పోతన భాగవతామృతం

‘భగవతః చరితం భాగవతమ్’. భగవంతుని చరితము భాగవతము. ప్రపంచోత్పత్తి, ప్రళయము, భూతలముల ఆగమనగమనములు, విద్యావిద్యలు ఎవరికి తెలియునో ఆతడు భగవంతుడని ప్రాచీన పండితులు నిర్ధేశించారు. నిర్గుణ, సుగుణాత్మకుడైన ఆత్మస్వరూప నిరూపణమే భాగవత కథ. వ్యాసుడు రచించిన అష్టాదశపురాణాలలో అత్యంత విశిష్టమైనది భాగవతం. గాయత్రి ఆధారంగా ధర్మ ప్రబోధము కలిగి, 18వేల శ్లోకనిబ్ధమయినది భాగవతమని మత్స్యపురాణం వివరించింది. 18వేల శ్లోకాలతో 12 స్కంధములు కల్గి హయగ్రీవ బ్రహ్మవిద్యోపేతమై గాయత్రీ నిరూపణసహితమైనది భాగవతమని స్కంధ పురాణం అభివర్ణించింది.

ఇన్ని విశిష్టాలు కల్గిన భాగవతాన్ని నన్నయ, తిక్కన కవులు ఆంధ్రీకరించకపోవడం తన పూర్వజన్మసుకృతమని, పునర్జన్మ అనేది లేకుండా భాగవతాన్ని ఆంధ్రీకరించి తన జన్మని సఫలంచేసుకుంటానని పోతన శ్రీ మహాభాగవతాన్ని తెనుగీకరించాడు. సంసారబంధ విచ్ఛేదము కోరువాడు భాగవతం చదవాలని పద్మపురాణం చెపుతోంది. అదే లక్ష్యంగా ‘శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్’ అని పోతన తన తొలి పద్యంలోనే స్పష్టంచేశాడు.

‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట’ అంటూ భాగవతంలోని భక్తిరసాన్ని చెప్పకనే చెప్పాడు. పాండిత్యము వల్లకానీ, వ్యాఖ్యానం వల్లగాని భాగవతసారం తెలియదని కేవలం భక్తి రసమే ప్రధానమని నిరూపించాడు. భగవద్భక్తి ప్రబోధాత్మకమైన పద్యాలెన్నో ఆంధ్రభాగవతంలో మనకు సాక్షాత్కరిస్తాయి. ‘మందార మకరంద మాధుర్యమున దేలు,’ ‘కమలాక్షు నర్చించు గరములు కరములు…’, ‘కలడందురు దీనులయెడ…’, ‘లావొక్కింతయు లేదు…’, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ పద్యము భక్తిరసాన్న ఓలలాడుతుంది.

నొరులుగారు నాకు నొరులకు నేనౌదు
నొంటివాడ జుట మొకడులేడు
సిరియు దొల్లిగలదు చెప్పెదనాటెంకి
సుజనులందు తఱచు సొచ్చియుండు

అంటూ పరబ్రహ్మతత్త్వాన్ని ప్రస్తుతించాడు.

వ్యాసభాగవతానికి ఆంధ్రీకరణే అయిన పోతన తనదైన శైలిలో అనేకచోట్ల మూలము కంటె విస్త్రృతంగా రచించి మన్ననలు పొందాడు. ఉదాహరణకు సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర, అష్టమ స్కంధంలోని గజేంద్రమోక్ష ఘట్టాలను పోతన మూలమును దాదాపు మూడు, నాలుగు రెట్లు పెంచి రచించెనని పండితుల అభిప్రాయం. అదే విధంగా అష్టమ స్కంధంలోని వామనావతార ఘట్టము నందు బలి చక్రవర్తి స్వర్గంపై దండెత్తడాన్ని వ్యాసుడు 12 శ్లోకాలలో వర్ణిస్తే, పోతన సుదీర్ఘ వచన శబ్ధాలంకారలతో విస్త్రృతంగా వర్ణించాడు. ఎవ్వరివాడవు, ఏమికావలనన్న బలి ప్రశ్నలకు వామనమూర్తి సమాధానాలు మూలంలో కానరావు. అవన్నీ పోతన సృష్టియే. పోతన గావించిన స్వేచ్ఛానువాదము వల్లనే ఆంధ్ర భాగవతం అంత ప్రఖ్యాతి గాంచి ఉండవచ్చు.

అదే విధంగా దశమ స్కంధమందలి రుక్మిణీ కళ్యాణ ఘట్టమందు రుక్మిణి బాల్యయౌవన వర్ణన, బ్రాహ్మణుడు కృష్ణునకు తెలిపిన రుక్మిణీ సౌందర్య వర్ణన పోతన కల్పితాలే. మూలకథకు హాని కల్గకుండా సందర్భసముచితంగా ఆయా ఘట్టాలను పోతన సుందరముగా వర్ణించి మూలకథను పెంపోందించాడు. కథాగతిలో వర్ణనలకు ప్రాధాన్యతను ఇవ్వటం ద్వారా పోతన తనదైన పోకడను కథాగమనంలో రాబట్టాడు. వామనావతారమందలి ‘ఇంతింతై వటుడింతై…’, ‘రవిబింబంబుపమింప…’ పద్యాలే ఇందుకు మచ్చుతునకలు. ఈ రెండు పద్యాల ద్వారా కథా దృశ్యాలను పాఠకుల మనోఫలకాలపై ప్రతిష్టించిన ప్రతిభ పోతనది.

మాటిమాటికి వ్రేలు మడిచి యూరించుచు
నూరగాయలు దినుచుండు నొక్క
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి
చూడలేదని నోరు చూపు నొక్క
డేగురార్గురి చల్దు లెలమి బన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్క
డిన్నియు దగబంచి యిడుట నెచ్చలి తన
మనుచు బంతెనగుండు లాడు నొకడు

కృష్ణుజూడు మనుచు గికురించి పరుమ్రోల
మేలి భక్ష్యరాశి మెసగునొకడు
నవ్వునొకడు సఖుల నవ్వించు నొకడు
ముచ్చటలాడు నొకడు మరియు నొకడు

అంటూ చపల గోపాలబాలుర చిలిపిచేష్టలను అచ్చతెనుగులో మూలములో లేని సొగసులను ఇడిమి సహజసుందరంగా సాక్షాత్కరింపచేయడం పోతనకే చెల్లింది. పోతన మూలాన్ని పెంచిపెంపొందించినట్టే యథాతధముగ అనువదించిన సందర్భాలు కూడా పెక్కె. మూలములోని భక్తిబంధురమగు భావజాలాన్ని, పదాలను గ్రహించి సందర్భోచితంగా విపులీకరించి పోతన తన ప్రతిభను చాటుకున్నాడు.

అంతేకాకుండా ప్రతీ కథ చివరా ఆ కథలోని విశేషాన్ని ఒక సూక్తిగా కూర్చడం పోతన ప్రత్యేకత. ఉదాహరణకు శివుడు హాలాహలాన్ని మింగిన సందర్భంలో ఆ హాలాహలం ఏవిధంగా శివునికి ఆభరణమైందో చెపుతూ, నల్లని మచ్చ అన్పించినా అది సాధు రక్షణ వల్ల ఏర్పడ్డ భూషణమని, సజ్జనులయినవారికి సాధు రక్షణమే భూషణమన్నాడు.

హరుడు గళమునందు హాలాహలము వెట్ట
గప్పు గలిగి తొడవు కరణి నొప్పె
సాధు రక్షణంబు సజ్జనులకు నెన్న
భూషణంబుగాదె భూవరేంద్ర!

అలాగే మోహినీ అవతార కథ చివరన –

కాము గెలువవచ్చు గాలరి గావచ్చు
మృత్యుజయము గలిగి మెఱయవచ్చు
ఆడువారి చూపుటంపఱ గెలువంగ
వశముగాదు త్రిపురవైరికైన! అన్నాడు.

ఇలా

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరుతు

అంటూ తనదైన శైలిలో పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించి మనదరిని కృతార్ధులని చేశాడు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *