మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 2

అవ్యక్తో యమచింత్యో య వికార్యోయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి|| 2-25 ||

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా|| 2-28 ||

ఆత్మ అవ్యక్తమైనది. అనగా ఇంద్రియగోచరముగానిది, మనస్సునకు అందనిది. వికారములు లేనిది. జనన మరణాల మధ్య మాత్రమే ఇంద్రియగోచరాలు ప్రకటితమవుతాయి. ఆత్మ జననమరణాలకు అతీతమైనది. నాశనము లేనిది. అయితే నాశనం అయ్యేదేమిటనే సందేహం కల్గవచ్చు. మధ్వులు దీనికి వివరణనిచ్చారు. నాశనం నాలుగు రకాలు: స్వరూప నాశనం, దేహ నాశనం, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత. జీవికి స్వరూప నాశనం లేదు. జీవి బాహ్య ఉపాధి (శరీరం, మనసు అవి పొందే మార్పులు)కి లోబడి లౌకిక విషయాలలో మమేకమై తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేక దేహ నాశనం, దుఃఖ ప్రాప్తులు పొందుతాడు. ముక్తస్థితిని చేరుకుంటున్న కొద్ది అంతర్గత ఉపాధి (జీవుని స్వరూపోపాధి) ద్వారా తనలోని చైతన్యం భగవద్విభూతని గ్రహిస్తాడు. ఆత్మయొక్క అంతర్యామిగా పరబ్రహ్మం భాసిస్తూ విడదీయలేని సంబంధాన్ని జీవితో కలిగి ఉంటాడని మధ్వులు తెలియచేస్తారు. స్వరూపైక్యత, సంపూర్ణ స్వభావైక్యత మినహాయిస్తే జీవి ముక్త స్థితిలో జ్ఞానం, ఆనందంతో భాసిస్తూ ఈశ్వర లక్షణాలను ప్రతిబింబిస్తాడు మినహా ఈశ్వరుడు కాబోడు. ఇది ద్వైత సిద్ధాంతం యొక్క విశిష్ట సారాంశం.

అవివేకి అయిన వ్యక్తి దేహము, ఇంద్రియములు, బంధువులు, ద్రవ్యప్రాప్తి వంటి లోభాలకులోనై జ్ఞాన సముపార్జనను విస్మరించి జీవిత పరమావధిని కోల్పోతాడు. ‘నిత్యో నిత్యానం’, భగవంతుడే నిత్యుడన్న నిజాన్ని విస్మరించి లౌకిక భోగాలకు లొంగి దుఃఖానికి లోనవుతాడు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి|| 2-47 ||

వేదాలు నిర్దేశించిన కార్యాలను ఆచరించి భోగములను పొందవచ్చనుకునే వారు అజ్ఞానులు. గీత ప్రభోదించే సారం ఒక్కటే నిష్కామ కర్మ లేక నివర్తకర్మ. ఈ సిద్ధాంతం మూడు కీలక ఆంశాలపై ఆధారపడి ఉంది. 1. కర్మను ఆచరించటం వ్యక్తి ధర్మం కనుక కర్మను ఆచరించాలి. 2. ఫలాపేక్ష, కర్మను నిర్దేశించకూడదు. 3. ప్రతిఫలాపేక్ష లేదు కనుక లేక ప్రతిఫలము ఉండదన్న కారణంతోనో తన ధర్మాన్ని ఉపేక్షించరాదు. ఈ స్థితప్రజ్ఞతను మనిషి చేరుకోవాలంటే, ముందుగా తనలోని రజస్సత్త్వ తమో గుణాలను విసర్జించాలి. ఈ త్రిగుణాలను అర్ధంచేసుకుని, ప్రాకృతిక సంబంధాలకు కేవలం సాధన ద్వారా మాత్రమే జీవి దూరంకాగలడు. ఈ సాధన కర్మ, జ్ఞాన, భక్తి మార్గంలో భాగమే. అయితే కర్మ కేవలం వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించటంతో సరిపెట్టకుండా ఆత్మజ్ఞానంతో సమన్వయించాలని, ‘అస్మాదవప్యతే శాస్త్రాద్ జ్ఞాన పూర్వేణ కర్మణా’, జ్ఞానాత్మక కర్మాచరణ ద్వారానే ఆధ్యాత్మ సాధన సాధ్యం అవుతుందని మధ్వులు చెప్పారు.

దూరేణ హ్య వరం కర్మ బుద్ధి యోగా ద్ధనంజయ
బుద్ధౌ శరణ మన్విచ్ఛ కృపణాః ఫల హేతవః || 2-49 ||

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణ
జన్మబంధనిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 2-51 ||

వేదసారాన్ని సరైనే రీతిలో అర్ధం చేసుకుని నిష్కామ కర్మను ఆచరించే వ్యక్తి సమాధి స్థితిని పొందగలుగుతాడు. ఫలాపేక్ష లేకుండా కర్మని ఆచరించే మనిషికి మరో మోక్ష మార్గం అవసరం లేదు. శైశవ, బాల్య, కౌమార, వృధాప్యం అనేవి మనిషిలో నాలుగు పరిణామ దశలైతే, కర్మలను ఆచరించటం, జ్ఞాన సంపదను పొందటం, జ్ఞానేంద్రియాలపై నియంత్రణ సాధించటం, మోక్షపథం చేరుకోవడం మానవ జీవితానికి గల నాలుగు ప్రధాన లక్ష్యాలు.

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్చతే|| 2-55 ||

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 2-56 ||

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 2-61 ||

ఈ లక్ష్యాలను పొందాలంటే జ్ఞానకర్మసముచ్ఛయమో, జ్ఞానకర్మసాధ్య, భక్తియోగముతోనో సాధ్యం కాదని మధ్వుల అభిప్రాయం. ‘అపరోక్ష జ్ఞానం’ ఒక్కటే మనస్సును శుద్ధిపరచి, భక్తి, జ్ఞానమార్గాలవైపు నడిపిస్తుందంటారు. శాస్త్రానుసారం వర్తిస్తూ, భగవధారాధన తప్ప మరోక విషయచింతన లేకుండగా ఇంద్రియనిగ్రహం కల్గి పరమాత్మలో మమేకమైననాడే మోక్షం సాధ్యమవుతుంది.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః || 2-69 ||

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్ధ నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || 2-72 ||

భగవత్ సాకారం పొందిన స్థితప్రజ్ఞుడు ప్రాపంచిక విషయాలపై నిరాశక్తుడై, ‘నేను’, ‘నాది’ అనే మోహాన్ని వీడి, ఫలాపేక్షరహితంగా, తనలో తాను రమిస్తాడు. తనలో నిద్రాణమైన భగవత్ స్వరూప సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. ఈ అపరోక్షజ్ఞానాన్ని కల్గటమే బ్రాహ్మీ స్థితిని చేరటమంటారు.

జ్ఞానంలేని కర్మి(కర్త), కర్మను ఆచరించని జ్ఞాని ఇద్దరి కర్మాచరణ అసంపూర్ణమేనని మధ్వుల అభిప్రాయం. కర్మ, జ్ఞానాల మధ్య సమన్వయమే కర్మయోగం. వ్యాస స్మృతి తెలిపిన నివృత్తి మార్గం, నైష్య కర్మలను సమన్వయపర్చి, మధ్వులు నివృత్తి కర్మను ప్రతిపాదించారు. ‘తత్కర్మ హరితోషం యతు’ అనే భాగవత వాక్యం, ‘యజ్ఞార్ధాత్కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః’ అన్న గీత వాక్కులు చెపుతున్నది ఇదే!

మధ్వులు ప్రతిపాదించిన కర్మసిద్ధాంతం తదుపరి భాగంలో….

సౌమ్యశ్రీ రాళ్లభండి

మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 1

మధ్వులు ప్రతిపాదించిన గీతాసారం 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *