దీపావళి

దిబ్బు, దిబ్బు దీపావళి
మళ్లీ వచ్చే నాగులచవితి

అంటూ పిల్లల చేత దివిటీలు కొట్టిస్తూ, ఇల్లంతా దీపాలు అలంకరించి, మతాబులు, టపాకాయలు వెలిగిస్తూ సందడిగా సాగే దీపావళి పండుగ కోసం చిన్నా, పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. దీపావళి పదాన్ని విడదీస్తే దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా – 1. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి వధించటం, 2. వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు యాచించి, వానిని పాతాళానికి తొక్కటం, 3. రావణ వథానంతరం శ్రీరాముడు రాజ్యపట్టాభిషక్తుడవడం, 4. నరకము నుండి విముక్తి పొందడానికి యమునికి పూజచేయటం, చివరగా, 5. విక్రమార్క చక్రవర్తి ఈ రోజున పట్టాభిషక్తుడవటం. అయితే,

తులా సంస్థే సహస్రాంశౌ ప్రదోషో భూత ధర్మయోః
ఉల్కాహాస్తానరాః కుర్యుః పితౄణాం మార్గదర్శనం

సూర్యుడు దీపావళినాడు తులారాశిని పొందుచున్నాడనియు, నాడు లోకులు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనము చేయవలనని దీనర్థం. అలాగే, ‘యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ’ అని యమధర్మరాజుని పూజిస్తారు. మనదేశంలో ఉత్తరాయణం మకర సంక్రాంతి నాడు వచ్చును. కానీ, ఉత్తర ధ్రువమందు తులాసంక్రాంతినాడు వచ్చును. కావున దీపావళినాడు ధ్రువమండలంలో దక్షిణాయనము మొదలవును. దక్షిణాయనములో చీకటి ప్రబలి ఉండును కాన, ఆ కాలంలో చనిపోయినవారికి ఉత్తరాయణం వచ్చాక శ్రాద్దకర్మలు ఆచరిస్తారు. ఈ సమయాన పితృదేవతలు నరకాన ఉండిపోవుదురు కాన యమునికి పూజచేయుట అనే ఆనవాయితీ వచ్చింది. దీపావళి నాడు మొదలుపెట్టి కార్తీకమాసమంతా ఇంటిముందర దీపాలు పెడతారు. అలా పెట్టటం వల్ల తులాసంక్రమణనాటి దీర్ఘరాత్రి పితృదేవతలకు ఈ దివ్వెలు మార్గదర్శకంగా ఉంటాయని కూడా చెపుతారు.

ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమైన దీపావళి పండుగను అనేక పేర్లతో పిలుస్తారు. ముద్రారాక్షసాన కౌముదీ మహోత్సవంగా పిలవబడే దీపావళిని జైనులు దీప ప్రతిపదుత్సవంగా జరుపుకుంటారు. బౌద్ధ జాతక కథలలో లక్షదీపోత్సవము, దీపదానము జరిపి బుద్ధభగవానుని చుట్టూ దీపాలు పెట్టి పూజించినట్టుగా కలదు. సింహాసన ద్వాత్రింశతితో దీనిని దివ్వెల పండుగగా చెప్పబడింది.

ఆచారవ్యవహారాలలో తేడాలున్నప్పటికీ, దీపావళి పండుగను ఆంధ్రానాట మూడు రోజులు మొదటిరోజు నరక చతుర్దశి, రెండవనాడు దీపావళి అమావాస్య, మూడో రోజు బలి పాడ్యమిగా జరుపుకుంటారు. అయితే ధన త్రయోదశి, భగనీ హస్తభోజనం (భాయిదూజ్)లతో కలిపి ఐదురోజులు ఈ పండుగను జరుపుకునే ఆనవాయితీ కూడా ఉత్తరదేశాన మనం చూడవచ్చు.

ధన త్రయోదశి: క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ప్రకటించి మహావిష్ణువు భార్యగా స్వీకరించాడు. అలాగే భృగుమహర్షిపైన ఆగ్రహంతో భూలోకానికి లక్ష్మీదేవి చేరిన ఈ ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. అంతేకాక ఔషదకర్త ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. అందుకే ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, సంపదలను కలుగ చేస్తుందిని నమ్ముతారు.

బలిపాడ్యమి: వటువు రూపంలో బలిని పాతాళానికి తొక్కగా సంవత్సరానికి ఒక్కసారి ఈ పాడ్యమినాడు బలి భూమ్మీదకు వస్తాడని పురాణ గాథ. కృష్ణుడు ఈ పాడ్యమినాడే గోవర్ధనగిరి నెత్తిన రేపల్లీయులను ఇంద్రుని బారి నుంచి కాపాడాడు. అందుకే దీపావళి మర్నాడు బలిపాడ్యమిగా బలికి పూజలు చేస్తారు.

భగినీహస్తభోజనం లేదా భాయీదూజ్: సోదర, సోదరి ప్రేమకు నెలవుగా ఈ పండుగ నిలుస్తుంది. సూర్యభగవానుడి కూమారుడైన యముడు, కుమార్తె యమనకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. తన సోదరుని పట్ల ప్రేమతో ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాని యముడు కార్తీక శుద్ద విదియనాడు తప్పకుండా వస్తానని తన సోదరికి ప్రమాణం చేస్తాడు. అన్నప్రకారం నాడు యమున ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరిస్తారు. ప్రతీ సంవత్సరం ఇదేవిధంగా ఈ ఒక్కరోజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవల్సిందిగా యమున అన్నగారిని కోరుతుంది. నాటి నుంచి నేటి వరకు సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి విందు ఆరగించటం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఉత్తరాదివారితో పాటు దక్షిణాదివారు కూడా ఆదాయ, వ్యయములకు సంబంధించిన కొత్త పుస్తకాలను ఈ రోజు ప్రారంభించే ఆనవాయితీ కూడా ఉంది. అందుకే వ్యాపారులు దీపావళినాడు లక్ష్మీపూజ చేస్తారు. అశ్వయుజ అమావాస్య, కార్తీకమాస ప్రారంభమును కొన్ని ప్రదేశాలలో పంటలు ఇంటికి వచ్చును. కేదారమనగా సస్యశ్యామలమైన భూమి. క్షేత్రలక్ష్మిని గౌరిగా భావించి కేదారగౌరీ వత్రాన్ని ఆచరిస్తారు. ఈ నోమున తొమ్మిది రకాల పండ్లు, తొమ్మిది రకాలు పువ్వులు, తొమ్మిది రకాలు కూరగాయలు, ఆ ఋతువున పండే ధాన్యాలతో తొమ్మిది రకాల పిండివంటలతో పార్వతీపరమేశ్వరులను పూజిస్తుంటారు.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రువృద్ధి వినాశాయ దీపంజ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్థనః
దీపోహరతి పాపాని సంధ్యాదీప నమోస్థుతే!

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *