పురాణ పరిచయం 3

వాయు పురాణం

అష్టాదశ పురాణాలలో నాలుగవదైన వాయు పురాణాన్ని శ్వేత కల్పంలో శివుడు వాయువుకు మొట్టమొదటిసారిగా బోధించాడు. ‘చతుర్వింశతి సాహస్రం పురాణం తదిహోచ్చతే’ అన్న శ్లోకానుసారం ఇరువది నాలుగువేల శ్లోకాలున్న ఈ వాయు పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమభాగంగా కీర్తించబడింది. అయితే ఇందు కేవలం 11వేల శ్లోకాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పురాణం ముఖ్యంగా నాలుగు భాగాలుగా విభజించబడింది. బ్రహ్మాండ పురాణంలో వలె ఇందులో కూడా భాగాలని పాదాలని పిలుస్తారు. అవి వరుసగా, ప్రక్రియా పాదం, అనుసంగ పాదం, ఉపోద్ఘాత పాదం మరియు ఉపసంహార పాదం. వాయుపురాణంలో మొత్తం 112 అధ్యాయాలున్నాయి. వాయుప్రోక్తంగాన ఇది వాయు పురాణంగా ప్రసిద్ధి చెందినా, శివ మహాత్మ్య వివరాలు ఎక్కువగా ఇందు చోటు చేసుకోవడం వల్ల దీనిని కొందరు శివపురాణంగా తలుస్తారు. సృష్టికి శివుడు బీజి, విష్ణువు బోజమని, బ్రహ్మ క్షేత్రమని ఈ పురాణం తెలుపుతుంది. అలాగే కృతయుగంలో బ్రహ్మ, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో విష్ణువు, అన్ని యుగాలలో శివుడు పూజనీయుడని ఈ పురాణంలో చెప్పబడింది.

భూగోళ, ఖగోళ విషయాలు, బ్రహ్మాండ రచన, ప్రక్రియ, అగ్ని వంశవర్ణన, కైలాస వర్ణన, శివస్తుతి, జంబూద్వీప, తదితర సప్తద్వీపాలు వర్ణన, గయా క్షేత్ర వర్ణన మొదలగు అంశాలు వాయుపురాణంలో మనకు అగుపిస్తాయి. ఈ పురాణం పూర్వఖండంలో సూర్యమండల విస్తారం, ఇతర ఖగోళాలకు సూర్యునికి మధ్య దూరం, వాటి గతిక్రమాలు నిర్దేశించబడ్డాయి. ఇక గయా క్షేత్ర మహిమను దాదాపు 9 అధ్యాయాలలో ఈ పురాణం వివరించింది. అలాగే సంగీతానికి సంబంధించిన సప్తస్వరాలు, 3 గ్రామాలు, 21 మూర్ఛనలు, 49 తాళాలు, 4 వర్ణాలు, 30 అలంకారాలు ఈ పురాణంలోని ఉత్తరఖండంలో పేర్కొనబడ్డాయి.

తస్మాద్యుక్తః సదాయోగీ ప్రాణాయామపరో భవేత్
సర్వపాపవిశుద్ధాత్మ పరం బ్రహ్మాధిగచ్ఛతి

ప్రాణాయామ స్వరూప బేధాలు, విశిష్టత ఈ పురాణంలో మనకు కన్పిస్తుంది. శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదమనే నాలుగు ప్రయోజనాలను ప్రాణాయామం వల్ల పొందవచ్చు. ఇలా ప్రాణాయామం గురించి ఈ పురాణంలో చెప్పినంత విస్తృతంగా మరే పురాణంలోనూ చెప్పబడలేదు. అదేవిధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే మూర్తిత్రయాత్మకమైనది ఓంకారం. అట్టి ఓంకార వర్ణన వాయు పురాణంలో విపులంగా ఉంది.

కాలమానం:  కాలం, ఆయుర్ధాయాలు ఎలా నిర్ణయించబడ్డాయో కూడా మనకు ఈ పురాణం విశదీకరిస్తుంది. కనురెప్పకాలాన్ని నిమిషం అంటారు. 15నిమిషాలు ఒక కాష్ఠ, 30 కాష్ఠలు ఒక కళ. 30కళలు ఒక ముహుర్తం, 30 ముహుర్తాలు అహోరాత్రం లేదా ఒక రోజు. 15 రోజులు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక మాసం. ఆరు మాసాలు ఒక ఆయనం, రెండు ఆయనాలు ఒక సంవత్సరం. ఒక మానవ సంవత్సరం, దేవతలకు ఒక రోజవుతుంది. మన సంవత్సరంలోని ఉత్తరాయనం దేవతలకి పగలు, దక్షిణాయనం రాత్రి అంటే మనకి 30 సంవత్సరాలయితే, దేవతలకి 30 రోజులు అనగా నెల. అలాంటి పన్నెండు నెలలు దేవతలకు ఒక దివ్య సంవత్సరం. ఈ కాలమానం ప్రకారమే యుగ విభజన జరిగింది.

అష్టాంగ యోగం: యమము -సర్వేంద్రియాలను నిగ్రహించటం, నియమము – వేదోక్తమైన క్రమశిక్షణ పాటించటం, ఆసనము – పద్మాసనం వంటి ఆసనాలను అభ్యసించి, ఆచరించటం, ప్రాణాయామం – వాయువును నిరోధించి శ్వాసను నియంత్రిచటం, ప్రత్యాహారం – విషయ వాంఛలను వదలి వైదిక కర్మల వైపు దృష్టి సారించటం, ధారణ -సర్వదా భగవద్విషయాన్నే ధరించటం, ధ్యానం – ఏకాగ్రతతో భగవంత్ చింతన యందు లగ్నమవటం, సమాధి – లౌకిక విషయాలను విస్మరించి, నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉండటం. ఈ ఎనిమిది అంగాలతో కూడిన అష్టాంగ యోగాన్ని శివుడే రచించాడు. ఈ యోగ సాధనతో అలాగే శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార భిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మ్యాయ నమః అనే శివనామషట్కాన్ని పఠనతో శివానుగ్రహాన్ని పొందవచ్చని ఈ పురాణం పేర్కొంది. అయితే, ఈ నామాష్టకం, శివారాధన చేయలేని వారు అహింసా, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే ఎనిమిది పుష్పాలతో శివ మానస పూజ చేసిన వారికి శివానుగ్రహం కలుగుతుంది.

అంహింసా ప్రథమం పుష్పమింద్రియ నిగ్రహం
సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పంతధైవచ
సత్యపుష్పం విధిం పుష్పం శివప్రీతికరం భవేత్

లింగార్చన: పార్థివ లింగార్చనను గూర్చిన వివరాలను కూడా ఈ పురాణం మనకు తెలుపుతోంది. చైత్రమాసంలో పార్థివ లింగాన్ని, వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యైష్ఠంలో మరకత లింగాన్ని, ఆషాడంలో మౌక్తిక (ముత్యపు) లింగాన్ని, శ్రావణంలో ఇంద్రనీల లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వీయుజంలో గోమేధిక లింగాన్ని, కార్తీకంలో విద్రమ (పగడపు) లింగాన్ని, మార్గశిరంలో వైఢూర్య లింగాన్ని, పుష్యంలో గరుడపక్షి లింగాన్ని, మాఘంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణంలో చంద్రకాంత లింగాన్ని అర్చించాలని వాయు పురాణం తెలుపుతోంది. ఈ పన్నెండు నెలలు ఈ రత్నాలతో శివుని అర్చించలేకపోయినా, తాహతకు తగ్గట్టు బంగారం, వెండి, రాగి ఆఖరికి మట్టి లింగానైన్నా అర్చించి శివానుగ్రహ పాత్రులు కావచ్చు.

వాయుపురాణం ఫలస్తుతి:

ధన్యం యశస్య మాయుష్యం పుణ్యం పాపప్రణాశనమ్
కీర్తనం శ్రవణం చాస్యం, ధారణం చ విశేషతేః

ఈ వాయు పురాణం విన్నవారు, పఠించినవారు కీర్తిమంతులై, ఆయుష్యంతులై తమ, తమ పాపాలను పొగొట్టుకొని పుణ్యాన్ని పొందగలరని పై శ్లోకం భావన.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *