పురాణ పరిచయం 5

7. మార్కండేయ పురాణం

అష్టాదశ పురాణాలలో ఏడవదయిన మార్కండేయ పురాణాన్ని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు ప్రప్రథమంగా జైమినికి బోధించాడు. నూటముప్పది నాలగు అధ్యాయాలు, తొమ్మిదివేల శ్లోకాలు కల్గిన మార్కండేయ పురాణం విష్ణుమూర్తి కుడిపాదంగా అభివర్ణిస్తారు. అయితే ఇందు కేవలం 6900 శ్లోకాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ పురాణమందు విస్తరస్త్రోతకీర్తనాదులు కానరావు. నీతి సూత్రములు, ఆచార విధివిధానములు, ధర్మ ప్రబోధములు పరిమితం. కథాకథనం ఈ పురాణ ప్రధాన లక్షణం.

పురాణాలు క్రమముగా సాత్త్వికరాజసతామసికములని పద్మపురాణం వర్గీకరించింది. అందు మార్కండేయము త్రిగుణ ప్రధానమైన పురాణము. సరస్వతీ చతుర్మఖకృశాలను కీర్తించును గాన రాజసమనియు స్వర్గప్రద మనియు పేర్కొంది. స్కాంద పురాణం మార్కండేయ పురాణాన్ని శివస్తుతి ప్రధానమైనదని, శివుడు తమోగుణ ప్రధానుడు కావున ఈ పురాణం తామస పురాణమని పరిగణించింది. అయితే మార్కండేయ పురాణం ప్రథమ భాగమున బ్రహ్మసూర్యాగ్నులను ప్రముఖంగా కీర్తించింది. పూర్వాభాగమున హరిహరులు, సప్తశతి యందు దుర్గాదేవీ ఈ పురాణంలో కీర్తించబడ్డారు. ఈ పురాణములో కీర్తించబడ్డ దైవములు గుణత్రయమునకు చెందినవారు. గుణత్రయ ప్రాధాన్యంగల ఈ పురాణం త్రిమూర్తులను, వైదిక దైవములను సమదృష్టితో కీర్తించటం ద్వారా ఇది త్రిగుణ ప్రధానమైన మహాపురాణం. ‘కల్పనేయం మహారాజకృతా సా వ్యావహారికీ త్వత్కృతానాం తథానామ్నాం శ్రుణు భూప నిరర్థతాం, వదన్తి పురుషాః ప్రాజ్ఞ వ్యాపినం పురుష సతః’ అని ప్రభోదించు ఈ పురాణం నామరూపరహితమైన పరబ్రహ్మమొక్కటే అను పరమజ్ఞానాన్ని అందిస్తోంది.

ఓంకార స్వరూపం, బ్రహ్మాండోత్పత్తి, జీవోత్పత్తి విధము, దేవీ మహాత్మ్యము, హరిశ్చంద్రోపాఖ్యానము వంటి వృత్తాంతాలు ఈ పురాణమందు చోటు చేసుకోవటంతోపాటు, దుర్గాదేవి లలితా సప్తశతి ఈ పురాణంలోనే మనకు సాక్షాత్కరిస్తుంది. దుర్గాదేవి తర్వాత అంత విస్తృతంగా ఈ పురాణంలో సూర్యభగవానుడు కీర్తించబడ్డాడు. జడోపాఖ్యానము, దత్తాత్రేయ కథ, కార్తవీర్యార్జున వృత్తాంతము, వైవస్వతమను చరిత్రము, పాంచాలీ భర్తృపంచక వివరణము మొదలగు ఘట్టాలు ఈ పురాణమందు మనకు కన్పిస్తాయి.

మార్కండేయ పురాణాన్ని ఐదుభాగాలుగా విభజించవచ్చు.

1. ప్రథమ భాగం: 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు గల ఈ భాగంలో పురాణారంభము నుంచి మహాభారత సంశయార్థాల గురించి ధర్మపక్షులు జైమిని ముని అడిగే ప్రశ్నలకు ప్రత్యుత్తరమిచ్చునంతవరకు గల కథా వస్తువు ఇందు చూడవచ్చు.
2. ద్వితీయ భాగం: 10 నుంచి 41వ అధ్యాయం వరకు గల ఈ భాగంలో పితాపుత్ర సంవాదరూపమైన జడోపాఖ్యాన కథనం కలదు.
3. తృతీయ భాగం: సర్గాదివర్ణనము మొదలు సావర్ణికమన్వంతరము వరకు గల కథార్థములు, 42 నుండి 78వ అధ్యాయం వరకు ఈ భాగంలో తెలపబడింది.
4. చతుర్థ భాగం: 78 మొదలు 90వ అధ్యాయము వరకు సప్తశతి కథనం వర్ణించబడింది.
5. పంచమ భాగం: రౌచ్యమన్వంతర కథనం నుండి పురాణఫలశృతి వరకు గల కథార్థాలు 91 నుండి 134వ అధ్యాయాలలో కలదు.

శ్రీమహావిష్ణువు నాలుగు రూపాలు:

దుష్టసంహారమునకు, శిష్ట రక్షణకు అవతరించిన సృష్టిస్థితి లయకారణడైన నారాయణుడగు విష్ణువు నిర్గుణుడిగా నాలుగు స్వరూపాలలో అలరిస్తున్నాడు.

1. వాసుదేవ రూపం – శ్వేత రూపంలో మహాయోగులకు మాత్రమే ప్రత్యక్షమయ్యే ఈ రూపం అనిర్వచనీయమైనది.
2. శేష రూపం – దశావతారాలకు సంబంధించిన ఈ రూపం పాతాళంలో నివసిస్తూ, సమస్త భూమండలాన్ని ధరిస్తుంది.
3. ప్రద్యుమ్న రూపం – ప్రజారక్షణ, ధర్మ సంస్థాపనార్థం అవతరించిన మరో దశావతార రూపమిది.
4. అనిరుద్ధ రూపం – వైకుంఠంలో శేషశాయిపై ఉండే రూపమిది.

సప్తశతి:

సప్తశతి యందు మహామాయా స్వరూపిణియగు శక్తి యొక్క జన్మస్వరూప స్వభావచరిత్రములు సవిస్తరముగా అభివర్ణించబడ్డాయి. దుర్గాదేవి యొక్క చాముండా నామము, చండికా స్వరూపము మొట్టమొదట సప్తాశతి నందే పేర్కొనబడింది.

మధుకైటభుల, మహిషాసుర, శుంభనిశుంభుల సంహారాలు, సప్తమాతృకా స్వరూపిణియై రాక్షస సైన్యమును చెండాడుట వంటి వృత్తాంతాలు ఇందు నిక్షిప్తమై ఉన్నాయి. చంఢీభక్తులు, శాక్తేయులు సప్తశతిని అతిపవిత్రగ్రంథంగా భావిస్తారు. ఈ సప్తశతియందలి మహిషాసురమర్థనాది గాథలే దేవీభాగవతంలో విస్తృతంగా చెప్పబడ్డాయి. మహాభారతానికి భగవద్గీత ఎలాగో, మార్కండేయ పురాణానికి సప్తశతి అటువంటి దివ్యాలంకారం.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *