మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 3

‘కర్మణా బధ్యతే జంతుః’ మనిషి కర్మ అనే చక్రబంధంలో చిక్కుకుని ఉన్నాడు. ఈ చక్రబంధనాన్ని చేధించుకుని బయటపడితే కాని జ్ఞానయోగం ప్రాప్తించదు. అయితే కర్మాచరణ గొప్పదా, జ్ఞానం గొప్పదా అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలగకమానదు. కర్మయోగం, జ్ఞాన యోగం రెండూ మోక్షమార్గాలే.

లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయా నఘ!
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం || 3-3||

సాంఖ్యులు జ్ఞానయోగంతోను, యోగులు కర్మయోగంతోను మోక్షసాధన చేస్తారని భగవద్గీత మనకు తెలుపుతోంది. అయితే స్థితప్రజ్ఞుడు కర్మయోగంతోనే జ్ఞానయోగాన్ని కూడా సాధిస్తాడు. మనిషి భౌతిక పరిణామ ప్రక్రియలో దశలున్నట్టే, మోక్షసాధనలో కూడా పరిణామ దశలున్నాయి.

“భక్తియోగం” అంటే “నామసంకీర్తనం ఇత్యాది”, దీనివల్ల తమోగుణం క్షీణించి, రజోగుణం అభివృద్ధి చెందుతుంది. “కర్మయోగం” అంటే “నిష్కామకర్మ”, ఇది రజోగుణాన్ని తగ్గించి సత్వగుణం పెంపొందిస్తుంది. ఇక “జ్ఞానయోగం” అంటే “ఆత్మజ్ఞానశాస్త్ర పరిచయం”, ఇందు సత్వగుణం ప్రధానమవుతూ “నిర్గుణత్వం” కూడా అభివృద్ధి చెందుతూవుంటుంది. చివరగా, “ధ్యానయోగం” అంటే “అనుభవైక్య జ్ఞానం”, ఇందు మనిషి పరిపూర్ణత్వాన్ని పొంది నిర్గుణుడవుతాడు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే௨ర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే || 3-7||

మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేయువాడు ఉత్తముడు. అయితే గృహస్థుకు వర్ణాశ్రమ ధర్మాలను పాటించటమే కర్మయోగం. అంతేగాని నిత్యనైమిత్తికామ్య కర్మలను త్యజించుట సన్యాసమనిపించుకోదు. మోక్షజ్ఞానంతో కర్మలు చేయుట కర్మయోగం. కాగా, కర్మల తాలూకు ఫలమును విడిచిపెట్టుట సన్యానయోగం. కర్మ యోగము, జ్ఞానయోగము ఒకదానికొకటి ఆధారం. ఇదే విషయాన్ని మధ్వులు,‘‘శతస్మోజ్ఞానినాం కర్మ మప్యనుష్ఠేయం, కర్మిణామపి గృహస్థా (దీ) నాం జ్ఞాతవ్యోభగవాన్’’ అంటూ జ్ఞానకర్మను గూర్చి తెలిపారు. జ్ఞానము లేనిదే కర్మాచరణ సాధ్యంకాదు. అలాగే, కర్మచేయనిదే జ్ఞానము అనగా అపరోక్షజ్ఞానము పుట్టదు. కాన జ్ఞానపూరితమైన కర్మ వలనే మోక్షము పొందగలరని తెలిపారు.

కర్మలేని జ్ఞానం, జ్ఞానంలేని కర్మ ఎలా సాధ్యంకాదో, జ్ఞానం లేని భక్తి, భక్తిలేని జ్ఞానం కూడా ఉండదని మధ్వులు స్పష్టం చేశారు. ‘వినా జ్ఞానం కుతో భక్తిః కుతో భక్తి వినా చ తత్’ అని వ్యాఖ్యానిస్తూ, కేవలం నామ జపం భక్తి కాదని, నైతిక స్వచ్ఛత, నిబద్ధత, వైరాగ్యభావన, స్వాభావికంగా ప్రాపంచిక సౌఖ్యాల పట్ల విముఖత కలిగి ఉండుట నిజమైన భక్తికి ఉండే లక్షణాలని విశిదీకరించారు. అలాగే, మధ్వులు భక్తిని మూడు రకాలుగా విభజించారు – పరోక్షజ్ఞాన సిద్ధికి ముందు, పరోక్షజ్ఞాన సిద్ధి అనంతరం, అపరోక్షజ్ఞాన సిద్ధి తరువాత. జ్ఞాన సముపార్జన కంటే భక్తికి మధ్వులు పెద్ద పీఠ వేసినట్టు కన్పిస్తుంది. అపరోక్షజ్ఞానానంతరం కూడా భక్తి ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఈ భక్తే పక్వ భక్తి, పరిపక్వ భక్తి, అతిపరిపక్వ భక్తిగా రూపాంతరం చెందుతుంది. ఈ పరిపక్వ దశయే సాధన భక్తి. మధ్వులు తన గీత తాత్పర్య నిర్ణయ గ్రంథంలో సాధనా భక్తిని గూర్చి ఈ కింది విధంగా పేర్కొన్నారు.

భక్త్యా ప్రసన్నః పరమూ దధాద్ జ్ఞానమనాకులం
భక్తించ భూయసీం తాభ్యాం ప్రసన్నో దర్శనం వ్రజేత్
తతో పి భూయసీం భక్తిం దధాత్తాభ్యం విమోచయేత్
ముక్తో పి తద్వశే నిత్యం భూయోభక్తి సమన్వితః

ప్రాపంచిక బంధాలనుంచి విముక్తులై, ముక్తస్థితిని పొందిన భక్తులకు పరమాత్మ అనంత గుణస్వభావాన్ని తెలిపే జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని దీనర్ధం. ఇదే భావన భగవద్గీతలోని భక్తియోగం నిర్ధారిస్తోంది. ఈ స్థితిలో భక్తుడు బింబ-ప్రతిబింబ, భగవంతుడు-జీవి మధ్య సంబంధాన్ని గ్రహించగలడు.

ధ్యానేనాత్మని పశ్యంతికే చిదాత్మాన మాత్మానా|
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||13-25||

కొందరుఫలేచ్ఛలేని కర్మలు చేయుచూ మనస్సును తమ స్వాధీనములో ఉంచుకొని లోపల అంతరాత్మ అని పిలవబడే పరమాత్మను చూచెదరు. మరికొందరు ధ్యానము చేయుటకు అశక్తులై, శాస్త్రజ్ఞానమును సంపాదించుకొని తద్వారా అపరోక్షజ్ఞానమును పొంది పరమాత్మను దర్శించెదరు. ఈ విధంగా ధ్యాన, జ్ఞాన, కర్మయోగాల ద్వారా భక్తుడు బింబరూపి అయిన పరమాత్మ సందర్శనం పొందుతాడు.

భక్తి అనే బీజమునుండి పుట్టిన వృక్షము నుండి శాస్త్రజ్ఞానము, దానిని నుండి తత్వజ్ఞానము లేదా ఆధ్యాత్మజ్ఞానము పుట్టి దీని ద్వారా అపరోక్షజ్ఞానమనే ఫలము కలుగును. ఈ ఫలమును పొందిన వారు మాత్రమే శరీర హృదయాంతరాళాలలో నిక్షిప్తమైన పరమాత్మను జ్ఞానదృష్టి ద్వారా చూడగలరు.

‘‘భక్త్యా మా మభిజానాతి యావాన్య శ్చాస్మితత్త్వతః’’ (గీ.18-55) అన్న శ్లోకం భగవంతుని స్వరూపజ్ఞానమునకు భక్తి యనునది యొక సాధనమనియు, అలాగే ‘‘తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదన్తరం’’ (గీ.18-55) అనుట వలన పరమేశ్వర స్వరూప జ్ఞానాన్తరమే తత్ఫలభూతమైన మోక్షరూపమగు బ్రహ్మప్రాప్తి లభించగలదని భగవంతుడుద్ఘోషించెను.

సౌమ్యశ్రీ రాళ్లభండి

మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 1
మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *