బతుకమ్మ , బతుకమ్మ ఉయ్యాలో...

మన తెలుగునాట అనేక పండుగలు ప్రకృతితో, ఋతుపరివర్తనతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చిన సందర్భంగా జానపదులు ఉత్సాహంతో తమకు ఆనందాన్ని కల్గించిన పుడమితల్లిని, పశుసంపదను పూజించి కృతజ్ఞతలు తెలుపుకుని పండుగలు జరుపుకుంటారు. తెలంగాణా ప్రాంతీయులు జరుపుకునే అలాంటి విశేషమైన పండుగలే బతుకమ్మ -బొడ్డెమ్మ పండుగలు.

వినాయక చవితి లేదా భాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాలయమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగను, మహాలయమావాస్యతో ప్రారంభించి, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను తెలంగాణా ప్రాంతంలో విశేషంగా జరుపుకుంటారు. గౌరీదేవిని పూజించే ఈ రెండు పండుగల్లో బతుకమ్మ పెద్దలు చేసుకునే పండుగైతే, బొడ్డెమ్మ పిల్లలు జరుపుకునే పండుగ.

‘బొట్టె, బొడిప, బొటిమ, పొట్టి’ అని పిలవబడే, బొడెమ్మ అంటే ‘చిన్నది’ అని అర్థం. అలాగే బొడెమ్మను లక్ష్మీస్వరూపమైన ధాన్యరాశి, ధాన్యపు కుప్ప అని కూడా భావిస్తారు. బోణి అంటే స్త్రీ అని అర్థం. బోణి + అమ్మ, బోణెమ్మ. ఈ పేరు జానపదుల నోటిలో నాని బొడ్డెమ్మ అయి ఉంటుందని కూడా అంటారు. ‘బొడ్డ’ అనే పదానికి అత్తి చెట్టు లేదా మేడి చెట్టు లేదా ఉదుంబర చెట్టు అని కూడా అర్థాలున్నాయి. సంతానాన్ని పొందడానికి ఈ చెట్టుకు పూజ చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. బొడ్డెమ్మను చెక్కపీటపై పుట్టమన్నుతో చతురస్రాకారంగా ఐదుదొంతరలు చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారంగా పేర్చి, బొడ్డెమ్మను ఉద్రాక్ష, కాకర, కట్ల, బీర, గుమ్మడి, మల్లె, జాజి మొదలైన పూలతో అలంకరిస్తారు. శక్తి ఉపాసకులు శ్రీచక్రాన్ని మేరు రూపం, పృధ్వీరూపం అని రెండు రూపాల్లో పూజిస్తారు. బొడ్డెమ్మ మేరు స్వరూపం. పీట నాలుగు మూలలను ఓం ధర్మాయనమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః అని పూజించి, శిఖరాగ్రంలో బియ్యంతో నిండిన చిన్న కలశం, దానిపైన కొత్త రవికె నుంచి, దానిపై తమలపాకులో పసుపు గౌరిని ఉంచుతారు. సాయంకాలం అలికి ముగ్గులు పెట్టిన ముంగిలిలో బొడ్డెమ్మను నిలిపి కన్నెపిల్లలంతా చప్పట్లు చరుస్తూ, బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతారు. ఆంధ్రనాట సంక్రాంతిలో కన్నెపిల్లలు ఇలాగే సందె గొబ్బిళ్ల ముంగిట ఉంచి పూజిస్తారు.

ఆడపిల్లలందరూ బొడ్డెమ్మ పండుగ గాథను తెలిపే కథను ఈ సందర్భంగా పాడుతారు.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో	బిడ్డా లెందారే వలలో
నీ బిడ్డ నీలగౌరి వలలో	నిత్యమల్లె చెట్టేక్కె వలలో
నిత్యమల్లో చెట్టుకూ వలలో	నిత్యే నీళ్లుపోసి వలలో
కాయల్లు పిందెల్లు వలలో	ఘనమైనా కాతా వలలో
కాయలన్ని దింపి వలలో	కడవల్లా పోసి వలలో
పిందెలన్నీ దింపి వలలో	బిందెల్లో నింపి వలలో
పండ్లన్నీ దింపి వలలో	బండ్లల్లా పోసి వలలో
పోయెనే ఆ బండి వలలో	శ్రీశైలం దాకా వలలో
శ్రీశైల మల్లేశా వలలో	పండ్లోయి పండ్లు వలలో
ఏం పండ్లోగాని వలలో	ఎంత ఘుమఘుమ వలలో
చూసెటోరెగాని వలలో	కొనెటోరేలేరు వలలో
అన్నించి ఆ బండీ వలలో	తిరుపాతీ దాకా వలలో
తిరుపతి వెంకన్నా వలలో	పండ్లోయి పండ్లు వలలో
ఏం పండ్లోగాని వలలో	ఎంత ఘుమఘుమ వలలో
చూసెటోరెగాని వలలో	కొనెటోరేలేరు వలలో
అన్నించి ఆ బండీ వలలో	భద్రాచలం దాకా వలలో
భద్రాచలం రామన్న వలలో	పండ్లోయి పండ్లు వలలో
ఏం పండ్లోగాని వలలో	ఎంత ఘుమఘుమ వలలో
చూసెటోరెగాని వలలో	కొనెటోరేలేరు వలలో
అన్నించి ఆ బండీ వలలో	కాశీ దాకానూ వలలో
కాశీ విశ్వేశా వలలో		పండ్లోయి పండ్లు వలలో
ఏం పండ్లోగాని వలలో	ఎంత ఘుమఘుమ వలలో
చూసెటోరెగాని వలలో	కొనెటోరేలేరు వలలో
అన్నించి ఆ బండీ వలలో	వేమూడాలా దాకా వలలో
వేముడాల రాజన్న వలలో	పండ్లోయి పండ్లు వలలో
ఏం పండ్లోగాని వలలో	ఎంత ఘుమఘుమ వలలో
చూసెటోరెగాని వలలో	కొనెటోరేలేరు వలలో
అన్నించి ఆ బండీ వలలో	అన్న సాగరం దాకా వలలో
అన్న సాగరంలోని వలలో	ఆ కాళీమాతా వలలో
చూసేనె పండ్లన్నీ వలలో	దింపేనూ బండ్లన్నీ వలలో

ఇలా రోజంతాపాటలు పాడుతూ, పప్పు, బెల్లంతో నైవేద్యం పెట్టి, ప్రసాదాలను అందరికి పంచుతారు. రాత్రిపూట, ‘నిద్రపో బొడ్డమ్మా, నిద్రపోవమ్మా; నిద్రాకు నూరేండ్లు, నీకు వెయ్యేండ్లు; నిను గన్న తల్లికి నిండు నూరేళ్లు’ అంటూ జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. ఈ విధంగా తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి, చివరగా తొమ్మిదోవ రోజు కలశంలోని బియ్యంతో పరమాన్న ప్రసాదం చేసి ఆరగించి, బొడ్డెమ్మను నీళ్లలో నిమజ్జనం చేస్తారు.
ఈ పండుగ కాలంలో తెలంగాణాలో అనుములు, పెసర్లు, మొక్కజొన్నలు, గోధుమలు, శెనగలు, నువ్వులు వంటి పంటలు విరివిగా పండుతాయి. అందుకే ముఖ్యంగా బొడ్డెమ్మను, బతుకమ్మను గౌరమ్మగా, లక్ష్మిగా, కాళిగా కొలిచే జానపదుల పాటలలో ఈ ధాన్యాల, శివపార్వతులకు ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అలాగే లయబద్దంగా సాగే జానపద పాటల చివర చందమామ, వలలో, ఉయ్యాల, కోల్, గౌరమ్మ, ఎన్నియలో అనే మకుటాలు మనకు కన్పిస్తాయి.

బతుకమ్మ పండుగ:

తెలంగాణాలో జానపదులు బతుకమ్మను శ్రీ మహాలక్ష్మిగా, మహిషాసుర మర్ధనిగా, గౌరీదేవిగా అనేక రూపాల్లో కొలుస్తారు. బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. రెండు శతాబ్ధాల క్రితం కలరా, మశూచి వంటి వ్యాధులు ప్రబలి ప్రాణనష్టం విపరీతంగా జరుగుతున్న తరుణంలో, ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను కాపాడి, తమ బతుకు చల్లగా సాగాలని అమ్మవారిని ప్రజలు వేడుకున్నారు. తమకు బ్రతుకునిచ్చిన అమ్మను పూలతో పూజించి బతుకమ్మగా గ్రామీణులు కొలిచి, ఆరాధించటం ఆనవాయితీగా మారింది. కాగా, లక్ష్మీదేవి అంశ ధర్మాంగుడు, సత్యవతులకు పుత్రికగా జన్మించందని, ఆమెకు మునులు ‘బతుకమ్మ’ అని పేరుపెట్టారని, ఆమెను శ్రీమహావిష్ణువు చక్రాంకుడనే పేరుతో వచ్చి పెండ్లి ఆడి, పెక్కుమంది కుమారులతో భువిపై భోగభగ్యాలనుభవించారని మరో కథనం ప్రచారంలో ఉంది. ఈ కథను తెలిపే – ‘శ్రీ లక్ష్మీ దేవియు చందమామ, సృష్టి బ్రతుకమ్మయ్యె చందమామ; పుట్టినరీతి జెప్పె చందమామ, భట్టు నరసింహకవి చందమామ…’ అంటూ సాగే బతుకమ్మ పాటను నేటికీ చాలా ప్రాంతాల్లో పాడుతారు. బహుళ ప్రాచుర్యంలో ఉన్న మరో కథ పూర్వం ఒక దంపతులకు ఆరుగుపిల్లలు పుట్టి పురిటిలోనే చనిపోతారు. ఏడవకాన్పులో ఒక ఆడపిల్ల పుట్టగా ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేస్తారు. బతుకమ్మ తర్వాత వారికి ఒక మగపిల్లవాడు పుడతాడు. వారిద్దరికి వివాహాలై సుఖంగా ఉంటారు. ఒకనాడు బతుకమ్మ తన సోదరుని ఇంటికి వెడుతుంది. అక్కడ బతుకమ్మ, ఆమె మరదలు మధ్య చెరువు గట్టున జరిగిన వివాదంలో, మరదలు ఈర్ష్యా, అసూయలతో బతుకమ్మ గొంతు నులిమి చంపి అక్కడే పాతి వేస్తుంది. చనిపోయిన బతుకమ్మ తన భర్త కలలో కన్పించి తనను ఇంటికి తీసుకుని పోమ్మని కోరుతుంది. బతుకమ్మను తీసుకువెళ్లడానికి భర్త వస్తుండగా, చెరువు గట్టున మొలిచిన తంగేడు పూవులను ఆశ్చర్యపోతాడు. పూవులను కోయబోగా, ‘పాపిష్టి మరదలు తనని ఇక్కడ చంపి పాతిపెట్టింద’ని తెలుపుతుంది. ప్రతి సంవత్సరం తంగేడు పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరమ్మను నిలిపి పూజ చేసి నీటిలో విడవాలని కోరింది. అప్పటి నుంచి బతుకమ్మను జానపదులు కొలుస్తున్నారని కథనం. ఇక చివరగా, గౌరీ దేవి లోక కంటకుడైన మహిషాసురుని చంపి, ఆ అలసటతో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు మూర్ఛపోయిందని, ఆమె మూర్ఛ తీర్చడానికి స్త్రీలందరూ నాలుగురోజులపాటు భక్తితో పాటలు పాడారు. ఐదవరోజు గౌరీ దేవికి స్పృహ వచ్చింది. మూర్ఛపోయిన మహిషాసురమర్ధనిని ‘బతుకమ్మ’ అని వేడుకోవడం వల్ల ఆమె బతుకమ్మ అయిందని ప్రతీతి. ఇలా అనేక కథలు వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్నప్పటికీ, జానపదులు బతుకమ్మను కొలిచే విధానంలో మాత్రం తేడాలు లేవు.

పూజా విధానం:

బొడ్డెమ్మను నిమజ్జనం చేసిన రోజు నుంచి బతుకమ్మ పండుగ మొదలై తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఏడురోజులు మాత్రమే జరుపుకునే ఆనవాయితీ కూడా ఉంది. మొదటి రోజు పండుగను ‘ఎంగిలిపూవు’ అంటారు. ఆ రోజు బొడ్డెమ్మకు, బతుకమ్మ పూజకు వినియోగించే ఉద్రాక్ష వంటి పూవులను ఒకరోజు ముందే కోసి నీళ్లలో వేసి, లేక నోటితో ఊది వికసింప చేస్తారు. అలా చేయడం వల్ల ఆ పూలు ఎంగిలి పడ్డాయని వాటిని ఎంగిలి పూలు అంటారు. మొదటి రోజు పేర్చే బతుకమ్మ మిగిలిన రోజుల కంటే పెద్దగా ఉంటుంది. ఈ ఆ రోజు వాయనంగా వక్కలు, తులసి ఆకులు, సత్తుపిండి (పంచదార లేక బెల్లం కలిపిన మొక్కజోన్న పిండి) ఇస్తారు. కొన్ని చోట్ల నానపెట్టిన పెసరపప్పు, దోసముక్కలు పంచిపెడతారు. ఇక రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా ఇస్తారు. మూడవరోజు బెల్లంలో ఉడికించిన శనగపప్పు, నాలుగోరోజు నానబియ్యం (బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం), ఐదవరోజు అట్లు పోసి ప్రసాదంగా చేసుకుంటారు. ఆరోవ రోజు బతుకమ్మను పేర్చడంగాని, ఆడడం గాని చేయరు. ఆ రోజు బతుకమ్మ అలిగిందని జానపదుల అభిప్రాయం. ఏడవ రోజు ప్రసాదంగా పప్పు బెల్లం, ఎనిమిదో రోజు నువ్వుల బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా పంచిపెడతారు.

చివరి రోజు బతుకమ్మను ‘సద్దుల బతుకమ్మ’ అంటారు. దక్షయజ్ఞంలో ప్రాణత్యాగం చేసిన సతీదేవి వెంపలి చెట్టు అయిందని జానపదుల విశ్వాసం. అందుకు చివరి రోజు వెంపలి చెట్టును ధూపదీప నైవేద్యాలతో పూజించి, చెట్టు మొదలో బతుకమ్మ నుంచి పూజలు చేస్తారు. చివరి రోజున బతుకమ్మను వెదురు సిబ్బిలోగాని, ఇత్తడి పళ్లంలో గుమ్మడి ఆకులు, పూలరేకలు పర్చి బతుకమ్మను పేరుస్తారు. మొదటి వరసున గుండ్రంగా తంగేడు పూలతో పేరుస్తారు. తర్వాత తెల్లని గునుగు పూలతో ఒక వరుస పేర్చి, మధ్యలో తంగేడు ఆకులు, మొగ్గలతో నింపుతారు. ఒక వరుస తర్వాత ఒకటిగా గోపురాకారంలో పూలను పేర్చుతారు. గన్నేరు, ఉద్రాక్ష, కట్ల, బంతి, చేమంతి, బీర, గన్నేరు, కలువ, గోరింట, నిత్య మల్లెలు, గుమ్మడి ఇలా చెట్లమీద, పుట్లమీద దొరికే పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖర భాగాన పెద్ద గుమ్మడి, కలువ, బంతి లేక గులాబి పూవును ఉంచుతారు. ఒంటి బతుకమ్మ అశుభానికి సూచన అని ప్రతి ఇంటిలో పెద్ద బతుకమ్మతోపాటు చిన్న బతుకమ్మను కూడా మరో పళ్లెంలో పేరుస్తారు. చిన్న బతుకమ్మ పైభాగాన పసుపు గౌరిని ఉంచి పూజిస్తారు. ఇలా ఊరంతా తాము పేర్చిన బతుకమ్మలను చెరువు దగ్గరకు తీసుకువచ్చి ఒక వెంపలికొమ్మను నాటి, పసుపు చల్లి బతుకమ్మను ఉంచి,

ఒక్కొక్కపూవేసి చందమామ		ఒక్క జాముఆయె చందమామ
శివుడింక రాడాయె చందమామ	శివుని పూజాలయె చందమామ
రెండేసి పూలేసి చందమామ		రెండు జాములాయె చందమామ
శివుడింక రాడాయె చందమామ	శివుని పూజాలయె చందమామ

అంటూ, బతుకమ్మకు పదిసార్లు ఒక్కక్క పూవు వేసి శివుణ్ణి ప్రార్థిస్తారు. కొన్ని ప్రాంతాలలో విఘ్నాలు కలుగకుండా గణపతికి కూడా పూజచేస్తారు. తర్వాత మంగళప్రదాయిని గౌరీదేవిని ఆవాహన చేసి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. చివరి రోజున సద్దుల బతుకమ్మకు అన్నంలో తొమ్మది రకాలు పొడులు (నువ్వులు, దోస, పప్పులు మొదలైనవి) విడి, విడిగా కలిపి నైవేద్యం పెడతారు. చెరువు గట్టుకు తీసుకువచ్చిన ప్రసాదాలను ఇతరులకు పంచి పెడతారు, ఈ ప్రసాదాలను ఇంటికి మాత్రం తీసుకు వెళ్లరు.

తొమ్మదిరోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగలో స్త్రీల ఆట, పాటలే ప్రాముఖ్యమైనవిగా గోచరిస్తాయి. పౌరాణిక, చారిత్రిక, సాంఘిక ఘట్టాలను జానపదులు తమ పాటలలో మిళితం చేసి తమలోని ధార్మికతను చాటుకుంటారు.

శ్రీ గౌరిపూజ ఉయ్యాలో	చేయబూనితిమమ్మ ఉయ్యాలో
కాపాడిమమ్మేలు ఉయ్యాలో	కైలాసరాణి ఉయ్యాలో
శాంకరీ పార్వతీ ఉయ్యాలో	శంభునిరాణి ఉయ్యాలో
తల్లినిన్నెప్పుడు ఉయ్యాలో	ధ్యానింతునమ్మా ఉయ్యాలో
కలహంస నడకల ఉయ్యాలో	కలికిరావమ్మా ఉయ్యాలో
సింహపీఠంబున ఉయ్యాలో	చెలియ కూర్చుండు ఉయ్యాలో
బంగారు చెంబులో ఉయ్యాలోగంగ ఉదకముతెచ్చి ఉయ్యాలో
కాంతనీపాదాల ఉయ్యాలో	కడిగి తడి ఒత్తేదా ఉయ్యాలో
అంబికనీకివే ఉయ్యాలో	ఆర్ఘ్యంబులిత్తు ఉయ్యాలో
ఆకాశగంగతో ఉయ్యాలో	అభిషేకించేదా ఉయ్యాలో
పంచామృతముచే ఉయ్యాలో	పణతిరోనీకిత్తు ఉయ్యాలో
జలజాక్షి పన్నీరు ఉయ్యాలో	జలకమాడుము తల్లి ఉయ్యాలో
జల్తారు చీరను ఉయ్యాలో	శాంభవీ గైకొనుము ఉయ్యాలో
రాగిసొమ్మదాల్చి ఉయ్యాలో	రంజిల్లు గౌరమ్మ ఉయ్యాలో
అందమైనమెడకు ఉయ్యాలో	చందనంబు బూసి ఉయ్యాలో
అక్షింతలుంచితి ఉయ్యాలో	అంబనీపాదాల ఉయ్యాలో
పునుగు జవ్వాజితో ఉయ్యాలోపూజింతు నిన్ను ఉయ్యాలో
పసుపుకుంకుమ బెట్టి ఉయ్యాలోపడతినిన్ను పూజింతు ఉయ్యాలో
పూలు పత్రి చెట్టు ఉయ్యాలో	పూజింతు గౌరమ్మ ఉయ్యాలో
పారిజాతంబు ఉయ్యాలో	పార్వతినిను కొలుతు ఉయ్యాలో
మారేడు దళముల ఉయ్యాలోమాతనిను పూజింతు ఉయ్యాలో
తుమ్మిపూలతోటి ఉయ్యాలో	అమ్మనిను పూజింతు ఉయ్యాలో
గన్నెరుపూవులా ఉయ్యాలో	గౌరినిను పూజింతు ఉయ్యాలో
గోరంటపూవ్వుల ఉయ్యాలో	కోరినిను పూజింతు ఉయ్యాలో
చేమంతి పువ్వుల ఉయ్యాలో	చేరినిను పూజింతు ఉయ్యాలో
కలువపూవులతో ఉయ్యాలో	కలికిరో పూజింతు ఉయ్యాలో
సంపెగపూలతో ఉయ్యాలో	యింపుగా పూజింతు ఉయ్యాలో
బంతిపూలతను తెచ్చి ఉయ్యాలోయింతినీకర్పింతు ఉయ్యాలో
మంకెనపూవులు ఉయ్యాలో	శాంకరీనీకిత్తు ఉయ్యాలో
తంగేడు పూవుల ఉయ్యాలో	తల్లినిను పూజింతు ఉయ్యాలో
పొన్నపూవులతోటి ఉయ్యాలో	పార్వతిని పూజింతు ఉయ్యాలో
మందారపూలతో ఉయ్యాలో	మగువనిను పూజింతు ఉయ్యాలో
మల్లెపూలు తెచ్చి ఉయ్యాలో	మాతల్లి పూజింతు ఉయ్యాలో
నీలకంఠునిరాణి ఉయ్యాలో	నిన్ను పూజించెద ఉయ్యాలో
సాంబ్రాణి ధూపంబు ఉయ్యాలోశాంభవీ నీకిత్తు ఉయ్యాలో
దేవి నీ సన్నిధిని ఉయ్యాలో	దీపంబు వెలిగింతు ఉయ్యాలో
చారపలుకులపప్పు ఉయ్యాలోనారికేళంబులు ఉయ్యాలో
నాతిరోనికిదే ఉయ్యాలో	నైవేద్యమిచ్చెద ఉయ్యాలో
శంభూనిరాణి ఉయ్యాలో	తాంబూలమిచ్చెద ఉయ్యాలో
దాక్షాయిని నీకు ఉయ్యాలో	దక్షిణగైకొమ్ము ఉయ్యాలో
మానినీ చేకొమ్ము ఉయ్యాలో	మంత్రపుష్పం బిదె ఉయ్యాలో
దేవి ప్రదక్షిణము ఉయ్యాలో	దరికి చేతు వచ్చు ఉయ్యాలో
మొక్కితినికిదే ఉయ్యాలో	సావిత్రీదేవి ఉయ్యాలో
అంగనామణినీకు ఉయ్యాలో	మంగళహారతి ఉయ్యాలో
భువనేశ్వరినిన్ను ఉయ్యాలో పూజింతునమ్మ ఉయ్యాలో
తప్పులన్నికాచి ఉయ్యాలో  తల్లిమము కాచు ఉయ్యాలో

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *