భీష్మ ఏకాదశి- విష్ణు సహస్రనామ ఆవిర్భావ పర్వదినం

ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి) అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:

• ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
• కార్తీక శుద్ధ ఏకాదశి
• పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
• మాఘ శుద్ధ ఏకాదశి

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. అష్ట వసువులలో ఒకడైన భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు అంపశయ్యపై పవళించాడు. చివరికి ఏకాదశినాడు శ్రీ కృష్ణుని ఆజ్ఞ మేరకు ధర్మరాజాది పాండవులకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు.

శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత –భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.

కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?

లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.

దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,

అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.

ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతాయని వివరించాడు.

భీష్మ పంచకం: మాఘశుద్ధ సప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకమంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి ఈనాటి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడనాడాడని పురాణాలు చెపుతన్నాయి.

భీష్మాష్టమి మాఘశుద్ధ అష్టమి. పద్మపురాణంలోనూ హేమాద్రి వ్రత ఖండంలోనూ దీనిని గురించి చెప్పబడి వున్నది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చేవారికి సంతాన ప్రాప్తి కలుగుతుది. దీనివల్ల భీష్ముడు ఈ రోజుననే మరణించినట్లు తెలుస్తూ వుంది. మహాభారతంలో కూడా ఈ రోజునే భీష్ముని నిర్యాణం రోజుగా చెప్పబడింది.

భీష్మాష్టమి అని స్మృతి కౌస్తుభం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని తిథితత్త్వము. నేడు భీష్మాష్టమీ శ్రాద్ధదినమని కృత్యసారసముచ్చయములో వివరించారు.

భీష్మద్వాదశి వ్రతం ఈ రోజున్నే ప్రారంభిస్తారని నిర్ణయసింధువు. జరపవలసిన పర్వం-త్రోత్సవ చంద్రిక. పంచాంగ కర్తలు ఈనాటి వివరణలో నందినీ దేవిపూజ, భీష్మాష్టమి అని వ్రాసారు. భీష్మాష్టమి భీష్ముని నిర్యాణ దినం ఈ రోజున భీష్ములకు శ్రాద్ధ తర్పణం చేసిన వారికి సంవత్సరపాపం నశిస్తుందంటారు.

పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం –ఈ మూడు కాంతిమార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. అటువంటి అమృత ఘఢియల్లో వచ్చేవరకు అంపశయ్యపై పరుండి భీష్మాష్టమినాడు ప్రాణాలు వదిలాడు. భీష్ముడు తన పంచ ప్రాణాల్లో ఒకదానిని సప్తమినాడున్నూ, రెండోదానిని అష్టమినాడు, మూడోదానిని నవమినాడు, నాలుగోదానిని దశమినాడు, ఐదోదానిని ఏకాదశినాడు వదిలాడని కొన్ని ప్రాంతాల వారు చెబుతారు. కాని పలు గ్రంథాలలో మాఘశుద్ధాష్టమి బీష్మనిర్యాణ రోజుగా చెప్ప బడింది.. భీష్మ పంచకానికి అది ఆఖరి రోజు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, కాలమాధవీయం మున్నగు గ్రంథాలన్నీ మాఘశుద్ధాష్టమి భీష్మ నిర్యాణ దినంగా చెబుతున్నాయి.

జయైకాదశి: మాఘశుద్ధ ఏకాదశి భీష్మైకాదశి అంటారు. ఆయాదేర్‌ జోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశిని జయైకాదశి అని పేర్కొంటూ ఉంది. ఈనాడు భీమైకాదశీ వ్రతమని తిథితత్వము. ఇంద్రసభలో పుష్పవంతుడు అనే గంధర్వుడు నాట్యం చేస్తూ ఉన్నాడు. తన భార్యను చూస్తూ అతడు నాట్యం తప్పుగా చేశాడు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుని, అతని భార్యను రాక్షసులు కావలసిందిగా శపించాడు. రాక్షసులై తిరుగుతూ ఉన్న ఆ దంపతులకు మాఘశుక్ల ఏకాదశినాడు తినడానికి ఏమీ లభించలేదు. అందుచేత వారు ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారు శాపమివుక్తులయ్యారు. భీష్మైకాదశి కౌరవవీరుడగు భీష్ముడు మరణించినదీ ఈ దినమే.


తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *