పురాణ పరిచయం 7

10. బ్రహ్మవైవర్త పురాణము

రథంత కల్పస్య వృత్తాంత మధికృత్య చ|
సావర్ణినా నారదాయ కృష్ణ మాహాత్మ్య సంయుతం ||
చరితం బ్రహ్మ వరాహస్య చరితం వర్ణ్యతేzత్ర చ|
తదష్టా దశసాహస్రం బ్రహ్మవైవర్తముచ్యతే ||

వరాహస్వామి, శ్రీకృష్ణునికి సంబంధించిన వృత్తాంతాన్ని సావర్ణి మనువు నారద మహర్షికి రథంతర కల్పంలో మొట్టమొదటిసారిగా తెలిపినదే ఈ బ్రహ్మవైవర్త పురాణమని స్కాంద పురాణంలో ప్రభాస ఖండంలో చెప్పబడింది. బ్రహ్మవైవర్త శబ్ధమున కర్థము – బ్రహ్మణో వివర్తః (పరిణామః) ‘బ్రహ్మవైవర్తః). బ్రహ్మమనగా సకలసృష్టిబీజస్వరూపుడైన భగవంతుడు. వైవర్తమనగా సకలజగాన్నిర్మాణశీలయైన ప్రకృతి. ప్రకృతిభగవంతుల దివ్యచరితవిశదవర్ణనయే బ్రహ్మవైవర్త పురాణం.

బ్రహ్మాణ్డే సర్వబీజం పరబ్రహ్మ నిరూపణమ్
తతః ప్రకృతేఖణ్డే చ దేవీనాం చరితం శుభమ్
తతో గణేశఖణ్డే చ తజ్జన్మ పరికీర్తితమ్
శ్రీకృష్ణఖణ్డం చ కీర్తి తం చ తతః పరమ్

శ్రీమన్నారాయణుని ఎడమకాలితో పోల్చబడే ఈ పురాణం బ్రహ్మాండం, ప్రకృతి ఖండం, గణేశ ఖండం మరియు శ్రీకృష్ణఖండం అనే నాలుగు ఖండాలుగా విభజింపబడింది. ఇందు 18వేల శ్లోకాలున్నాయని మత్స్య, నారద పురాణాలు తెలుపుతున్నప్పటికీ, నేడు మనకు కేవలం 12వేల శ్లోకాలు లభిస్తున్నాయి. బ్రహ్మఖండంలో సృష్టిక్రమం, ప్రకృతి ఖండంలో దుర్గ, లక్ష్మి, సరస్వతి మొదలగు దేవతా స్వరూపాలతో ప్రకృతి ఆవిర్భావం, గణేశ ఖండంలో వినాయక జన్మవృత్తాంతం, కృష్ణఖండంలో శ్రీకృష్ణలీలలు వర్ణించబడ్డాయి. ఇవేకాక, సరస్వతీ పూజావిధానం, భూదాన మహిమ, తులసీ మహాత్మ్యం, వమహాలక్ష్మీస్తోత్రం, భౌగోళిక, అణు, కాల విజ్ఞానాలు, ఆయుర్వేదము, లాభదాయక ఔషధాలు, మనుష్య ధర్మాలు మొదలగు అనేక అంశాలు ఈ పురాణమందు చోటుచేసుకున్నాయి.

అలాగే గణపతి ఖండం 44వ అధ్యాయంలో వేదములే శాస్త్రములందు శ్రేష్టమని, దైవములందు శ్రీకృష్ణపరమాత్మయే సర్వ శ్రేష్ఠుడని, పవిత్రతీర్థములందు గంగయే సర్వోత్కృష్టమైనదని, సకలపుష్పములందు తులసియే పరమోత్కృష్టమగు పూజాకుసుమమని మహావిష్ణువు ధృవీకరించాడని ఈ పురాణం తెలుపుతోంది. అంతేకాక అతిథి, గురుమహిమలతోపాటు తండ్రి, తనయులుగా భావించదగ్గవారి గురించిన వివరణ ఇందు కలదు.

విద్యాదాతన్నదాతాచ భయత్రాతచ జన్మద
కన్యాదాతాచవేదోక్తా, నరాణాంపితర స్మృతా

విద్యాదాత (గురువు), అన్నదాత (పోషకుడు), అభయదాత (శరణాగత రక్షకుడు), జన్మదాత (జన్మనిచ్చివాడు), కన్యాదాత (పిల్లనిచ్చిన మామ) వీరైదుగురు తండ్రి స్థానాన ఎంచగలవారని, అలాగే పుత్రుడంటే రక్తసంబంధంతో పుట్టినవాడేగాక పుత్రదృష్టితో చూడదగిన అయిదుగురు వరసగా సేవకుడు, శిష్యుడు, పోషితుడు, ఔరసుడు, శరణాగతుడని ఈ పురాణం మనకు చెపుతోంది. సమస్త పూజనీయులయందు తండ్రి అత్యంత వందనీయుడు. కానీ, నవమాసములు మోసి, పాలించి పోషించిన జనని తండ్రికన్నా నూరురెట్లు వందనీయురాలని ఈ పురాణం చెపుతూ, పురుషులకు 14మంది తల్లులు కలరని తెలుపుతూ, గురుపత్ని, రాజపత్ని, దేవపత్ని, తల్లి సహోదరి, తండ్రి సహోదరి, శిష్యపత్ని, సేవకుని భార్య, మేనమామ భార్య, సవతితల్లి, భార్య తల్లి, సహోదరి కుమార్తె, గర్భమున ధరించిన జనని, ఇష్టదేవి వీరందరు పురుషునకు తల్లులనబడతారని శ్రీకృష్ణజన్మఖండంలో విశదీకరించబడింది.

ఇంకా బ్రహ్మవైవర్త పురాణమందు యమధర్మరాజు సతీసావిత్రి కుపదేశించిన విషయాలు శ్రీయమగీతగాను, దూర్వాసమహర్షి దేవేంద్రునకు కుపదేశించిన విషయాలు దూర్వాసగీతయని, శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన శ్రీమద్భగవద్గీతయు సవిస్తారంగా వివరించబడ్డాయి. వీటితోపాటుగా గణేశ కవచము, దుర్గా కవచము, శ్రీ శివ, కృష్ణ మహామంత్రస్తోత్ర కవచములు, శ్రీమహాలక్ష్మీ, సూర్య మహామంత్రస్తోత్ర కవచములు మొదలగు దేవతాస్తోత్రాలు కూడా బ్రహ్మవైవర్త పురాణమందు నిక్షిప్తమైయున్నాయి.

11. లింగపురాణం

అగ్నిలింగంలోనున్నశివమహాదేవుడు కల్పాంతకల్పంలో ప్రప్రథమంగా నారదునికి ఉపదేశించిన పురాణమే లింగపురాణం. ఇది శ్రీమహావిష్ణువు యొక్క కుడిచీలమండగా అభివర్ణించబడింది. ‘తదేకాదశ సాహస్రం, హరమాహాత్మ్య సూచకం’ అన్న శ్లోకాధారంగా ఇందు 11వేల శ్లోకాలున్నాయని తెలుస్తోంది. పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలుగా విభజించబడ్డ ఈ పురాణంలో పూర్వార్థంలో 108, ఉత్తరార్థంలో 55 మొత్తం 163 అధ్యాయాలలో 28 విధాలైన శివావతారాలకు సంబంధించిన ఘట్టాలు వర్ణించబడ్డాయి. యమ, నియమాదులనే అష్టాంగయోగాలతో శివారాధన విధానం, బ్రహ్మ జననం, సప్తసముద్రాలు, సప్త ద్వీపాల వర్ణన, త్రిపురాసుర సంహారం, ఉమామహేశ్వర వ్రతం, వారణాసి మహాత్మ్యం, పార్వతీ కల్యాణం, వినాయక జన్మవృత్తాంతం మొదలగు అంశాలు లింగపురాణంలో మనకు సాక్షాత్కరిస్తాయి.

పృథ్వీ స్వరూపుడు – శర్వుడు, జల స్వరూపుడు – భవుడు, అగ్ని స్వరూపుడు – పశుపతి, వాయు స్వరూపుడు – ఈశానుడు, ఆకాశ స్వరూపుడు – భీముడు, సూర్వ స్వరూపుడు – రుద్రుడు, సోమమూర్తి – మహాదేవుడు, యజమాన స్వరూపుడు – ఉగ్రుడు అనే శివుని అష్టవిధములైన రుపాలను లింగ పురాణం వర్ణించింది. అలాగే ఈ పురాణానుసారం అష్టదిక్పాలకుల నివాస స్థానాలు వరుసగా ఇంద్రుడు – అమరావతి, ఈశానుడు – యశోవతి, కైలాసం, యముడు – సంయమిని, వరుణుడు – శ్రద్ధావతి, నిరృతి (నైఋతి) – కృష్ణాంగన, వాయుదేవుడు – గంధవతి, అగ్నిదేవుడు – తేజోవతి, చివరగా కుబేరుడు – అలక.

శివుడిని పశుపతి అని ఎందుకు పిలుస్తారు?

దేవాదయః పిశాచాంతాః పశవః ప్రకీర్తితాః
తేషాం పతిత్వాత్సర్వేశో భవః పశుపతిః స్మృతః

ఇంద్రాది దేవతల నుంచి పిశాచాది గణాల వరకూ సకల జీవులూ పశువులని పిలవబడతారు. అలాగే సంసారబంధం అనే పాశాలతో బంధింపబడ్డ వారు పశువులే అనబడతారు. అలాంటి పశువులందరినీ శాసించే ప్రభువు కనుకనే పరమేశ్వరుడు ‘పశుపతి’ అయ్యాడు. యోగీశ్వరుడైన శివుని చేరాలంటే యోగమార్గమే తరుణోపాయం. మనస్సుని నిరోధించటాన్నే యోగం అంటారు. అలాంటి యోగం యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం మరియు సమాధి అని ఎనిమిది రకాలు. ఈ అష్టాంగ యోగం ద్వారా శివోపాసన ఎలా జరపాలో కూడా మనకు లింగ పురాణం తెలుపుతుంది.

యోగం చేయటం ఎలా?

ఓంకార వాచ్యం పరమంశుద్ధం దీపశిఖాకృతిం
ధ్యాయే ద్వైపుండరీకస్య కర్ణికాయాం సమాహితః

‘త’ హృదయం అనే కమలంలో పరమేశ్వరుణ్ణి ఓంకార స్వరూపుడుగా, శుద్ధసత్త్వ స్వభావుడిగా, దీపం అంచుని పోలిన తేజోమయ ఆకారం కలిగినవాడిగా ధ్యానించాలి. యోగీశ్వరుడైన శివుడిని నాభి ప్రదేశంలోగాని, కంఠం మధ్యలో గాని, కనుబొమల మధ్యలో గాని, లలాటం మీద గాని, తలమీద కాని ఉన్నట్టు భావించి ధ్యానించవచ్చు. యోగాభ్యాసం చేసేవారు, హృదయంలో పరమేశ్వరుణ్ణి, నాభికమలంలో సదాశివుణ్ణి, లలాటం మీద చంద్రశేఖరుణ్ణి, కనుబొమల మధ్య శంకరుణ్ణి ధ్యానించాలి. పన్నెండుసార్లు ప్రాణాయామం చేస్తే ఒక ధారణ అవుతుంది. అటువంటి పన్నెండు ధారణలు చేస్తే ధ్యానంగా పరిగణించబడుతుంది. ఈ ధ్యానం పన్నెండుసార్లు చేయటం వల్ల సాధకుడికి సమాధి సిద్ధిస్తుంది.

లైంగమాద్యంత మఖిలం యః పఠేచ్ఛృణు యాదాపి
ద్విజేభ్యః శ్రావయేద్వా పి సయాతి పరమాం గతిం

తపస్సు చేత, యజ్ఞం చేత, దానం చేత, రుద్రాధ్యయనం, వేదాధ్యయనం చేయటం చేతా ఎంత పుణ్యం లభిస్తుందో, ఈ లింగ పురాణ పఠనం, శ్రవణం వల్ల కూడా అంతే పుణ్యఫలం లభిస్తుంది.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *