ధనుర్మాసము, తిరుప్పావైల ప్రాశస్త్యం

సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటినుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుస్సు అపూ పదానికి ధర్మం అని అర్ధం. ‘ధనుర్మాసం’ అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ఈ మాసం వైష్ణవులకు ఎంతో ప్రీతికరమైనది. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలంకారప్రియుడైన విష్ణువును బ్రాహ్మీ ముహర్తంలో పంచామృతంతో అభిషేకించి, తులసి మాలలతో అలకరిస్తారు. ఈ నెలలో విష్ణువును మధుసూధనుడని పిలుస్తారు. తిరుమలలో వేంకటేశ్వరుని ఆలయంలో ధనుర్మాసకాలంలో సుప్రభాతానికి మారుగా ‘తిరుప్పావై’ గానం చేస్తారు. తెలుగునాట ముగ్గులతో, గొబ్బెమ్మలతో వాకిళ్లు ఈ నెలంతా శోభిల్లుతుంటాయి.

తిరుప్పావై: శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో విష్ణునామ సంకీర్తననే ‘నోము’గా నెంచి, రోజుకొక్క ‘పాశురము’ (కీర్తన) చొప్పున నెలరోజులలో ముప్పది పాశురాలతో సేవించిన సాక్షాత్ భూదేవి అవతారమూర్తియైన ‘ఆండాళ్’ (గోదాదేవి) రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ‘తిరు’ అనగా పవిత్రమైన ‘పావై’ అనగా ‘ప్రబంధం’ అని అర్థం. అలాగే తిరు అంటే మంగళ కరమైన అని,పావై అంటే మేలుకొలుపు అనే కూడా అర్ధం వస్తుంది. వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చేస్తూ వస్తారు.

ఈమె ‘పెరియాళ్వార్’అని ప్రసిద్ధి పొందిన ‘విష్ణుచిత్తుని’ పెంపుడుబిడ్డ. ‘కోదై’ అనగా ‘పూలదండ’ అని అర్థం. గోదాదేవిని పెంచిన విష్ణుచిత్తుడు మాలాకారుడు కనుక. మాలాకారుని తనయగా ‘కోదై’గా పిలువబడి. అలాగే విష్ణువుని పాశుర మాలలతో కొలిచినందు వల్ల కూడా కోదాగా పిలవపడింది. ‘కోదై’ క్రమంగా ‘గోదా’గా పరిణితి చెందింది. “గో “అనే శబ్దానికి జ్ఞానము అని, “ద” అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని కూడా అర్ధం చెప్పవచ్చు.

తమిళనాడు శ్రీవిళ్ళిపుత్తూరులోని వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువునకు విష్ణుచిత్తుడు కైంకర్యం చేస్తున్న పూలమాలల్ని ముందుగా తాను ధరించి, మళ్ళీ వాటినే స్వామివారి కైంకర్యానికి పంపినందువల్ల, ఈమెకు ‘ఆముక్తమాల్యద’ అనీ ‘చూడికొడుత్తనాచ్చియార్’ అనీ ప్రసిద్ధమైన పేర్లు వచ్చాయి. ‘ఆముక్త’ అనగా అలంకరించుకొని తీయబడినదని  అర్ధం. ‘మాల్య’ అనగా పూలదండను ‘ద’ అనగా ఇచ్చునది అని అర్థం.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని భర్తగా పొందాలననే ఉద్దేశంతో గోపికలు కాత్యాయనీవ్రతాన్ని మార్గశిరమాసంలో చేశారు. అలాగే గోదాదేవి కూడా తనను తాను గోపికగా భావించుకొని మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ధనుస్సంక్రమణనాడు ధనుర్మాసంలో ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించింది. తిరుప్పావై అంటే శ్రీవ్రతమని అర్ధం. నెలరోజులపాటు ప్రతిదినం వేకువజామునే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువును గూర్చి రోజుకొక్క పాశురాన్ని గానం చేసింది. ఈ వ్రతం ముప్పైరోజులపాటు చేసి చివరకు శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడి ఆండాళ్ గా ప్రసిద్ది పొందింది. ‘ఆండాళ్’ అనగా భగవంతుణ్ణి వశం చేసుకున్న స్త్రీ అని అర్థం. అప్పటి నుండి ‘తిరుప్పావై’ను విష్ణ్వాలయాలలో విధిగా పారాణం చేయటం ఆచారమై యున్నది.

తిరుప్పావై’గా వినుతికెక్కిన ముఫ్పైపాశురాలను మూడు దశలుగా వర్గీకరించవచ్చును. అభిముఖ్యదశ, ఆశ్రయణదశ, అనుభవదశ. అభిముఖ్యదశలోని మొదటి అయిదు పాశురాలలో వ్రతపూర్వరంగం, వ్రతాంగాలు, వరుణాహ్వానం, కర్మసిద్ధాంత ప్రసక్తి, నామసంక్తీరన ఉన్నాయి. ఇవి తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియ చేస్తాయి. ‘ఆశ్రయణదశ’లో ఆరవపాశురం నుంచి పదిహేనవ పాశురం మొత్తం పది పాశురాలు గోపికలను మేల్కొల్పి వ్రతాచరణకు ఆహ్వానించటం, వ్రతాచరణగావించటం వర్ణిస్తాయి. ఈ పది పాశురాలు ముఖ్యంగా విష్ణువు దశావతారాలను కీర్తిస్తాయి. ఇక ‘అనుభవదశ’లో మొదటి ఐదుపాశురాల్లో అండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. యశోదను, బలరాముని సన్నద్ధం చేసి నీలాదేవి రూపంలో శ్రీకృష్ణుని స్తుతించి, మంగళాశాసనం చేసి వేడుకొని జన్మజన్మల పర్యంతం కృష్ణసేవలోనే తరింపచేయుమని, శరణాగతి చేయటం ఈ పాశురాల్లో కానవస్తుంది. చివరి తొమ్మది పాశురాల్లో భగవద్విభూతిని గోదాదేవి వర్ణిస్తుంది. ఇక చిట్టచివరి పాశురంలో గోదాదేవి, తను విష్ణుచిత్తుని కుమార్తె ననీ, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడాననీ, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందనీ ఉద్ఘాటిస్తుంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *