16. మత్య్యపురాణం
శ్రీ మహావిష్ణువు సప్త కల్పంలో వైవస్వత మనువునకు ఉపదేశించిన ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పదహారవది. మత్స్యపురాణాన్ని విష్ణుమూర్తి యొక్క మెదడుతో పోలుస్తారు. మొత్తం 14వేల శ్లోకాలు గల ఈ పురాణాన్ని 289 అధ్యాయాలలో చెప్పబడింది. మహావిష్ణువు నిద్రిస్తే ప్రళయం, మేల్కుంటే సృష్టిస్థితని మత్స్యపురాణం తెలుపుతోంది.
మత్స్యావతార వర్ణన, బ్రహ్మాండ సృష్టి, కలి ధర్మాలు, అక్షయ తృతీయ వ్రతం, దేవాసుర సంగ్రాహం, త్రేతా, ద్వాపర, కలియుగ ధర్మాలు, పార్వతీ కల్యాణం, కుమార సంభవం, వినాయక విజయం, నృసింహావతార వర్ణన, వామన, వరాహావతార వర్ణనలు, వాస్తు శాస్త్ర సిద్ధాంతాలు, యమునా నదీ స్నాన మహాత్మ్యం, సావిత్రీ సత్యవంతుల కథ, స్వప్న ఫలితాలు, 30 కల్పాల పేర్లు మొదలగు అనేక అంశాలు ఈ పురాణంలో చోటు చేసుకున్నాయి. అంతేకాక ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యము, వంశ చరిత్ర కూడా ఈ పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
పురాణ విశిష్టత – విభజన:
బ్రహ్మ నాల్గు ముఖముల నుండి వేదములు ఉద్భవించడానికి మునుపే పురాణాలను బ్రహ్మ స్మరించాడు. కల్పాంతరమున పురాణ మొక్కటియే శతకోటి ప్రవిస్తరమై ఉంటుంది. లోకాలు దగ్ధమైనప్పుడు, వాజిరూపధరుండై (గుఱ్ఱము) వేదములను, వేదాంగములను, న్యాయమును, మీమాంసను, ధర్మశాస్త్రమును గ్రహించి, మత్స్యరూపుడై విష్ణువు లోకానికి అనుగ్రహించాడు, అంతపెద్ద గ్రంధాన్ని గ్రహించలేరనే ఉద్దేశంతో ప్రతి ద్వాపరమందు వ్యాసరూపుడై పురాణాలను 4లక్షల శోక్లాలతో 18 పురాణాలుగా విష్ణుమూర్తి విభజించాడని మనకి ఈ పురాణం తెలుపుతోంది. ఇవికాక ఆదిత్యపురాణమని మరొక పురాణం కలదు. దానిని మాత్రం అష్టాదశ పురాణాలలో చేర్చలేదని ఈ పురాణం తెలుపుతోంది.
కల్పాలు:
మత్స్యపురాణం ఆయా మన్వంతరములు, కల్పములు మొదలగువాని కాలమానమును గురించి వర్ణించింది. ఈ పురాణమందు తెలిపిన 30 కల్పముల పేర్లు వరుసగా – 1. శ్వేతకల్పము, 2. నీలలోహితము, 3. వాసుదేవము, 4. రథంతరము, 5. రౌగవరము, 6. దేవము, 7. బృహత్కల్పము, 8. కందర్పము, 9. సద్యఃకల్పము, 10. ఈశానము, 11. తమఃకల్పము, 12. సారస్వతము, 13. ఉదానము, 14. గారుడము, 15. కౌర్మము (ఇది బ్రహ్మకు పౌర్ణమన్నమాట), 16. నారసింహము, 17. సమానము, 18. ఆగ్నేయము, 19. సోమము, 20. మానవము, 21. తత్పురుషము, 22. వైకుంఠము, 23. లక్ష్మీకల్పము, 24. సావిత్రీ కల్పము, 25. అఘోరము, 26. వారాహము, 27. వైరాజము, 28. గౌరీ కల్పము, 29. మహేశ్వరము, 30. పితృకల్పము (ఇది బ్రహ్మకు అమావాస్య).
ఈ 30 కల్పములు సంకీర్ణములు, రాజసములు, తామసములు, సాత్త్వికములు అని విభజింపబడినవి. 30 కల్పములు క్షయకల్పముతో కల్సి బ్రహ్మకు ఒక మాసము పూర్తగును.
అస్మాత్పురాణా దపి పాద మేకం పరేత్తు యః సోపి విముక్త పాపః
నారాయణాఖ్యం పదమేమతి నే నమనంగ వద్దివ్య సుఖాని భుంక్తే
పవిత్రమైన మత్స్యపురాణాన్ని కనీసం ఒక్క పాద భాగమైనా శ్రద్ధతో చదివితే చేసిన పాపాలు నశించి నారాయణ సాన్నిధ్యం చేరుకుంటాం.
17. గరుడ పురాణము
పక్షిరాజైన గరుత్మంతుడడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు స్వయంగా సమాధానాలు చెప్పిన గ్రంధమే గరుడ పురాణం. కాగా ఈ పురాణాన్ని గరుడ కల్పంలో విష్ణువు, మనువుకు ప్రప్రథమంగా బోధించాడు. 19వేల శ్లోకాలతో పూర్వఖండం, ఉత్తరఖండంగా విభజింపబడిన గరుడ పురాణాన్ని విష్ణుమూర్తి శరీర కొవ్వుగా అభివర్ణిస్తారు.
చాలామందికి గరుడ పురాణమనగానే మృత్యువు, శ్రాద్ధసంబధమైన విశేషాలు, కర్మానుష్టాలు, జీవుని పరలోక యాత్ర గురించి తెలుపుతందనే అపోహలేకపోలేదు. అయితే గరుడపురాణం కూడా వైష్ణవ పురాణమే. ఇందు భారతంలో భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం కాక మరొకటి కూడా కలదు. విష్ణు పంజర స్తోత్రంతోపాటు పాంచరాత్ర సూత్రాలను కూడా ఈ పురాణం మనకిందిస్తుంది. వైష్ణవ పురాణాలు విష్ణువు ఐదురూపాలను పేర్కొనగా, ఈ పురాణం తొమ్మిది రూపాలను పేర్కొంది. అలాగే శ్రవణ, కీర్తన, స్మరణాది భక్తి మార్గాలను కూడా ఈ పురాణం ప్రతిపాదిస్తోంది. ఇవేకాక, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం మున్నగు అనేక అంశాలు కూడా గరుడ పురాణంలో పొందుపర్చబడ్డాయి. వీటన్నింటితోపాటుగా గరుడ పురాణంలో ధర్మం, మరణ సమయ ప్రస్తావన, యమదూతల వర్ణన, నరక ప్రయాణం, యాతన దేహధారణ, వైతరణి వర్ణన, నరక బాధలు, దారిలో వచ్చు మృత్యుపట్టణాలు, నరకాలూ, కర్మరాహిత్య ఫలితాలు కూడా ఉన్నాయి.
ఓంజుంసః అనే బీజాక్షరాలతో కూడిన మృత్యుంజయ మంత్రం, బీజాక్షరాలతో కూడిన సంధ్యావందన మంత్రాలు, హయగ్రీవ మూలమంత్రం, గాయత్రీ మంత్రోపాసన, సంధ్యావిధి ఇలా వందలకొద్ది మంత్రాలు, వ్రతవిధానాలు, వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, రత్నశాస్త్రాలు మొదలైన అనేక అంశాలను అందించే మంత్రశాస్త్రం గరుడ పురాణం.
18. బ్రహ్మాండ పురాణం:
బ్రహ్మాండ సృష్టికి సంబంధించిన విశేషాలను తెలియపర్చేదే బ్రహ్మాండ పురాణం. అష్టాదశ పురాణాలలో చివరిదశైన ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు అస్తుల (ఎముకలు)తో పోలుస్తారు. బ్రహ్మ మనువుకు భవిష్య కల్పంలో ప్రప్రథమంగా బోధించాడు. ప్రకియా పాదం, అనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం మరియు ఉపసంహార పాదమని నాలుగు భాగాలు గల ఈ పురాణంలో మొత్తం 12వేల శ్లోకాలున్నాయి.
సమగ్ర సృష్టి వర్ణన, సూర్యభగవానుని మహిమ, సప్తఋషుల జన్మవృత్తాంతాలు, పరుశురామ వృత్తాంతం, యుగ ధర్మాలు, లింగోత్పత్తి, లలితాదేవి విస్తార వర్ణన, లలితా సహస్రనామ స్తోత్రాదులు మొదలగునవి బ్రహ్మాండ పురాణంలో ఉన్నాయి. ఇంకా భూమండలంలో ఎన్ని ద్వీపాలున్నాయి, వాటిని చుట్టియున్న సముద్రాలు, పర్వతాలు వాని శీతోష్ణ పరిస్థితుల గురించి సమగ్రంగా తెలపబడింది.
సూర్యరథ వర్ణన:
ఒకే చక్రం గల సూర్య రథానికి పగలు నాభి (బండి కంటి మధ్య గల తూము), పంచాయుధములు (ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపహర్ణా, సాయంకాలములు అను పగటి విభాగములు) చక్రములోని ఆకులు. ఆరు ఋతువులు నేమి (బండి కంటి దగ్గర నుండి కమ్మి), రెండయనములు బండి తొట్టె, కళలు, ముహుర్తములు ఇతర భాగములు. కాష్ఠలు ముందరి ముక్కు, క్షణము అక్షదండము. నిమిషములే పగ్గములు, రాత్రి వరూథములు (చక్ర రంథ్రాలలో దూర్చు నెమ్ములు), ధ్వజము ధర్మము, అర్థకామములు ఇరుసులు. గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కులనెడి ఏడు ఛందస్సులు గుఱ్ఱములు. చక్రనాభి ధ్రువునితో బంధించబడియుండును. ధ్రువుడు ఈ సూర్య చక్రకాలమును తిప్పుతుండును. అతనిని పర్యవేష్టించి సప్తఋషులుందురు.
య ఇదం కీర్తయేద్వత్స శృణోతి చ సమాహితః
స విధూయేహ పాపాని యాతి లోకమనామమయమ్
ముగింపు
పురాణము సర్వ సాహిత్య ప్రక్రియలకు మాతృభూమి వంటిదని నారదీయ పురాణం అభివర్ణించింది. ఇతిహాసము, ఉపాఖ్యానము, కథ, స్తుతి మొదలగు సాహితీ ప్రక్రియలన్నింటిని తనలో పురాణం ఇముడ్చుకుంది. పురాణాపురుషుని నుండి ఏవిధంగానైతే బ్రహ్మాండమావిర్భవించిందో, సర్వవాఙ్మయ జగత్తు పురాణం నుండే ఆవిర్భవించింది.
పురాణ పురుషాజ్ఞాతం యధేదం జగదద్భుతమ్
తథేదం వాఙ్మయం జాతం పురాణేభ్యో న సంశయః
తేటగీతి