణ సుధాలహరి’, ధర్మవరం సీతారామాంజనేయుల ‘ఆంజనేయ రామాయణం’ ఇందు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి.

తులసీదాసు హిందీలో రచించిన ‘శ్రీరామచరితమానస్’, కంబకవి రచించిన సుప్రసిద్ధ తమిళ రామాయణం ‘కంబ రామాయణం’, శ్రీ సిధ్దేంద్రయోగి ఉత్కళ (ఒరియా) బాషయందు రచించిన ‘విచిత్ర రామాయణా’ లను కూడ అనేకులు తెలుగులోకి అనువదించారు. లెక్కకుమిక్కుటంగా రామచరిత జనరంజకంగా చెప్పబడి విశ్వాన భాసిల్లుతోంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి

One thought on “రామాయణము(లు) 3 తెలుగు రామాయణాలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp