పురాణ పరిచయం 9

14. వామన పురాణం

వామనంబిది పదునాల్గవది తనర్చు
శైవమై కూర్మకల్పకథావిశేష
మయి పులస్త్యుండు సురముని కానతిచ్చి
నది పవిత్రంబు దశసహస్రాత్మకంబు

శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనావతార మహాత్మ్యాన్ని తెలిపే పురాణమే వామనపురాణం. విష్ణువు చర్మంగా అభివర్ణించబడే ఈ పురాణాన్ని బ్రహ్మ కూర్మకల్పంలో పులస్త్య మహామునికి బోధించాడు. పూర్వభాగం, ఉత్తర భాగం అని రెండు భాగాలుగా విభజించబడిన ఈ పురాణంలో మొత్తం 95 అధ్యాయాలలో పదివేల శ్లోకాలున్నాయి. అయితే ‘బృహద్వామనమ’ నబడే ఉత్తర భాగం నేడు దొరకట్లేదు.

ఈ పురాణంలో ముఖ్యంగా పన్నెండు విష్ణు స్తోత్రాలు, ఎనిమిది శివ స్తోత్రాలు, నాలుగు దేవీ స్తోత్రాలు, సుదర్శన చక్ర స్తోత్రం ఉన్నాయి. ఇవే కాక త్రివిక్రమరూపం దాల్చిన, వామనుడి వృత్తాంతంతోబాటు, నరనారాయణోపాఖ్యానం, దేవీ మాహాత్మ్యం, ప్రహ్లాద వృత్తాంతం, శ్రీరామ చరిత, వివిధ పుణ్యతీర్థాల వర్ణన, కురుక్షేత్ర మాహాత్మ్యం, గజేంద్ర మోక్షం, శివుడు తన వేర్వేరు అంగాలలో ధరించే సర్పాల పేర్లు, దేవదానవులుపయోగించే వివిధ వాహనాల పేర్లు వాని వర్ణనలు, విష్ణు పూజా విధానం, విష్ణ్వాలయ నిర్మాణం, విష్ణు దీక్షా గ్రహణ పద్ధతి వంటి అంశాలెన్నో ఈ పురాణంలో చోటుచేసుకున్నాయి.

దేవతల్లో ముఖ్యడు విష్ణువు. అదేవిధంగా ఆయుధాలలో శ్రేష్టమైనది సుదర్శన చక్రం, పక్షులలో గరుడుడు, సర్పాలలో వాసుకి, పంచభూతాల్లో భూమి, నదుల్లో గంగానది, నీట జన్మించిన వాటిలో పద్మం, సరోవరాల్లో మానస సరోవరం, వనాల్లో నందనవనం, లోకాల్లో బ్రహ్మలోకం, ధర్మాల్లో సత్యం, క్రతువుల్లో అశ్వమేధం, ఋషీశ్వరుల్లో అగస్త్యమహర్షి, పురాణాల్లో మత్స్యపురాణం, స్మృత్యుల్లో మనుస్మృతి, తేజోవంతుల్లో సూర్యుడు, జలాశయాల్లో సముద్రుడు, ధాన్యాల్లో వరి, చతుష్పాత్తులలో గోవు, పుష్పాల్లో జాజి, నగరాల్లో కంచి, సుందరీమణుల్లో రంభ, పట్టణాల్లో కుశస్థల (రాముని కుమారుడు కుశుడు నిర్మించిన పట్టణం), పళ్లల్లో మామిడి, తెల్లని పదార్ధాల్లో పాలు, శాస్త్రాలలో గణిత శాస్త్రం, విజ్ఞానాల్లో మహేంద్రజాలం, షడ్రుచులలో లవణం, వృక్షాలలో రావి, సతీమణుల్లో పార్వతీదేవి శ్రేష్టమని, చివరగా, మహాపాపాత్ముల్లో కృతఘ్నునికి సమానుడు లేదని వామన పురాణం మనకు తెలుపుతోంది.

శివుని కాలస్వరూపము:

కాలరుద్రుని, కాలస్వరూపమును వామన పురాణం ఈ కింది విధంగా విశదీకరించింది.

అశ్విని, భరణి, కృత్తికలోని యొక పాదము కలిసి మేషరాశి. ఇది కుజక్షేత్రము. కాలరూపుండగు శివునికిది శిరస్సు.

కృత్తిక మూడుపాదములు, రోహిణి, మృగశిర రెండు పాదములు వృషభము, ఇది శుక్రుని ఇల్లు – శివుని ముఖము.

మృగశిర మిగత రెండు పాదములు, ఆర్ద్ర, పునర్వసులలో మూడును మిథునము, ఇది బుధుని ఇల్లు – శివుని రెండు బాహువులు.

పునర్వసు పాదము, పుష్యమి, ఆశ్లేషయు కర్కటము, ఇది చంద్రుని గృహము – శివుని ప్రక్కలు.

మఘ, ఉత్తర, పుబ్బలోని పాదము సింహము. ఇది సూర్యసదనము – మహేశుని హృదయము.

ఉత్తరలో మూడు పాదములు, హస్త, చిత్తలో రెండును, కన్య. ఇదియును బుధుని గృహమే – శంకరుని జఠర స్థానము.

చిత్తలో రెండు, స్వాతి, విశాఖలో మూడు పాదములు తుల. ఇది శుక్రుని నివాసము – శివునికిది నాభి.

విశాఖలో పాదము, అనురాధ, జ్యేష్ఠ కలిసి వృశ్చికము. ఇది కుజుని రెండవ ఇల్లు – శంభుని మూత్రస్థానము.

మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడలో పాదము ధనుస్సు. ఇది బృహస్పతి ఆవాసము – శివుని తొడలు.

ఉత్తరాషాడ మూడు పాదాలు, శ్రవణము, ధనిష్ఠలో సగము మకర రాశి. ఇది శని ఇల్లు – గిరీశుని జాను (మోకాళ్ల) భాగము.

ధనిష్ఠలో రెండు పాదములు, శతభిషము, పూర్వాభాద్రలో మూడు పాదాలు కుంభము. ఇదియును శని నివాసమే. – శంకరుని పిక్కలు.

పూర్వాభాద్రలో ఒకటి, ఉత్తరాభాద్ర, రేవతియు మీనము. ఇది బృహస్పతి రెండవ ఇల్లు – శివుని పాదములు.

15. కూర్మపురాణం

కూర్మరూపంలో ఉన్న మహావిష్ణువు స్వయంగా దేవేంద్రుని సమక్షంలో దేవతలకు ఉపదేశించిన ఈ పురాణం విష్ణువు యొక్క పృష్ఠ (వీపు) భాగంగా వర్ణించబడింది. పూర్వార్థంలో 53, ఉత్తరార్థంలో 46 అధ్యాయాలు కలిపి మొత్తం 99 అధ్యాయాలలో 17వేల శ్లోకాలు ఈ పురాణంలో ఉన్నాయి. కాగా లక్ష్మీకల్పంలో ఈ పురాణాన్ని విష్ణువు పులస్త్యమహామునికి ఈ పురాణాన్ని బోధించాడు. వైవస్వత మనువుకి మత్స్యావతారంలోను, వరరాహావతారంలో భూదేవికి, వామనావతారంలో బలికి కూర్మావతారం గురించి విష్ణువు ఆయా అవతారాలలో తెలిపాడు. నారద పురాణానుసారం ఇందు బ్రహ్మీ సంహిత, భాగవతీ సంహిత, సౌర సంహిత మరియు వైష్ణవీ సంహిత అని నాలుగు భాగాలున్నాయి. అయితే వీటిలో బ్రహ్మీ సంహిత మినహాయించి, మిగిలిన సంహితాలు అందుబాటులో లేవు.

సృష్టి విధానం వర్ణన, ద్వాదశాదిత్య వర్ణన, అష్టాంగ యోగాలు, వానప్రస్థాశ్రమ మహాత్మ్యము, దేవీ అవతారాలు, యదువంశ చరిత్ర, వారణాసి, ప్రయాగ క్షేత్రాల మాహాత్మ్యం, జంబూద్వీప వర్ణన, ఈశ్వర గీత, వ్యాసమహర్షి చేసిన ధర్మోపదేశాలు, పుణ్యతీర్థాలు వాటి ప్రాశస్త్యం, ప్రళయ వర్ణన మొదలగు అనేకా అంశాలు ఈ పురాణమందు తెలుపబడ్డాయి.

ఉప పురాణాలు:

మహాపురాణాలలాగే ఉప పురాణాలు కూడా 18 ఉన్నాయని కూర్మపురాణం మనకు చెపుతోంది. ఈ ఉప పురాణాలు వరుసగా – 1. సనత్కుమారోక్తం, 2. నారసింహం, 3. స్కాందం, 4. శివధర్మం, 5. దౌర్వసం, 6. నారదోక్తం, 7. కాపిలం, 8. వామనం (మానవం), 9. ఉశనసఃప్రోక్తం, 10. బ్రహ్మాండం, 11. వారుణం, 12. కాలికా పురాణం, 13. మాహేశ్వరం, 14. సాంబం, 15. సౌరం, 16. పరాశరోక్తం, 17. మారీచం మరియు 18. భాస్కరం (భార్గవం).

ఈశ్వరుడు నిర్వచించిన ఆత్మజ్ఞానం:

ఆత్మాయం కేవలః స్వచ్ఛాః శుద్ధః సూక్ష్మః సనాతనః
అస్తి సర్వాంతరః సాక్షాచ్ఛిన్మాత్ర స్తమసః పరః

ఆత్మ కేవలం శుద్ధమైనది, నిర్మలమైనది, సూక్ష్మం, సనాతమైదే కాక, జ్ఞానమాత్రమై, అంధకారానికి అతీతమై అన్నింటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ నుంచే ప్రపంచం జన్మించి, అందులోనే లీనమవుతుంది. ఆత్మ ప్రాణరూపుడు కాదు. మనసు, అవ్యక్తం, శబ్ధం, స్పర్శ కూడా కాదు. ఆత్మ కర్త కాదు. వాక్కుకాదు. పాణిపాదాలు, గుద, యోనులు, కర్త, భోక్త, ప్రకృతి, పురుషుడు, మాయ, ప్రాణం ఇవేవి కాదు. ఆత్మ వికార రహితమైనది. ద్వంద్వాలు లేనిది. ఆనందరూపమైనది. నాశనరహితమైనది. పొగతో సంబంధం వల్ల ఆకాశం ఎలా మలినం కాదో, అలాగే మనసులోని కామక్రోధాది దుర్గుణాల వల్ల ఆత్మ మలినం కాదు. స్ఫటికశిల ఎలాగైతే స్వప్రకాశంతో వెలుగొందుతుందో, నిర్మలమైన ఆత్మ కూడా స్వతః సిద్ధంగానే ప్రకాశిస్తుంది. ఆత్మ సహజంగా నిర్గుణమైనది, చైత్యనస్వరూపిణి, సర్వ వ్యాప్తి. ఆత్మ అక్షరమైనది, శుద్ధమైనది, నిత్యమైనది.

అలాగే ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు అవ్యక్తుడు, మాయా స్వరూపుడు, సర్వాత్మకుడు, సర్వరూపుడు, సర్వాంతర్యామి, సనాతనుడు అని కూర్మపురాణం మనకు తెలుపుతోంది. అలాగే మహేశ్వరునికి శాంతి, విద్య, ప్రదిష్ట, నివృత్తి అనే నాలుగు విధాలైన శక్తులుండటంచే పరమేశ్వరుడు చతుర్వ్యూహడుని ఈ పురాణం తెలుపుతోంది.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *