
పూరీ జగన్నాథ రథయాత్రకి ప్రప్రంచ ప్రసిద్ధి ఉంది. ‘పురుషోత్తమ క్షేత్రం’గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావన ధామం అద్భుతాలకు ఆలవాలం. ‘జగన్నాథ స్వామి నయన పథగామీ భవతుమే’ అని ఆదిశంకర భగవత్పాదులు ఈ స్వామి తన కళ్లముందు నిరంతరం కదలాడాలని ప్రార్ధించి, తన నాలుగు పీఠాలలో ఒక దానిని ఇక్కడే ప్రతిష్టించాడు.జయదేవుని ‘గీతగోవిందం ’ఈ స్వామి ఆరాధనయే.
‘ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రం మిత్యభిధీయతే, — నవద్వారే పురే దేహీ.’
తొమ్మిది ద్వారాల పురమేఈ దేహం. ఇదే క్షేత్రం. ఈ కారణం చేతనే ఈ క్షేత్రం పేరు ‘పురి.’ మనం పూరీ అని వ్యవహరించే ఈ క్షేత్రాన్ని పురాణాలు పురి అని పేర్కోన్నాయి.
మత్స్య, విష్ణు, పద్మ, స్కాంద, అగ్ని పురాణాలలో కపిలసంహిత, రుద్రయామళ, నీలాద్రి మహోదయ మొదలైన తంత్ర గ్రంథాలలో మహాభారతంలో ఈ క్షేత్ర మహిమను బహువిధాలుగా ప్రస్తావించారు. సృష్ట్యాదినుండే ఈ క్షేత్రాన నీలాచలమనే దివ్యపర్వతం ఉండేదని, ఇక్కడ ఇంద్రనీలమణితో చేసిన విష్ణు విగ్రహం దేవతలచేత ఆరాధింపబడేదనీ పురాణాలు చెబుతున్నాయి. ఒక్కడి వటవృక్షం ప్రళయకాలాల్లో కూడా నశించనిదంటారు. ఒక కల్పాంతంలో జగమంతా ఏకవర్ణవమైనపుడు, ఇక్కడి వటవృక్ష పత్రంపై బాలకృష్ణుడు మార్కండేయ మునికి గోచరించినట్లుగా పురాణకథ.
పురుషోత్తమాఖ్యం సుమహత్ క్షేత్రం పరమపావనం|
యత్రాస్తే దారవతనుః శ్రీశోమానుషలీలయా|
రర్మనాన్ముక్తిదః సాక్షాత్ సర్వతీర్ధ ఫలప్రదః||
సాగరస్యోత్తరే తీరే మహానద్యాన్తు దక్షిణే|
సప్రదేశః పృధివ్యాం హి సర్వతీర్ధ ఫలప్రదః||
‘‘పురుషోత్తమ నామంతో పరమపావనమైన గొప్పమహిమకల క్షేత్రమిది. లక్ష్మీపతి విష్ణువు మావులను అనుగ్రహించే లీలతో కర్రలతో చేసిన రూపాన్ని పొందాడు. దర్శనమాత్రం చేత సాక్షాత్తుముక్తినీ, సర్వతీర్ధఫలాన్ని ఇచ్చే క్షేత్రమిదని, సముద్రానికి ఉత్తరతీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్ధాల ఫలాన్నిచ్చే ప్రదేశమది’’, అని స్కాంద పురాణం చెపుతున్నది.
కాలక్రమంగా ఆ క్షేత్రాన రత్న విగ్రహం అదృశ్యమైంది. అవంతీ దేశాధిపుడైన ఇంద్రద్యుమ్న చక్రవర్తికి స్వప్నంలో శ్రీ మహా విష్ణువు గోచరించి, ప్రేరేపింపగా అతడీ క్షేత్రానికి చేరుకున్నాడు. సముద్రతీరంలో ఒక దివ్వయాగాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞఫలంగా సముద్ర జలాల నుండి ఒక గొప్ప వృక్షరాజ్యం తేలివచ్చింది. అది విష్ణుమయమైన వృక్షం, నారాయణుని ఆజ్ఞ ప్రకారంగా విశ్వకర్మ (దేవశిల్పి) ఆ వృక్షాన్ని నాలుగు విగ్రహాలుగా తయారు చేశాడు.
ఏకదారు సముత్సన్నాశ్చతుర్ధా సంభవిష్యతి|
ఒకే దారువు (కర్ర) నాలుగు విగ్రహాలుగా అయిందని పురాణోక్తి.
కృతయుగంలోనే ఈ దేవతలు ఆవిర్భవించారని స్కాందం చెపుతోంది. మహాలక్ష్మీదేవీ యే సుభద్రా స్వరూపమనీ, ద్వాపరయుగంలో లక్ష్మీ అంశ కృష్ణ సోదరిగా రోహిణి పుత్రికగా జన్మించిందని పురాణ కథనం.
ఈ క్షేత్రానికి శివుడే క్షేత్రపాలకుడు. ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దశలలో నెలకొన్నాడు. ఎనిమిది దిక్కుల శక్తి పలురూపాలలో వెలిసింది. ఈమె క్షేత్రరాక్షశక్తి.
తస్మాద్దారుమయం బ్రహ్మవేదాంతేషు ప్రగయతే (స్కందపురాణం)||
‘ఇది దారురూపంలో ఉన్న బ్రహ్మమ్’ అని వేదాంతాలలో కీర్తించబడింది.
ఈ విగ్రహాలను బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్టించాడని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ నాలుగు ఆకృతులను బృహస్పతితో కలిసి, దేవతల సమక్షంలో బ్రహ్మదేవుడు శ్రీసూక్త, పురుష సూక్తాలతో అభిమంత్రించి ప్రతిష్టించాడు.
వైశాఖస్యామలే పక్షే అష్టమ్యాం పుష్యయోగతః|
కృతాప్రతిష్టా భోవిప్రాః శోభనే గురువాసరే || (పురుషోత్తమ క్షేత్ర మహత్మ్యం)
వైశాఖ శుక్ల అష్టమీ, గురువారం, పుష్యమీ నక్షత్రం ఉన్న పుణ్యసమయంలో ప్రతిష్ట జరిగింది. శ్రీ నృసింహయంత్రంతో , మంత్రంతో చతుర్ముఖుడు ఈ ప్రతిష్టామహోత్సవం జరిపినట్లు పురాణం వర్ణిస్తోంది. అందుకే ఇది ప్రధానంగా నృసింహ క్షేత్రం.
బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు. జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేద స్వరూపం, సుదర్శనుడు అథర్వణ వేదరూపుడు అని బ్రహ్మదేవుడు పేర్కోన్నాడు. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్త్వమే ఈ నాలుగు రూపాలు అని దీని సారాంశం. అనంత తత్త్వానికి సంకేతమైన నల్లని వర్ణమే జగన్నాథుని వర్ణం. శుద్ధసత్వగుణమే బలభద్రుని తెల్లని ఛాయ. ఐశ్వర్యశక్తికి సంకేతం సుభద్రాదేవి పసుపు రంగు.
జ్యేష్టపూర్ణిమ నాటి నుండి జ్యేష్టావ్రతాన్ని ఆచరించి, ఆషాఢశుద్ధ విదియనాడు ఆ దివ్యమూర్తులకు రథయాత్రను మొదట బ్రహ్మదేవుడే జరిపించాడని పురాణోక్తి. అప్పటి నుండి పరంపరంగా ఈ రథయాత్ర ఏటా జరుగుతోంది.
ఇప్పటికీ పన్నెండేళ్లకోసారి (అధికాషాడం వచ్చిననాడు) విష్ణలాంఛనాలతో ఉన్న దివ్యవృక్షాలను, కొన్ని సంకేతాల ద్వారా, ఆచార్యులు తెలుసుకొని, వివిధ ఉత్సవాలలో ఆ వృక్షాలను తరలించి, పద్ధతి ప్రకారంగా విగ్రహాలను చెక్కిస్తారు. పాత విగ్రహాలను కళలను ఈ నూతనాకృతులలో పునః ప్రతిష్టించి, పాతవాటిని సంప్రదాయబద్ధంగా ఖననం చేస్తారు. ఇది కేవలం ఈ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం.
ప్రతిఏడు మూలవిరాట్టులే సాక్షాత్తుడగా కదలివచ్చే రథయాత్ర తొమ్మిది రోజుల పర్వం. దీనికి ‘‘మహావేదీ మహోత్సవం ’’అని పేరు కూడా పూరాణాలలో కన్పిస్తుంది. ప్రధానాలయం నుండి, ఒక్కరోజులో సకల భక్తజనులు భక్తిమయ హృదయాలతో స్వామివారిని గుండిచా మందిరానికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులపాటు ఆరాధింపబడి, ఆ వేళలో క్షేత్రానికీ, జగతికీ సకలశుభాలను అనుగ్రహించి, తిరిగి తొమ్మిదో రోజున తన మందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు.
రథస్థితం వ్రజంతం తం మహావేదీ మహోత్సవే|
యేపశ్యంతి ముదాభక్త్యా వాసస్తేషాం హరేః పదే||
‘‘మహావేదీ మహోత్సవానికి రథంలో యాత్రచేసే స్వామిని సంతోషంతో, భక్తితో చూనేవారికి విష్ణుపదంలో నిత్యవాసం కలుగుతుంది.’’
ఆ వేళ స్వామిని తాకి వచ్చేగాలి ఒంటికి తగిలితే చాలు పాపాలు, అమంగళాలు నశిస్తాయని శాస్త్రాలు చెపుతున్నాయి.
యధారథ విహారోయం మహావేదీ మహోత్సవః|
యత్రాగత్యదివో దేవాః స్వర్గం యాంత్యాధికారిణః||
ఈ రథయాత్రకు దేవతలందరూ స్వర్గం నుండి దిగివచ్చి, ఉత్సవం తరువాత తిరిగి వెళతారని ‘పురుషోత్తమ క్షేత్ర మహత్మ్యం ’చెబుతోంది. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు మొదలైన మహాత్మ్యులు, మహార్షులు ఈ క్షేత్రంలో నారాయణుని సేవించుకున్నారు.
‘రథస్థ వామనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అని స్మృతివచనం. రథమందున్న వామనుని చూస్తే పునర్జన్మ ఉండదని భావన. వామనుడంటే సూక్ష్మరూపుడు. స్థూలమైన దేహరథంలో అత్యంత సూక్ష్మంగా భాసించే జగన్నాథుడే వామనుడు.
శరీరాన్ని రథంతో పోల్చాయి ఉపనిషత్తులు. ఇంద్రియాలు గుర్రాలుగా, బుద్ధి శక్తులు పగ్గాలుగా నడిచే రథం ఈ శరీరం. నడిచే రథాన్ని చూస్తున్నాం గానీ, నడిపే రథిని సందర్శించాలి. అతడే పరమాత్మ. రథ సదృశమైన దేహమే నేను – అనే భ్రాంతిని వదిలి, దీనికి మూలమైన పరమాత్మ చైతన్యంతో ఈ నేను తాదాత్మ్యం చెందితే … అతడే జ్ఞాని. అతడి జీవితమే నిజమైన రథయాత్ర.
పూరీలోని మూడు రథాలలో జగన్నాథుని రథానికి ‘నందిఘోష’ అని, ‘గరుడధ్వజ’ అని పేర్లు. సుభద్ర రథానికి ‘దర్పదళన’ అని, ‘పద్మధ్వజ’ అని పేర్లు. కాగా బలభధ్రుని రథానికి ‘తాళధ్వజ’ అని పేరు. వీటి అశ్వాలకీ, ధ్వజాలకీ సంఖ్యలోనూ, నామాలలోనూ కూడా మంత్ర, దేవతా సంకేతాలున్నాయి.
స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో – జాగ్రత్ స్వప్నసుషుప్తులలో – భూత, భవిష్యద్వర్తమానాలలో వ్యాపించిన విష్ణు చైతన్యాన్ని అవగాహన చేసుకోవడమే మూడు రథాలలోని ముమ్మూర్తల సాక్షాత్కారం.
కొన్ని లక్షల మంది దర్శించి, తరించే ఈ పావన రథయాత్ర , వేదవేద్యుని దర్శనం ఒక దివ్యానుభూతి.
(శ్రీ సామవేద షణ్మఖశర్మగారి …ఏష ధర్మః సనాతనః అనే వ్యాస సంపుటి నుంచి సేకరించిన వ్యాసం.)